న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా(67) శనివారం కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన.. కొంత కాలంగా ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గతవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం వినోద్ దువా మృతి చెందారని ఆయన కూతురు మల్లికా దువా సోషల్ మీడియాలో తెలిపారు.
వినోద్ దువా.. ప్రముఖ హింది జర్నలిస్ట్. ఆయన.. దూరదర్శన్, ఎన్డీటీవి తదితర ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో పనిచేశారు. ఆయన 42 సంవత్సరాలు జర్నలిజం రంగానికి సేవలందించారు. ఆయన జర్నలిజం విలువలు పాటించి, తనదైన మార్క్ చూయించారు. జర్నలిజంలో ఆయన చేసిన కృషికి గాను 1996లో రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ ఆయనే కావడం విశేషం.
అదే విధంగా.. 2008లో కేంద్ర ప్రభుత్వం వినోద్ దువాను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2017లో ముంబై ప్రెస్ క్లబ్ నుంచి రెడ్ ఇంక్ అవార్డును... మహరాష్ట్ర మాజీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా అందుకున్నారు. దూరదర్శన్‌లో ‘పరాక్’ అనే కరెంట్ అఫైర్స్ షోకి హోస్ట్‌గా వ్యవహరించారు.
అదే విధంగా ఎన్డీటీవిలో ‘ఖబర్దార్ ఇండియా’, ‘వినోద్ దువా లైవ్’ కార్యక్రమాలకు హోస్ట్‌గా కూడా పనిచేశారు. కాగా, వినోద్ దువా అంతిమ సంస్కారాలు ఆదివారం ఢిల్లీలోని లోధి స్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment