ఆ ధీమా వెనుక రహస్యం విశ్వాసమే! | Said that faith is the secret behind! | Sakshi
Sakshi News home page

ఆ ధీమా వెనుక రహస్యం విశ్వాసమే!

Published Sun, Nov 8 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

ఆ ధీమా వెనుక రహస్యం విశ్వాసమే!

ఆ ధీమా వెనుక రహస్యం విశ్వాసమే!

సువార్త
మన హృదయాల్లో నింపే ‘విశ్వాసం’ సజీవమైనది. అది పనిచేయకుండా ఉండదు. కొద్దిపాటి విశ్వాసముంటే పరలోకానికి చేరవచ్చు కానీ గొప్ప విశ్వాసం పరలోకాన్నే తెచ్చి మన జీవితాల్లో, కుటుంబాల్లో నింపుతుంది. యేసుక్రీస్తు అక్కడెక్కడో దూరంగా పరలోకంలో ఉండేవాడుగా చూడటం మతం. కాని నావాడంటూ ఆయన్ను ఆలింగనం చేసుకోవడం నిజమైన విశ్వాసం.
 
కటిక చీకట్లో ఒకాయన కొండపై నుండి జారి లోయలో పడుతూ అనుకోకుండా ఒక చెట్టు కొమ్మ చేతికి తగిలితే దానికి వేలాడుతున్నాడట. పైన ఆకాశం, కింద లోయ. చుట్టూ చీకటి. ‘నన్ను కాపాడు దేవా’ అంటూ ప్రార్థిస్తున్నాడు. ‘ఫరవా లేదు, కొమ్మను వదిలేయ్’ అన్నాడు దేవుడు. కానీ ధైర్యం చాలక దేవుణ్ణి వదిలేసి కొమ్మనే పట్టుకున్నాడు. కాసేపటికి పట్టుసడలి కొమ్మను వదిలేశాడు. ఆశ్చర్యం! మరు క్షణం భూమ్మీదున్నాడు. నేలకు కేవలం గజం దూరంలో తానున్నానన్న విషయం చీకట్లో అతనికి తెలియలేదు.
 
దేవుని ప్రతి మాటనూ నమ్మడమే విశ్వాసం. నీ దోనెను లోతునకు నడిపించి వలలు వేయమని యేసు ప్రభువు పేతురుతో అన్నాడు. చేపలు పట్టడంలో ఎంతో అనుభవం ఉన్న పేతురు అంతకు ముందు రాత్రి ఎంత కష్టపడ్డా ఒక్క చేప కూడా దొరకలేదు. గలిలయ సరస్సులోని చేపలన్నీ కలిసి అతన్ని వెక్కిరించినట్లనిపించి అవమాన భారంతో కృంగిపోయాడు. మరునాడు పేతురు దోనెలోకి యేసు ఎక్కి కూర్చొని అక్కడున్న వారికి బోధ చేశాడు. ఆయన మాటలు పేతురులో ధైర్యాన్ని నింపాయి. ‘ఈసారి తన ప్రతిభను పక్కనపెట్టి ‘యేసు మాట’ చొప్పున వలలు వేస్తే చేపలు విస్తారంగా పడ్డాయి. ముందు రాత్రి ఘోర పరాజయం, మరునాడే ఘన విజయం.

పరాభవాల్ని విజయంగా, సమస్యను ఆశీర్వాదంగా, కొరతను సమృద్ధిగా మార్చే శక్తి విశ్వాసం అనే కాలువ ద్వారా మన జీవితంలోకి ప్రవహిస్తుంది. అయితే నీళ్లు లేని కాలువలాగే క్రియలు లేని విశ్వాసం మృతప్రాయమంటుంది బైబిలు (యాకోబు 2:7). కంటికి కనబడని విద్యుత్తు బల్బును వెలిగించి కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతినిచ్చినట్టే, లోకానికి మన విశ్వాసం తాలూకు సత్‌క్రియలు కనిపించాలి. పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో నింపే ‘విశ్వాసం’ సజీవమైనది. అది పనిచేయకుండా ఉండదు. కొద్దిపాటి విశ్వాసముంటే పరలోకానికి చేరవచ్చు కానీ గొప్ప విశ్వాసం పరలోకాన్నే తెచ్చి మన జీవితాల్లో, కుటుంబాల్లో నింపుతుంది.

యేసుక్రీస్తు అక్కడెక్కడో దూరంగా పరలోకంలో ఉండేవాడుగా చూడటం మతం. కాని నా వాడంటూ ఆయన్ను ఆలింగనం చేసుకోవడం నిజమైన విశ్వాసం. అలా యేసును విశ్వసించిన వారు తమ అడుగులు శూన్యంలో, చీకట్లో వేసినా అవి స్థిరమైన బండ మీదే పడ్తాయి. విశ్వాసంతో అసాధారణమైన విజయాలు మన సొంతమవుతాయి. మనుషులు చేసేదే దేవుడూ చేస్తే అందులో దేవుని మహిమ ఏముంది? ‘నన్ను బలపరుచువానియందే నేను సమస్తం చేయగలను’ అన్న పౌలు ధీమా వెనుక రహస్యం ఆయన విశ్వాసమే’ (ఫిలిఫ్పీ 4:13).
- రెవ టి.ఎ. ప్రభుకిరణ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement