Gospel
-
ఎంతో బలమున్నా నిర్వీర్యుడైన సమ్సోను
శత్రువు ఆయుధాలతో మన ఎదురుగా ఉంటే మనం గెలవొచ్చు. కాని ఆ శత్రువే విషంగా మారి మన రక్తంలో కలిస్తే, చనిపోవడమొక్కటే మనకున్న మార్గం. ఇశ్రాయేలీయులకు, ఫిలిష్తీయులనే శత్రువులు అలాంటి వారే. ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ఎదుర్కోవలసిన ఏడు శత్రుజనాంగాల జాబితాలో నిజానికి ఫిలిష్తీయులు లేరు (యెహోషువా 3:11). కాని న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులను ఏలిన 300 ఏళ్లలో ఫిలిష్తీయులు గ్రీసు దేశం నుండి ఐగుప్తుకు, అక్కడినుండి వెళ్లగొట్టితే వచ్చి ఇశ్రాయేలీయులుంటున్న కనాను దేశపు దక్షిణప్రాంతాల్లో శరణార్థులుగా నివసించారు. ఎందుకంటే ఇనుప పనిముట్లను, ఆయుధాలను, ఇనుప రథాలను చెయ్యడంలో ఫిలిష్తీయులది అందె వేసిన చెయ్యి. అందువల్ల ఫిలిష్తీయులను తమ మధ్య నివసించడానికి అనుమతించడంలో ఇశ్రాయేలీయులకు ప్రయోజనం కనిపించింది. కనానులోని శత్రువులను సంహరించి, ఓడించిన దేవుని ప్రజలు ఇలా కొత్త శత్రువులొచ్చి తమ మధ్య దూరకుండా అడ్డుకోలేక పోయారు. ఇశ్రాయేలీయులు చాలా కాలం ఫిలిష్తీయులను తమ పొరుగువారుగా, ఇనుప పనిముట్లు చేసిపెట్టే పనివారుగానే పరిగణించారు. పైగా ఫిలిష్తీయుల పురుషులు బలవంతులైతే, వాళ్ళ స్త్రీలు చాలా అందమైనవారు కావడంతో, ఇశ్రాయేలు యువకులు అక్కడి నుండి స్త్రీలను తెచ్చుకొని పెళ్లిచేసుకోవడం కూడా మామూలయింది. కనానుదేశంలో అన్యజనాంగాలతో సాంగత్యం చేయవద్దంటూ దేవుడిచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించి ఇశ్రాయేలీయులు చేసిన ఈ దుష్కార్యానికి పర్యవసానంగా ఫిలిష్తీయులే ఒక దశలో ఇశ్రాయేలీయులను ఏలడం ఆరంభించి 70 ఏళ్లపాటు వారిని కఠినంగా పాలించారు. ఫిలిస్తీయుల నుండి ఇశ్రాయేలీయులను కాపాడేందుకు దేవుడు సమ్సోను అనే న్యాయాధిపతిని అపుడు ఎన్నుకున్నాడు. అంతదాకా పిల్లలు లేని మనోహా అనే ఇశ్రాయేలీయుని భార్యతో దేవుడు మాట్లాడి, ఆమెకు తానొక కొడుకునివ్వబోతున్నానని, అతడు చాలా బలవంతుడవుతాడని, అయితే అతన్ని దేవునికి ‘ప్రతిష్ఠితుడుగా’ ప్రత్యేకించి పెంచాలని, ఇశ్రాయేలీయులను అతను ఫిలిష్తీయుల నుండి రక్షిస్తాడని ఆమెను తెలిపాడు. అలా మొదలయ్యింది ఎంతో బలవంతుడుగా పేరొందిన సమ్సోను కథ. అప్పటికే ఇశ్రాయేలీయుల జీవనశైలిలో ఫిలిష్తీయుల సంప్రదాయాలు చాలా కలిసిపోయాయి. ఫిలిష్తీయుల నుండి దేవుని ప్రజల్ని రక్షించడానికి ప్రత్యేకంగా తమకు పుట్టిన బాలునికి అతని తల్లిదండ్రులు ‘సమ్సోను’ అనే ఫిలిష్తీయుల పేరు పెట్టడమే దానికి రుజువు. సమ్సోనును ఎంతో బలవంతుడుగా దేవుడు పుట్టిస్తే స్త్రీలను మోహించి తన బలాన్నంతా వారికే ధారపోసే దుర్బలుడయ్యాడు సమ్సోను. పైగా తల్లిదండ్రుల నియంత్రణ కూడా అతని మీద లేదు. చివరికి దెలీలా అనే ఫిలిష్తీ స్త్రీని మోహించి ఆమెతో సహవసించి, అలా ఫిలిష్తీయులకు బందీగా చిక్కి, వాళ్ళు అతని కళ్ళు కూడా పెరికివేసేంత బలహీనుడయ్యాడు. కాకపోతే అంధుడై కూడా దేవుని సహాయంతో ఒక గుడి స్తంభాలు పడగొట్టడం ద్వారా వారి దేవాలయాన్ని కూల్చి వేలాదిమంది ఫిలిష్తీయులను ఒక్కసారిగా హతమార్చి సమ్సోను తన పగ తీర్చుకున్నాడు. దేవుని కోసం, దేవుని ప్రజల కోసం ఎన్నో గొప్పకార్యాలు చేయడానికి పుట్టిన సమ్సోను అలా కేవలం తన పగ మాత్రం తీర్చుకొని చనిపోయాడు. దేవుడిచ్చిన బలం తన సొంతమని అతను నమ్మడం, అతని తల్లిదండ్రులు కూడా అతన్ని సరిగ్గా నడిపించలేక పోవడమే అతని సమస్య అయ్యింది. శత్రువును గెలిచేవాడు బలవంతుడైతే, స్వీయనిగ్రహంతో తనను తాను గెలిచేవాడు మహా యోధుడని సమ్సోను తెలుసుకోలేకపోయాడు. అత్యున్నతంగా కనిపించే పర్వతాల అసమానశక్తి రహస్యం, అదృశ్యంగా భూమి లోపల ఉండే వాటి పునాదుల్లో ఉంటుందన్న రహస్యం తమను తాము నిగ్రహించుకునేవారికి, తగ్గించుకునేవారికే తెలుస్తుంది. ఎంతో బలమున్న సమ్సోను నిర్వీర్యం కావడానికి అతని హృదయంలోని అపరిశుద్ధతే కారణమైంది. – రెవ.డా. టి.ఎ. ప్రభుకిరణ్ -
దేవుని సమన్యాయ పాలనా వ్యవస్థ!!
అంతా తప్పుచేసి పట్టుబడి శిక్షకు లోనవుతారు. కాని దానియేలు ప్రార్థన చేసి పట్టుబడ్డాడు, శిక్షగా ‘సింహాలగుహ’ లో వేయబడ్డాడు. దానియేలు, అతని ముగ్గురు యూదుస్నేహితులు, బబులోను సామ్రాజ్యంలోని యూదుబానిసల కుటుంబాలకు చెందిన వారు. కొన్ని వందల మంది అలాంటివాళ్ళున్నా, తాము యూదులమన్న ప్రత్యేకతను మర్చిపోకుండా ఆ నలుగురూ జీవించారు. బబులోను రాజైన నెబుకద్నెజరు సంస్థానంలో 15 –17 ఏళ్ళ వయసులోనే ఉన్నతసేవల కోసం ప్రతిభను బట్టి వాళ్ళు ఎంపికై శిక్షణ పొందారు. అలా తమ ప్రత్యేకతను కాపాడుకొంటూ అంచెలంచెలుగా ఎదగడానికి దేవుడు వారికి సాయం చేశాడు. ధర్మశాస్త్రానుసారం వాళ్ళు తమ దేవునికే ప్రార్థన చేసేవారు. దానియేలయితే, రాజులు కని మర్చిపోయిన కలల్ని కూడా గుర్తుచేసి మరీ వాటిని విడమర్చి చెప్పేంత ప్రతిభావంతుడయ్యాడు. అలా బబులోను, పర్షియా, ఆ తర్వాత మాదీయుల సంస్థానాల్లో దానియేలు తన ప్రతిభ, సమగ్రత, నమ్మకత్వంతో గవర్నర్ స్థాయికి ఎదిగాడు. కాని దానియేలుకు శత్రువులు కూడా అసంఖ్యాకం అయ్యారు. దానియేలు ప్రతిరోజు యూదు పద్ధతిలో మూడు సార్లు క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటాడన్న విషయం తెలిసి, అతని శత్రువులు ముప్పైరోజులపాటు దేశంలో రాజైన దర్యావేషుకు తప్ప మరెవరికీ ప్రార్థన చేయకూడదన్న ఒక ఆజ్ఞను రాజుగారి ద్వారా తయారు చేయించారు. అయినా రాజాజ్ఞను ఉల్లంఘించి, తన ఇంటి కిటికీ తలుపు తెరిచి అందరికీ తెలిసేలా అతను ప్రార్థన చేశాడు. ఫలితంగా ఇష్టం లేకున్నా రాజుగారు దానియేలును సింహాల గుహలో వేశాడు. విచిత్రమేమిటంటే, ఆకలితో ఉన్న సింహాల మధ్య కూడా దానియేలు హాయిగా నిద్రపోగా, రాజభవనంలో పరుపుల పైన పడుకున్న రాజుగారికి, అతన్ని పట్టించిన శత్రువులకు మాత్రం ఆ రాత్రి నిద్రపట్టని కాళరాత్రే అయ్యింది. మరునాడే, రాజు దానియేలును విడిపించి అతని శత్రువులందరినీ అదే గుహలో వేసి సంహరించాడు. విశ్వాసి ఎక్కడుంటే ఆ ప్రదేశాన్నే దేవుడు తన సన్నిధితో పరలోకంగా మార్చుతాడు. అపాయాలు, సమస్యలు, చిక్కుముడుల మధ్య కూడా విశ్వాసి హృదయంలోనే దేవుడు పరలోకానందపు ఊటలు నింపుతాడు. తాను సంతకం చేసిన ఆజ్ఞకు తానే బందీగా మారేంత బలహీనుడయ్యాడు ఆ రాజు. కాని రాజాజ్ఞలు, లోకాదేశాలకు అతీతమైన దేవుని సమన్యాయ, సమధర్మ పాలనావ్యవస్థలో దేవుడు పరలోకానందాన్ని రాజులకు, బానిసలకు కూడా న్యాయంగా, సమానంగా పంచుతాడు. దక్షిణాఫ్రికా విమోచనోద్యమం ముగిసి అక్కడ సమన్యాయ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతున్న 1989లో, అక్కడి జులు తెగకు చెందిన రాజు దానికి తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాడు. ఎవరు చెప్పినా అతను వినని పరిస్థితుల్లో, బ్రిటిష్ ప్రభుత్వం బిషప్ టాటూ గారిని ఆయన వద్దకు పంపింది. బిషప్ గారు అతని ముందు నిలబడి, ‘నేను బిషప్‌ను, మీరు రాజు గారు. అయితే మిమ్మల్ని, నన్ను కూడా పాలించే అత్యున్నతమైన దేవుని ప్రార్థిద్దాం, మనిద్దరం మోకరిద్దాం, అనగానే, ఆ రాజు సింహాసనం దిగి, మోకరించాడు. బిషప్ గారి ప్రతిపాదనకు అంగీకారం కూడా తెలిపాడు. లోకమా? దేవుడా? అన్న మీమాంస ఎదురైతే, దేవుని ఆశ్రయించడమే క్షేమం, వివేకం. – రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
‘క్షమాపణ’లో తడిసిముదై్దన యోసేపు!!
యోసేపు చిన్నప్పటి నుండీ దేవుని భయం కలిగిన వాడు. దేవుని భయమంటే తెలియని అతని అన్నలు ఆ కారణంగా అతనిపై పగబట్టారు. అన్నల దుర్మార్గపు ప్రవర్తన గురించిన నివేదికలు యోసేపు తమ తండ్రియైన యాకోబుకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వచ్చిన కారణంగా అన్నలతనిపై మరింత కక్ష పెంచుకున్నారు. ముందతన్ని చంపుదామనుకున్నారు, ఆ తర్వాత మనసు మార్చుకొని ఐగుప్తు వర్తకులకు బానిసగా అమ్మేసి, అడవిలో యోసేపు క్రూరమృగం బారినపడి చనిపోయాడని తండ్రికి అబద్ధం చెప్పారు. అలా చిన్నతనంలోనే ఒక బానిసగా ఐగుప్తుకు వెళ్లిన యోసేపు మరెన్నెన్నో శ్రమలనుభవించినా, అతని సత్ప్రవర్తనకు దేవుని అపారమైన కృప కూడా తోడైన కారణంగా, ఏడేళ్ల భయంకరమైన కరువుకాలంలో ఒక్క ఐగుప్తు దేశానికే కాదు పొరుగు దేశాలవాసులకు కూడా అన్నం పెట్టిన ఒక గొప్ప ప్రధానమంత్రిగా దేవుని ద్వారా నియమించబడి ప్రఖ్యాతి చెందాడు. పొరుగునే ఉన్న అతని అన్నలు కూడా ఒకరోజున ధాన్యం కోసం అతని సమక్షానికి రావలసి వచ్చింది. యోసేపు వెంటనే వారిని గుర్తుపట్టాడు. కానీ దైవభయం, తన అత్యున్నత స్థితికి కారకుడు దేవుడేనన్న కృతజ్ఞత, నమ్రత, తగ్గింపు స్వభావం కల్గిన ఒక అసమాన విశ్వాసిగా, చేజిక్కిన అన్నలపై పగ తీర్చుకోకుండా, వారిని హృదయపూర్వకంగా క్షమించాడు. పైగా మీరు నాకు అన్యాయమేమీ చెయ్యలేదు, అబ్రాహాము వంశంగా తనకోసం ప్రత్యేకించుకున్న మనల్నందర్నీ ఇలాంటి కరువులో పోషించి కాపాడటం కోసం దేవుడే ముందస్తు ప్రణాళికతో మీ ద్వారా ఐగుప్తుకు నన్ను ముందుగా పంపించాడంటూ దేవుని ప్రణాళికను వారికి వివరించాడు. వారిని క్షేమంగా ఇళ్లకు పంపి అన్నలను, వారి కుటుంబాలను, తన తండ్రిని కూడా సాదరంగా ఐగుప్తుకు రప్పించుకొని వాళ్లందరినీ పోషించాడు. దేవుని అపారమైన ప్రేమకు, సిలువలో పరిమళించిన యేసుక్రీస్తు క్షమాస్వభావానికి యోసేపు నిలువెత్తు నిదర్శనం. యోసేపు నిజానికి ‘స్వయం సాధక వ్యక్తి’ గా తనను తాను శ్లాఘించుకోవచ్చు. అయితే తన జీవితంలో జరుగుతున్న ప్రతి మంచి, చెడు, చిన్న, పెద్ద సంఘటన దేవుని సంకల్పం మేరకు తనకు, తన ద్వారా లోకానికి మేలు కలిగేందుకే జరుగుతుందని, జరుగుతోందని విశ్వసించిన యోసేపు పాతనిబంధన కాలంలో నివసించిన కొత్తనిబంధన కాలపు మహా విశ్వాసి(రోమా 8:28). పాతనిబంధన కాలంలో తరచుగా జరిగినట్టుగా, యోసేపు తమను, తమ కుటుంబాలను కత్తివాతకు గురి చేసి చంపుతాడేమోనని భయంతో బిక్కచచ్చిన అన్నలతో ‘భయపడకండి, నేను దేవుని స్థానంలో ఉన్నానా? మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ మీతోపాటు లక్షలాదిమందిని ఈ భయంకరమైన కరువులో చనిపోకుండా బతికేంచేందుకు దేవుడు మీ కీడును నాకు, లోకానికి కూడా మేలు గా మార్చాడు’ అంటూ వారికి కొత్తనిబంధన కాలపు క్షమాసిద్ధాంతాన్ని వివరించాడు. రాబోయే వేలసంవత్సరాల తర్వాత క్రీస్తు ద్వారా ఆవిష్కరించబడనున్న క్షమాయుగపు కృపాసువార్తను ముందే తెలుసుకొని దాన్ని అంగీకరించి, అనుభవించి, ఆచరించి, తద్వారా దేవుని ఆశీర్వాదాలు తనివితీరా పొందిన అసమాన విశ్వాసం యోసేపుది!! పాతనిబంధన వాడైనా క్షమాస్వభావిగా యోసేపు జీవితం చరిత్ర, బైబిల్ పుటలకెక్కితే, కొత్తనిబంధన విశ్వాసులమైన మనం మాత్రం పగలతో రగులుతూ, ప్రతీకారేచ్ఛలతో జీవితాలను అశాంతిమయం చేసుకొంటున్న పాతనిబంధన తాలూకు కరడుగట్టిన ప్రజలముగా మిగిలిపోతున్నాం. పగ, కోపం, ప్రతీకారేచ్ఛ శత్రువుకన్నా ముందుగా మనల్నే దహించి బూడిద చేస్తుంది. క్షమాస్వభావం హృదయాన్ని దూదికన్నా తేలికగా చేసి దేవుడు తెరిచిన ఆశీర్వాదాల ద్వారాల గుండా హాయిగా ఆనందంగా ఎగురుతూ, లోకానికి ఆశీర్వాదాలు పంచే పరిచర్యలో మనల్ని ప్రతిష్టిస్తుంది. విశ్వాసికి క్షమాపణ, ప్రేమ శ్వాసగా మారాలి, అప్పుడే అతనిలో, అతని కుటుంబంలో శాంతి, ఆనందం అపారంగా ప్రజ్వలిస్తాయి. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
వినే మనసు ఉంటే...
ఆత్మీయం ఓ నిరక్షరాస్యుడు గీతా ప్రవచనం వింటున్నాడు. అతను ప్రవచనం వింటూ మధ్యలో కంట నీరు పెట్టుకుంటున్నాడు. ఇది చూసిన వారెవరో... ‘నీకేమి అర్థం అయింది? ఎందుకలా కన్నీరు కారుస్తున్నావ’ని అడిగారు. ‘అయ్యా! పొట్టపొడిస్తే అక్షరం ముక్క రానివాడిని. గీత గురించి పండితుల వారు ఏదేదో చెబుతున్నారు. అందులో నాకు కృష్ణా కృష్ణా అనే శబ్దం తప్ప ఇంకేమీ అర్థం కావట్లేదు. పండితులవారు కృష్ణా అన్నప్పుడల్లా ఆ భగవానుడి రూపమే నా కళ్లముందు కనిపిస్తోంది. ఆయన దివ్యమోహన రూపాన్ని చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగటం లేద’ని బదులిచ్చాడట. దీనిని బట్టి అర్థం అవుతోంది... వినే మనసు ఉంటే చాలు భగవంతుడిని దర్శించడానికి... భక్తుడు తరించడానికీ... అని. -
దురాశకు అంతులేకపోతే దేవుని కృప ఉగ్రతగా మారుతుంది!
• సువార్త అడక్కుండా దేవుడు మనకిచ్చేదెప్పుడూ ఆశీర్వాదకరమైనది. దేవుణ్ణి మనమడిగి తీసుకున్నది మాత్రం ఆశీర్వాదకరమైనది కావచ్చు, కాకపోవచ్చు. అందుకే యేసు ప్రభువు ‘నీ చిత్తమే సిద్ధించుగాక’ అంటూ చేసే ప్రార్థన అత్యంత ఆశీర్వాదకరమైన, శక్తితో కూడిన ప్రార్థన అని బోధించారు (మత్త6:10). మన పరలోకపు తండ్రిౖయెన దేవదేవునికి ఆయన పిల్లలమైన మనపట్ల అద్భుతమైన ప్రణాళికలున్నాయి. అవి యథాతథంగా నెరవేరడం మనకు అత్యంత ఆశీర్వాదకరం. కాని తెలిసీ తెలియక, మొండిగా, తొందరపాటుతో మనం చేసే ప్రార్థనలు ఆయన ప్రణాళికలు, తలంపుల నెరవేర్పునకు ఆటంకాలు కారాదు. ఇశ్రాయేలీయులు చేసిన తప్పు అదే. దేవుడు బానిసత్వం నుండి విముక్తినిస్తే దాని విలువనర్థం చేసుకోకుండా దారిలో ఆహారం సరిగా లేదంటూ సణిగే వారినేమనాలి? గుప్తు కఠిన దాస్యాన్ని దేవుడు దూరం చేస్తే, ఐగుప్తు అన్నమే బావుందంటూ, ఇశ్రాయేలీయులు వాపోవడం వారి మొదటి తప్పు. మన్నాకు బదులు మాంసమివ్వలేడా? అన్న అసంతృప్త భావనతో పరోక్షంగా దేవుని బాహుబలాన్ని శంకించడం వారి రెండవ తప్పు. ఐగుప్తు విముక్తి సమయంలో చూపించిన ప్రేమను దేవుడు అరణ్యమార్గంలో చూపించడం లేదన్న విధంగా మన్నాను తక్కువ చేసి పరోక్షంగా వ్యాఖ్యానించడం వారి మూడవ తప్పు. ఈ తప్పులు అప్పుడెప్పుడో ఇశ్రాయేలీయులు చేసినవే కాదు, ఇప్పటికీ మనం చేస్తున్న తప్పులివి. మనిషికి అంతులేని ఆశలంటారు. అది తప్పు. మనిషి దురాశకు అంతులేదు. అయితే దేవుని కృప కూడా అంతులేనిదే. కాకపోతే మనం పరిమితి దాటితే దేవుని కృప కాస్తా ఉగ్రతగా మారుతుంది. ఆయన ఉగ్రతను భరించడం మనుషులెవరికీ సాధ్యం కాదు. దురాశపడి జీవితంలో బాఉపడి సుఖపడ్డవాళ్లు, ఏదీ ఆశించకుండా దేవుడిచ్చిందే ఆశీర్వాదమనుకొని చెడిపోయిన వాళ్లు లోకంలో ఉండరు. – రెవ.డాక్టర్ టి.ఎ.ప్రభుకిరణ్ -
చదవని బైబిల్.. వెలగని కాగడా వంటిదే!
• సువార్త గలిలయకు 150 కిలో మీటర్ల దూరంలో యెరూషలేముంటుంది. యేసు బోధ విని బాగుపడేందుకు కాదు, ఆయన బోధల్లో లోపాలెత్తి చూపించి, ఆయనకే ఎదురు బోధ చేసేందుకు వాళ్లంతా అంత ప్రయాసపడి రావడం ఆశ్చర్యకరం!! యేసును చూసి, ఆయన బోధ వినే భాగ్యాన్ని పొందిన ఎంతోమంది నిరక్షరాస్యులు, అజ్ఞానులు తమ జీవితాన్ని ధన్యం చేసుకొంటుండగా, మహా మేధావులుగా ముద్రపడినవారు ఆ భాగ్యాన్ని చేజార్చుకొని, యేసుతో వాతలు వేయించుకొని భ్రష్టులుగానే తిరుగుముఖం పట్టిన పరిసయ్యులనేమనాలి? కొందరంతే!! బోధ చేయడానికి, ఖండించడానికి, గద్దించడానికి ఇతరులకు బుద్ధి చెప్పడానికే తాము పుట్టామన్న దుర్భావనలో ఉంటారు (2 తిమోతి 4:2). కాని దానికి ముందుగా తమలోని అజ్ఞానపు అంధకారాన్ని గుర్తించి సరిచేసుకోలేని గురివింద గింజలు వాళ్లు. అలా పప్పులో కాలేసి చివరికి నరకంలో చేరే మాట అటుంచితే, లోపాలెత్తి చూపడం, విమర్శించడమే వ్యాపారంగా మారి విజ్ఞత లోపించిన తొందరపాటు నిర్ణయాలతో ఈ లోకంలోనే తమ జీవితాన్ని అశాంతితో నరకప్రాయం చేసుకుంటారు వాళ్లు. ఎంత ఉన్నా ఇంకేదో పొందలేకపోతున్నామన్న అభద్రతా, అసంతృప్తి భావన పరోక్షంగా వారి మాటలు, చేతల్లో ధ్వనిస్తూంటుంది. దేవుని బోధలు వినేందుకు ఈనాడు వందల మైళ్లు ప్రయాణించే అవసరం లేదు. దేవుని మాటలు, బోధల సంగ్రహ సారాంశంగా బైబిలు గ్రంథం విశ్వాసులందరికీ అందుబాటులో ఉంది. బైబిలు గ్రంథం జీవితాన్ని సరైన బాటలో నడిపించే కాగడాలాంటిది. అయితే దాన్ని ^è దివినపుడు మాత్రమే అలా వెలిగే కాగడా అవుతుంది. చదవని బైబిలు గ్రంథం, వెలగని కాగడావంటిదే! దైవ భయంతో, వినమ్రతతో, అత్యంత విధేయతతో చదివితే అది జీవితాన్ని కుటుంబాన్ని కూడా ఆనందమయం చేస్తుంది. విమర్శించడానికో, లోపాలు చూడడానికో మిడిమిడి జ్ఞానపు మేధావిలాగా చదివితే మాత్రం జీవితంలో మిగిలేది అంధకారమే, అశాంతే, భ్రష్టత్వమే. – రెవ.డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్ -
వజ్రసంకల్పాన్ని వృద్ధాప్యం నీరుగార్చలేదు!
సువార్త వాగ్దాన దేశమైన కానానులో ఇశ్రాయేలీయులకు గోత్రాలవారీగా భూభాగాలను వారి నాయకుడైన యెహోషువ పంచుతున్నాడు. అందరి దృష్టీ మంచి భూభాగాలను పొందడంపైనే ఉంది. రూబేను, గాదు, మనష్షే గోత్రాల వాళ్లైతే సస్యశ్యామలమైన గిలాదు ప్రాంతాన్ని తీసుకుంటే, యూదా గోత్రానికి చెందిన కాలేబు వచ్చి అనాకీయులనే మహాబలవంతులు, అత్యంత క్రూరులు నివసించే కొండప్రాంతాన్ని తనకివ్వమని కోరాడు. అది ఎవరూ కోరుకోని హెబ్రోను ప్రాంతం. అనాకీయులనే బలవంతుల చేతుల నుండి తీసుకోవడం అసాధ్యమైన ప్రాంతం కూడా. మోషే ఒకప్పుడు వాగ్దాన దేశాన్ని వేగు చూసేందుకు 12 మందిని పంపగా ఈ అనాకీయులను, వాళ్ల బలాన్ని చూసి వారిలో కాలేబు, యెహోషువ తప్ప మిగిలిన 10 మంది భయంతో వణికిపోయారు. అంతటి బలవంతులను గెల్చి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడం అసాధ్యమంటూ పిరికితనంతో మాట్లాడారు. కాలేబు, యెహోషువ మాత్రం దేవుడు మనతో ఉండగా అది సాధ్యమేనన్నారు. ఆ అనాకీయుల దేశాన్ని తనకివ్వమంటున్నాడు కాలేబు (యోహో 14:6-13). ఏదైనా కోరుకోవలసి వస్తే ఎవరైనా సులువైనది, లాభకరమైనది, ఇంపైనదే కోరుకుంటారు. కాని కాలేబు అత్యంత సంక్లిష్టమైన, రాళ్లు రప్పలున్న కొండప్రాంతాన్ని కోరుకోవడం దేవుని పట్ల అతనికున్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. పైగా 85 ఏళ్ల వృద్ధాప్యంలో కూడా తన బలం తగ్గలేదంటాడు. అదెలా సాధ్యం? బలం, అందం వంటి బాహ్యాంశాలు వయసు పెరిగే కొద్దీ క్షీణించడం శరీర ధర్మం, అనివార్యం కూడా! ఒకప్పటి కండల వీరులంతా వృద్ధాప్యం తాకిడికి పగిలిన కుండల్లా నిర్వీర్యమవుతారు. కాని విశ్వాస వీరులు మాత్రం కాలేబులాగే ఉంటారు. కాలేబు వృద్ధుడే. అయితే అప్పుడూ ఇప్పుడూ కూడా అతని నమ్మకం దేవుని అండ మీదే! తన కండల మీద కాదు. ఈ 45 ఏళ్లలో శరీరం కృశించిపోయినా, ఆంతర్యంలో దేవునిలో అతనెంతో బలపడ్డాడు. అందుకే తన బలం తగ్గలేదంటున్నాడు, అనాకీయుల ప్రాంతాన్ని సవాలుగా స్వీకరిస్తానంటున్నాడు. కాలేబు, యెహోషువతో మాట్లాడిన మాటలు 8 వచనాల్లో ఉన్నాయి. ఆ ఎనిమిది వచనాల్లో తొమ్మిదిసార్లు దేవుని పేరు ప్రస్తావించాడంటే కాలేబుకు దేవుని పట్ల ఎంత నిబద్ధత, విశ్వాసమున్నదో అర్థం చేసుకోవచ్చు. యెహోషువ అతని కోరిక మేరకు హెబ్రోనునే కాలేబుకిచ్చాడు. తాను చెప్పినట్టే అక్కడి అనాకీయులను మట్టి కరిపించి హెబ్రోనును స్వాధీనం చేసుకోవడమే కాదు, కాలేబు, అతని వంశీయులు ఆ కొండ ప్రాంతాన్ని ఒలీవ, ద్రాక్షతోటలున్న వ్యవసాయ క్షేత్రంగా మార్చుకున్నారు. ఏవో చిన్న విజయాలు సాధించడం కాదు, దేవుని అండతో మహా జయాలు సాధించాలన్న వజ్రసంకల్పం విశ్వాసికి ఉండాలి. అందుకు ఉడిగిపోయిన బలం, వృద్ధాప్యం అడ్డు రానే రాదనడానికి కాలేబు జీవితమే సాక్ష్యం! - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
ప్రేమ, క్షమ లేకుంటే... సమాజమే ఎడారి
సువార్త ఒనేసిము ఒకప్పుడు ఫిలేమోను అనే ధనికుని వద్ద బానిసగా ఉండి పారిపోయినవాడు. అయితే అతనికి అపొస్తలుడైన పౌలు పరిచయమయ్యాడు. తద్వారా యేసుక్రీస్తును తెలుసుకొని విశ్వాసి అయ్యాడు. పారిపోయిన బానిసలకు, వారి యజమానులు క్షమిస్తే తప్ప, రోమా ప్రభుత్వం మరణశిక్ష విధించే రోజులవి. పైగా పారిపోయిన బానిసలకు వారి యజమానులు క్షమించడం కూడా జరిగేది కాదు. కాని ఫిలేమోను కూడా తన ద్వారానే ప్రభువును తెలుసుకున్నవాడు గనుక ఒనేసిమును బానిసగా కాక విశ్వాసిగా పరిగణించి అతన్ని క్షమించమని కోరుతూ పౌలు అతనికి ఒక లేఖ రాసి ఒనేసిముతోనే పంపించాడు. అతని వల్ల జరిగిన నష్టాన్ని తన ఖాతాలో వేస్తే తానే చెల్లిస్తానని కూడా పౌలు తెలిపాడు. పౌలు అభ్యర్థన మేరకు ఫిలేమోను అతన్ని క్షమించగా ఎఫెసీలోని చర్చికి తిమోతి తరువాత ఒనేసిము కాపరి అయ్యాడని, అలా అద్భుతమైన పరిచర్య చేశాడని చరిత్ర చెబుతోంది (ఫిలే 1:8-22). దేవుడు శ్రుతి చేసిన విశ్వాసి అద్భుతమైన రాగాలు పలుకుతాడు, ప్రేమ, క్షమ అతనిలో పరిమళిస్తుంది. పౌలు, ఫిలేమోను, ఒనేసిముల్లో అదే జరిగింది. ఫిలేమోను ధనికుడైన యజమాని, ఒనేసిము పారిపోయిన బానిస, నేరస్తుడు. కాగా పౌలు వారిద్దరికీ ఆత్మీయతండ్రి. సామాజికంగా ఈ ముగ్గురి మధ్యా ఎన్నో అంతరాలున్నా, దేవుని ప్రేమ, క్షమ అనే ఉమ్మడి అంశాలు పునాదిగా వారి మధ్య అపూర్వమైన అనుబంధం పరిమళించింది. ఫలితంగా ఆ ముగ్గురి సమిష్టి కృషితో దేవుని రాజ్య నిర్మాణం జరిగింది. దేవునితో అనుబంధం బలంగా ఉన్న విశ్వాసి జీవితంలోని ప్రతి అనుబంధమూ, బాంధవ్యమూ అత్యంత ప్రేమమయంగా ఉంటుంది. ప్రతి బాంధవ్యాన్ని కూడా దేవుడు తనను ప్రేమించినట్టుగా లోకాన్ని ప్రేమించే ఒక సదవకాశంగా భావిస్తాడు. అందుకే ఒక తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, సోదరుడిగా, సోదరిగా, మిత్రుడిగా, దేశపౌరుడిగా అత్యున్నతమైన విలువల స్థాపనకు విశ్వాసి శ్రమిస్తాడు. అలా మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తాడు. అయితే విశ్వాసులు కానివారి దృష్టిలో సమాజమంతా ఒక మాయా ప్రపంచం. తోటి మనుషులంతా అవసరార్థమైన సాధనాలు, పెకైగబాకేందుకు ఉపయోగపడే నిచ్చెనలు!! ఈ దుష్ట, భ్రష్ట విషవలయం నుండి విముక్తినిచ్చి విశ్వాసిని సమాజాన్ని కూడా ప్రభావితం చేసి ప్రేమామయం చేసేది దేవుని శక్తి. మన దైనందిన సంబంధ బాంధవ్యాల్లో ప్రేమ, నిజాయితీ, నిస్వార్థత లేకపోతే ఆ బంధాలకు అసలు విలువేలేదు. తన సామాజిక బంధాల్లోనే నిజాయితీ లేనివాడుూ దేవునితో గల బాంధవ్యంలో నిజాయితీ కలిగి ఉంటాడనుకోవడం కేవలం భ్రమ!! అలాంటి వారి ప్రార్థనలు, అర్పణలు, పాటలు, ప్రసంగాలు, ఆరాధనలకు దేవుని దృష్టిలో అసలు విలువ లేదు. శ్రుతిలేక అపస్వరాలు పలికే వయోలిన్ వంటిదే ప్రేమ కరువైన సమాజం. ఊర్లో పోస్ట్మాన్ని మామా అని, ఇంటికొచ్చి గాజులమ్మిన వ్యక్తిని బాబాయ్ అని, చింతకాయలు కోసిచ్చిన అపరిచితున్ని అన్నా అని, పొరుగిళ్లలో వాడల్లో బోలెడు మంది అత్తలు, పిన్నిలు, మామయ్యలు, బాబాయ్‌లు, తాతలు, అవ్వల్ని కలిగి ఉన్న ఎంతో ఆప్యాయతాభరితమైన సమాజం ఒకప్పుడు మనది. కాలక్రమంలో ఆధునికత కాటుకు అది అంతరించింది. స్వార్థం, ధనార్జన తప్ప మరొకటి కానరాని నేటి సమాజపు విష కౌగిలిలో ఇప్పుడు స్వచ్ఛందంగా భాగమై నలిగిపోతున్నాం. పాపిని ప్రేమించి పరలోకాన్ని వదిలి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తును కలిగి ఉండటమే ఒక తియ్యటి అనుబంధం. ఆ ప్రేమ విశ్వాసి ద్వారా లోకమంతా వ్యాపిస్తే అదే అసలైన ఆరాధనానుభవం!! - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్ -
నిర్భాగ్యులే దేవుని గుండె చప్పుళ్లు
సువార్త అరేబియన్ గుర్రాలకిచ్చే శిక్షణ చాలా కఠినమైనది. చివరి పరీక్షగా ట్రెయినర్ గుర్రాలకు కొన్ని రోజులపాటు నీళ్లివ్వకుండా పరిగెత్తిస్తాడు. అవి విపరీతమైన దాహంతో ఉన్నప్పుడు ఒక చెరువు వద్దకు వాటిని తోలుతాడు. అవి ఆశతో నీళ్లు తాగబోతూండగా విజిల్ వేసి వెనక్కి రమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆ దశలో ఒకటో రెండో గుర్రాలు మాత్రమే నీళ్లు తాగకుండా వెనక్కి వస్తాయి. పరుగెత్తడంతోపాటు విధేయత కూడా నేర్చుకున్న ఆ గుర్రాలే అత్యుత్తమమైనవిగా అధిక ధర పలుకుతాయి. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించ మన్న యేసుప్రభువు అందుకు ఒక ఉపమానం కూడా చెప్పాడు. ఒక వ్యక్తి ప్రయాణిస్తూ దొంగల బారిన పడ్డాడట!! దొంగలతన్ని విపరీతంగా కొట్టి కొనప్రాణంతో వదిలి పోయారు. యూదుమతాచార్యులైన ఒక యాజకుడు, లేవీయుడు అటుగా వచ్చి కూడా అతన్ని పరామర్శించకుండానే వెళ్లిపోయారు. కాని ఆలయ ప్రవేశార్హత కూడా లేని తక్కువ జాతివాడైన ఒక సమరయుడు అతని మీద జాలిపడి, పరామర్శించి, అతని గాయాలు కడిగి, కట్టు కట్టి తన వెంట తీసుకెళ్లి ఒక పూటకూళ్ల వాని ఇంట్లో చేర్చాడు. అతన్ని చూసుకోవడానికి డబ్బు కూడా చెల్లించాడు. అపరిచితుడైన ఒక నిర్భాగ్యునికి సమరయుడు చేసిన ఈ పరిచర్యను యేసుప్రభువు కొనియాడి, నిజమైన పరిచర్య ఇదేనన్నాడు (లూకా10:25) యేసు చేసిన అత్యంత విప్లవాత్మకమైన ప్రబోధమిది. ధర్మశాస్త్రాన్ని కంఠస్థం చేయడం కాదు, దాని సారాన్ని గ్రహించి దానికి విధేయత చూపించడమే అత్యున్నతమైన పరిచర్య అన్నాడు ప్రభువు. తాము దేవునికి ఎంతో దగ్గరి వారమన్న భ్రమతో ఉన్న యాజకుడు, లేవీయుడు నిజానికి దేవునికి ఎంత దూరంగా ఉన్నారో, ధర్మశాస్త్రం, దేవుడు, ఆలయం, ఆరాధన ఇవేవీ తెలియని సమరయుడు దేవుని హృదయస్పందనకు ఎంత దగ్గరగా ఉన్నాడో ప్రభువు వివరించాడు. పుస్తకం చదివిన వారికి ఆ పుస్తక రచయిత గురించి తెలియాల్సిన అవసరం లేదు. కాని బైబిల్ చాలా విలక్షణమైన గ్రంథం. అది చదివేకొద్దీ దాని రచయిత అయిన దేవుడు అంతకంతకూ మరెక్కువగా అర్థం కావాలి. దేవుని హృదయ స్పందనంతా నిర్భాగ్యులూ, నిరుపేదల కోసమేనన్నది అప్పుడర్థమవుతుంది. ఆదిమ కాలంలో చర్చిలు అది అర్థం చేసుకున్నాయి. అందుకే నాటి విశ్వాసులంతా తమ ఆస్తులు సైతం అమ్మి తెచ్చి అపొస్తలుల పాదాల వద్ద పెట్టారు. అలా పరుగెత్తడాన్ని, విధేయతను కూడా ఆదిమ చర్చిలు నేర్చుకున్నాయి. కాని నేటి చర్చిలకు పరుగెత్తడంలో ఉన్న శ్రద్ధ, విధేయత చూపించడంలో కనిపించడం లేదు. దేవుడు తమనుండి ఏం కోరుకుంటున్నాడన్న అవగాహన విశ్వాసుల్లో, చర్చిల్లో లోపించింది. ఫలితంగా నిరుపేదల కోసం కొత్తగా అనాథాశ్రమాలు, ఉచిత స్కూళ్లు, ఆసుపత్రులు తెరిచి పరిచర్య చేయవలసింది పోయి ఉన్నవి కూడా మూసేస్తున్నారు. ఖరీదైన కార్లు, సూట్లు, చీరలు, నగలు, సంభాషణలతో నిండిన నేటి చర్చిలు షాపింగ్ మాల్స్‌ను తలపింప చేస్తున్నాయే తప్ప, తనకంటూ తల దూర్చుకోవడానికి కూడా సొంత స్థలం లేనంతగా తనను తాను తగ్గించుకొని వచ్చి నిరుపేదలను, నిర్భాగ్యులను ఆలింగనం చేసుకున్న యేసుక్రీస్తు ఆరాధనాస్థలాలుగా మాత్రం కనిపించడం లేదు. దాతృత్వంతో ప్రేమను, క్షమాపణను, ఆదరణ ను పంచాల్సిన చర్చిలు కుత్సితత్వం, కృత్రిమత్వం, కుతత్వానికి కేంద్రాలయ్యాయి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్న ప్రభువు బోధను అటకెక్కించి ‘నిన్ను నీవే ప్రేమించుకో! అన్న కొత్త ప్రబోధాన్ని ప్రతిష్ఠించుకున్నాం. ఫలితంగా ఖరీదైన ఏసీ వాతావరణంతో దైవిక మూలసూత్రాలు తెలియని పాస్టర్లు, భక్తుల మధ్య దేవుడున్నాడన్న భ్రమతో చర్చి లోపల ఆయన్ను ఆరాధిస్తున్నాం. కాని చర్చి బయట గుడి మెట్ల మీద కూర్చొని భిక్షాటన చేస్తున్న నిర్భాగ్యుల పరామర్శ కోసం వారి మధ్యే ఉండి వారి కోసం తహ తహలాడుతున్న యేసుక్రీస్తును చూడలేని అంధులమయ్యాం. (మత్త 25:31-40) - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని కృప ఉంటే... సామాన్యులూ అసామాన్యులే!
సువార్త గిద్యోను చాలా పిరికివాడు. ‘నేను, నా కుటుంబం’ అన్న పరిధిని మించి ఆలోచించలేని అత్యంత సామాన్యుడు. ఎంతో క్రూరులైన మిద్యానీయులనే శత్రువులు ఇశ్రాయేలీయులను వేధిస్తున్న గడ్డు కాలమది. దేవుడొక శూరున్ని లేపి అతని ద్వారా తమకు ముక్తి కలిగిస్తాడని గిద్యోనుతో సహా ఇశ్రాయేలీయులంతా ఎదురు చూస్తున్నాడు. అయితే ‘ఆ శూరుడివి నీవే!’ అన్నాడు. రిచర్డ్ ఫెయిన్‌మెన్ అమెరికా అంతరిక్ష విజయాలకు పితామహుడు, 1965లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. అతని చిన్నప్పటి స్కూల్ రికార్డ్స్ తిరగేస్తే, క్లాస్‌లో అతనికి గొప్ప మార్కులేమీ వచ్చేవి కావని, అప్పట్లో అతని ఐక్యూ కూడా తక్కువేనని వెల్లడైంది. మరి ఇంతటి వాడెలా అయ్యాడని అంతా ఆశ్చర్యపోతూంటే ‘నాకవేవీ గుర్తు లేదు. నేను దేవుని ప్రత్యేకమైన సృష్టినన్నదొక్కటే నాకెప్పుడూ గుర్తుంటుంది. నన్ను ముందుకు నడిపస్తుంది’ అని జవాబిచ్చాడాయన. గిద్యోను చాలా పిరికివాడు. ‘నేను, నా కుటుంబం’ అన్న పరిధిని మించి ఆలోచించలేని అత్యంత సామాన్యుడు. ఎంతో క్రూరులైన మిద్యానీయులనే శత్రువులు ఇశ్రాయేలీయులను వేధిస్తున్న గడ్డు కాలమది. దేవుడొక శూరున్ని లేపి అతని ద్వారా తమకు ముక్తి కలిగిస్తాడని గిద్యోనుతో సహా ఇశ్రాయేలీయులంతా ఎదురు చూస్తున్నాడు. అయితే ‘ఆ శూరుడివి నీవే!’ అన్నాడు. గిద్యోను వద్దకు దేవుడు పంపిన దూత ‘నేనా?’ అంటూ గిద్యోను తన అనర్హతలన్నీ ఏకరువు పెట్టాడు. కాని దేవుడు ఊరుకోలేదు. అంతమంది మిద్యానీయులనూ ఒకే వ్యక్తి హతమార్చినట్టు దేవుని తోడ్పాటుతో నీవు హతమార్చుతావంటూ ఆ దూత ప్రోత్సహించాడు. ‘మానవ నేత్రాలకు వాళ్లు అసంఖ్యాకమైన శత్రు సైన్యం. కాని దేవుని నేత్రాలతో చూస్తే నేలకొరిగిన ఒకే ఒక శత్రువు కళేబరం!’ అన్న విశ్వాస సూత్రాన్ని అలా నేర్చుకున్న గిద్యోనుతో దేవుడు తన పరాక్రమాన్ని నింపగా అతను శత్రువులను చీల్చి చెండాడి గొప్ప విజయాలు సాధించాడు (న్యాయా 6,7,8). పరాక్రమవంతులతోనే గొప్ప కార్యాలు జరిగించుకుంటే దేవుని ప్రత్యేకత ఏముంది? ఖాళీగా, అనామకంగా పడి ఉన్న మట్టి కుండల్లోనే దేవుడు తన మహదైశ్వర్యాన్ని నింపుతాడు. లోకం తృణీకరించిన వాళ్లు, నిండా వైఫల్యాలున్న వారినే ఆయన మహామహులను, విజేతలను చేస్తాడు. అయితే దేవున్ని సంపూర్ణంగా విశ్వసించాలన్నది దానికి పూర్వ నిబంధన. అలాంటి విశ్వాసుల జీవితాలకు దేవుడే జవాబు దారవుతాడు. దేవుడు తన అసమానమైన కృపతో అలాంటి విశ్వాసులను అనూహ్యమైన విజయాల కోసం సిద్ధం చేస్తాడు. దేవుని కృపతో అలా సామాన్యులైన విశ్వాసులు కూడా గొప్ప ఆత్మలుగా ప్రజ్వరిల్లుతారు. జీవితంలో చిరుగులు కుట్టమని, గతుకులు పూడ్చమని దేవుని అడగడం లేదు. చిరుగులు కుట్టే సూది దారం, గతుకులు పూడ్చే పార, పలుగు దేవున్నడిగి తీసుకొని ఆయన కృపాసాయంతో మనమే మన జీవితాల్ని సరిచేసుకోవడమే నిజమైన విశ్వాసం. అలా యేసుక్రీస్తు కృపా పరిధిలో ఇమిడిన విశ్వాసి జీవితంలో దేవుని మహిమపర్చే విషయాలకే తప్ప పాపానికి తావు లేదు. ఎందుకంటే చలిని వేడి, చీకటిని వెలుగు వ్యతిరేకించినట్టే, దేవుని కృప పాపాన్ని వ్యతిరేకిస్తుంది. చౌకబారు ఆలోచనలు, మాటలు, పనుల నుండి దేవుని కృప విశ్వాసిని దూరంగా పెడుతుంది. ధర్మశాస్త్రంలో భయం, దేవుని ఉగ్రత ఉంటుంది. కాని దేవుని కృపలో కరుణ, ఆశ ఉంటుంది. అందువల్ల ధర్మశాస్త్రపు కాడి నుండి విడుదలనిచ్చే దేవుని కృపలో విశ్వాసి అంతకంతకూ ఎదిగి గొప్పకార్యాలు చేస్తాడు. దేవుని నమ్మిన విశ్వాసిలో ఎదుగుదల లేకుంటే, లోకాన్ని ఎదిరించే శక్తి లేకపోతే దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాల్సిన ఆలోచన లేకపోతే ఆ విశ్వాసంలో ఏదో లోపమున్నట్టే! నా దేవుడు గొప్పవాడంటూ మాటల మేడలు కడితే అందువల్ల దేవునికేమీ మహిమ లేదు. దేవుని గొప్పదనం విశ్వాసి చేతలు, విజయాల్లో కనిపిస్తే దానికిక తిరుగులేదు. సమస్యలు, అనర్హతల సుడిగుండాల్లో అంతా మునిగి అంతమవుతారు. కాని దేవుని తోడ్పాటున్న విశ్వాసులు మాత్రం ఈది వాటి నుండి బయటపడి గజ ఈతగాళ్లనిపించుకుంటారు. అందువల్ల కృంగిపోవద్దు. బాణంలా నింగిలోకి దూసుకెళ్లండి. అదే జయజీవితమంటే. - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్ -
మనసును అదుపు చేసుకోలేని వారి జీవితం...
ప్రాకారం లేక పాడైన పురము సువార్త శత్రువులు దాడి చేయకుండా చైనా రాజులు తమ దేశం చుట్టూ 15 వేల మైళ్ల పొడవున, సగటున ఏడు మీటర్ల ఎత్తున చైనా గోడ కట్టారు. ప్రజలను పీడించి అందుకు బోలెడు డబ్బు, కాలం, శ్రమ వెచ్చించారు. కాని అది పూర్తయిన వందేళ్లలోపే శత్రువులు చైనాపై మూడు సార్లు దాడి చేశారు. వాళ్లు గోడెక్కి రాలేదు, గోడపై కావలి ఉన్న సైనికులకు లంచమిచ్చి లోపలికొచ్చారు. గోడమీది ధీమాతో వాళ్లు సైనికుల నిజాయితీ విషయం మర్చిపోయారు. తాళం వేసి గొళ్లెం మరిచారు. దావీదు మహాచక్రవర్తి కొడుకుగా సొలొమోను చక్రవర్తికి ఎంతో సంపద, ఖ్యాతి, వైభవం కలిసొచ్చింది. యెరూషలేము మందిరాన్ని సైతం దేవుడు సొలొమోనుతోనే కట్టించాడు. దావీదు తన యుక్తితో, యుద్ధ నైపుణ్యంతో పొరుగు రాజులందరినీ లొంగదీసుకోగా శత్రుభయం లేని గొప్ప శాంతియుత సామ్రాజ్యం సొలొమోను ఒడిలో వచ్చి పడింది. పైగా దేవుడిచ్చిన జ్ఞానవివేచనవల్ల తెలివైన రాజుగా అతని ఖ్యాతి భూదిగంతాలకు పాకింది. కాని క్రమంగా సొలొమోను దేవుని మరిచిపోయాడు. స్త్రీలోలుడై వందలాది మంది భార్యలు, ఉపపత్నులను చేరదీశాడు. తన భార్యలు పూజించే దేవతలకు తానూ పూజించాడు. ప్రజలతో వెట్టి చాకిరి చేయించాడు. తన జ్ఞానంతో ప్రపంచంలో అభిమానులను సంపాదించుకున్నారు కాని అహంకారం, విచ్చలవిడితనంతో సొంత ప్రజలనే శత్రువులను చేసుకున్నాడు (1 రాజులు 11:4 ; 12:4-16). ఫలితంగా అతని తర్వాత ఇశ్రాయేలు దేశం రెండు ముక్కలై బలహీనమైంది. ఆ తర్వాత పూర్తిగా విచ్ఛిన్నమైంది. జీవితాన్ని చేజేతులా పాడుచేసుకునే విద్యలో మనిషి ఆరితేరాడు. కళ్లెదురుగా గొయ్యి కనబడుతున్నా అందులో పడి కనీసం బురదంటుకోకుండా ప్రాణాలతో బయటపడగలనన్న ఆశావాదం ఆధునిక మానవునిది. అందుకే ఎన్నో గొప్ప విజయాలు సాధించిన మహనీయులు కూడా ఎంతో చిన్న విషయాల్లో విఫలమై చరిత్ర హీనులయ్యారు. అవిద్య, దారిద్య్రం, అజ్ఞానం మనిషిని పాడు చేస్తాయన్నది కొందరి అపోహ. కాని ఈ మూడింటి బాధితులైన మన పూర్వికులు ఈ మూడూ లేని మనకన్నా ఎంతో గౌరవప్రదంగా, శాంతిగా, సంస్కారయుక్తంగా, ఎంతో మందికి ప్రయోజనకరంగా బతికారన్నది నిర్వివాదాంశం. మనిషిని నిజంగా పాడుచేసేది అహంకారం, దేవునితో అతను పెంచుకున్న దూరం. అందుకే ‘నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు’ అని యేసుక్రీస్తు తన శిష్యులతో అన్నాడు (యోహాను 15:5). మనిషికున్న జ్ఞానం, శక్తి అపారమే! అయినా తనను తాను నియంత్రించుకోవడంలో మాత్రం అతను ముమ్మాటికీ అశక్తుడే! మన ఇంద్రియాలను, అంతరేంద్రియాలను కూడా సృజించిన దేవుని నిరంతర సహవాసం, సాన్నిధ్యంలోనే మనిషికి ఇంద్రియ నిగ్రహం అలవడుతుంది. మనిషి తనను తాను అపరిమితంగా ప్రేమించుకోవడం, నమ్ముకోవడం ద్వారా దేవునికి దూరమవుతాడు, దైవవ్యతిరేక విధివిధానాలకు దగ్గరవుతాడు. దాన్నే బైబిల్ ‘పాపం’ అంటుంది. చాలామంది విశ్వసిస్తున్నట్టు మనిషికే గనుక తనపై తనకు నియంత్రణ ఉంటే ఇన్ని అనర్థాలకు తావేది? డాక్టర్ సలహా మేరకే కనీసం ఉప్పు, కారం, తీపి మానలేని మనిషి తనను తాను అదుపు చేసుకొని లోకకల్యాణాన్ని సాధిస్తాడనుకోవడం గొర్రెతోక పట్టుకొని గోదావరి ఈదాలనుకోవడం కాదా? అందుకే సొలొమోను తన చివరి రోజుల్లో స్వానుభవంతో ‘తన మనస్సును అణచుకోలేనివాని జీవితం ప్రాకారం లేక పాడైన పురము’లాంటిదన్నాడు (సామెతలు 25:28). - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్ -
ఆ ధీమా వెనుక రహస్యం విశ్వాసమే!
సువార్త మన హృదయాల్లో నింపే ‘విశ్వాసం’ సజీవమైనది. అది పనిచేయకుండా ఉండదు. కొద్దిపాటి విశ్వాసముంటే పరలోకానికి చేరవచ్చు కానీ గొప్ప విశ్వాసం పరలోకాన్నే తెచ్చి మన జీవితాల్లో, కుటుంబాల్లో నింపుతుంది. యేసుక్రీస్తు అక్కడెక్కడో దూరంగా పరలోకంలో ఉండేవాడుగా చూడటం మతం. కాని నావాడంటూ ఆయన్ను ఆలింగనం చేసుకోవడం నిజమైన విశ్వాసం. కటిక చీకట్లో ఒకాయన కొండపై నుండి జారి లోయలో పడుతూ అనుకోకుండా ఒక చెట్టు కొమ్మ చేతికి తగిలితే దానికి వేలాడుతున్నాడట. పైన ఆకాశం, కింద లోయ. చుట్టూ చీకటి. ‘నన్ను కాపాడు దేవా’ అంటూ ప్రార్థిస్తున్నాడు. ‘ఫరవా లేదు, కొమ్మను వదిలేయ్’ అన్నాడు దేవుడు. కానీ ధైర్యం చాలక దేవుణ్ణి వదిలేసి కొమ్మనే పట్టుకున్నాడు. కాసేపటికి పట్టుసడలి కొమ్మను వదిలేశాడు. ఆశ్చర్యం! మరు క్షణం భూమ్మీదున్నాడు. నేలకు కేవలం గజం దూరంలో తానున్నానన్న విషయం చీకట్లో అతనికి తెలియలేదు. దేవుని ప్రతి మాటనూ నమ్మడమే విశ్వాసం. నీ దోనెను లోతునకు నడిపించి వలలు వేయమని యేసు ప్రభువు పేతురుతో అన్నాడు. చేపలు పట్టడంలో ఎంతో అనుభవం ఉన్న పేతురు అంతకు ముందు రాత్రి ఎంత కష్టపడ్డా ఒక్క చేప కూడా దొరకలేదు. గలిలయ సరస్సులోని చేపలన్నీ కలిసి అతన్ని వెక్కిరించినట్లనిపించి అవమాన భారంతో కృంగిపోయాడు. మరునాడు పేతురు దోనెలోకి యేసు ఎక్కి కూర్చొని అక్కడున్న వారికి బోధ చేశాడు. ఆయన మాటలు పేతురులో ధైర్యాన్ని నింపాయి. ‘ఈసారి తన ప్రతిభను పక్కనపెట్టి ‘యేసు మాట’ చొప్పున వలలు వేస్తే చేపలు విస్తారంగా పడ్డాయి. ముందు రాత్రి ఘోర పరాజయం, మరునాడే ఘన విజయం. పరాభవాల్ని విజయంగా, సమస్యను ఆశీర్వాదంగా, కొరతను సమృద్ధిగా మార్చే శక్తి విశ్వాసం అనే కాలువ ద్వారా మన జీవితంలోకి ప్రవహిస్తుంది. అయితే నీళ్లు లేని కాలువలాగే క్రియలు లేని విశ్వాసం మృతప్రాయమంటుంది బైబిలు (యాకోబు 2:7). కంటికి కనబడని విద్యుత్తు బల్బును వెలిగించి కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతినిచ్చినట్టే, లోకానికి మన విశ్వాసం తాలూకు సత్క్రియలు కనిపించాలి. పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో నింపే ‘విశ్వాసం’ సజీవమైనది. అది పనిచేయకుండా ఉండదు. కొద్దిపాటి విశ్వాసముంటే పరలోకానికి చేరవచ్చు కానీ గొప్ప విశ్వాసం పరలోకాన్నే తెచ్చి మన జీవితాల్లో, కుటుంబాల్లో నింపుతుంది. యేసుక్రీస్తు అక్కడెక్కడో దూరంగా పరలోకంలో ఉండేవాడుగా చూడటం మతం. కాని నా వాడంటూ ఆయన్ను ఆలింగనం చేసుకోవడం నిజమైన విశ్వాసం. అలా యేసును విశ్వసించిన వారు తమ అడుగులు శూన్యంలో, చీకట్లో వేసినా అవి స్థిరమైన బండ మీదే పడ్తాయి. విశ్వాసంతో అసాధారణమైన విజయాలు మన సొంతమవుతాయి. మనుషులు చేసేదే దేవుడూ చేస్తే అందులో దేవుని మహిమ ఏముంది? ‘నన్ను బలపరుచువానియందే నేను సమస్తం చేయగలను’ అన్న పౌలు ధీమా వెనుక రహస్యం ఆయన విశ్వాసమే’ (ఫిలిఫ్పీ 4:13). - రెవ టి.ఎ. ప్రభుకిరణ్ -
నేటి కష్టాల బడి... రేపటి ఆశీర్వాదాల ఒడి!
సువార్త మండు వేసవిలో నీళ్లు లేక ఒక తోటలో నారింజ చెట్లన్నీ ఎండిపోతున్నాయి. ‘మహా అయితే మరో పది రోజులు ఈ చెట్లు బతుకుతాయేమో!’ అంటూ పెదవి విరిచాడు తోటమాలి. ‘కాని ఆ మూలన ఉన్న నారింజ చెట్లకు మాత్రం భయం లేదు. ఎందుకంటే నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు కూడా కావాలనే నేను వాటికి సరిపడా నీళ్లు పోసేవాణ్ణి కాదు. ఫలితంగా అవి తమ వేర్లను భూమిలో లోపలి పొరల్లోకి పోనిచ్చి అక్కడి నీటిని పీల్చి బతకడం నేర్చుకున్నాయి. ఇప్పుడవి ఏ కాలంలోనైనా స్థిరంగా, పచ్చగా, నిర్భయంగా బతగ్గలవు’ అన్నాడా మాలి. ‘నిన్ను ఎన్నుకొని కష్టాల కొలిమిలో పరీక్షించాను’ అంటాడు విశ్వాసితో దేవుడు (యెషయా 48:10,11). విశ్వాసి అందరిలాగా తనకోసం తాను బతికే స్వార్థ జీవి కాదు. అతని జీవితం విలక్షణమైనదిగా ఉండాలన్నది దేవుని అభిమతం. సమాజానికి అతన్ని ప్రయోజనకరంగా మార్చేందుకు దేవుడు తగిన తర్ఫీదును కష్టాలు, కన్నీళ్ల కొలిమిలోనే ఇస్తాడు. దేవుడు మహా గొప్పగా వాడుకున్న బైబిలు విశ్వాస వీరులంతా అలా శ్రమల కొలిమిలో నుండి వచ్చినవారే. సారెపై రూపుదిద్దుకున్న పచ్చికుండకు ఎండ వేడిమి సరిపోదు. దానికి ప్రత్యేకమైన గుర్తింపు, ప్రయోజకత్వం కొలిమిలోనే దొరుకుతుంది. కష్టాల్లో నేర్చుకునే పాఠాలు, అనుభవాలే విశ్వాసి భావిజీవితానికి బంగారు బాటవేస్తాయి. ‘కష్టాల బడి అతనికి ఆశీర్వాదాల గని’గా మారుతుంది. ఈ లోకం అందరినీ కష్టపెడుతుంది. ఎడమవైపు దొంగను, కుడివైపు దొంగను, పాపరహితుడైన యేసుక్రీస్తును కూడా కలిపి సిలువ వేసిన ‘సర్వసమానత్వపు’ కుళ్లు సమాజం మనది! అయితే దేవుణ్ణి విశ్వసించే జీవితానికి కష్టాలు, శ్రమలు కొత్తమలుపు తిప్పుతాయి. ‘ఏ అర్హతా లేని నాకు ఇన్ని ఆశీర్వాదాలెందుకు?’ అని స్వపరీక్ష చేసుకోని వారికి ‘నాకెందుకీ శ్రమలు?’ అని ప్రశ్నించుకునే హక్కు లేదు. లోకంతో విశ్వాసి రాజీపడడు. లోక ప్రయాణం, విశ్వాసి జీవనయానం పరస్పరం అభిముఖంగా సాగుతాయి. అందుకే శ్రమలు, ప్రతికూలతలు, ప్రతిబంధకాలు. లోకంతో రాజీపడితే భోరున ‘కాసుల వర్షం’! దైవిక నియమాలకు కట్టుబడి ఉండాలనుకుంటే ‘కష్టాల వర్షం’ ఇదే బైబిలులోని విశ్వాస వీరులందరి జీవన సారాంశం. ‘ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి, అప్పుడవన్నీ మీకు లభిస్తాయి’ అన్న యేసుక్రీస్తు ఆజ్ఞ విశ్వాసి జీవితాన్ని అనేక మలుపులు తిప్పుతుంది కానీ తుదకు దేవుని సాన్నిధ్యం, ప్రసన్నత అనే ఆశీర్వాదపు గమ్యానికి చేర్చుతుంది (మత్తయి 6:33). పల్లాన్ని వెదుక్కునే క్రమంలోనే కాలువ అనేక మలుపులు తిరుగుతుంది. కాని ప్రతి పల్లం, మలుపు తనను గమ్యానికి చేరువ చేస్తోందన్న విశ్వాసమే కాలువకు ఊపిరినిచ్చి నడిపిస్తుంది. దేవుని సంపూర్ణంగా విశ్వసించడమంటే సుఖాలను, కష్టాలను కూడా దేవుడిచ్చే సమానానుభవాలుగా స్వీకరించడమే!! బైబిలులోని 66 పుస్తకాల దైవిక సారాంశాన్నంతా క్రోడీకరిస్తే అధిక భాగం శ్రమలు, కష్టాలు, కన్నీళ్లేనని అర్థమవుతుంది. అందుకే ఇన్నేళ్ల తర్వాత కూడా సమకాలీన పరిస్థితులను విశ్లేషించగల సజీవ వాక్యమయింది. దావీదు తదితరులు శ్రమల నేపథ్యంలోనే కీర్తనలు రాశారు. అపోస్తలులు దాదాపుగా తమ పత్రికలన్నీ చెరసాలల్లో ఉంటూ సంకెళ్లతోనే రాశారు. పాత నిబంధనలోని గ్రంథాలన్నీ దేవుని ప్రజల కష్టాల చిట్టాలే! ప్రవక్తల గ్రంథాలన్నీ బానిసత్వపు కాడికింద నలిగిన దేవుని ప్రజల ఆక్రందనలే! అయితే బైబిలులోని చిట్టచివరిదైన ప్రకటన గ్రంథం యేసుక్రీస్తుతో పాటు విశ్వాసి సాధించబోయే అసమానమైన విజయాన్ని, అతనికి దేవుని సాన్నిధ్యంలో కలుగబోయే నిత్యానందాన్ని వివరిస్తుంది. దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించే వారికి కారుచీకట్లో కూడా దేవుని బాట సుస్పష్టంగా కనిపిస్తుంది. మనల్ని దేవుడు తన మహిమఘటంగా రూపొందించే ప్రక్రియలో అంతర్భాగమే జీవితంలో మనం పొందే అనుభవాలన్నీ!! ‘శ్రమనొంది యుండుట నాకు మేలాయెను’ అన్న దావీదు అనుభవం ఎంత గొప్పదో కదూ!! (కీర్తన 119:71) - రెవ టి.ఎ.ప్రభుకిరణ్ -
ఆరాధనా స్థలాలుగా... మన కుటుంబాలు
విశ్వాసి వాక్యం అకుల అనే యూదు క్రైస్తవుడు అతని భార్యయైన ప్రిస్కిల్ల ఆదిమకాలపు ఆదర్శమయమైన విశ్వాసి జంట. అపొస్తలుడైన పౌలుకు పరిచర్యలో వారు సహాయకులు. ఎంతో ప్రతికూలత మధ్య పౌలు స్థాపించిన కొరింథీ, ఎఫెసీ చర్చిలు ఆ పట్టణాల్లో అకుల, ప్రిస్కిల్ల గృహాల్లోనే ఆరంభమయ్యాయి. పైగా అపొల్లో అనే మహావిద్వాంసుణ్ణి వారు ఎఫెసులో తమ ఇంటిలో చేర్చుకుని క్రీస్తు మార్గాన్ని విశదీకరించి తర్ఫీదునిస్తే ఆయన గొప్ప సువార్త ప్రబోధకుడయ్యాడు (అపొ.కా. 18) మా చర్చిలో మేమంతా ఒక కుటుంబంలాగా ఉంటాం తెలుసా? అంటారు చాలామంది గొప్పగా. అకుల, ప్రిస్కిల్ల అనే ఈ దంపతులైతే తమ కుటుంబాన్నే చర్చిగా, బైబిలు కళాశాలగా మార్చుకున్నారు. పగ, వైషమ్యాలు పెచ్చరిల్లుతున్న నేటి సమాజంలో దేవుని భయం, ప్రేమ పునాదిగా కలిగిన ఇలాంటి విశ్వాస కుటుంబాలు ఎడారిలో సెలయేళ్లవంటివే కదా! ఆత్మీయ పునాదులు, విలువల మీద కట్టబడిన కుటుంబాలతోనే పటిష్టమైన సమాజం నిర్మితమవుతుంది. పిల్లల పెంపకంలో అందుకే తల్లిదండ్రులది కీలకమైన పాత్ర. కరెన్సీ కట్టల్ని వేటాడే విద్యల్లో మన పిల్లలు ఆరితేరేందుకు ఆరాటపడుతున్నాం కాని అంతిమంగా ఆత్మీయత రూపంలో వారెలాంటి మూల్యాన్ని చెల్లించవలసి వస్తుందో ఆలోచించడం లేదు. ఆవిరి యంత్రాలతో ఆరంభమైన పారిశ్రామిక విప్లవం వేస్తున్న వెర్రితలల ఆధునిక యుగంలో మనుషులు కూడా మనసులేని యంత్రాలుగా మారి, ఒకనాటి శాంతి, ఆనందాలు ఆవిరైపోతుంటే నిస్సహాయంగా చూస్తున్నాం. అన్నీ చూస్తూ కూడా అలాంటి రాక్షస సమాజంలోనికే మన పిల్లల్ని నెడుతున్నాం. దేవుడు మాత్రమే ఇచ్చే శాంతిని, నిజమైన ఆనందాన్ని, లోకం ఇచ్చే విలాసాలు, వినోదాల్లో పొందే అవివేకానికి ‘ఆధునికత’ అనే పేరు పెట్టి మురిసిపోతున్నాం. మన కుటుంబాలు దేవునికి ఆరాధనా స్థలాలు, బైబిలు బోధనా కేంద్రాలుగా ఉంటే దేవునికి మహిమ, మనకు పరలోకానందం. దేవుడు, ఆయన విధివిధానాల మీద కట్టబడిన విశ్వాస కుటుంబాలు వినూత్న సమాజానికి దిశానిర్దేశం చేస్తాయి. దేవునికి దూరంగా బతకడమే ఆనందమనుకుంటే నీటికోసం ఎండమావుల్ని ఆశ్రయించడమే. మితిమీరిన వేగం, హింసాత్మకత నిండిన నేటి ‘ప్రగతిశీల సమాజం’లో జీవన సాఫల్యంతో హాయిగా కన్నుమూసే భాగ్యం కోల్పోయాం. బి.పి., షుగర్ వంటి జీవనశైలి రోగాలతో, బుల్లెట్ గాయాలతో కన్నుమూసే నిస్సారపు సమాజాన్ని నిర్మించుకున్నాం. ‘దేవుని సన్నిధి’ అనే అగ్ని మండే బలిపీఠాలుగా మన కుటుంబాలు, చర్చిలు ఉండాలి. అది సకల విధాలైన అపరిశుద్ధతనూ దహించి వేసి శాంతిని, ఆనందాన్ని మనలో నింపుతుంది. - రెవ. టి.ఎ. ప్రభుకిరణ్ -
దైవం ఇచ్చిన బహుమానం
సువార్త బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు. - సామెతలు 22:6 ఈ ప్రపంచంలో కల్మషం లేనిది ఏదైనా ఉంది అంటే... అది పసివాళ్ల మనసే అని చెప్పాలి. కానీ ఆ నిష్కల్మషత్వం ఎప్పటి వరకు ఉంటుంది! ఈ లోకం గురించి తెలుసుకునే వరకూ ఉంటుంది. లోకాశలకు లోబడే వయసు రానంతవరకే ఉంటుంది. ఆ తర్వాత వారి బాట వేరవుతుంది. దేవుడి నుంచి దూరమవుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే వారిలో మంచి అనేది చిన్నతనంలోనే పెరగాలి. అలా పెరిగేలా తల్లిదండ్రులు చూడాలి. అందుకే పిల్లల పెంపకం గురించి తల్లిదండ్రులకు ఎన్నో విషయాలు చెప్పాడు ప్రభువు. వారిని సరైన దారిలో పెంచాల్సిన బాధ్యత మీదే అని పదే పదే హెచ్చరించాడు. పైన చెప్పుకున్న వాక్యమే అందుకు నిదర్శనం. అంతేకాక... ‘‘తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక, ప్రభువు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచుడి’’ అన్నాడు ప్రభువు ఎఫెసీ 6:4లో. ఈ ఒక్క మాట చాలు పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకోవడానికి. కోపం మనిషికి శత్రువు. అది మనిషిని విచక్షణా రహితుణ్ని చేస్తుంది. తప్పులు చేయిస్తుంది. అందుకే కోపానికి దూరంగా ఉండాలి. ఆ దూరంగా ఉండటం అన్నది చిన్ననాటి నుంచే జరగాలి. కోపమనే విత్తును పిల్లల మనసుల్లో నాటకుండా ఉండాలి. దేవుడి బోధలను, ప్రవచనాలు వివరించి... వాటిని అనుసరించి నడచుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలి. నిజానికి పిల్లలు ఎలా ఉండాలి అన్నదానికి అత్యంత గొప్ప ఉదాహరణ యేసుక్రీస్తే. తన తండ్రియైన యెహోవా దేవుని ఆజ్ఞ మేరకు క్రీస్తు ఈ లోకంలో మనిషిగా జన్మించాడు. తన తండ్రి రాజ్యాన్ని ఈ నేలమీద స్థాపించాడు. తన తండ్రి ఆదేశించిన విధంగా శిలువ మరణం పొందాడు. ఓ గొప్ప కొడుక్కి అసలు సిసలు ఉదాహరణ క్రీస్తు. మరి మనకొద్దా అలాంటి గొప్ప బిడ్డలు! గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం (కీర్తనలు 127:3). ఆయన ఇచ్చిన బహుమానాన్ని పదిలంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని ఆయన ఘనతను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా చేయాల్సిన బాధ్యత మనది. కాబట్టి పిల్లల నడవడికను కనిపెట్టాలి. నడవాల్సిన తోవను చూపించాలి. చేరాల్సిన గమ్యాన్ని నిర్దేశించాలి. - జాయ్స్ మేయర్ -
ఆయన నిన్ను ఎన్నడు విడువడు!
సువార్త నీ దేవుడనైన యెహోవానగు నేను - భయపడకుము, నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. - యెషయా 41:13 బిడ్డ పడిపోకుండా తండ్రి చేయి పట్టుకుంటాడు. నడక నేర్పిస్తాడు. దారి చూపిస్తాడు. ప్రభువు కూడా అంతే. ఆయన ఎప్పుడూ మన చేయి పట్టుకునే ఉంటాడు. మనం నడవాల్సిన తోవను మనకు చూపిస్తాడు. దారి తప్పిన ప్రతిసారీ దారిలోకి తీసుకొస్తాడు. చేరాల్సిన గమ్యానికి చేర్చుతాడు. నాటి ఇశ్రాయేలీయుల నుంచి నేటి మన వరకు ఆయన అదే చేశాడు. ఎన్నడూ మాట తప్పలేదు. నేను నీ చేయిపట్టి నడిపిస్తాను అని చేసిన ప్రమాణాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. నాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానంటూ ఇశ్రాయేలీయులకు మాటిచ్చాడు ప్రభువు. అన్న విధంగానే వారిని బానిసత్వం నుంచి విడిపించాడు. కష్టమన్నదే ఎరుగని దేశానికి వారిని నడిపించాడు. కొండలు, గుట్టలు దాటుకుంటూ వారు వెళ్తుంటే కాళ్లకు సత్తువనిచ్చాడు. అడవుల గుండా నడుస్తున్నప్పుడు క్రూరమృగమైనను, విష కీటకమైనను వారి దరికి రాకుండా అడ్డుకున్నాడు. సముద్రాన్ని చీల్చాడు. మన్నాను కురిపించి కడుపులు నింపాడు. కడదాకా వారికి అండగా ఉన్నాడు. కావలి కాశాడు. అదే ఆయన ప్రేమ. తన బిడ్డల పట్ల ఆయనకున్న మమత. అదే ప్రేమ, అదే మమత మన పట్ల కూడా కురిపిస్తున్నాడు తండ్రి. లోకం పాప పంకిలమైపోయిందని ఆయనకు తెలుసు. మనం కట్టడులు మీరుతున్నామని కూడా ఆయనకు తెలుసు. ఆదర్శంగా ఉండాల్సిన తన బిడ్డలు తనను విస్మరించినా... ఆయన మాత్రం మనలను విస్మరించడు. అందుకే దావీదు మహారాజు... విడువని, యెడబాయని దేవుడవు అంటూ ప్రభువును వేనోళ్ల స్తుతించాడు. మరి అంత చేస్తున్న దేవునికి మనమేం చేస్తున్నాం? ఆయన చూపించే ప్రేమకి మారుగా మనమేమి ఇస్తున్నాం? ఏమీ లేదు. కనీసం ఆయన చూపే ప్రేమానురాగాలకు కృతజ్ఞత కూడా చూపడం లేదు మనం. ఆయన ఏం కోరుకున్నాడు? కానుకలు అడగలేదు. అభిషేకాలు కోరలేదు. కల్మషాన్ని వదిలేయమన్నాడు. కారుణ్యతను ప్రదర్శించమన్నాడు. పొరుగువాడిని ప్రేమించమన్నాడు. తనకు మాదిరిగా నడుచుకొమ్మన్నాడు. క్షమించమన్నాడు. సహించమన్నాడు. అది కూడా చేయలేము మనం. విశ్వాసులమని చెప్పుకుంటూ ఆయన మాటలను పెడచెవిన పెట్టి, విశ్వాస ఘాతుకానికి పాల్పడుతూనే ఉంటాం. అందుకే మనం ఆయన ప్రేమను పొందడానికి అనర్హులం. కానీ ఆయన ఎన్నడూ అలా అనుకోడు. సణగడు. ఆగ్రహించడు. మనల్ని దూరంగా నెట్టేయడు. మన మొరలు ఆలకించకుండా తన చెవులను కప్పుకోడు. మన అగచాట్లు చూడకుండా కన్నులు మూసుకోడు. నా దారిలో నడవని మీ దారికి నేను రానే రానంటూ ఒంటరిగా వదిలేయడు. ఏ ఒక్క సమయంలోనూ మన చేతిని విడిచి పెట్టడు. ఇంకా ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. దారి తప్పిపోతున్న తన కుమారులను దారిలో పెట్టేవరకూ విడువడు. భీతిల్లిన మనసుల్లో ధైర్యం నిండేవరకూ విడువడు. తన బిడ్డల కన్నుల్లో కన్నీళ్లు ఇంకేవరకూ విడిచిపెట్టడు. కళ్లు తుడుస్తాడు. వెన్ను తడతాడు. అవును... ఆయన మన చేయి విడువడు. ఎన్నడూ విడువడు! - జాయ్స్ మేయర్ -
పగకు ప్రతిఫలంగా...ప్రేమను పంచండి
సువార్త ‘‘నీ పగవాడు ఆకలిగొనిన యెడల వానికి భోజనము పెట్టుము. దప్పిగొనిన యెడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. (సామెతలు 25:21,22) కోపాన్ని జయించినవాడు ఉత్తముడని దేవుడు ఎప్పుడూ చెబుతూనే ఉన్నాడు. ఈ లోకంలో జరిగే ఎన్నో అనర్థాలకు మూలం కోపమే. దూషించుకోవడం, కొట్లాడుకోవడం, దాడి చేయడం, హతమార్చడం వంటి ఎన్నో నేరాలకు పురికొల్పేది కోపమే. మితిమీరిన కోపం పగగా మారుతుంది. అవతలి వ్యక్తికి కీడు చేసేందుకు ప్రేరేపిస్తుంది. అది తప్పు అని చెబుతున్నాడు ప్రభువు. కోపాన్ని అణచుకోలేక తిట్టడం, పగబట్టి హాని చేయడం కాదు... అతడిని ఆదరించి, ప్రేమ చూపించడమే అతడికి తగిన శిక్ష అని చెబుతున్నాడు. మనలో చాలామంది చేసేదేమిటంటే... ఒక వ్యక్తిమీద కోపం వస్తే వారిని చూడటానికి కూడా ఇష్టపడం. పరుష పదజాలంతో మాట్లాడుతాం. కఠినంగా వ్యవహరిస్తాం. దాన్ని తాను ఏమాత్రం సమర్థించను అని చెప్పకనే చెబుతున్నాడు ప్రభువు. పగను సైతం ప్రేమతో సాధించమని సెలవిస్తున్నాడు. పగవాడికి అన్నం పెట్టమంటున్నాడు. దాహమేస్తే మంచినీరు ఇమ్మంటున్నాడు. అలా చేయడం వల్ల అతడి తలమీద నిప్పులు కుప్పగా పోస్తావని ఆయన అన్నమాటకు అర్థం... నీ మంచితనంతో అతడిని సిగ్గుపరచేలా చేస్తావు అని. నిజమే కదా! చెడు చేయాలని చూస్తున్న వ్యక్తికి నువ్వు ప్రేమ చూపిస్తే, అతడిలో ఆ క్రూరమైన తలంపు నశించిపోతుంది. తిరిగి మంచే చేయాలనిపిస్తుంది. క్రైస్తవుడిగా పగవాడిని ప్రేమతో మార్చు తప్ప పగ సాధించవద్దు అన్నదే ఈ వాక్యం ద్వారా దేవుడిస్తున్న సందేశం. అలా చేస్తే తన దీవెనలను మెండుగా కుమ్మరిస్తానని ఆయన మాట ఇస్తున్నాడు కూడా! కాబట్టి పగను వదలాలి. ప్రేమను పంచాలి. ఆవేశాన్ని సైతం ఆప్యాయతగా మార్చగల శక్తి దానికి మాత్రమే ఉంది మరి! - జాయ్స్ మేయర్