శత్రువు ఆయుధాలతో మన ఎదురుగా ఉంటే మనం గెలవొచ్చు. కాని ఆ శత్రువే విషంగా మారి మన రక్తంలో కలిస్తే, చనిపోవడమొక్కటే మనకున్న మార్గం. ఇశ్రాయేలీయులకు, ఫిలిష్తీయులనే శత్రువులు అలాంటి వారే. ఇశ్రాయేలీయులు కనాను దేశంలో ఎదుర్కోవలసిన ఏడు శత్రుజనాంగాల జాబితాలో నిజానికి ఫిలిష్తీయులు లేరు (యెహోషువా 3:11). కాని న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులను ఏలిన 300 ఏళ్లలో ఫిలిష్తీయులు గ్రీసు దేశం నుండి ఐగుప్తుకు, అక్కడినుండి వెళ్లగొట్టితే వచ్చి ఇశ్రాయేలీయులుంటున్న కనాను దేశపు దక్షిణప్రాంతాల్లో శరణార్థులుగా నివసించారు. ఎందుకంటే ఇనుప పనిముట్లను, ఆయుధాలను, ఇనుప రథాలను చెయ్యడంలో ఫిలిష్తీయులది అందె వేసిన చెయ్యి. అందువల్ల ఫిలిష్తీయులను తమ మధ్య నివసించడానికి అనుమతించడంలో ఇశ్రాయేలీయులకు ప్రయోజనం కనిపించింది.
కనానులోని శత్రువులను సంహరించి, ఓడించిన దేవుని ప్రజలు ఇలా కొత్త శత్రువులొచ్చి తమ మధ్య దూరకుండా అడ్డుకోలేక పోయారు. ఇశ్రాయేలీయులు చాలా కాలం ఫిలిష్తీయులను తమ పొరుగువారుగా, ఇనుప పనిముట్లు చేసిపెట్టే పనివారుగానే పరిగణించారు. పైగా ఫిలిష్తీయుల పురుషులు బలవంతులైతే, వాళ్ళ స్త్రీలు చాలా అందమైనవారు కావడంతో, ఇశ్రాయేలు యువకులు అక్కడి నుండి స్త్రీలను తెచ్చుకొని పెళ్లిచేసుకోవడం కూడా మామూలయింది. కనానుదేశంలో అన్యజనాంగాలతో సాంగత్యం చేయవద్దంటూ దేవుడిచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించి ఇశ్రాయేలీయులు చేసిన ఈ దుష్కార్యానికి పర్యవసానంగా ఫిలిష్తీయులే ఒక దశలో ఇశ్రాయేలీయులను ఏలడం ఆరంభించి 70 ఏళ్లపాటు వారిని కఠినంగా పాలించారు.
ఫిలిస్తీయుల నుండి ఇశ్రాయేలీయులను కాపాడేందుకు దేవుడు సమ్సోను అనే న్యాయాధిపతిని అపుడు ఎన్నుకున్నాడు. అంతదాకా పిల్లలు లేని మనోహా అనే ఇశ్రాయేలీయుని భార్యతో దేవుడు మాట్లాడి, ఆమెకు తానొక కొడుకునివ్వబోతున్నానని, అతడు చాలా బలవంతుడవుతాడని, అయితే అతన్ని దేవునికి ‘ప్రతిష్ఠితుడుగా’ ప్రత్యేకించి పెంచాలని, ఇశ్రాయేలీయులను అతను ఫిలిష్తీయుల నుండి రక్షిస్తాడని ఆమెను తెలిపాడు. అలా మొదలయ్యింది ఎంతో బలవంతుడుగా పేరొందిన సమ్సోను కథ. అప్పటికే ఇశ్రాయేలీయుల జీవనశైలిలో ఫిలిష్తీయుల సంప్రదాయాలు చాలా కలిసిపోయాయి. ఫిలిష్తీయుల నుండి దేవుని ప్రజల్ని రక్షించడానికి ప్రత్యేకంగా తమకు పుట్టిన బాలునికి అతని తల్లిదండ్రులు ‘సమ్సోను’ అనే ఫిలిష్తీయుల పేరు పెట్టడమే దానికి రుజువు.
సమ్సోనును ఎంతో బలవంతుడుగా దేవుడు పుట్టిస్తే స్త్రీలను మోహించి తన బలాన్నంతా వారికే ధారపోసే దుర్బలుడయ్యాడు సమ్సోను. పైగా తల్లిదండ్రుల నియంత్రణ కూడా అతని మీద లేదు. చివరికి దెలీలా అనే ఫిలిష్తీ స్త్రీని మోహించి ఆమెతో సహవసించి, అలా ఫిలిష్తీయులకు బందీగా చిక్కి, వాళ్ళు అతని కళ్ళు కూడా పెరికివేసేంత బలహీనుడయ్యాడు. కాకపోతే అంధుడై కూడా దేవుని సహాయంతో ఒక గుడి స్తంభాలు పడగొట్టడం ద్వారా వారి దేవాలయాన్ని కూల్చి వేలాదిమంది ఫిలిష్తీయులను ఒక్కసారిగా హతమార్చి సమ్సోను తన పగ తీర్చుకున్నాడు. దేవుని కోసం, దేవుని ప్రజల కోసం ఎన్నో గొప్పకార్యాలు చేయడానికి పుట్టిన సమ్సోను అలా కేవలం తన పగ మాత్రం తీర్చుకొని చనిపోయాడు.
దేవుడిచ్చిన బలం తన సొంతమని అతను నమ్మడం, అతని తల్లిదండ్రులు కూడా అతన్ని సరిగ్గా నడిపించలేక పోవడమే అతని సమస్య అయ్యింది. శత్రువును గెలిచేవాడు బలవంతుడైతే, స్వీయనిగ్రహంతో తనను తాను గెలిచేవాడు మహా యోధుడని సమ్సోను తెలుసుకోలేకపోయాడు. అత్యున్నతంగా కనిపించే పర్వతాల అసమానశక్తి రహస్యం, అదృశ్యంగా భూమి లోపల ఉండే వాటి పునాదుల్లో ఉంటుందన్న రహస్యం తమను తాము నిగ్రహించుకునేవారికి, తగ్గించుకునేవారికే తెలుస్తుంది. ఎంతో బలమున్న సమ్సోను నిర్వీర్యం కావడానికి అతని హృదయంలోని అపరిశుద్ధతే కారణమైంది.
– రెవ.డా. టి.ఎ. ప్రభుకిరణ్
Comments
Please login to add a commentAdd a comment