మృకండు మహర్షి భృగు సంతతికి చెందినవాడు. ఆయన భార్య మరుద్వతి. ఎన్నాళ్లయినా వాళ్లకు సంతానం కలగలేదు. సంతానం కోసం దంపతులిద్దరూ తీర్థయాత్రలు చేయసాగారు.కేదారక్షేత్రం దర్శించుకున్నప్పుడు ‘మీకు పుత్రభాగ్యం కలుగుతుంది’ అని అశరీరవాణి వినిపించింది. మృకండుడు, మరుద్వతి తీర్థయాత్రలు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. కొన్నాళ్లకు మరుద్వతికి పండంటి మగశిశువు కలిగాడు. మృకండు దంపతుల పుత్రోత్సాహానికి భంగం కలిగిస్తూ, ‘ఈ బాలుడు అల్పాయుష్కుడు. పన్నెండేళ్లు మాత్రమే ఇతడి ఆయుష్షు’ అశరీరవాణి వినిపించింది. ఈ మాటలకు వారు దుఃఖించినా, అంతా పరమశివుని లీల అని సరిపెట్టుకున్నారు.
పుత్రుడికి శాస్త్రోక్తంగా జాతకర్మ జరిపించి, మార్కండేయుడు అని నామకరణం చేశారు. దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న మార్కండేయుడికి మృకండు మహర్షి ఉపనయనం చేసి, గురుకులానికి పంపాడు. పదకొండేళ్ల వయసు వచ్చేసరికి మార్కండేయుడు అన్ని విద్యలూ నేర్చుకున్నాడు. తిరిగి తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. బ్రహ్మతేజస్సుతో గురుకులవాసం నుంచి తిరిగి వచ్చిన మార్కండేయుణ్ణి చూసి మృకండుడు సంతోషించాడు. మరుద్వతి కొడుకును అక్కున చేర్చుకుని మురిసిపోయింది. అతడికి పదకొండేళ్లు నిండాయని ఇంకొక్క ఏడాదే గడువు ఉందనే సంగతి గుర్తుకొచ్చి ఆ దంపతులకు గుండెతరుక్కుపోయింది.
మృకండుడు గుండెచిక్కబట్టుకున్నా, మరుద్వతి కొడుకును పట్టుకుని వలవలా కన్నీరు కార్చసాగింది. ఈ దుఃఖానికి కారణమేమిటని తరచి తరచి అడిగినా మరుద్వతి బదులివ్వలేదు సరికదా, బిగ్గరగా రోదించసాగింది.చివరకు మృకండుడే చెప్పలేక చెప్పలేక అసలు సంగతిని కొడుకుతో చెప్పాడు.‘నాయనా! నీ ఆయువు ఇంకొక్క ఏడాది మాత్రమే ఉంది’ అన్నాడతడు. తండ్రి మాటకు మార్కండేయుడు ఏమాత్రం తొణకలేదు. ‘తండ్రీ! అన్నింటికీ ఆ పరమశివుడే రక్ష. నేను ఆయన గురించి తపస్సు చేస్తాను. మృత్యుంజయుడినై తిరిగి వస్తాను. ఆశీర్వదించండి’ అంటూ తల్లిదండ్రుల దీవెనలు పొందాడు.
మార్కండేయుడు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, అక్కడకు నారదుడు వచ్చాడు. మార్కండేయుని సంకల్పం తెలుసుకుని, ప్రశంసించాడు. ‘నాయనా! ఇక్కడి నుంచి గౌతమీ తీరానికి వెళ్లు. పంచాక్షరీ జపంతో శివుడిని అర్చించు. నీ సంకల్పం నెరవేరుతుంది’ అని ఆశీర్వదించాడు. మార్కండేయుడు గౌతమీ తీరానికి వెళ్లి, అక్కడొక సైకతలింగాన్ని ప్రతిష్ఠించి, శివుడి కోసం తపస్సు చేయసాగాడు. లోకసంచారం చేస్తూ, నారదుడు యముడి దగ్గరకు వెళ్లాడు. ‘మృత్యువును జయించడానికి మార్కండేయుడనే మునిబాలకుడు శివుడి కోసం తపస్సు చేస్తున్నాడు. నీ బలాబలాలేమిటో తేలే సమయం వచ్చింది’ అని చెప్పి చల్లగా జారుకున్నాడు. మార్కండేయుడికి మృత్యుఘడియ రానేవచ్చింది. అతడి ప్రాణాలను తోడితెమ్మని యముడు తన దూతలను పంపాడు. శివలింగం నుంచి వెలువడే తేజస్సుకు కళ్లుచెదిరి అతణ్ణి సమీపించలేకపోయారు. చేసేదేమీ లేక వెనుదిరిగి, యముడికి జరిగినదంతా చెప్పారు.
ఇక యముడే స్వయంగా మహిషాన్ని అధిరోహించి బయలుదేరాడు. సైకతలింగాన్ని గట్టిగా వాటేసుకుని, దానిపైనే తల ఆన్చి నిద్రిస్తున్న మార్కండేయుణ్ణి చూశాడు. అతడి ప్రాణాలు తీయడానికి తన కాలపాశాన్ని మార్కండేయుడి కంఠం మీదకు విసిరాడు.అంతే! హుంకారం చేస్తూ, శివలింగం నుంచి సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. మార్కండేయుడి మీదకు పాశాన్ని విసిరిన యముడి మీదకు తన త్రిశూలాన్ని ఎక్కుపెట్టాడు. రౌద్రాకారంలో కనిపించిన శివుడిని చూసి యముడు గజగజలాడాడు. ‘హర హరా! రక్షించు’ అంటూ మోకరిల్లాడు. శివుడు యముణ్ణి క్షమించి, విడిచిపెట్టాడు. మార్కండేయుని తలపై నిమిరి లేవదీశాడు. ‘వత్సా! నీకిక మృత్యుభయం లేదు. కల్పకల్పాంతరాల వరకు చిరంజీవిగా ఉంటావు’ అని వరమిచ్చాడు. శివానుగ్రహంతో చిరంజీవి అయిన మార్కండేయుడు కళకళలాడుతూ తల్లిదండ్రులను చేరుకున్నాడు.
-సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment