వినే మనసు ఉంటే...
ఆత్మీయం
ఓ నిరక్షరాస్యుడు గీతా ప్రవచనం వింటున్నాడు. అతను ప్రవచనం వింటూ మధ్యలో కంట నీరు పెట్టుకుంటున్నాడు. ఇది చూసిన వారెవరో... ‘నీకేమి అర్థం అయింది? ఎందుకలా కన్నీరు కారుస్తున్నావ’ని అడిగారు. ‘అయ్యా! పొట్టపొడిస్తే అక్షరం ముక్క రానివాడిని. గీత గురించి పండితుల వారు ఏదేదో చెబుతున్నారు.
అందులో నాకు కృష్ణా కృష్ణా అనే శబ్దం తప్ప ఇంకేమీ అర్థం కావట్లేదు. పండితులవారు కృష్ణా అన్నప్పుడల్లా ఆ భగవానుడి రూపమే నా కళ్లముందు కనిపిస్తోంది. ఆయన దివ్యమోహన రూపాన్ని చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగటం లేద’ని బదులిచ్చాడట. దీనిని బట్టి అర్థం అవుతోంది... వినే మనసు ఉంటే చాలు భగవంతుడిని దర్శించడానికి... భక్తుడు తరించడానికీ... అని.