మంచిమాట
మాటకున్న మహత్తు ఇంతా అంతా కాదు. బయటి నుంచి తెచ్చుకోవాల్సిన పని లేని ఆయుధం. ప్రతి మనిషికి సహజంగా ఇవ్వబడినది. ఎవరికి వారికి తగిన రీతిలో ప్రత్యేకంగా తయారు చేసి ఇవ్వబడింది. మనిషి తనంత తానుగా చేయ వలసినది దానిని పదును పెట్టి, పాడవకుండా, తుప్పు పట్టకుండా చూసుకోవటం.
దానికి ముందుగా అందరూ అప్రయత్నంగా చేసేది పెద్దలని చూసి అనుకరించటం. తరువాత శిక్షణ తీసుకోవటం. ఈ శిక్షణ పాఠశాలలలో కాని, విడిగా శిక్షణాతరగతులలో కాని జరుగుతుంది.
ఇతర జీవులకి వేటికి లేని ప్రత్యేకత మానవుడికి మాత్రమే ఇవ్వ బడింది. అదే మనస్సు. దాని లక్షణం ఆలోచించటం. ఆపై తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవటం. దానికి సాధనం భాష. మానవులకి మాత్రమే ఇవ్వ బడిన భాష అనే విలువైన సాధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా!
అపార్థాలు కలగకుండా, అనర్థాలు వాటిల్లకుండా, సమర్థవంతంగా తన భావనలని వ్యక్తం చేయటానికి, దానికి సాధనమైన మాటని జాగ్రత్తగా ఉపయోగించాలి. మాటతో మనుషులు, కుటుంబాలు, సంస్థలు, దేశాలు కలుస్తాయి, విడిపోతాయి కూడా. మాట ప్రాణం పోస్తుంది, మాట ప్రాణం తీస్తుంది. వీటి అన్నిటికీ చరిత్రలో ఉదాహరణలు కోకొల్లలు. రామకథలో ప్రతి మలుపుకి ఒక మాట కారణమయింది. స్వతంత్ర భారత దేశం ముక్కలు కావటానికి ఒక మాట కారణం అంటారు ఆనాటి రాజనీతివేత్తలు.
కుటుంబ కలహాలకి చెప్పుడు మాటలే కారణం అని విన్నవాళ్ళకి కూడా తెలుసు. కాని, ఆ క్షణాన ఆ మాటలు ఇంపుగా అనిపిస్తాయి. దీనినే కైటభుడుగా పురాణాలు సంకేతించి చెప్పాయి. వినగా వినగా నిజమే నేమో అనిపిస్తుంది, క్రమంగా నిజమే అనిపిస్తుంది. చిన్నప్పుడు విన్న బ్రాహ్మణుడు – నల్లమేకకథ గుర్తు ఉంది కదా! (ప్రస్తుతం మన ప్రచార, ప్రసార సాధనాలు ఈ సిద్ధాంతాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాయి.) ఆంగ్లంలో ఒక సామెత ఉంది. ఒక కుక్కని చంపాలి అంటే ముందు అది పిచ్చిది అని ప్రచారం చేయాలి అని. మాటకి ఉన్న శక్తి అర్థమయింది కదా!
ఉచ్చారణ, వ్యాకరణం, వాక్యనిర్మాణం, కాకువు, ముఖకవళికలు, ముఖ్యంగా కళ్ళు, కనుబొమల కదలికలు, శరీర భంగిమ, కాళ్ళు చేతుల కదలికలు మొదలైనవి అన్నీ మాటలతో పాటు భావ ప్రకటనకి సహకరిస్తాయి. ఉచ్చారణ స్పష్టంగా లేక పోతే ‘కళ్ళు’ తెరవటం ‘కల్లు’ తెరవటం అవుతుంది. ‘శకలం’ (ముక్క) ‘సకలం’ (సమస్తం) అవుతుంది. ‘శంకరుడు’కాస్తా ‘సంకరుడు’ అయిపోతాడు. తేడా తెలుస్తోంది కదా!
వ్యాకరణం తెలియక ఎంతో సదుద్దేశంతో ‘‘సుపుత్రాప్రాప్తిరస్తు’’ అని దీవిస్తూ ఉంటారు. అంటే సుపుత్ర అప్రాప్తి అవుతుంది. ‘‘సుపుత్ర ప్రాప్తిరస్తు’’ అనాలి. అందరికీ వాక్సిద్ది లేకపోవటం అదృష్టం.
జాగ్రత్తగా ఉచ్ఛరించిన మాటలకి సరైన కంఠస్వరం తోడు ఉంటే వినాలని అనిపిస్తుంది. చెవితో వింటే కదా! ఆచరించాలని అనిపించేది. ఎన్నో సందర్భాలలో ఆర్థికంగా గాని, శారీరికంగా గాని సహాయం చేయలేక పోయినా మాటసహాయం చేసి సమస్యలని పరిష్కరించటం చూస్తాం. ఇంత శక్తిమంతమైన ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరికి వారు ఉద్ధరించ బడుతూ పదిమందికి సహాయం చేయవచ్చు.
శక్తిమంతమైన మాటని చక్కగా ఉపయోగించుకోటానికి కొన్ని లక్షణాలని పెంపొందించుకోవాలి. అవి – సత్యం, హితం, మితం, ప్రియం, స్మితం, మధురం, ప్రథమం. ఏ ఒక్క లక్షణం ఉన్నా గొప్పే. అన్నీ ఉండటం సామాన్య మానవుల విషయంలో చాలా కష్టం. హితమైనది ప్రియంగా ఉండదు. సత్యం మధురంగా ఉండక పోవచ్చు. నిజం నిష్ఠురంగా ఉంటుంది కదా! ‘‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్య మప్రియం, ప్రియం చ నానృతంబ్రూయాత్, ఏష ధర్మ స్సనాతనః’’.
ఈ ఆరు లక్షణాలతో ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి అంటే సహజ స్వభావానికి మెఱుగు పెట్టే శిక్షణ అవసరం.
– డా.ఎన్.అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment