mans
-
మనిషి ఆయుష్షు ఐదు రెట్లు పెరుగుతుందా?
వందేళ్లు బతకాలని ఎవరు అనుకోరు చెప్పండి. కానీ.. చాలా తక్కువ మందికి ఈ అదష్టం దక్కుతుంది. ఇప్పటివరకూ ఇదే పరిస్థితి. కానీ ఓ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బందం పరిశోధనలు పూర్తిస్థాయిలో సఫలమైతే మాత్రం మనిషి ఆయుష్షు నాలుగు రెట్లు అంటే సుమారు 400 ఏళ్లకు పెంచేందుకు అవకాశం ఏర్పడుతుంది! ఎందుకంటే.. సి.ఎలిగాన్స్ అనే సూక్ష్మస్థాయి పురుగులపై జరిగిన పరిశోధనల్లో వాటి ఆయుష్షు ఐదు రెట్లు ఎక్కువైంది కాబట్టి. అదెలాగో తెలుసుకునే ముందు మన కణాలెలా పనిచేస్తాయో కొంచెం అర్థం చేసుకుందాం. కణాల్లోపల ఉండే భాగాలు నిర్దిష్ట పనులు నిర్వహించేందుకు సిగ్నలింగ్ పాథ్‌వేస్‌ను ఏర్పాటు చేసుకుంటాయి. ఒక భాగానికి సంకేతం అందితే.. ఆ పని చేసిన తరువాత సంకేతం పక్కనున్న భాగానికి వెళుతుంది. ఇన్సులిన్‌తోపాటు రాపమైసిన్ పాథ్‌వేలకూ.. ఆయుష్షుకు మధ్య సంబంధం ఉందని గతంలోనే రుజువైంది. రాపమైసిన్ పాథ్‌వేను నియంత్రిస్తే ఆయుష్షు 100 శాతం పెరిగితే ఇన్సులిన్ నియంత్రణ ద్వారా 30 శాతం పెరిగినట్లు గత పరిశోధనలు చెబుతున్నాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. ఈ రెండింటినీ మార్చడం ద్వారా ఆయుష్షు ఐదు రెట్లు పెరుగుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అయితే మానవుల్లోనూ ఇదే ఫలితాలు కనిపిస్తాయా? అన్నది ప్రస్తుతానికైదే తెలియదు. కానీ.. సి–ఎలిగాన్స్‌తోపాటు మానవుల్లోనూ ఒకే రకమైన జన్యువులు ఉండటం గమనించాలని అంటున్నారు ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన జరోడ్ రోలిన్స్ అనే శాస్త్రవేత్త. విస్తత స్థాయి పరిశోధనల ద్వారా మానవుల్లోనూ ఇదే ఫలితాలు సాధించేందుకు అవకాశముందని అంచనా. -
విధేయత లేని ప్రార్థనలు అర్థరహితం
ప్రవాహం లాంటి ప్రార్థనా ధాటి కొందరిది. అంతటి ఆత్మీయావేశం వారి నిజ జీవితంలో ఉంటుందా అంటే అనుమానమే. అద్భుతమైన పదాలు ఏరి కూర్చిన పూదండ మరికొందరి ప్రార్థన. ఆ ఆత్మీయ సౌందర్యం వారి విశ్వాస జీవితంలో మాత్రమే కనిపించదు.. నవరసాలూ గొంతులోనే పలికిస్తూ సాగే ఏక పాత్రాభినయం మరికొందరి ప్రార్థన. కాని వారి విశ్వాస జీవితం నిండా నీరసమే, నటనే. దేవునితోనే నేరుగా సంభాషించే మహిమానందకరమైన సాధనంగా దేవుడే మనకిచ్చిన ‘ప్రార్థన’ అనే ఆరాధనా మాధ్యమం తాలూకు సరికొత్త రూపాలివి. ప్రార్థనాశక్తిని తక్కువచేసే ప్రయత్నం కానే కాదిది. ‘విశ్వాసికి ప్రార్థన ప్రాణవాయువు’. ప్రార్ధన సర్వస్వమే, కాని మన క్రియలకు ప్రత్యామ్నాయం కాదు. ఐగుప్తు దాస్య విముక్తి నాటి రాత్రి మోషే వెంబడి నడిచిన లక్షలాదిమంది ఇశ్రాయేలీయులు తమ త్రోవలో ముందుకు సాగకుండా అడ్డుపడ్డ ఎర్ర సముద్రాన్ని, వెనక తరుముకొస్తున్న ఫరో సైన్యాన్ని చూసి భయపడి ‘ఐగుప్తులో మాకు సమాధులు లేవని మమ్మల్నిక్కడికి తెచ్చావా?’ అంటూ మోషే మీద విరుచుకుపడగా, వారికి భయపడి మోషే దేవుణ్ణి ప్రార్థిస్తుండగా, ఇది ప్రార్థించే సమయమా? అని గద్దిస్తూ,‘నీ చేతిలోని కర్రతో సముద్రాన్ని కొట్టి, అదిచ్చే దారిలో ముందుకు సాగిపో!!’ అన్నాడు దేవుడు (నిర్గమ 14:13–16). దేవుని ఆజ్ఞలకు విధేయులవడానికన్నా ప్రార్థించడానికే ప్రాధాన్యతనిచ్చే వారికి దేవుడు వేసే మొట్టికాయ ఇది. ప్రార్థన గొప్పది కాని దేవుని పట్ల, దేవుని ఆజ్ఞలపట్ల మన ‘విధేయత’ మరెంతో గొప్పది. క్రియలు లేని, దేవుని పట్ల విధేయత లేని ప్రార్థన అర్థరహితమైనది. యెరికో తర్వాత ‘హాయి’ పట్టణంలో ఇశ్రాయేలీయులు ఓడినప్పుడు మొహం చెల్లక ప్రార్థిస్తున్న యెహోషువను, ఓటమికి కారణమైన పాపం ఎక్కడుందో తెలుసుకోకుండా ప్రార్థన ఎందుకు చేస్తున్నావని దేవుడు నిలదీశాడు (యెహోషువ 7:10). అపుడు ఆకాను అనే వ్యక్తి చేసిన అవిధేయతా పాపం బట్టబయలై, ప్రాయశ్చిత్తం కూడా జరిగింది. ‘నీవు బలిపీఠం మీద అర్పణ చెల్లిస్తున్నపుడు, ఎవరితోనైనా నీకు విరోధమున్నదని గుర్తొస్తే, అర్పణనొదిలేసి వెళ్లి ముందు సమాధానపడాలి’ అన్న యేసుక్రీస్తు ఆదేశం కొత్తనిబంధనకాలపు మన ప్రార్థనలను సరికొత్తగా నిర్వచిస్తోంది (మత్తయి 5:23,24). ప్రార్ధనకన్నా, అర్పణకన్నా నిర్దోషమైన హదయానికే దేవుడు విలువనిస్తాడు. తల్లిదండ్రులతో, తోబుట్టువులతో, ఇంకెవరితోనూ సమాధానం లేకున్నా, వాటిని సరిదిద్దుకోకుండా, కేవలం ప్రార్థనలతో విశ్వాసుల్లో హాజరు వేయించుకొనే వేషధారుల జీవితాలు అందుకే ఆనందం కరువై వెల వెలబోతుంటాయి. దేవుని ప్రేమను తెలుసుకోవాలన్న ఆశతో ఉన్న వేలాదిమంది చుట్టూ కనిపిస్తుంటే, ప్రభువా నన్నెలా వాడుకొంటామంటూ ఇంకా ప్రార్థనలే చేస్తున్న విశ్వాసులు ఇకనైనా కళ్ళు తెరవాలి. కొత్తనిబంధన బైబిల్ సారాంశమే దేవుని ప్రేమను మాటల్లో, క్రియల్లో కూడా ప్రకటించడమైతే ఇంకా ప్రార్థనలతో కాలక్షేపం దేనికి? ప్రార్థన చెయ్యకూడదని కాదు, ప్రార్థన మాత్రమే చేస్తాను అన్న ధోరణి సరైనది కాదు. ప్రభువు పనికి పూనుకొన్న విశ్వాసి జీవితంలో ప్రార్థనా వూటలు అనంతంగా ఉబుకుతుంటాయి, మనిషి పనిచేస్తూ ఊపిరి కూడా పీల్చుకొంటున్నట్టే, విశ్వాసి ప్రార్థన, పరిచర్య ఒకేసారి సాగుతూ ఉంటాయి. ప్రార్థన మిళితమైన పరిచర్య జీవితం వారిది.. ఒక ధనికుడు పేదలు, దీనులకు సాయం కలగాలంటూ రోజూ ప్రార్థన చేసేవాడట. ఆ ప్రార్థన రోజూ వినే అతని పదేళ్ల కొడుకు ఒకసారి ‘నీకున్న డబ్బంతా నాకిచ్చెయ్యి నాన్నా’ అన్నాడు. ఎందుకని అడిగితే, ‘అదంతా పేదలకు పంచేస్తాను నీ ప్రార్థనలన్నీ ఒక్క రోజులో నిజం చేస్తాను’ అన్నాడట. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
విలువలతోనే సాఫల్యం
మానవుడికి లభించిన వరాల్లో మంచినడవడిక గొప్పవరం. మంచినడవడితోనే దైవసన్నిధికి చేరుకోవడం సాధ్యం. పరులకు సాయం చేయకపోవడం, వాగ్దానం చేసి భంగపరచడం, దేవుని పేరుతో మోసాలకు పాల్పడడం ఘోరమైన పాపాలు. ఇలాంటి వాళ్ళకు దైవశిక్ష తప్పదు. మంచినడవడితో కూడిన జీవితమే ఇహపరలోకాల్లో మానవుణ్ణి సాఫల్య శిఖరాలకు చేరుస్తుంది. ముహమ్మద్ ప్రవక్త(సం)ప్రవచనం ప్రకారం, మూడురకాల వ్యక్తులవైపు ప్రళయం రోజున దైవం కన్నెత్తి కూడా చూడడు. వారి పాపాలను క్షమించి వారిని పరిశుధ్ధపరచడు.పైగా వారిని తీవ్రంగా శిక్షిస్తాడు. వారిలో ఒకరకం మనిషి, అవసరానికి మించి ప్రయాణ సామగ్రి ఉన్నా, తోటి ప్రయాణీకులకు వాటిని ఇచ్చి ఆదుకోనివాడు. రెండోరకం వ్యక్తి, ప్రాపంచిక లాభాలను దృష్టిలో ఉంచుకొని, రాజ్యాధినేతకు అనుకూలంగా ప్రమాణాలు చేసేవాడు. మూడోరకం మనిషి, తన వ్యాపారవస్తువులను అమ్ముకోడానికి, దైవంపైప్రమాణాలు చేసేవాడు. తరువాత ప్రవక్తమహనీయులు, ఖురాన్ లోని వాక్యం పఠించారూ. ‘కొందరు తమ వాగ్దానాలను,దేవుని విషయంలో చేసిన ప్రమాణాలను అతి స్వల్పమూల్యానికి అమ్ముకుంటారు. ఇలాంటి వారికి పరలోకంలో ఎలాంటి ప్రతిఫలం లభించదు.దైవం వారితో మాట్లాడడు. ప్రళయదినాన వారివైపు కన్నెత్తికూడాచూడడు.వారిని పరిశుధ్ధపరిచే ప్రసక్తి అంతకన్నాలేదు. పైగా వారికి నరకంలో అత్యంత వ్యధాభరితమైన శిక్ష పడుతుంది.’ఈ ప్రవచనంలో ప్రవక్త మహనీయులు మూడురకాల మనస్తత్వాలను ప్రస్తావించారు. ఒకటి: అవసరానికి మించి ఉన్నప్పటికీ, అవరార్ధులైన తోటివారికి ఇవ్వకపోవడం, వారిని ఆదుకోకపోవడం మానవత్వం అనిపించుకోదని, ఇలాంటి అమానవీయ చర్యలను దైవం హర్షించడని, ఇలాంటి నేరానికి పాల్పడినందుకు తీవ్రంగా శిక్షిస్తాడని చెప్పారు. నిజానికి ఇది ప్రయాణ సందర్భానికే పరిమితమైన హితవుకాదు. నిత్యజీవితంలో అడుగడుగునా ఆచరించవలసిన అమృత ప్రవచనమిది. ఎంతోమంది అవసరార్ధులు, అభాగ్యులు నిత్యజీవితంలో మనకు తారసపడుతుంటారు. అలాంటి వారికి చేతనైన సహాయం చేయడం మానవత్వం. స్థోమత ఉన్నా పక్కవారిని గురించి పట్టించుకోకపోవడం అమానవీయం, అనైతికం. నేరం. అందుకే ప్రవక్తమహనీయులు, ‘నువ్వు తిని, నీ పక్కవాడు పస్తులుంటే నీలో విశ్వాసంగాని, మానవత్వం గాని లేదని తీవ్రంగా హెచ్చరించారు. మరోరకం మనిషి, స్వార్థం కోసం, స్వలాభంకోసం అధికారంలో ఉన్నవారికి వత్తాసు పలుకుతూ తన పబ్బం గడుపుకుంటాడు. తన పప్పులు ఉడుకుతున్నంత వరకూ, తనమాట సాగుతున్నంత వరకూ వారి చర్యలకు మద్దతు పలుకుతూ, సమర్థిస్తూ ఉంటాడు. ఇక లాభం లేదనుకున్నప్పుడు ప్లేటు పిరాయిస్తాడు. ఇలాంటి ఊసరవెల్లి రాజకీయాలను ఈనాడు మనం కళ్ళారా చూస్తున్నాం. ఇలాంటి కుటిల, స్వార్ధపర, అవినీతి పరులకు కూడా వినాశం తప్పదు. మూడోరకం మనిషి, తన సరుకును అమ్ముకోడానికి దైవంపై ప్రమాణాలు చేసి ప్రజలను నమ్మిస్తాడు. నాసిరకం సరుకును నాణ్యమైన సరుకని, ఇదిగో ఇంతకు కొన్నాను, ఇంతకు అమ్ముతున్నాను. అంతా పారదర్శకం. అని ప్రమాణం చేసి మోసం చేసి తన వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకుంటాడు. సర్వశక్తిమంతుడైన దేవునిపై ప్రమాణం చేసిన కారణంగా ప్రజలు అతని మాయమాటలు ఇట్టే నమ్మేస్తారు. దీనివల్ల అతనికి తాత్కాలి క లాభాలు సమకూరినా, నిజమేమిటో ప్రజలకు కొద్దికాలంలోనే తెలిసిపోతుంది. ఇలాంటి వంచకులు, మోసకారులైన వ్యాపారులకు ఇహలోకంలో, పరలోకంలో కూడా వినాశనం తప్పదు. అందుకని ప్రాపంచిక జీవితంలో నైతిక విలువలు పాటిస్తూ పాపభీతితో జీవితం గడపడం వివేకవంతుల లక్షణం. అలాంటివారే స్వర్గసౌఖ్యాలకు అర్హులు కాగలుగుతారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
కుక్కలే ఎందుకు మనిషికి బెస్ట్‌ఫ్రెండ్?
కుక్కలు, నక్కలు ఒకేజాతి జంతువులు. కుక్కేమో మనిషికి బెస్ట్‌ఫ్రెండ్. నక్క మాత్రం కాదు. ఎందుకిలా? మానవులతో స్నేహం చేయాలన్న లక్షణం కుక్కల జన్యువుల్లోనే ఉండటం దీనికి కారణమంటున్నారు ఒరెగాన్ స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. మనుషుల్లో కొందరికి విలియమ్స్ బారెన్ సిండ్రోమ్ అనే ఓ సమస్య ఉంటుందట. ఈ సమస్య ఉన్న వారు పరిచయమైతే చాలు విపరీతమైన స్నేహభావాన్ని చూపుతుంటారు. వీరిలో ఎదుగుదల చాలా ఆలస్యంగా జరుగుతుంటుంది. ఇలాంటి వారిలో, కుక్కల్లో జన్యుపరమైన సారూప్యత ఉన్నట్లు శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. కొన్ని కుక్కలు, నక్కలతో కొన్ని ప్రయోగాలు నిర్వహించారు. మనుషుల సమక్షంలో ఒక డబ్బా మూత తీయమని పురమాయిస్తే.. కుక్కలు మనుషుల అనుమతి కోసం ఎదురుచూస్తే.. నక్కలు మాత్రం నేరుగా పనిలో పడిపోయాయి. అలాగే పేరుపెట్టి పిలిచినప్పుడు రెండు జంతువులూ మనుషుల వద్దకు ఎగబడి వచ్చినా.. కుక్కలు మనిషిని ఆకర్షించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తే.. నక్కలు సెకన్ల వ్యవధిలో వెనుదిరిగి వెళ్లిపోయాయి. జన్యుపరీక్షల్లో విలియమ్స్ బారెన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తుల్లో మాదిరిగానే కుక్కల్లో కూడా జన్యుపరమైన మార్పులు కనిపించాయి. వీటిని బట్టి మనుషులతో కుక్కలకు ఉన్న దోస్తీకి జన్యుపరమైన మార్పులే కారణమన్న అంచనాకు వచ్చారు శాస్త్రవేత్తలు. -
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
మధురై: రెండు వేర్వేరు మతాలకు చెందినవారు ఒకే మత ఆచారం ప్రకారం పెళ్లి చేసుకుంటే ఆ వివాహం చట్టబద్ధం కాదని మద్రాసు హైకోర్టు గురువారం సంచలన తీర్పును వెలువరించింది. రెండు విభిన్న మతాలకు చెందిన స్త్రీ, పురుషుడు ఏదో ఒక మతాచారం ప్రకారం పెళ్లి చేసుకుంటే చెల్లదని చెప్పింది. కేవలం ప్రత్యేక వివాహ చట్టం ప్రకారమే రెండు మతాల మధ్య జరిగిన వివాహాలు చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. ఓ హిందూ మతానికి చెందిన అమ్మాయి, క్రైస్తవమతానికి చెందిన అబ్బాయి గుడిలో వివాహం చేసుకున్నారు. అయితే, ఈ వివాహాన్ని అంగీకరించని అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దీనిని విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఆర్. శివకుమార్, జస్టిస్ వి.ఎస్.రవి తీర్పును వెలువరించారు. దీని ప్రకారం ఇద్దరు వేర్వేరు మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవాలనుకుంటే ముందు వారిలో ఒకరు మరొకరి మతాన్ని స్వీకరించాలని ఆ తర్వాత జరిగే వివాహమే చెల్లుబాటవుతుందని పేర్కొంది. 1954 ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం, మత మార్పిడి అవసరం లేకుండానే వీరి వివాహాన్ని నమోదు చేయాల్సి వుందని సూచించింది. మేజర్ అయిన ఆ యువతికి ఎక్కడికైనా వెళ్లి నివసించే హక్కు ఉందని, ఆమెకు తల్లిదండ్రులు, ఇతరుల రక్షణ అవసరం లేదని కూడా చెప్పింది. -
ఉమెన్స్ హాస్టల్లో యువకులా?
గుంటూరు: ఉమెన్స్ హాస్టల్లో యువకులు పనిచేయటమా? ఇక్కడ పనిచేసేందుకు మహిళలు దొరకలేదా.. అసలు వీరిని ఎవరు నియమించారు, ఎప్పుడు నియమించారు అంటూ ఇన్చార్జి వీసీ బి.ఉదయలక్ష్మి మండిపడ్డారు. వెంటనే ఇక్కడి నుంచి వీరిని మార్చండి అని రిజిస్ట్రార్ పి.రాజశేఖర్‌ను ఆదేశించారు. ఇన్చార్జి వీసీగా హోదాలో యూనివర్సిటీకి వచ్చిన ఉదయలక్ష్మి ఉమెన్స్ హాస్టల్‌ను సందర్శించారు. భోజనశాలలో భోజనం చేస్తున్న విద్యార్థినుల వద్దకు వెళ్లి వసతులెలా ఉన్నాయి, భోజనాలు బాగుంటున్నాయా అని అడిగారు. విద్యార్థినులు సమాధానమిస్తూ భోజనం బాగోడం లేదని, తమకంటే సిబ్బంది ముందుగా తింటున్నారని తమకు సరిగా పెట్టడం లేదని ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు చెప్పేది నిజమేనని సిబ్బంది పనితీరు బాగోలేదని చీఫ్ వార్టెన్ జయశ్రీ కూడా ఇన్చార్జి వీసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే సిబ్బందిని పిలిచిన ఇన్చార్జి వీసీ ఇంతకు ముందులా ఉండదని, సరిగా చేయకపోతే సస్సెండ్ చేస్తానని హెచ్చరించారు. భోజనం, శుభ్రతపై ప్రశ్నిస్తున్నందుకు తనను సిబ్బంది అందరూ కలిసి బెదిరించారని తాను ఎంతో వేదన చెందానని ఎల్ఎల్ఎం విద్యార్థిని కిరణ్ విలపిస్తూ ఇన్చార్జి వీసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే హాస్టల్ ఇన్‌చార్జ్‌లు, సిబ్బందిని పిలిపించిన ఉదయలక్ష్మి విద్యార్థినిని ఎందుకు బెదిరించారని వారిని ప్రశ్నించారు. మరొకసారి ఇలా జరిగితే ఊరుకోనని స్పష్టం చేశారు. విద్యార్థిని పిర్యాదు చేస్తుండగా సూపర్ వైజర్ కలుగజేసుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికందరికీ నోటీసులు జారీ చేసి వివరణ అడగాలని, సూపర్వైజర్లు ఇద్దరినీ మార్చాలని రిజిస్ట్రార్ పి.రాజశేఖర్‌కు సూచించారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రత్యేకంగా డ్రస్ వేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జంట్స్ హాస్టల్‌ను సందర్శించి వసతులను పరిశీలించారు. అందులో పనిచేస్తున్న పెద్దవయసున్న పురుషులను ఉమెన్స హాస్టల్‌కు మార్చాలని అధికారులకు సూచించారు. వసతి గృహ వ్యవహారాల్లో విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఇన్చార్జి వీసీ వెంట పలువురు యూనివర్సిటీ అధికారులు, సిబ్బంది ఉన్నారు. సిబ్బంది బదిలీకి రంగం సిద్ధం ఇన్చార్జి వీసీ ఆదేశాలతో వసతి గృహాల్లో పనిచేస్తున్న సిబ్బందిని బదిలీ చేసేందుకు యూనివర్సిటీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఉమెన్స హాస్టల్లోని ఇన్చార్జిలతోపాటు అక్కడ పనిచేసే సిబ్బందిని మారుస్తున్నారు. ఉమెన్స హాస్టల్స్ చీఫ్ వార్డెన్ జయశ్రీ గురువారం రాత్రి రిజిస్ట్రార్ పి.రాజశేఖర్‌తో సమావేశమై దీనిపై చర్చించారు.