దురాశకు అంతులేకపోతే దేవుని కృప ఉగ్రతగా మారుతుంది!
• సువార్త
అడక్కుండా దేవుడు మనకిచ్చేదెప్పుడూ ఆశీర్వాదకరమైనది. దేవుణ్ణి మనమడిగి తీసుకున్నది మాత్రం ఆశీర్వాదకరమైనది కావచ్చు, కాకపోవచ్చు. అందుకే యేసు ప్రభువు ‘నీ చిత్తమే సిద్ధించుగాక’ అంటూ చేసే ప్రార్థన అత్యంత ఆశీర్వాదకరమైన, శక్తితో కూడిన ప్రార్థన అని బోధించారు (మత్త6:10).
మన పరలోకపు తండ్రిౖయెన దేవదేవునికి ఆయన పిల్లలమైన మనపట్ల అద్భుతమైన ప్రణాళికలున్నాయి. అవి యథాతథంగా నెరవేరడం మనకు అత్యంత ఆశీర్వాదకరం. కాని తెలిసీ తెలియక, మొండిగా, తొందరపాటుతో మనం చేసే ప్రార్థనలు ఆయన ప్రణాళికలు, తలంపుల నెరవేర్పునకు ఆటంకాలు కారాదు. ఇశ్రాయేలీయులు చేసిన తప్పు అదే. దేవుడు బానిసత్వం నుండి విముక్తినిస్తే దాని విలువనర్థం చేసుకోకుండా దారిలో ఆహారం సరిగా లేదంటూ సణిగే వారినేమనాలి? గుప్తు కఠిన దాస్యాన్ని దేవుడు దూరం చేస్తే, ఐగుప్తు అన్నమే బావుందంటూ, ఇశ్రాయేలీయులు వాపోవడం వారి మొదటి తప్పు.
మన్నాకు బదులు మాంసమివ్వలేడా? అన్న అసంతృప్త భావనతో పరోక్షంగా దేవుని బాహుబలాన్ని శంకించడం వారి రెండవ తప్పు. ఐగుప్తు విముక్తి సమయంలో చూపించిన ప్రేమను దేవుడు అరణ్యమార్గంలో చూపించడం లేదన్న విధంగా మన్నాను తక్కువ చేసి పరోక్షంగా వ్యాఖ్యానించడం వారి మూడవ తప్పు. ఈ తప్పులు అప్పుడెప్పుడో ఇశ్రాయేలీయులు చేసినవే కాదు, ఇప్పటికీ మనం చేస్తున్న తప్పులివి.
మనిషికి అంతులేని ఆశలంటారు. అది తప్పు. మనిషి దురాశకు అంతులేదు. అయితే దేవుని కృప కూడా అంతులేనిదే. కాకపోతే మనం పరిమితి దాటితే దేవుని కృప కాస్తా ఉగ్రతగా మారుతుంది. ఆయన ఉగ్రతను భరించడం మనుషులెవరికీ సాధ్యం కాదు. దురాశపడి జీవితంలో బాఉపడి సుఖపడ్డవాళ్లు, ఏదీ ఆశించకుండా దేవుడిచ్చిందే ఆశీర్వాదమనుకొని చెడిపోయిన వాళ్లు లోకంలో ఉండరు.
– రెవ.డాక్టర్ టి.ఎ.ప్రభుకిరణ్