అడవి పిలిచింది!
నార్త్ లండన్‌లో ఉండే జాక్ సోమర్‌విల్లి నమీబియా అడవుల్లో నివసించే సాన్ తెగ ప్రజల గురించి ఎన్నోసార్లు విన్నాడు. వారి గురించి విన్నప్పుడల్లా... వారిని చూడాలని, వారి జీవనశైలిని చిత్రించాలనే కోరిక బలంగా కలిగేది. తన కోరికను నిజం చేసుకోవడానికి కెమెరాతో నమీబియా అడవుల్లోకి వెళ్లాడు సోమర్‌విల్లి.
అక్కడికి వెళ్లి వారి జీవనశైలిని, జంతువుల పట్ల వారి ప్రవర్తన తీరు తెన్నులను కెమెరాలో బంధించాడు. ‘‘ప్రకృతిని అమితంగా ప్రేమిస్తారు’’ అని సాన్ ప్రజల గురించి చెబుతున్నాడు సోమర్. కేవలం ప్రకృతికి సంబంధించిన విషయాలే కాదు... నైతికవిలువలకు సంబంధించి కూడా ఈ పురాతన జాతి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అంటాడు సోమర్‌విల్లి. సోమర్‌విల్లి తీసిన ఫోటోలను చూస్తే... మనం కూడా నమీబియా అడవుల్లో సంచరించినట్లుగానే ఉంటుంది.