NDTV journalist
-
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: హింసించే భర్తకు గుడ్‌బై
గృహ హింస అంటే భార్య ఒంటి మీద గాయాలు కనిపించాలి అనుకుంటారు చాలామంది. బాగనే కనిపిస్తున్నావుగా... కాపురం చేసుకోవడానికి ఏం నొప్పి అంటారు చాలామంది. ‘కాని మనసుకు తగిలే గాయాల సంగతి ఏమిటి అని అడుగుతుంది’ మేఘనా పంత్. గృహ హింస అంటే భర్త కొట్టకుండా తిట్టకుండా పెట్టే హింస కూడా అంటుందామె. మానసిక భావోద్వేగాలు అదుపు చేసుకోలేని భర్తతో ఐదేళ్లు బాధలు పడి ఆ పెళ్లి నుంచి బయటపడి ఆ అనుభవాలతో ‘బాయ్స్ డోన్ట్ క్రై’ నవల రాసింది మేఘనా. ‘ఒక స్త్రీ విడాకులు తీసుకుంటూ ఉంటే హాహాకారాలు చేసే సమాజం ధోరణి మారాలి’ అంటున్న మేఘన జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో తన/వివాహిత స్త్రీల జీవితాలలోని సంఘర్షణలపై వ్యాఖ్యానం చేసింది. ‘నాకు చదువుంది. చైతన్యం ఉంది. లోకజ్ఞానం ఉంది. అయినా నేను నా వివాహంలో గృహ హింసను అనుభవిస్తున్నాను అని తెలుసుకోవడానికి ఐదేళ్లు పట్టింది’ అంది మేఘనా పంత్. తాను రాసిన నవల ‘బాయ్స్ డోన్ట్ క్రై’ గురించి జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో జరిగిన చర్చలో ఆమె మాట్లాడింది. ‘మన దగ్గర బాధితురాలిని కూడా ఒక స్టీరియోటైప్‌ను చేశారు. గృహ హింస ఎదుర్కొంటున్న గృహిణి అనగానే భర్త కొట్టిన దెబ్బలకు కన్ను వాచిపోయి, చర్మం కమిలిపోయి లేదా ఎముకలు విరిగి హాస్పిటల్ పాలయ్యి... ఇలా అయితేనే సదరు గృహిణి బాధ పడుతున్నదని భావిస్తారు. పైకి అంతా బాగున్నా మన దేశంలో దాదాపు 20 కోట్ల మంది స్త్రీలు గృహహింసను ఎదుర్కొంటున్నారు. కాని పెళ్లిలో ఆ మాత్రం భర్త చేతి లెంపకాయలు మామూలే అన్నట్టు సర్దుకుపోతుంటారు’ అందామె. మేఘనా పంత్ ముంబైలో చదువుకుంది. ఎన్డిటివిలో రిపోర్టర్‌గా పని చేసింది. కథా రచయిత. 2007లో ఆమెకు వివాహం అయితే 2012లో ఆ పెళ్లి నుంచి బయటకు వచ్చింది. ‘నాకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకో అని మొదట అన్నది మా అమ్మ. నేను వైవాహిక జీవితంలో పడుతున్న బాధను చెప్పుకున్నప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చెయ్ అని మొదట చెప్పిందీ మా అమ్మే. ఇప్పుడు పర్వాలేదు కాని పదేళ్ల క్రితం వరకూ కూడా విడాకులు అనగానే ఇక ఆ స్త్రీ జీవితం నాశనం అని, ఆ స్త్రీ ఏదో తప్పు చేస్తున్నదని భావించడం ఎక్కువగా ఉండేది. ఇప్పుడూ భావించే వర్గాలు ఉన్నాయి. తల్లిదండ్రులే అందుకు ఒప్పుకోరు. నేనేమంటానంటే ఆమె జీవితాన్ని ఆమెను నిర్ణయించుకోనివ్వండి అని’ అంటుందామె. మేఘనా కథనం ప్రకారం ఆమె భర్తకు మానసిక భావోద్వేగాలపై అదుపు లేదు. ‘పెళ్లి సంబంధం చూసేటప్పుడు చదువు, ఉద్యోగం చూస్తాం కాని కుర్రాడి మానసిక ప్రవర్తన గురించి ఆరా తీయము. మానసిక సమతుల్యత లేనివారు స్త్రీలకు నరకం చూపిస్తారు. నా భర్తకు బైపోలార్ డిజార్డర్ ఉండేది. అతను నా పెళ్లికి రెండు వారాల ముందే నా మీద చేయి చేసుకున్నాడు. అసలు అప్పుడే పెళ్లి ఆపాల్సింది. కాని భారీ ఖర్చు చేసి పెళ్లి ఏర్పాట్లు చేయడం మన దేశంలో ఆనవాయితీ. అదంతా నష్టపోవాలా అనే పాయింటు ముందుకు వస్తుంది. పెళ్లి ఆపేయడం పెద్ద నామోషీ కూడా. అయితే మన ఇంటి అమ్మాయి నరకం పాలవ్వడం కంటే పెళ్లి ఆగి నామోషీ ఎదుర్కొనడం మంచిది. అలానే నా సలహా– పెళ్లికి పెట్టే ఖర్చు పూర్తిగా తగ్గించి ఆ మొత్తాన్ని ఆమె భవిష్యత్తు గురించి ఆమె కెరీర్ గురించి వెచ్చిస్తే చాలా మేలు. ముంబై నుంచి మా కాపురం న్యూయార్క్‌కు మారాక నా భర్త నన్ను నా తల్లిదండ్రుల నుంచి స్నేహితుల నుంచి కూడా దూరం చేశాడు. స్త్రీని ఒంటరి చేయడం హింస అవునా కాదా? 2012లో నా తొలి నవల ‘ఒన్ అండ్ ఏ హాఫ్ వైఫ్’ విడుదలైన రోజు రాత్రి అతను ఎంతో వింతగా ప్రవర్తించాడు. నాకు పిరియడ్స్ మొదలైతే నాప్కిన్ కూడా పెట్టుకోనివ్వలేదు. ఆ క్షణమే అనుకున్నాను ఈ జీవితం నుంచి బయటపడాలని’ అందామె. వివాహం నుంచి బయటకు వచ్చాక మేఘనా పూర్తి స్థాయి రచయితగా మారింది. స్త్రీల తరఫున అనేక వ్యాసాలు, షోస్ చేసింది. ఆమె నవల ‘ది టెర్రిబుల్, హారిబుల్, వెరి బ్యాడ్ గుడ్ న్యూస్’ నవల ‘బద్నామ్ లడ్డు’ పేరుతో సినిమాగా రానుంది. ఆమె తాజా నవల ‘బాయ్స్ డోన్ట్ క్రై’ కూడా వెబ్ సిరీస్‌కు ఎంపికైంది. ‘ఈ పేరు ఎందుకు పెట్టాను. అబ్బాయిలను చిన్నప్పటి నుంచి నువ్వు ఏడవకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, మగాడంటే స్త్రీలతో ఇలా వ్యవహరించాలి అని పెంచుతాము. వాళ్లు కూడా తాము స్త్రీలతో మోటుగా వ్యవహరించడానికి అర్హులు అన్నట్టుగానే పెరుగుతారు. ఇది మారాలి. మగాళ్లు ఏడిస్తే ఏం పోతుంది? పెళ్లి నచ్చని ఆడాళ్లు విడాకులు తీసుకుంటే ఏం పోతుంది? మనల్ని మనం ప్రేమించుకుని మన జీవితాన్ని చక్కదిద్దుకునే హక్కు ఉంది. ఇప్పుడు నాకు వివాహం అయ్యింది. నన్ను గౌరవించే భర్త దొరికాడు. నాకు ఇద్దరు కూతుళ్లు. అఫ్కోర్స్.. వైవాహిక జీవితంలో హింసను ఎదుర్కొంటున్న భర్తలు కూడా ఉన్నారు. వారి బాధను కూడా పరిగణించాలి. స్త్రీలన్నా బయటకు చెప్పుకుంటారు. మగాళ్లకు ఆ ఓదార్పు కూడా లేదు. స్త్రీలకైనా పురుషులకైనా ఈ బాధ అక్కర్లేదు’ అంటుందామె. ‘సర్దుకుపోవడం’ అనే ఒక సనాతన ధోరణిలోనే ఉన్న మన సమాజం మేఘనా వంటి రచయిత్రుల మాటలకు ఉక్కిరిబిక్కిరి కావచ్చు. కాని పెళ్లిలోని ఉక్కిరిబిక్కిరి భరించలేనిదిగా మారినప్పుడు కూడా ఎందుకు సర్దుకుపోవాలి అనే ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే. ‘బాయ్స్ డోన్ట్ క్రై’ దాదాపుగా మేఘనా జీవిత కథ. మార్కెట్లో ఉంది. చదవండి. ‘పెళ్లి సంబంధం చూసేటప్పుడు చదువు, ఉద్యోగం చూస్తాం కాని కుర్రాడి మానసిక ప్రవర్తన గురించి ఆరా తీయము. మానసిక సమతుల్యత లేనివారు స్త్రీలకు నరకం చూపిస్తారు. వేదికపై మేఘనా పంత్ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో మేఘనా పంత్ -
పద్మశ్రీ అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత
న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా(67) శనివారం కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన.. కొంత కాలంగా ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గతవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం వినోద్ దువా మృతి చెందారని ఆయన కూతురు మల్లికా దువా సోషల్ మీడియాలో తెలిపారు. వినోద్ దువా.. ప్రముఖ హింది జర్నలిస్ట్. ఆయన.. దూరదర్శన్, ఎన్డీటీవి తదితర ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో పనిచేశారు. ఆయన 42 సంవత్సరాలు జర్నలిజం రంగానికి సేవలందించారు. ఆయన జర్నలిజం విలువలు పాటించి, తనదైన మార్క్ చూయించారు. జర్నలిజంలో ఆయన చేసిన కృషికి గాను 1996లో రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ ఆయనే కావడం విశేషం. అదే విధంగా.. 2008లో కేంద్ర ప్రభుత్వం వినోద్ దువాను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2017లో ముంబై ప్రెస్ క్లబ్ నుంచి రెడ్ ఇంక్ అవార్డును... మహరాష్ట్ర మాజీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా అందుకున్నారు. దూరదర్శన్‌లో ‘పరాక్’ అనే కరెంట్ అఫైర్స్ షోకి హోస్ట్‌గా వ్యవహరించారు. అదే విధంగా ఎన్డీటీవిలో ‘ఖబర్దార్ ఇండియా’, ‘వినోద్ దువా లైవ్’ కార్యక్రమాలకు హోస్ట్‌గా కూడా పనిచేశారు. కాగా, వినోద్ దువా అంతిమ సంస్కారాలు ఆదివారం ఢిల్లీలోని లోధి స్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. -
రావీష్ కుమార్‌కు గౌరీ లంకేశ్ అవార్డు
సాక్షి, బెంగళూరు: ఇటీవల రామన్ మెగసెసే అవార్డు అందుకున్న ప్రముఖ జర్నలిస్టు, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రావీష్ కుమార్.. గౌరీ లంకేశ్ మెమోరియల్ మొదటి అవార్డును అందుకొన్నారు. ఆదివారం (సెప్టెంబర్ 22) బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో 'పదునైన వార్తల విశ్లేషణ, రాజీలేని లౌకిక వైఖరి' అవలంభించింనందుకు గాను ఆయనను ఈ అవార్డుతో సత్కరించారు. ప్రముఖ జర్నలిస్ట్ హెచ్ఎస్ దొరస్వామి చేతుల మీదుగా ఈ అవార్డును రావీష్‌కు అందజేశారు. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ రెండవ వర్ధంతిని పురస్కరించుకొని గౌరీ లంకేష్ మెమోరియల్ ట్రస్ట్ ఈ అవార్డును ప్రకటించింది. సీనియర్ జర్నలిస్ట్ సిద్ధార్థ్ వరదరాజన్, విద్యావేత్త రహమత్ తారికెరే, ఉద్యమకారుడు తీస్తా సెతల్వాద్‌లతో కూడిన కమిటీ ఈ అవార్డుకు రావీష్ కుమార్‌ను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా రావీష్ కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టులపై దాడులు అందరినీ ప్రభావితం చేస్తాయని అభిప్రాయ పడ్డారు. 'నాథూరం గాడ్సేను దేశభక్తుడిగా, గాంధీజీని ఉగ్రవాదిగా చూసే కాలంలో మనం జీవిస్తున్నాం. అంతేకాక దేశంలో అసమ్మతివాదులను.. దేశ వ్యతిరేకులు, అర్బన్ నక్సల్స్, పాకిస్తాన్‌కు అనుకూరులుగా చిత్రీకరిస్తున్నారు. మన దేశ ప్రజాస్వామ్యం నెమ్మదిగా మరణ దిశగా వెళుతోంది' అని ఆయన పేర్కొన్నారు. కాగా గౌరీ లంకేశ్‌ను బెంగళూరులోని ఆమె ఇంటి ముందు సెప్టెంబర్ 5, 2017న దుండగుడు అతి దారుణంగా కాల్చి చంపాడు. -
రవీష్ కుమార్‌కు రామన్ మెగసెసే
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ జర్నలిస్టు, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రావీష్ కుమార్ (44) ప్రఖ్యాత రామన్ మెగసెసే అవార్డుకు ఎంపికయ్యారు. 2019 సంవత్సరానికి గాను ఆయన ఈ అవార్డును గెలుచుకున్నారని రామన్ మెగసెసే ఫౌండేషన్ శుక్రవారం ప్రకటించింది. జర్నలిజంలో రవీష్ కుమార్ అందించిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది. 2019 రామన్ మెగసెసే అవార్డు విజేతలుగా ప్రకటించిన ఐదుగురిలో కుమార్ ఒకరు. మిగిలిన నలుగురిలో మయన్మార్‌కు చెందిన కో స్వీ విన్, థాయ్‌లాండ్‌కు చెందిన అంగ్ఖానా నీలపైజిత్, ఫిలిప్పీన్స్‌కు చెందిన రేముండో పూజంటే కయాబ్యాబ్, దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జోంగ్-కి ఉన్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో సెప్టెంబర్ 9 న ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఆసియా నోబెల్ బహుమతిగా పరిగణించబడే రామన్ మెగసెసే అవార్డును సొంతం చేసుకోవడంపై పలువురు రవీష్ కుమార్‌కు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం రామన్ మెగసెసే ఫౌండేషన్ ఆయా రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆసియా దేశపు వ్యక్తులకు ఈ అవార్డును ప్రధానం చేస్తుంటుంది. ఫిలిప్పీన్స్ దేశపు మాజీ అధ్యక్షుడైన రామన్ మెగసెసే జ్ఞాపకార్థం దీనిని 1957 లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సేవ, ప్రజా సేవ, సామాజిక నాయకత్వం, జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత, ప్రపంచ శాంతి, అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు రంగాల్లో విశేష సేవలందించిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంది. -
ఉమా సుధీర్‌కు చమేలీ దేవి అవార్డు
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్ 2017 సంవత్స రానికి ప్రతిష్టాత్మక చమేలీ దేవి అవార్డుకు ఎంపికయ్యారు. రాజకీయాలు, పిల్లలు, మహిళలు, మానవ హక్కులు, వ్యవసాయం, గ్రామీణ సమస్యలు, మైనారిటీల సమస్యలు తదితరాలపై ఆమె విస్తృతంగా వెలువరించిన కథనాలకు ఈ గుర్తింపు లభించింది. ఉమా సుధీర్ విశ్లేషణాత్మక కథనాలు క్షేత్రస్థాయిలో వాస్తవాలపై అవగాహన కలిగించేందుకు దోహ దపపడ్డాయని అవార్డు అందించే మీడి యా ఫౌండేషన్ పేర్కొంది. కుష్టు వ్యాధి వల్ల వేలిముద్రలు కోల్పోయి ప్రభుత్వ పథకాలకు దూరమైన వారి దుస్థితిపై కథనాలు రాసిన న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్టు సురక్షను కూడా తగిన విధంగా గౌరవించాలని జ్యూరీ సిఫార్సు చేసింది. -
ఇస్ ఇండియన్‌కో నికాలో!
న్యూయార్క్: పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి న్యూయార్క్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ భారతీయ టీవీచానెల్ జర్నలిస్టుకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఎన్డీటీవీ జర్నలిస్టు పట్ల కొంత దురుసుగా ప్రవర్తిస్తూ.. ’ఇస్ ఇండియన్‌కో నికాలో’ (ఈ భారతీయుడ్ని వెళ్లగొట్టండి) అంటూ బయటకు పంపించారు. జమ్మూకశ్మీర్‌లోని యూరిలో తాజా ఉగ్రవాద దాడితో భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో న్యూయార్క్‌లోని రూజ్వెల్ట్ హోటల్లో పాక్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారతీయ జర్నలిస్టులెవరినీ అనుమతించలేదు. ఈ సమావేశానికి హాజరైన ఎన్డీటీవీ జర్నలిస్టు నమ్రత బ్రార్‌ను బయటకు పంపించారు. అంతేకాకుండా 18మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న యూరి ఉగ్రవాద దాడిపై భారతీయ పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు పాక్ నాయకత్వం జవాబు దాటవేసింది. న్యూయార్క్‌లో ఉన్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారతీయ విలేకరుల ప్రశ్నలను పూర్తి తోసిపుచ్చుతూ.. వారిని ఏమాత్రం పట్టించుకోనట్టు వ్యవహరించారు. మరోవైపు మాత్రం జమ్ముకశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, బ్రిటన్ ప్రధాని థెరిసా మేలతో సమావేశాల్లో మొసలి కన్నీరు కార్చారు.