
విశ్వవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులు భక్తి శ్రద్ధలతో ఉపవాస ధ్యానంలో ఆచరించే తపస్సు కాలాన్ని ‘లెంట్ కాలం’అంటారు. లెంట్ అనే లాటిన్ మాటకు చిగురించడం అని అర్థం. ఇది బుధవారంతో ప్రారంభమవుతుంది. అందు చేత ‘భస్మ బుధవారం’ లేదా ‘బూడిద బుధ వారం’ అంటారు. లెంట్ మొత్తం నలభై రోజులు. లాటిన్ భాషలో ‘క్వాడ్రగెసిమ’ అనే మాటకు నలభై అనిఅర్థం. బైబిల్లో నలభై దినాల ఉపవాసానికి ఉదాహరణగా, మోషేనలభై దినాలు ఉపవసించి ప్రార్థన చేశాడు. ఏలియా ప్రవక్త 40 రోజులు ఉపవసించి, ప్రార్థించాడు. నోవా జలప్రళయం 40 దినాలు జరిగింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానుకు 40 సంవత్సరాలు పయనించారు. ఏసు పరిచర్యకు ఉపక్రమించే ముందు 40 దినాలు ఉపవసించి ప్రార్థించాడు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన ఉపవాస ధ్యానాలు 40 రోజులు భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ఒంటిపూట సాత్వికాహారం తీసుకుని నియమబద్ధమైన జీవితం గడుపుతూ ఆచరిస్తారు.
బుధవారం రోజు కొన్ని ఆలయాల్లో విశ్వాసులు తాటాకులతోగాని, కొబ్బరి ఆకులతోగాని, ఖర్జూరపు ఆకులతో చేసిన సిలువ ప్రతిమలు తెచ్చి ఉంచుతారు. వాటిని మరుసటి సంవత్సరం వరకు ఉంచి బుధవారం భస్మం చేస్తారు. ఆ బూడిదతో నుదుటపై సిలువు గుర్తు వేసుకుని లేదా తలపై చల్లుకుని బూడిద బుధవారం నుంచి శుభ శుక్రవారం వరకు జరిగే క్వాడ్రగెసిమ కాలం ధ్యానాలు ఆచరిస్తారు. లెంట్‌కాలం అంతా దేవాలయాల్లో నలభై అంశాలపై ధ్యానం చేస్తూ ప్రార్థనలు జరుగుతాయి. ఈ కాలంలో శుభకార్యాలు గాని, కుటుంబాల్లో జరుపుకునే ఇతర ఉత్సవాలు గాని చేయరు. భస్మ బుధవారం నుంచిశుభ శుక్రవారం వరకూ వచ్చే నలభై దినాలు ‘శ్రమల కాలం’గా పరిగణించి, ప్రక్షాళన కోసం పవిత్రపరచుకునే సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సమాజం ఆచరిస్తుంది. శుభ శుక్రవారం అనంతరం వచ్చే శనివారాన్ని ‘లాజరస్ సాటర్ డే’ అంటారు. దీన్నే ‘నిశ్శబ్ద శనివారం’ అని కూడా పిలుస్తారు. ఏసు మరణించిన శుక్రవారం సమాధిలో ఉన్నా, శనివారం అనంతరం పునర్జీవితుడై తిరిగి లేచిన ఆదివారం ‘ఈస్టర్ ఆది వారం’గా జరిగే ప్రార్థనలతో లెంట్‌కాలం పూర్తవుతుంది. ఈ క్వాడ్రగెసిమ కాలం అంతా పాప ప్రక్షాళనతో పాటు వ్యక్తిగత నియమనిష్ఠలను పాటించి, ప్రపంచ శాంతి, సమసమాజ సుహృద్భావ జీవనం కలగాలని ప్రార్థనలు చేస్తారు.
– ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, క్రైస్తవ సాహిత్య పరిశోధకులు (నేడు భస్మ బుధవారం)