కనుమరుగు  కావడం సహజం! | Everybody must know the righteousness | Sakshi
Sakshi News home page

కనుమరుగు  కావడం సహజం!

Published Sun, Apr 1 2018 1:23 AM | Last Updated on Sun, Apr 1 2018 1:23 AM

Everybody must know the righteousness - Sakshi

అది కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతం. విజేతలైన వీరులు చివరి రోజు రాత్రి శత్రు శిబిరంలో విశ్రమించాలన్న ఆనాటి ఆచారం మేరకు పాండవులను వెంటబెట్టుకుని కౌరవుల శిబిరం వద్దకు వెళ్ళాడు కృష్ణుడు. తరువాత కృష్ణుడు అర్జునుని ఉద్దేశించి, ‘‘అర్జునా! నీవు గాండీవాన్ని, ఇతర ఆయుధాలను తీసుకుని రథం నుంచి కిందికి దిగి దూరం వెళ్లు’’ అని ఆదేశించాడు. అర్జునుడు అణుమాత్రం సందేహించకుండా గాండీవం, ఇతర ఆయుధాలను తీసుకుని రథం దిగాడు. కృష్ణుడు కూడా ఇన్నాళ్లు సారథిగా తన చేతిలో ఉన్న చర్నాకోలను, గుర్రాల కళ్ళాలకు వేసే పగ్గాలను అక్కడే వదిలేసి రథం మీద నుంచి కిందికి ఎగిరి దూకాడు. కృష్ణుడు రథం నుంచి దూకిన మరుక్షణమే హనుమంతుడు నిలిచి ఉన్న ధ్వజ కేతనం అంతరిక్షంలోకి ఎగురుతూ పోయి అదృశ్యమైంది. పాండవులు ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తుండగానే, రథంలో అగ్ని జ్వాలలు చెలరేగి, క్షణాల్లో రథం కాస్తా బూడిద కుప్పగా మిగిలింది. ఆ దృశ్యాన్ని చూసి అర్జునుడు తట్టు్టకోలేకపోయాడు. ఖాండవ దహన సమయంలో అగ్నిదేవుడు అర్జునుడికిచ్చిన కానుక ఆ రథం. అప్పటి నుంచి అర్జునునికి, ఆ రథానికి విడదీయరాని సంబంధం ఏర్పడింది. అలాంటి రథం దగ్ధం కావడంతో అర్జునుడు అప్రతిభుడయ్యాడు. అతి కష్టం మీద కన్నీటిని అపుకుంటూ, ‘‘కృష్ణా! ఎందుకిలా జరిగింది?  శత్రు భీకరమైన ఈ రథం ఎందుకిలా ...’’ ఆ పై మాట్లాడాలంటే గొంతు పెగలలేదు అర్జునుడికి.

కృష్ణుడు తన సహజశైలిలో చిరునవ్వు రువ్వాడు. ‘‘అర్జునా! ఇది అసామాన్యులైన భీష్మద్రోణాదులు, ఇతర వీరుల భయంకరాస్త్రాల ప్రభావానికి గురైంది. నేను సారథిగా ఉండి అన్ని అస్త్రాల శక్తిని అణచి ఉంచాను. నీవు సురక్షితంగా బయటపడ్డా్డవు. కథ ముగిసిపోయింది. చివరగా నేను దిగి పోగానే ఆ అస్త్రాల శక్తిని వదలడంతో అది కాలి దగ్ధమైంది. ఇక దానితో నీకు పని లేదు. నిర్దేశిత కార్యం కోసం వచ్చిన అవతార పురుషులు, వస్తువులు ఆ కార్యం పూర్తి కాగానే కనుమరుగు కావడం సహజం. ఆ కోవలోనే ఆ రథం తన కర్తవ్యాన్ని నిర్వహించి అదృశ్యమైంది. పుట్టిన ప్రతి జీవికి నిశ్చితమైన లక్ష్యం, కార్యకలాపాలు ఉంటాయి. తన లక్ష్యం సాధించుకున్న తర్వాత ఆ జీవితో ప్రపంచానికి గాని, ప్రపంచానికి ఆ జీవితో గానీ అవసరం ఉండదు. అప్పుడు భూమిని విడిచి వెళ్లిపోతాడు. లేకపోతే భూమికి భారమే కదా ఇక. కాబట్టి నీవు ఈ విషయాన్ని గుర్తుంచుకో. రథం కోసం దుఃఖించకు’’ అని ఊరడించాడు.  ఇది ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవల్సిన నీతి.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement