దేవుని కృప ఉంటే... సామాన్యులూ అసామాన్యులే! | If the common asamanyule the grace of God ...! | Sakshi
Sakshi News home page

దేవుని కృప ఉంటే... సామాన్యులూ అసామాన్యులే!

Published Sun, Jan 31 2016 12:34 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

దేవుని కృప ఉంటే... సామాన్యులూ అసామాన్యులే!

దేవుని కృప ఉంటే... సామాన్యులూ అసామాన్యులే!

సువార్త
గిద్యోను చాలా పిరికివాడు. ‘నేను, నా కుటుంబం’ అన్న పరిధిని మించి ఆలోచించలేని అత్యంత సామాన్యుడు. ఎంతో క్రూరులైన మిద్యానీయులనే శత్రువులు ఇశ్రాయేలీయులను వేధిస్తున్న గడ్డు కాలమది. దేవుడొక శూరున్ని లేపి అతని ద్వారా తమకు ముక్తి కలిగిస్తాడని గిద్యోనుతో సహా ఇశ్రాయేలీయులంతా ఎదురు చూస్తున్నాడు. అయితే     ‘ఆ శూరుడివి నీవే!’ అన్నాడు.
 
రిచర్డ్ ఫెయిన్‌మెన్ అమెరికా అంతరిక్ష విజయాలకు పితామహుడు, 1965లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. అతని చిన్నప్పటి స్కూల్ రికార్డ్స్ తిరగేస్తే, క్లాస్‌లో అతనికి గొప్ప మార్కులేమీ వచ్చేవి కావని, అప్పట్లో అతని ఐక్యూ కూడా తక్కువేనని వెల్లడైంది. మరి ఇంతటి వాడెలా అయ్యాడని అంతా ఆశ్చర్యపోతూంటే ‘నాకవేవీ గుర్తు లేదు. నేను దేవుని ప్రత్యేకమైన సృష్టినన్నదొక్కటే నాకెప్పుడూ గుర్తుంటుంది. నన్ను ముందుకు నడిపస్తుంది’ అని జవాబిచ్చాడాయన.
 
గిద్యోను చాలా పిరికివాడు. ‘నేను, నా కుటుంబం’ అన్న పరిధిని మించి ఆలోచించలేని అత్యంత సామాన్యుడు. ఎంతో క్రూరులైన మిద్యానీయులనే శత్రువులు ఇశ్రాయేలీయులను వేధిస్తున్న గడ్డు కాలమది. దేవుడొక శూరున్ని లేపి అతని ద్వారా తమకు ముక్తి కలిగిస్తాడని గిద్యోనుతో సహా ఇశ్రాయేలీయులంతా ఎదురు చూస్తున్నాడు. అయితే ‘ఆ శూరుడివి నీవే!’ అన్నాడు. గిద్యోను వద్దకు దేవుడు పంపిన దూత ‘నేనా?’ అంటూ గిద్యోను తన అనర్హతలన్నీ ఏకరువు పెట్టాడు. కాని దేవుడు ఊరుకోలేదు. అంతమంది మిద్యానీయులనూ ఒకే వ్యక్తి హతమార్చినట్టు దేవుని తోడ్పాటుతో నీవు హతమార్చుతావంటూ ఆ దూత ప్రోత్సహించాడు. ‘మానవ నేత్రాలకు వాళ్లు అసంఖ్యాకమైన శత్రు సైన్యం. కాని దేవుని నేత్రాలతో చూస్తే నేలకొరిగిన ఒకే ఒక శత్రువు కళేబరం!’ అన్న విశ్వాస సూత్రాన్ని అలా నేర్చుకున్న గిద్యోనుతో దేవుడు తన పరాక్రమాన్ని నింపగా అతను శత్రువులను చీల్చి చెండాడి గొప్ప విజయాలు సాధించాడు
 
(న్యాయా 6,7,8).
పరాక్రమవంతులతోనే గొప్ప కార్యాలు జరిగించుకుంటే దేవుని ప్రత్యేకత ఏముంది? ఖాళీగా, అనామకంగా పడి ఉన్న మట్టి కుండల్లోనే దేవుడు తన మహదైశ్వర్యాన్ని నింపుతాడు. లోకం తృణీకరించిన వాళ్లు, నిండా వైఫల్యాలున్న వారినే ఆయన మహామహులను, విజేతలను చేస్తాడు. అయితే దేవున్ని సంపూర్ణంగా విశ్వసించాలన్నది దానికి పూర్వ నిబంధన. అలాంటి విశ్వాసుల జీవితాలకు దేవుడే జవాబు దారవుతాడు. దేవుడు తన అసమానమైన కృపతో అలాంటి విశ్వాసులను అనూహ్యమైన విజయాల కోసం సిద్ధం చేస్తాడు. దేవుని కృపతో అలా సామాన్యులైన విశ్వాసులు కూడా గొప్ప ఆత్మలుగా ప్రజ్వరిల్లుతారు. జీవితంలో చిరుగులు కుట్టమని, గతుకులు పూడ్చమని దేవుని అడగడం లేదు. చిరుగులు కుట్టే సూది దారం, గతుకులు పూడ్చే పార, పలుగు దేవున్నడిగి తీసుకొని ఆయన కృపాసాయంతో మనమే మన జీవితాల్ని సరిచేసుకోవడమే నిజమైన విశ్వాసం.

అలా యేసుక్రీస్తు కృపా పరిధిలో ఇమిడిన విశ్వాసి జీవితంలో దేవుని మహిమపర్చే విషయాలకే తప్ప పాపానికి తావు లేదు. ఎందుకంటే చలిని వేడి, చీకటిని వెలుగు వ్యతిరేకించినట్టే, దేవుని కృప పాపాన్ని వ్యతిరేకిస్తుంది. చౌకబారు ఆలోచనలు, మాటలు, పనుల నుండి దేవుని కృప విశ్వాసిని దూరంగా పెడుతుంది. ధర్మశాస్త్రంలో భయం, దేవుని ఉగ్రత ఉంటుంది. కాని దేవుని కృపలో కరుణ, ఆశ ఉంటుంది. అందువల్ల ధర్మశాస్త్రపు కాడి నుండి విడుదలనిచ్చే దేవుని కృపలో విశ్వాసి అంతకంతకూ ఎదిగి గొప్పకార్యాలు చేస్తాడు.

దేవుని నమ్మిన విశ్వాసిలో ఎదుగుదల లేకుంటే, లోకాన్ని ఎదిరించే శక్తి లేకపోతే దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాల్సిన ఆలోచన లేకపోతే ఆ విశ్వాసంలో ఏదో లోపమున్నట్టే! నా దేవుడు గొప్పవాడంటూ మాటల మేడలు కడితే అందువల్ల దేవునికేమీ మహిమ లేదు. దేవుని గొప్పదనం విశ్వాసి చేతలు, విజయాల్లో కనిపిస్తే దానికిక తిరుగులేదు. సమస్యలు, అనర్హతల సుడిగుండాల్లో అంతా మునిగి అంతమవుతారు. కాని దేవుని తోడ్పాటున్న విశ్వాసులు మాత్రం ఈది వాటి నుండి బయటపడి గజ ఈతగాళ్లనిపించుకుంటారు. అందువల్ల కృంగిపోవద్దు. బాణంలా నింగిలోకి దూసుకెళ్లండి. అదే జయజీవితమంటే.
 - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement