బతుకు-బతకనివ్వు, బడుగుకు భరోసానివ్వు!
పద్యానవనం: ఇవాళ మనం గొప్పగా చెప్పుకునే ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ వంటి విశ్వవిద్యాలయాలు పది, పదకొండు ఆ తర్వాతి శతాబ్దాల్లో వచ్చినవే. అంతకు అయిదారు వందల సంవత్సరాల పూర్వమే మొదట విశ్వవిద్యాలయాల భావనను ఆచరణలోకి, ప్రాచుర్యంలోకి తెచ్చింది భారతదేశమే! ధరణిదేనువు బిదుకంగ దలచితేని జనుల బోషింపుమధిప వత్సముల మాడ్కి జనులు పోషింపబడుచుండ జగతి కల్పలత తెఱంగున సకల ఫలంబు లొసగు..
రాజనీతి అనేక రకాలుగా ఉంటుంది. ధర్మనిరతికి లోబడే ఉండాలనేది పెద్దల మాట. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు వేల సంవత్సరాలుగా ధార్మిక, ఆధ్యాత్మికాంశాల్లో మార్గదర్శకాలుగా ఉంటూ వస్తున్నాయి. అయితే, ధర్మసూత్రాలు, నీతిశాస్త్రాల నుంచే కాకుండా నిరంతరం సాగే ప్రకృతి పరిణామాలు, అనేకానేక వ్యావహారిక ఆచరణల నుంచి కూడా మంచిని గ్రహించి రాజులు అనుసరించేవారు. ఆ అనుభవసారంతో జనరంజకమైన సుపరిపాలన అందించేవారు.
ఆదివేదమైన రుగ్వేదంలో ఓ గొప్ప మాటుంది. జ్ఞానమనే వెలుగును అన్ని వైపుల నుంచీ ప్రసరించనీయాలనీ, ఆహ్వానించాలనీ! ప్రకృతిలో మౌలికంగా ఎన్నో మంచి అంశాలుంటాయి. వాటి నుంచి సాపేక్షంగా మంచిని గ్రహించి అనుసరించడం ద్వారా మనిషి జీవిత లక్ష్యాల్ని తేలికగా సాధించగలడు. పూర్వం రుష్యాశ్రమ విద్యా బోధనలో ఇటువంటివి చాలా చెప్పేవారు. ప్రాకృతికమైన ఓ అంశంతో పోల్చి జీవన సత్యాల్ని వివరించేవారు. వేమన పద్యాలైనా, బద్దెన సుమతీ శతక పద్యాలైఏనా ఇటువంటివే! ‘అవును కదా!’ అనిపించే నిజాల్ని కళ్లకు కట్టినట్టు చెబితే, చిరు మెదళ్లలో అవి బాగా, బలంగా నాటుకునేవి. ధర్మనిరతి, సత్యనిష్ఠ, మానవతా విలువలు, సచ్ఛీలత ఇలాంటివన్నీ గొప్ప గొప్ప ఆదర్శాలుగా కనిపించేవి, అనుసరణీయం అనిపించేవి. అనుసరణో, అనుకరణో... ఎవరికి వారు యథాశక్తి వాటిని పాటించేందుకు యత్నించేవారు.
దాంతో గొప్ప వ్యక్తిత్వ వికాసం జరిగేది. సమాజం విలువలతో విలసిల్లేది. ఇటీవలి కాలం వరకు కూడా అది గొప్పగానే కొనసాగింది. పరంపరగా ఇటువంటి నైతిక జ్ఞాన వ్యాప్తికి భారతీయ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంప్రదాయాల్లో ఎంతో ప్రాధాన్యత ఉండేది. పూర్వపు విద్యా విధానంలో ఇటువంటి అంశాల బోధనకు పెద్దపీట వేసేవారు. ఇవాళ మనం గొప్పగా చెప్పుకునే ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ వంటి విశ్వవిద్యాలయాలు పది, పదకొండు ఆ తర్వాతి శతాబ్దాల్లో వచ్చినవే. అంతకు అయిదారు వందల సంవత్సరాల పూర్వమే మొదట విశ్వవిద్యాలయాల భావనను ఆచరణలోకి, ప్రాచుర్యంలోకి తెచ్చింది భారతదేశమే!
నాగరికత వికాస క్రమంలో విజ్ఞానం కోసం ప్రపంచం ఆర్తితో ఉన్నపుడు వివిధ దేశాల నుంచి విద్యార్థుల్ని ఆకట్టుకున్న నలంద, తక్షశిల, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాల్ని నడిపిన నేల ఇది. అంతకు పూర్వం, తర్వాత జైనుడు, మహావీరుడు, బుద్ధుడు, శంకరాచార్యుడు, బసవేశ్వరుడు, కబీరు, వేమన, నిన్నమొన్నటి వివేకానందుడి వరకు... ఇలా ఎందరెందరో తాత్వికులు, ఆధ్యాత్మిక చింతనాపరులు, మానవతావాదులు ఈ నేలపై నడచిన వారే!
భర్తృహరి సంస్కృతంలో చెప్పిన ఓ గొప్ప మాటను ఏనుగులక్ష్మణ కవి తెలుగులో ఈ పద్యంగా మలిచారు. భూమి అనే గోవు నుంచి ధనం పిండుకోవాలనుకుంటే దూడను పోషించిన విధంగా జనులను పోషించాలి రాజా! అంటాడు. జనుల్ని చక్కగా పోషించే భారాన్ని, బాధ్యతని తీసుకుంటే జగత్తుమొత్తం కల్పవృక్షపు కొమ్మలాగా, తీగెలాగా కోరినవన్నీ ఫలాలుగా అందిస్తుంది అంటాడు. ఆ స్పృహ పాలకులకు ఉండాలి. దూడలను గాలికి వదిలి పాలన్నీ తామే పితుక్కోవాలని అత్యాశకు వెళితే, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులకే పలాయనం తప్పలేదు.
స్వాతంత్య్రోద్యమ కాలంలో తెలుగునాట ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, యువతను ఉర్రూతలూగించిన పద్యం చిలకమర్తి లక్ష్మీనర్సింహం రాశారు. ‘‘భరత ఖండంబు చక్కని పాడియావు, లేగదూడలై హిందువులేడ్చుచుండ, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి, తెల్లవారను గడుసరి గొల్లవారు’’ అన్న పద్యం నాటి సామ్రాజ్యవాదుల దుర్నీతికి నిలువుటద్దం. ఇక్కడ భర్తృహరి చెప్పిన దానికి పూర్తి విరుద్ధం. పరాయిపాలన పోయి, సర్వసత్తాక స్వతంత్ర రాజ్యంగా భారతదేశం ఆవిర్భవించిన ఆరు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ఆ చెడు పోకడలు పోలేదు. నేటి పాలకులు కూడా భూమిని చెరబట్టి, భూమి మీదే భుక్తి వెతుక్కుంటున్న బడుగు జీవుల్ని ఎండబెట్టి తామే సర్వం దండుకోవాలనీ, తమ వారికి సంపద కొల్లగొట్టిపెట్టాలనీ చూసినప్పుడు మన మానవత, నైతికత, ధార్మికత ఎక్కడ మరుగునపడ్డాయి? అని బాధ కలుగుతుంది. పాలకులారా! గతం నుంచి పాఠాలు నేర్చుకోండి, ‘బతుకు-బతకనివ్వు’ అన్న మంచి మాటను ఆచరించండీ!! అని గట్టిగా అరవాలనిపిస్తుంది.
- దిలీప్‌రెడ్డి