నేడు క్రిస్మస్ పర్వదినం
మానవాళి ముక్తికొరకు మనుజావతారుడైన దైవం...
జగతిలో భీతి బాపేందుకు దిగివచ్చిన దైవ తనయుడు...
సర్వలోకానికి శాంతి సందేశం..
దివిలోనూ భువిలోనూ వేడుక...
పరలోక దూతావళి పరవశించి పాడిన వేళ
ప్రతి హృదిలో క్రిస్మస్ ఆనందం...
జగతిలో పాపం నిండినప్పుడు ప్రేమతో కలిసి జీవించాల్సిన ధరణి వాసుల హృదయాలు అసూయ, ద్వేషంతో రగులుతున్నప్పుడు చీకటి జలధిలో మునిగిన వారికి, శృంఖలాల్లో మగ్గేవారికి మరణ ఛాయలో బతికే వారికి ఒక ఆశాకిరణంగా... అరుణోదయ కాంతిగా... విమోచకుడిగా... జగద్రక్షకుడిగా రెండు వేల సంవత్సరాల క్రితం యేసుప్రభువు ఈ భువిపైకి అరుదెంచాడు. అదొక సుమనోహర ఘట్టం.. సర్వలోకాన్ని సంభ్రమాశ్చర్యాలతో విశేషంగా ఆకట్టుకున్న మధుర కావ్యం. తమను రక్షించే మెస్సయ్య కోసం సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న విశ్వాసుల్లో నింపిన అంతులేని ఆనందం వెరసి స్తోత్ర గీతంగా స్తుతి గానంగా మారిన వైనం.. అందుకు యూదా దేశంలోని బెత్లెహేము వేదిక అయింది.
ఆ సమయంలో రాజైన హేరోదు యెరూషలేము రాజధానిగా రాజ్యమేలుతున్నాడు. యూదా ప్రజలంతా తమను విమోచించే మెస్సయ్యా కోసం ఎదురు చూస్తున్న తరుణం. ఆ భాగ్యం కన్య అయిన మరియకు లభించింది. అప్పటికే గలిలయలోని నజరేతులో దావీదు వంశస్తుడైన యోసేపునకు మరియ ప్రదానం చేయబడింది. పరమ దేవుని ఆజ్ఞ మేరకు ప్రభువు దూత గబ్రియేలు ద్వారా ఈ శుభ వర్తమానం అందింది. ‘దయా ప్రాంప్తురాలా!’... అంటూ గబ్రియేలు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడే యవ్వన్రపాయంలో అడుగుపెడుతున్న మరియ ఎంతో భయపడింది.
ఎందుకంటే ఆ కాలంలో దేవుడు కాని ఆయన దూతల దర్శనం అరుదుగా మారింది. ప్రవక్తలకు ప్రవచనాలు నిలిచి పొయాయి. నిశ్శబ్దకాలంగా చెప్పబడింది. అటువంటి తరుణంలో దేవుని దూత మరియ వద్దకు వచ్చి ‘భయపడకుము నీవు ధన్యురాలవు, దేవుని వలన నీవు కృప ΄పొందావు. నీవు గర్భము ధరించి కుమారుని కంటావు. ఆయన సర్వోన్నతుని కుమారుడనబడతాడు. అతని రాజ్యము అంతము లేనిదై వుంటుందని’ పేర్కొన్నాడు. దూత మాటలు మరింత విస్మయానికి భయానికి గురిచేశాయి. ఇది దేవాది దేవుని నుంచి వచ్చిన పిలుపుగా మరియ తెలుసుకుంది. ‘అయ్యో నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఏలాగు సాధ్యం?’ అని అడిగింది.
‘మరియా! భయపడకు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి వస్తుంది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడతాడని దేవదూత చెప్పిన మాటలను బట్టి ఇది దైవకార్యంగా గ్రహించి ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పి దేవాది దేవుని తన గర్భంలో మోయడానికి సిద్ధపడింది. వాస్తవానికి వివాహం కాకుండా ఆ రోజుల్లో యూదా స్త్రీ గర్భవతి అయితే రాళ్ళతో కొట్టి చంపే ఆచారం ఉండేది. దేవుని దయ΄పొంది అంతులేని విశ్వాసంతో దేవుని ఆజ్ఞను శిరసావహించడానికి ముందుకు వచ్చింది కాబట్టే మరియ స్త్రీలందరి లో ధన్యురాలిగా కొనియాడబడింది.
అయితే మరియ గర్భవతియైన సంగతి తెలుసుకున్న యోసేపు కలత చెందాడు. నీతిమంతుడు కాబట్టి ఆమెను నలుగురిలో నగుబాటు చేయకుండా రహస్యంగా విడనాడాలని నిశ్చయించుకున్నాడు. ప్రభువు దూత స్వప్నమందు ప్రత్యక్షమై మరియ గర్భము ధరించింది ఏ పురుషుని వలన కాదని పరిశుద్ధాత్మ వలన జరిగినదని మరియను చేర్చుకొనడానికి ఏమాత్రమూ సందేహపడవద్దని పుట్టబోవు శిశువునకు యేసు అని పేరు పెట్టాలని తన ప్రజలందరి పాపములనుండి ఆయనే రక్షిస్తాడని తెలుపడంతో యోసేపులో ఆవేదన తొలగిపొయింది. అంతేకాదు మరియ యేసుకు జన్మనిచ్చేవరకూ ఆమెను ముట్టకుండా జాగ్రత్త పడ్డాడు.
ఇదే సమయంలో ఆరు నెలలకు ముందు మరొక ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. మరియ సమీప బంధువు రాలైన ఎలీసబెతు ఆమె భర్త జెకర్యా కురు వృద్ధులు. ఆ వయస్సులో దేవుడు వారికి సంతాన ప్రాంప్తి అనుగ్రహించాడు. దేవుని హస్తం వారికి తోడుగా వుండి ఒక మగ శిశువును దయచేసాడు. ఆ శిశువే తర్వాతి కాలంలో బాప్తీస్మం ఇచ్చు యోహానుగా పిలువబడి యేసు ప్రభు పరిచర్యకు ముందు ఆయన మార్గం సరళం చేసే సాధనమయ్యాడు.
లేఖన ప్రవచనాలు నెరవేర్చిన క్రిస్మస్
యేసుక్రీస్తు జననం రెండు వేల సంవత్సరాల క్రితం జరిగినా ఆయన ఆదిసంభూతుడు. ఆల్ఫా ఒమేగా ఆయనే. ఆదియు అంతమునై యున్నాడు. మొదటివాడు కడపటి వాడుగా ఉన్నవాడు. జగత్ పునాది వేయకముందే వున్న యేసు కాలం సంపూర్ణమైనప్పుడు సాతాను చెరలో చిక్కుకున్న మానవుడు పాపానికి బందీగా మారి దేవుని సన్నిధికి దూరంగా వెళుతున్న తరుణంలో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా పతనమై ఏ నిరీక్షణ లేని సమయంలో నిత్య జీవమిచ్చి తిరిగి దేవునితో ఐక్యపర్చేందుకు భూమి మీద దేవుని కుమారుడిగా క్రీస్తు అవతరించాడు.
యేసు పుట్టుకను క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితమే మీకా, యెషయా ప్రవక్తలు ప్రవచించడం విశేషం. ‘బెత్లెహేము ఎఫ్రాతా యూదా కుటుంబంలో స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏల బోవువాడు నీలో నుండి వచ్చును’ అని మీకా ప్రవచించగా ‘ఆలకించుడి కన్యక గర్భవతియై కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును’ అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఇమ్మానుయేలనగా దేవుడు మనకు తోడని అర్థం.
యేసు పుట్టుక ఆవశ్యకత గూర్చి యెషయా వివరించాడు. ‘ప్రభువు ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువార్తమానం ప్రకటించుటకు, నలిగిన హృదయం కలవారిని దృఢ పరచుటకు చెరలో నున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు’ అని యెషయా ప్రవక్త చెప్పిన లేఖనాలు తన రాక ద్వారా నిజమయ్యాయని యేసుప్రభు తనపరిచర్యలో చెప్పడం విశేషం.
ప్రజా సంఖ్యలో రాయబడటానికి యోసేపు మరియలు నజరేతు నుండి బెత్లెహేముకు రావాల్సి వచ్చింది. రెండింటి మధ్య 90 మైళ్ళ దూరం. రెండు వేల సంవత్సరాల క్రితం ఎలాంటి ప్రయాణ సాధనాలు లేనిరోజుల్లో నిండు చూలాలైన మరియను వెంటబెట్టుకొని బహు ప్రయాస కోర్చి చలికాలంలో బెత్లెహేము చేరుకున్నారు దంపతులు. జన సంఖ్య కోసం ఆ గ్రామం అప్పటికే క్రిక్కిరిసి పొయి ఉండటంతో ఎక్కడా స్థలం లేక ఓ పశువుల కొట్టమే వారికి అశ్రయమైంది. అర్థరాత్రి వేళలో క్రీస్తు జన్మించడంతో పశువుల తొట్టె క్రీస్తు పాన్పుగా మారిపొయింది. పరలోకాన్ని విడచివచ్చి పశువుల కొట్టంలో బాల యేసు పరుండాల్సి వచ్చింది. అతి సామాన్య కుటుంబంలో అతి సామాన్యంగా యేసు జన్మించాడు.
యేసు పుట్టుక శుభవార్త మొదట తెలిసింది సామాన్యులకే. ఊరి వెలుపల ΄÷లంలో గొఱె<లను కాచుకుంటున్న పశు కాపరుల వద్దకు ప్రభువు దూత వచ్చి వారి మధ్య నిలచినప్పుడు ప్రభువు మహిమ వారిచుట్టూ ప్రకాశించగా వారెంతో భయపడ్డారు. అందుకు దూత ‘భయపడకుడి ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తీసుకు వచ్చాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు’ అంటూ శిశువు ఆనవాలు తెలియజేయడం జరిగింది. అప్పుడు పరలోకం నుంచి వచ్చిన దేవదూతల సమూహం ‘సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక’ అంటూ దేవుని స్తుతిస్తూ పాటలు పాడారు.
యేసు పుట్టుక కేవలం యూదా ప్రాంంతానికే పరిమితం కాలేదు. యేసుక్రీస్తు జన్మవిశేషం తెలియజేస్తూ ఆకాశంలో ఓ వింత తార వెలిసింది. దాన్ని చూసిన ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రోజును వెతుక్కుంటూ యెరూషలేము చేరుకున్నారు. తుదకు బెత్లెహేము లో పుట్టాడని తెలుసుకొని శిశువును పూజించి తాము తెచ్చిన బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలను సమర్పించి అత్యానందభరితులై తిరిగి వెళ్లారు. ఈ విధంగా యేసు పుట్టుక ఒక విశ్వ వేడుకగా మారింది.
రక్షణ తెచ్చిన క్రిస్మస్
యేసు పుట్టుక సర్వమానవాళికి రక్షణ అందించిది. యేసు పుట్టుక పరమార్థమే అది. పాప పంకిలమైన మానవ జాతిని రక్షించడానికే యేసు జన్మించాడు. దేవుని ఆజ్ఞ మీరడం ద్వారా దేవుడు సృజించిన తొలి మానవుడు ఆదాము, అతని భార్య హవ్వ ఈ లోకానికి పాపాన్ని శాపాన్ని తీసుకు వచ్చారు. ఆ పాపానికి ప్రతిఫలంగా నర జాతి మొత్తానికి మరణం సం్రపాప్తించింది. అయితే ఆ శాపాన్ని పాపాన్ని కొట్టివేసి తద్వారా వచ్చిన మరణభయాన్ని తొలగించేందుకు క్రీస్తు అందించిన శిలువ యాగం ద్వారా రక్షణ ΄పొంది నిత్యజీవానికి వారసులై సదా కాలం క్రీస్తుతో నివసించే భాగ్యాన్ని క్రిస్మస్ మనకు అందించింది.
క్రిస్మస్ ద్వారా రక్షకుడు ఈ లోకానికి వచ్చి ప్రజలందరి రక్షణార్థం పాపపరిహారార్థ బలిగా శిలువపై తనను తాను సమర్పించుకున్నాడు. యేసు శిలువలో కార్చిన రక్తం ద్వారా పాప విమోచన. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మానవుడు దేవునితో పరలోకంలో ఉండే భాగ్యం అందించడానికి దేవుడు మానవుడిగా అవతరించాల్సి వచ్చింది. అందుకు క్రీస్తు పుట్టుక వేదికగా మారింది. అప్పుడు ఈ ధరిత్రి మీద మానవునిగా జన్మించిన యేసు ఇప్పుడూ నీవు ఆహ్వానిస్తే నీ హృదిలో ఆత్మరూపుడై వసించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీలో నిత్యసంతోషం నింపుతాడు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
సంతోషం... సమాధానం తెచ్చిన క్రిస్మస్
యేసుక్రీస్తు పుట్టుకే మానవాళికి గొప్ప శుభవార్త. క్రీస్తు పుట్టుక సమయంలో కురేనియ, సిరియా దేశమునకు అధిపతి అయిన కైసరు ఔగుస్తు మొదటి ప్రజాసంఖ్య ప్రకటించాడు. ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక అంశాలతో తెలియ చేయబడిన క్రీస్తు జననం ఒక కల్పితకథ కాదు ఒక చారిత్రాత్మక సత్యం. ఆయన కారణజన్ముడు. చారిత్రాత్మక పురుషుడు. క్రీస్తుకు ముందు... క్రీస్తు తర్వాతగా కాలం రెండుగా విభజింపబడటయే ఇందుకు ఓ గొప్ప ఉదాహరణ.
– బందెల స్టెర్జి రాజన్ సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment