దేశరాజధాని ఢిల్లీలో వడగాడ్పుల బీభత్సం కొనసాగుతోంది. ఎండలకు తాళలేక మృతి చెందుతున్నవారి సంఖ్య గతంలో ఎదురైన కరోనా మహమ్మారి మరణాలను మించిపోతున్నది. ఢిల్లీలోని పలు శ్మశానవాటికల వద్ద దహన సంస్కారాలకు ఎదురుచూస్తున్న మృతదేహాల క్యూ కనిపిస్తోంది.
ఢిల్లీ కార్పొరేషన్‌కు చెందిన బోద్ ఘాట్‌లో కరోనా తర్వాత అత్యధిక దహన సంస్కారాలు జూన్ 19న ఒక్క రోజులో జరిగాయి. బుధవారం రాత్రి 12 గంటల వరకు నిగమ్ బోద్ ఘాట్ వద్ద 142 మృతదేహాలను దహనం చేశారు. కరోనా కాలంలో 2021 ఏప్రిల్‌న 253 మృతదేహాలను ఇక్కడ దహనం చేశారు.
నిగమ్ బోద్ ఘాట్ నిర్వాహకులు మాట్లాడుతూ ఇంత భారీ సంఖ్యలో మరణాలు సంభవించడానికి వడదెబ్బ కారణం కావచ్చన్నారు. ఈ జూన్‌లో ఇప్పటివరకు 1,101 మృతదేహాలను దహనం చేశామన్నారు. నిగమ్ బోద్ ఘాట్‌ల వద్ద మృతదేహాల అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు చాలాసేపు వేచిచూడాల్సి వస్తోంది.
దేశంలో కరోనా తాండవమాడుతున్న 2022 జూన్‌లో ఈ ఘాట్‌లో మొత్తం 1,570 మృతదేహాలకు దహన సంస్కారాలు చేశారు. ఇప్పుడు ఈ రికార్డు బద్దలయ్యేలా వేసవి ఉష్ణోగ్రతలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. నిగమ్ బోద్ ఘాట్‌లో వారం రోజులుగా జరిగిన దహన సంస్కారాల గణాంకాలు ఇలా ఉన్నాయి.
జూన్ 14 - 43
జూన్ 15- 53
జూన్ 16 - 70
జూన్ 17 - 54
జూన్ 18 - 97
జూన్ 19- 142 (అర్ధరాత్రి 12 గంటల వరకు)
ఢిల్లీలో సంభవిస్తున్న అత్యధిక ఉష్ణోగ్రతలు పేదల పాలిట శాపంగా మారాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో మృతదేహాలు కనిపిస్తున్నాయి. వడగాడ్పుల కారణంగా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 48 గంటల్లో 50 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎండ తీవ్రతకు తొమ్మది రోజుల్లో 192 మంది నిరాశ్రయులు ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరంతా వడదెబ్బ కారణంగా మృతిచెందారా లేదా అనేది ఆరోగ్యశాఖ అధికారులు ఇంకా ధృవీకరించలేదు.
Comments
Please login to add a commentAdd a comment