సంగీతం... ఎప్పుడూ... చెవులకు ఇంపుగా ఉండాలి! | Music ... always ... be easy on the ears! | Sakshi
Sakshi News home page

సంగీతం... ఎప్పుడూ... చెవులకు ఇంపుగా ఉండాలి!

Published Tue, Aug 19 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

సంగీతం... ఎప్పుడూ... చెవులకు ఇంపుగా ఉండాలి!

సంగీతం... ఎప్పుడూ... చెవులకు ఇంపుగా ఉండాలి!

రావు బాల సరస్వతి... తొలి తరం సినీ నేపథ్య గాయని. పాట అంటే చెవులకు ఇంపుగా ఉండాలంటారామె. గాయకులు ప్రతి ఒక్కరూ తాము పాడే పాటలో సాహిత్యపు విలువలను గమనించుకోవాలని చెప్తున్నారు. విలువలు లోపించిన పాట గానం చేయకూడదనే నిబంధనను పాటించాలంటారు.
     
మీరు ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు ?
1928వ సంవత్సరం ఆగస్టు 28న మద్రాసులో పుట్టాను.
     
తొలి పాట...
నా ఆరవ యేట.

ఏ సినిమాకి ?...
సినిమాకి కాదు, ప్రైవేట్ ఆల్బమ్ కోసం ‘పరమ పురుషా పరంధామా...’ అనే పాట పాడాను.
      
గాయని కావడానికి ప్రోత్సహించింది ఎవరు ?
మా నాన్నగారు పార్థసారథి రావు. ఆయనకు సంగీతం అంటే చాలా ఇష్టం. గుంటూరులో మా థియేటర్‌లో డ్రామాలు వేయించేవారు. నేను మూడేళ్ల వయసులోనే స్థానం నరసింహరావు లాంటి ప్రముఖుల పాటలు విన్నాను. అలా ఆసక్తి పెరిగింది.
     
అప్పట్లో సంగీత సాధన ఎలా చేసేవారు ?
గ్రామఫోన్ రికార్డుల్లో విని అలాగే పాడేదాన్ని. అలా నాకిది స్వతహాగా అబ్బిన కళ. బాంబేలో హిందూస్తానీ సంగీతం నేర్చుకున్నాను.
         
సాటి గాయకుల్లో ఎవరి గొంతు ఇష్టం ?
... సుశీల గొంతు ఇష్టం.

మీరు ఏయే భాషల్లో పాడారు?
... మళయాళం, కన్నడం, తమిళం, తెలుగు, సింహళీ భాషల్లో పాడాను.
      
మీరు పాటించిన నియమాలేమైనా ఉన్నాయా?
డబ్బు కోసమే అన్నట్లు పాడలేదు. పాట నచ్చితేనే పాడేదాన్ని.
      
సాహిత్యపు విలువల్లో అప్పుడు - ఇప్పుడు తేడా?
కొన్ని పాటలనైతే వినలేక పోతున్నాను. అప్పట్లో శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి లాంటి వాళ్లు స్వయంగా రికార్డింగుకు వచ్చే వాళ్లు. ఎవరైనా ఒక పదం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తే వారు ఆ పదాన్ని అక్కడే మార్చేసేవారు.
      
నాటి గాయకులకు - నేటి గాయకులకు మధ్య మీరు గమనించిన తేడా?
ఘంటసాలలో తొలిపాట సమయంలో ఉన్న వినయం ఆయన చచ్చిపోయే వరకు అలాగే ఉండింది. ఇప్పుడు కొందరిని చూస్తే వారిలో వినయం సహజం అనిపించకపోగా, వినయాన్ని నటిస్తున్నట్లు ఉంటోంది.

బాల గాయకులకు సూచన?
ఏం పాడుతున్నామో తెలుసుకుని హాయిగా పాడాలి. కష్టపడుతూ కాదు.
      
గాయకుల తల్లిదండ్రులకు...
పిల్లలు బాగా పాడితే మెచ్చుకోండి. అతిగా పొగడకండి. ప్రశంస మితిమీరిన ఆత్మవిశ్వాసానికి కారణం కాకూడదు.

మీరు పాడడం ఎందుకు మానేశారు?
మా వారు ‘రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు’ అభిప్రాయం మేరకు 1958 నుంచి మానేశాను.

పరిశ్రమను చూస్తే ఏమనిపిస్తుంది?
బాగా పాడే పిల్లల్ని పాడనివ్వకపోతే వారిలో ఆ కళ అంతరిస్తుంది. సంగీత జ్ఞానం తెలిసిన వారు ఆ పాపం చేయకూడదు.

అత్యంత సంతృప్తినిచ్చిన పాట?
... ప్రతిదీ నచ్చిన తర్వాతనే పాడాను.

కుటుంబం, పిల్లలు...
ఇద్దరు కొడుకులు. రావు వెంకట రాజగోపాల కృష్ణ సూర్యారావు, రావు వెంకట కుమార కృష్ణ మహీపతి సూర్యారావు.

రాజా గారి శ్రీమతి అంటే రాణిగారి హోదా ఉండేదా?
మా ఎస్టేట్‌లో ఉండేది. ‘రాణీ రావు బాల సరస్వతీదేవి’ అని రాసేవారు. ఒక సినిమాకి కూడా పేరు అలాగే వేస్తే నేను తీయించేశాను.
   
ఎందుకలా?
సినిమాలో పాట పాడినందుకు డబ్బు తీసుకుంటున్నప్పుడు అక్కడ నా రాణి హోదా ప్రదర్శించకూడదు. అక్కడ నేను నేపథ్యగాయనిని మాత్రమే.
     
మిమ్మల్ని నొప్పించే విషయం?
నాకు మనుమళ్లు, మనుమరాళ్లు, ముని మనుమళ్లు, ముని మనుమరాళ్లు ఉన్నారు. వారికెవరికీ సంగీత జ్ఞానం అబ్బలేదు.
   
మీకు సంతోషం కలిగించే విషయం...
నన్నింకా కొంతమంది జ్ఞాపకం ఉంచుకున్నారు.
     
దేవుడు వరమిస్తానంటే...
సంగీత కుటుంబంలో పుట్టించమని అడుగుతాను. జగ్‌జీత్‌సింగ్ వంటి వారింట్లో పుట్టాలని కోరిక.
 
- వాకా మంజులారెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement