ప్రవాహం లాంటి ప్రార్థనా ధాటి కొందరిది. అంతటి ఆత్మీయావేశం వారి నిజ జీవితంలో ఉంటుందా అంటే అనుమానమే. అద్భుతమైన పదాలు ఏరి కూర్చిన పూదండ మరికొందరి ప్రార్థన. ఆ ఆత్మీయ సౌందర్యం వారి విశ్వాస జీవితంలో మాత్రమే కనిపించదు.. నవరసాలూ గొంతులోనే పలికిస్తూ సాగే ఏక పాత్రాభినయం మరికొందరి ప్రార్థన. కాని వారి విశ్వాస జీవితం నిండా నీరసమే, నటనే. దేవునితోనే నేరుగా సంభాషించే మహిమానందకరమైన సాధనంగా దేవుడే మనకిచ్చిన ‘ప్రార్థన’ అనే ఆరాధనా మాధ్యమం తాలూకు సరికొత్త రూపాలివి. ప్రార్థనాశక్తిని తక్కువచేసే ప్రయత్నం కానే కాదిది.
‘విశ్వాసికి ప్రార్థన ప్రాణవాయువు’. ప్రార్ధన సర్వస్వమే, కాని మన క్రియలకు ప్రత్యామ్నాయం కాదు. ఐగుప్తు దాస్య విముక్తి నాటి రాత్రి మోషే వెంబడి నడిచిన లక్షలాదిమంది ఇశ్రాయేలీయులు తమ త్రోవలో ముందుకు సాగకుండా అడ్డుపడ్డ ఎర్ర సముద్రాన్ని, వెనక తరుముకొస్తున్న ఫరో సైన్యాన్ని చూసి భయపడి ‘ఐగుప్తులో మాకు సమాధులు లేవని మమ్మల్నిక్కడికి తెచ్చావా?’ అంటూ మోషే మీద విరుచుకుపడగా, వారికి భయపడి మోషే దేవుణ్ణి ప్రార్థిస్తుండగా, ఇది ప్రార్థించే సమయమా? అని గద్దిస్తూ,‘నీ చేతిలోని కర్రతో సముద్రాన్ని కొట్టి, అదిచ్చే దారిలో ముందుకు సాగిపో!!’ అన్నాడు దేవుడు (నిర్గమ 14:13–16). దేవుని ఆజ్ఞలకు విధేయులవడానికన్నా ప్రార్థించడానికే ప్రాధాన్యతనిచ్చే వారికి దేవుడు వేసే మొట్టికాయ ఇది.
ప్రార్థన గొప్పది కాని దేవుని పట్ల, దేవుని ఆజ్ఞలపట్ల మన ‘విధేయత’ మరెంతో గొప్పది. క్రియలు లేని, దేవుని పట్ల విధేయత లేని ప్రార్థన అర్థరహితమైనది. యెరికో తర్వాత ‘హాయి’ పట్టణంలో ఇశ్రాయేలీయులు ఓడినప్పుడు మొహం చెల్లక ప్రార్థిస్తున్న యెహోషువను, ఓటమికి కారణమైన పాపం ఎక్కడుందో తెలుసుకోకుండా ప్రార్థన ఎందుకు చేస్తున్నావని దేవుడు నిలదీశాడు (యెహోషువ 7:10). అపుడు ఆకాను అనే వ్యక్తి చేసిన అవిధేయతా పాపం బట్టబయలై, ప్రాయశ్చిత్తం కూడా జరిగింది. ‘నీవు బలిపీఠం మీద అర్పణ చెల్లిస్తున్నపుడు, ఎవరితోనైనా నీకు విరోధమున్నదని గుర్తొస్తే, అర్పణనొదిలేసి వెళ్లి ముందు సమాధానపడాలి’ అన్న యేసుక్రీస్తు ఆదేశం కొత్తనిబంధనకాలపు మన ప్రార్థనలను సరికొత్తగా నిర్వచిస్తోంది (మత్తయి 5:23,24). ప్రార్ధనకన్నా, అర్పణకన్నా నిర్దోషమైన హదయానికే దేవుడు విలువనిస్తాడు.
తల్లిదండ్రులతో, తోబుట్టువులతో, ఇంకెవరితోనూ సమాధానం లేకున్నా, వాటిని సరిదిద్దుకోకుండా, కేవలం ప్రార్థనలతో విశ్వాసుల్లో హాజరు వేయించుకొనే వేషధారుల జీవితాలు అందుకే ఆనందం కరువై వెల వెలబోతుంటాయి. దేవుని ప్రేమను తెలుసుకోవాలన్న ఆశతో ఉన్న వేలాదిమంది చుట్టూ కనిపిస్తుంటే, ప్రభువా నన్నెలా వాడుకొంటామంటూ ఇంకా ప్రార్థనలే చేస్తున్న విశ్వాసులు ఇకనైనా కళ్ళు తెరవాలి. కొత్తనిబంధన బైబిల్ సారాంశమే దేవుని ప్రేమను మాటల్లో, క్రియల్లో కూడా ప్రకటించడమైతే ఇంకా ప్రార్థనలతో కాలక్షేపం దేనికి? ప్రార్థన చెయ్యకూడదని కాదు, ప్రార్థన మాత్రమే చేస్తాను అన్న ధోరణి సరైనది కాదు.
ప్రభువు పనికి పూనుకొన్న విశ్వాసి జీవితంలో ప్రార్థనా వూటలు అనంతంగా ఉబుకుతుంటాయి, మనిషి పనిచేస్తూ ఊపిరి కూడా పీల్చుకొంటున్నట్టే, విశ్వాసి ప్రార్థన, పరిచర్య ఒకేసారి సాగుతూ ఉంటాయి. ప్రార్థన మిళితమైన పరిచర్య జీవితం వారిది.. ఒక ధనికుడు పేదలు, దీనులకు సాయం కలగాలంటూ రోజూ ప్రార్థన చేసేవాడట. ఆ ప్రార్థన రోజూ వినే అతని పదేళ్ల కొడుకు ఒకసారి ‘నీకున్న డబ్బంతా నాకిచ్చెయ్యి నాన్నా’ అన్నాడు. ఎందుకని అడిగితే, ‘అదంతా పేదలకు పంచేస్తాను నీ ప్రార్థనలన్నీ ఒక్క రోజులో నిజం చేస్తాను’ అన్నాడట.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment