
భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) రూ.10,000 కోట్ల విలువైన రాకెట్లు, మందుగుండు సామగ్రి కోసం అతిపెద్ద దేశీయ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా పినాకా రాకెట్లు, ఏరియా డిస్ట్రక్షన్ మందుగుండు సామగ్రి కొనుగోలు చేయనున్నారు. వీటిని మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్), ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ (ఈఈఎల్) ఉత్పత్తి చేస్తాయి.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన పినాకా రాకెట్లు భారత సైన్యానికి లాంగ్ రేంజ్ ఆర్టిలరీ వ్యవస్థను అందిస్తాయి. ఇవి 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఇవి సైన్యం వ్యూహాత్మక కార్యకలాపాలకు కీలకమైన వనరుగా మారాయి. ఈ ఒప్పందంలోని మరో కీలక అంశం ఏరియా డేనియల్ మ్యునిషన్స్(ఏడీఎం). ఎక్కువ విస్తీర్ణంలో వందలాది బాంబులను ఏర్పాటు చేయడం ద్వారా నిర్దిష్ట ప్రాంతాల్లో శత్రు దళాలు ప్రవేశించకుండా కట్టడి చేయవచ్చు. అందుకోసం మందుగుండు సామగ్రి అవసరం అవుతుంది. ఈ ఒప్పందాన్ని డీఆర్‌డీఓ, ఎంఐఎల్, ఈఈఎల్‌కు వాటి వాటా ఆధారంగా విభజిస్తారు. మందుగుండు సామగ్రికి సంబంధించి ఈఈఎల్ కాంట్రాక్ట్ విలువలో 60% అందుకుంటుంది. మిగిలిన 40% ఎంఐఎల్‌కు అందుతుంది. ఈ సహకారం రక్షణ తయారీ రంగంలో స్వావలంబనను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదీ చదవండి: ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడుల జోరు
ఈ ఒప్పందానికి సీసీఎస్ ఆమోదం లభించడంతో రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తుంది. సైన్యం ఇప్పటికే 10 పినాకా రెజిమెంట్లను కలిగి ఉంది. భవిష్యత్తులో మరిన్ని రాకెట్లు తోడవుతుండడం సైన్యం వ్యూహాత్మక పరిధిని మరింత పెంచుతుంది. ఈ నిర్ణయం రక్షణ తయారీ రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల టర్నోవర్ సాధించాలనే దేశ లక్ష్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment