
మానవుడికి లభించిన వరాల్లో మంచినడవడిక గొప్పవరం. మంచినడవడితోనే దైవసన్నిధికి చేరుకోవడం సాధ్యం. పరులకు సాయం చేయకపోవడం, వాగ్దానం చేసి భంగపరచడం, దేవుని పేరుతో మోసాలకు పాల్పడడం ఘోరమైన పాపాలు. ఇలాంటి వాళ్ళకు దైవశిక్ష తప్పదు. మంచినడవడితో కూడిన జీవితమే ఇహపరలోకాల్లో మానవుణ్ణి సాఫల్య శిఖరాలకు చేరుస్తుంది. ముహమ్మద్ ప్రవక్త(సం)ప్రవచనం ప్రకారం, మూడురకాల వ్యక్తులవైపు ప్రళయం రోజున దైవం కన్నెత్తి కూడా చూడడు. వారి పాపాలను క్షమించి వారిని పరిశుధ్ధపరచడు.పైగా వారిని తీవ్రంగా శిక్షిస్తాడు. వారిలో ఒకరకం మనిషి, అవసరానికి మించి ప్రయాణ సామగ్రి ఉన్నా, తోటి ప్రయాణీకులకు వాటిని ఇచ్చి ఆదుకోనివాడు. రెండోరకం వ్యక్తి, ప్రాపంచిక లాభాలను దృష్టిలో ఉంచుకొని, రాజ్యాధినేతకు అనుకూలంగా ప్రమాణాలు చేసేవాడు. మూడోరకం మనిషి, తన వ్యాపారవస్తువులను అమ్ముకోడానికి, దైవంపైప్రమాణాలు చేసేవాడు.
తరువాత ప్రవక్తమహనీయులు, ఖురాన్ లోని వాక్యం పఠించారూ. ‘కొందరు తమ వాగ్దానాలను,దేవుని విషయంలో చేసిన ప్రమాణాలను అతి స్వల్పమూల్యానికి అమ్ముకుంటారు. ఇలాంటి వారికి పరలోకంలో ఎలాంటి ప్రతిఫలం లభించదు.దైవం వారితో మాట్లాడడు. ప్రళయదినాన వారివైపు కన్నెత్తికూడాచూడడు.వారిని పరిశుధ్ధపరిచే ప్రసక్తి అంతకన్నాలేదు. పైగా వారికి నరకంలో అత్యంత వ్యధాభరితమైన శిక్ష పడుతుంది.’ఈ ప్రవచనంలో ప్రవక్త మహనీయులు మూడురకాల మనస్తత్వాలను ప్రస్తావించారు. ఒకటి: అవసరానికి మించి ఉన్నప్పటికీ, అవరార్ధులైన తోటివారికి ఇవ్వకపోవడం, వారిని ఆదుకోకపోవడం మానవత్వం అనిపించుకోదని, ఇలాంటి అమానవీయ చర్యలను దైవం హర్షించడని, ఇలాంటి నేరానికి పాల్పడినందుకు తీవ్రంగా శిక్షిస్తాడని చెప్పారు. నిజానికి ఇది ప్రయాణ సందర్భానికే పరిమితమైన హితవుకాదు. నిత్యజీవితంలో అడుగడుగునా ఆచరించవలసిన అమృత ప్రవచనమిది.
ఎంతోమంది అవసరార్ధులు, అభాగ్యులు నిత్యజీవితంలో మనకు తారసపడుతుంటారు. అలాంటి వారికి చేతనైన సహాయం చేయడం మానవత్వం. స్థోమత ఉన్నా పక్కవారిని గురించి పట్టించుకోకపోవడం అమానవీయం, అనైతికం. నేరం. అందుకే ప్రవక్తమహనీయులు, ‘నువ్వు తిని, నీ పక్కవాడు పస్తులుంటే నీలో విశ్వాసంగాని, మానవత్వం గాని లేదని తీవ్రంగా హెచ్చరించారు. మరోరకం మనిషి, స్వార్థం కోసం, స్వలాభంకోసం అధికారంలో ఉన్నవారికి వత్తాసు పలుకుతూ తన పబ్బం గడుపుకుంటాడు. తన పప్పులు ఉడుకుతున్నంత వరకూ, తనమాట సాగుతున్నంత వరకూ వారి చర్యలకు మద్దతు పలుకుతూ, సమర్థిస్తూ ఉంటాడు. ఇక లాభం లేదనుకున్నప్పుడు ప్లేటు పిరాయిస్తాడు. ఇలాంటి ఊసరవెల్లి రాజకీయాలను ఈనాడు మనం కళ్ళారా చూస్తున్నాం. ఇలాంటి కుటిల, స్వార్ధపర, అవినీతి పరులకు కూడా వినాశం తప్పదు.
మూడోరకం మనిషి, తన సరుకును అమ్ముకోడానికి దైవంపై ప్రమాణాలు చేసి ప్రజలను నమ్మిస్తాడు. నాసిరకం సరుకును నాణ్యమైన సరుకని, ఇదిగో ఇంతకు కొన్నాను, ఇంతకు అమ్ముతున్నాను. అంతా పారదర్శకం. అని ప్రమాణం చేసి మోసం చేసి తన వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకుంటాడు. సర్వశక్తిమంతుడైన దేవునిపై ప్రమాణం చేసిన కారణంగా ప్రజలు అతని మాయమాటలు ఇట్టే నమ్మేస్తారు. దీనివల్ల అతనికి తాత్కాలి క లాభాలు సమకూరినా, నిజమేమిటో ప్రజలకు కొద్దికాలంలోనే తెలిసిపోతుంది. ఇలాంటి వంచకులు, మోసకారులైన వ్యాపారులకు ఇహలోకంలో, పరలోకంలో కూడా వినాశనం తప్పదు. అందుకని ప్రాపంచిక జీవితంలో నైతిక విలువలు పాటిస్తూ పాపభీతితో జీవితం గడపడం వివేకవంతుల లక్షణం. అలాంటివారే స్వర్గసౌఖ్యాలకు అర్హులు కాగలుగుతారు.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్