పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి
తల్లిదండ్రులకు దలైలామ సూచన
తుమకూరు: తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే నైతిక విలువలు నేర్పించాలని నోబల్ శాంతి అవార్డు గ్రహీత, ధార్మిక గురువు దలైలామ పిలుపునిచ్చారు. తుమకూరు నగరంలోని తుమకూరు విశ్వవిద్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధ్యయన కేంద్రంలోని బైలుకుప్ప సేరా జీ మెనాస్టిక్ యూనివర్సిటి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సమ్మేళనాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. నైతిక విలువలతో కూడిన విద్యాబోధన, శిక్షణ వల్లే సమాజంలో శాంతి నెలకొంటుందని అన్నారు. అప్పుడే సమాజంలో జరిగే అ న్యాయాలు, అక్రమాలను అడ్డుకోవచ్చన్నారు.
చిన్నారులు చెడు వ్యసనాలకు లోను కాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని, అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుందని అన్నా రు. శాంతితో నిండిన దేశం వైపే ప్రపంచం చూస్తుందన్నారు. భారతీయులు అహింస అనే ఆయుధంతోనే స్వతంత్రాన్ని సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దగంగ మఠానికి చెందిన శివకుమార స్వామి, ఇన్‌చార్జ్ మంత్రి టీ బీ జయచంద్ర, సాంఘీక సంక్షేమశాఖ మంత్రి ఆంజినేయప్రసాద్, చిత్రదుర్ఘ ఎంపీ చంద్రప్ప పాల్గొన్నారు.