నిజాయితీగా ఉంటేనే భవిష్యత్‌లో నీతిమయ సమాజం
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: భవిష్యత్ తరాలు నీతి నిజాయితీతో బతకాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముందు తాము నిజాయితీగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ సీఎస్ మోహన్ కందా రచించిన ‘ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్-రెజల్యూషన్ ఆఫ్ డైలమాస్’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. సమాజాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు మేధావులు కృషి చేయాలని... విసుగు, విరామం లేకుండా అంతిమ శ్వాస వరకూ అవినీతికి వ్యతిరేకంగా పనిచేయాలని అప్పుడే నూతన భారతావనిని చూడగలుగుతామని జస్టిస్ చంద్రకుమార్ వ్యాఖ్యానించారు. పదవీ విరమణ అనంతరం వ్యక్తులు సమాజానికి ఉపయోగపడేలా మేధస్సును వినియోగించాలన్నారు.
మేధావులు తలచుకుంటే ఈ సమాజాన్ని ఉద్ధరించగలరని, సమాజంలోని సమస్యలను పారద్రోలేందుకు మేధావులు తగిన సలహాలు, సూచనలను పుస్తకాల రూపంలో తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మేధావులు ఏసీ గదుల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అవి ఎవరి శ్రేయస్సు కోసం తీసుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. అనంతరం మోహన్ కందా మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల తన పాలనానుభవంలో నైతిక విలువలు, పాలన అనేవి ఎంతగానో ఆకర్షించాయన్నారు. పుస్తకాల్లో ఉండేవాటికి ఆచరణలో చేసేవాటికి చాలా వ్యత్యాసం ఉంటుందని.. ఒక్కో సందర్భంలో ఒక్కోటి పైచేయిని సాధిస్తుంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎం.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.