ప్రజలే ప్రతిపక్షంగా మారతారు: మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉండేవారికి చేతులెత్తి నమస్కరించాలని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన అనంతరం ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.‘‘ప్రత్యేక హోదా అంశం, రాష్ట్రానికి ఇచ్చిన హామీల గురించి అడిగాం. నియోజకవర్గాల పునర్విభజన గురించి ప్రస్తావించాం.
రాజ్‌నాథ్‌సింగ్ కూడా దానిపై స్పష్టత ఇవ్వలేకపోయారు. 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి లేదని ఇప్పటికే అటార్నీ జనరల్ కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పారన్నారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారడంపై ప్రస్తావించగా..‘‘ప్రభుత్వం ప్రతిపక్షంలోని నాయకులందరినీ తీసుకున్నా ప్రజలే ప్రతిపక్షంగా మారతారు. రాజకీయ నాయకులు విలువలకు కట్టుబడి ఉండాలి. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలోకి వెళ్లడమేనా? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ’’ అని మేకపాటి తెలిపారు. ఎంపీ వెలగపల్లి మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారం అనర్హత వేటు వేయాలని అడుగుతాం, ప్రజలు కూడా అడుగుతారు అని పేర్కొన్నారు.