= పిల్లలపై ఒత్తిడి పెంచొద్దు
=తల్లిదండ్రులకు ప్రముఖ సైకాలజిస్టు పట్టాభిరామ్
గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : విద్యార్థుల్లో సంస్కృతి, విలువలు, ఆత్మీయత, సంప్రదాయాలపై అవగాహన పెంచినప్పుడే వారి విద్యకు సాకారం లభిస్తుందని ప్రముఖ సైకాలజిస్టు బి.వి.పట్టాభిరామ్ అన్నారు. శనివారం రాత్రి విశ్వభారతి పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వచ్చిన ఆయన ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల్లో ఆత్మహత్యలు పెరగడం, తల్లిదండ్రులపై గౌరవం, ఉపాధ్యాయులపై భయభక్తులు తగ్గడానికి కారణం కేవలం వారిపై తల్లిదండ్రులు తెస్తున్న ఒత్తిడేనని చెప్పారు.
కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు మానసిక వైద్యుల అవసరం సమాజానికి ఉండేది కాదన్నారు. తాత నిష్ణాతుడైన సైకాలజిస్టుగా ఆ కుటుంబంలో ఉండటం వల్ల వారిలో సంప్రదాయాలు, విలువలు ఉండేవని చెప్పారు. తల్లిదండ్రులు అత్సుత్యాహంతో తమ కుమారుడు ఏ ర్యాంకులో ఉన్నాడనే దానిపై శ్రద్ధ చూపుతున్నారే తప్ప దాని దుష్పరిణామం ఎలా ఉంటుందో గమనించలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. దాని ఫలితాలే వృద్ధాశ్రమాలు, తల్లిదండ్రుల సామూహిక ఆత్మహత్యలు, కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడం వంటి వికృత పోకడలు అని వివరించారు.
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజాభివృద్ధికి, వ్యక్తి మనుగడకు వినియోగించాల్సింది పోయి ఫేస్‌బుక్‌లు, ఇతర చాటింగ్‌లు అంటూ యువత పెడదోవ పడుతున్నారన్నారు. ఇవి సమాజపు కళ్లు మూస్తాయని, నోరు నొక్కేస్తాయని తెలిపారు. యువత ఒక స్థితికి చేరాల్సిన సమయంలో సమయం వృథా చేయడం వల్ల అతని స్థితిగతులనే మార్చేస్తున్నాయని చెప్పారు.
పిల్లలకు కొంత సమయం వెచ్చించాలి...
పిల్లలకు విలువలు నేర్పేందుకు తల్లిదండ్రుల వారితో విధిగా కొంత సమయం గడపాలని పట్టాభిరామ్ సూచించారు. ప్రధానంగా విద్యలో ఏబీసీడీలతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో మరో కొత్త కోణంలో ఏబీసీడీలు నేర్పించాలని సమాజానికి తాను సూచిస్తున్నానని వివరించారు. అవి ఎ ఫర్ ఆటిట్యూడ్, బి ఫర్ బిహేవియర్, సి ఫర్ క్రియేటివిటీ, డి ఫర్ డిసిప్లిన్ అండ్ ఫైనాన్షియల్ ఎగ్జిస్టెన్స్ అంటూ వీటి అర్థాలు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పినప్పుడే వారి భవిష్యత్ బాగుంటుందని తెలిపారు. విశ్వభారతి విద్యాసంస్థ ఏటా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థుల్లో విలువలు పెంచడానికి కృషిచేస్తోందన్నారు. విశ్వభారతి చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు మార్కులు, ర్యాంకులు తేవాలని టీచర్లపై ఒత్తిడి తేవడం కంటే వారిలో విలువలు తేవాలని తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. స్కూల్ సీఈఓ పి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
విలువలతోనే విద్యకు సాకారం
Published Mon, Dec 16 2013 1:25 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement
Advertisement