ఆనందానికి ఆవలి గట్టు | Gollapudi Maruthi Rao writes on attitude of Happiness | Sakshi
Sakshi News home page

ఆనందానికి ఆవలి గట్టు

Published Thu, Feb 15 2018 4:21 AM | Last Updated on Thu, Feb 15 2018 4:22 AM

Gollapudi Maruthi Rao writes on attitude of Happiness - Sakshi

ఆనందం ఒక దృక్పథం. అది సంస్కృతి, సంస్కారమూ, స్వభా వమూ కలిసి ప్రసాదించే వారసత్వం. చదువుకుంటే వచ్చేది కాదు. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన, పవిత్రమైన నేలలో కన్ను విప్పే పుష్పం.

మా ఇంట్లో ఓ వంట మనిషి పని చేస్తోంది. 50 సంవత్సరాలు. లోగడ ప్రముఖ సంగీత దర్శకులు కేవీ మహదేవన్‌ ఇంట్లో పని చేసేది. ఆమె భర్తకి అనారోగ్యం. పని చెయ్యలేడు. ఇద్దరు ఆడపిల్లలు. మా ఇంటి దగ్గర్నుంచి లోకల్‌ ట్రైన్‌లో నాలుగు స్టేషన్లు ప్రయాణం చేసి, పార్కు స్టేషన్‌ నుంచి 14 స్టేషన్లు దాటి ఇల్లు చేరుతుంది. ఇది గత 14 సంవత్సరాలుగా ఆమె దైనందిన జీవితం. ఎప్పుడైనా అడుగుతాను ‘ఇంత శ్రమ ఇబ్బంది కాదా?’ అని. ఆమె సమాధానం ‘అనుకుంటే ఎలాగ సార్‌! ఇల్లు గడవాలి. పిల్లల్ని పెంచాలి’. ఆమె జీవితం ఆనందంగానే ఉంది. కారణం. ఆమె తన జీవిత లక్ష్యాన్ని తన పరి స్థితులకు కుదించుకుంది.

25 ఏళ్ల అమ్మాయి. పుట్టు గుడ్డి. పేరు వినూ. చిన్నప్పటినుంచీ జీవితంలో ఏనాటికయినా సివిల్‌ సర్వీసు చెయ్యాలని కలలుగన్నది. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటి అంధురాలిగా ఐ.ఎఫ్‌.ఎస్‌. ఆఫీసరుగా సెలెక్టయింది. గుడ్డి, మూగ, చెముడు ఉన్న ఒక మహాద్భుతం– హెలెన్‌ కెల్లర్‌ని ఆమె ఉదహరించింది. ‘జీవితంలో నేను అన్నీ చేయలేకపోవచ్చు. కానీ కొన్నయినా చెయ్య గలను’.

వీరందరూ జీవితాన్ని మెడబట్టుకు లొంగదీసి విజయాన్ని పరమావధిగా చేసుకుని ఆనం దంగా ఉన్న జీవులు. వీరి జీవన రహస్యం స్వధర్మాన్ని గర్వంగా, చిత్తశుద్ధితో నిర్వహించడం. ఈ దేశంలో చాలామందికి ‘స్వధర్మం’ అంటే బూతు మాట. ఇందులో మతం ఉందా? దేవుడు ఉన్నాడా? బీజేపీ ఉందా? ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఉందా? ‘స్వధర్మం’ అంటే నీ విధిని నీ ఆశయం మేరకి, శ్రద్ధగా నిర్వహించడం. అదీ– అదే– అంతే– ఆనందానికి దగ్గర తోవ.

అమెరికాలో యేల్‌ విశ్వవిద్యాలయంలో ఆనందంగా జీవించడానికి కొత్త కోర్సుని ప్రారంభించారు. దాదాపు అన్ని డిపార్టుమెంటుల విద్యార్థులూ అటువేపు దూకారు. ప్రస్తుతం 1,182 మంది మేధావులయిన విద్యార్థులు ఇందులో ఉన్నారు. ఈ కోర్సు ఏం నేర్పుతుంది?మనిషి సంతోషంగా ఉండటం ఎలాగో నేర్పుతుంది. మనకి నవ్వొస్తుంది– ‘ఇది ఒకరు నేర్పాల్సిన విషయమా?’ అని. హైందవ జీవన విధానంలోనే ఈ ‘అర’ ఉంది.

మన ఖర్మ. మనం మనకి అక్కరలేని వేలంటైన్‌ డేలను దిగుమతి చేసుకుంటున్నాం. జనవరి 1న బారుల్లో తాగి తందనాలాడడాన్ని గొప్ప వినోదంగా నెత్తిన వేసు కుంటున్నాం. తల్లిదండ్రుల్ని అనాధ శరణాలయాలకి అప్పగించి మరిచిపోవడాన్ని అలవాటు చేసుకుంటున్నాం. మనం ఉగాదులు మరిచిపోయాం. సంక్రాంతి సంబరా లంటే చాలామందికి తెలీదు. మా తరంలో ఏ కుర్రాడూ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వినలేదు. గురువుని సాక్షాత్తూ దేవుడన్నాం. ఇప్పుడు ఓ కుర్రాడు తనని అది లించిన కారణానికి టీచర్నే కాల్చి చంపాడు. ఆత్మహత్యలు చేసుకునే అమ్మాయిలూ, చదువుకొని అటకెక్కించి రాజ కీయాలలో రొమ్ము విరుచుకునే ప్రబుద్ధులూ. ఇవి విదేశీ యుల దరిద్రాలు. మనం కనీవినీ ఎరుగని అరాచకాలు. మనలో ఇప్పటికీ సత్య నాదెళ్లలూ, పుట్టుగుడ్డి వినూలు ఉన్నారు. సరైన దృక్పథాన్ని ఏర్పరచుకుంటే మనకి యేల్‌ విశ్వవిద్యాలయం కోర్సులు అక్కరలేదు.

ప్రపంచంలో ఏ సంస్కృతీ ‘సర్వేజనా స్సుఖినోభవంతు’ అనలేదు. ఓ మామూలు నేలబారు మనిషి ఆ మాట అని ఏం సాధిస్తాడు? బాబూ! అతను జనులందరినీ ఉద్ధరించలేకపోవచ్చు. కానీ అందరూ సుఖంగా ఉండాలన్న పాజిటివ్‌ ఆలోచన మొదట అతన్ని సుఖంగా ఉంచుతుంది. ఈ ఆశంస సమాజానికి కానక్కరలేదు. అది తన సంకల్పాన్ని ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచే Subjective తావీజు.

భగవద్గీతని మనం తప్ప చాలా దేశాలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాయి. అది దేవుడి పుస్తకం కాదు. ఆ రోజుల్లో దేవుడి రేపరు చుట్టి మన ‘జీవన విధానాన్ని’ సూచించే వాచకం. ఇందులో సూచించినవన్నీ చేయగలవాడు మహాత్ముడు. ఏ ఒక్కటయినా చేయగలిగినవాడు నిత్య సంతోషి. ఏమిటా పనులు?

అందరిపట్లా స్నేహ భావన, మిత్రత్వం, కరుణ, దేనిమీదా మమకారం లేకపోవడం, అహం కారాన్ని విడిచిపెట్టడం, సుఖాన్నీ, దుఃఖాన్నీ ఒకేలాగ చూడటం, ఓర్పు, సంతుష్టి కలవాడు (ఉదా: మా వంట మనిషి), దృఢ నిశ్చయం కలవాడు (వినూ అనే పుట్టు గుడ్డి)– ఇది నమూనా జాబితా (భగ. 12 అ.శ్లో. 13–14). ఇందులో మతమూ, శ్రీకృష్ణుడూ, హిందుత్వం లేదు.

యేల్‌ విశ్వవిద్యాలయం కోర్సు వారి దురదృష్టం. కనీసం వారు పోగొట్టుకున్నదేమిటో సంపాదించుకోవాలని తంటాలు పడుతున్నారు. వాళ్లు వదులుకోలేక ఇబ్బంది పడుతున్న వికా రాల్ని దిగుమతి చేసుకుని మన విలువైన ఆస్తుల్ని చంపుకుంటున్నాం.

ఆనందం ఒక దృక్పథం. Happiness is an attitude ఒక మానసిక స్థితి. అది బయటినుంచి రాదు. సంస్కృతి, సంస్కారమూ, స్వభావమూ కలిసి ప్రసాదించే వారసత్వం. అది చదువుకుంటే వచ్చేది కాదు. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన, పవిత్రమైన నేలలో కన్ను విప్పే పుష్పం. అదీ ఆనందం.


- గొల్లపూడి మారుతీరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement