నైతికం..వైద్యానికి ప్రాణం
నైతికం..వైద్యానికి ప్రాణం
Published Sat, Apr 8 2017 11:02 PM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM
– కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్
కర్నూలు(హాస్పిటల్): నైతికత వైద్యానికి ప్రాణం వంటిందని కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ అన్నారు. హౌస్‌సర్జన్ పూర్తి చేసుకున్న వైద్యవిద్యార్థులకు శనివారం ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. వైద్యవృత్తిలో నైతిక విలువలపై ఎథిక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ మాధవీలత వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ మాట్లాడుతూ.. బోధనాసుపత్రిలో అభ్యసిస్తున్నప్పుడే వైద్యవిద్యార్థులు ఎన్నో విషయాలు నేర్చుకుంటారన్నారు. వారి ప్రవర్తన, నడవడికలోనూ మార్పులు రావాలన్నారు. వారి నడవడిక సరిగ్గా లేకపోతే సర్టిఫికెట్లు ఇవ్వబోమన్నారు. వైద్యుడంటే హుందాగా ఉండాలన్నారు.
రోగులతో మమేకమై ప్రవర్తించాలని, వారి బాధలను ఓపికతో వినాలని సూచించారు. వైద్యుని వద్దకు వచ్చే పేదలను అవహేళన చేస్తే ఆ భగవంతుడు పరిహాసం చేస్తాడని హెచ్చరించారు. ప్రస్తుత తరంలో రోగులు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాధులపై అవగాహన పెంచుకుంటున్నారని, ఈ సమయంలో వైద్యులు ఎల్లప్పుడూ అప్‌డేట్ కావాల్సి ఉంటుందన్నారు. ఏ స్థాయిలో ఉన్నా వైద్య విద్యార్థులు ఎప్పుడూ పాఠ్యపుస్తకాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వైద్యవృత్తి చేసేటప్పుడు ఇచ్చే ప్రతి సర్టిఫికెట్ గురించి తెలుసుకుని ఉండాలని, వాటి వివరాలను భద్రపరుచుకోవాలని సూచించారు. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి ఇబ్బందులకు గురికావద్దని తెలిపారు. ప్రజల డబ్బులతో చదువుకున్నారు కాబట్టి వారికి నిబద్ధులై ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement