ప్రముఖ తబలా విద్వాంసుడు, సంగీత స్వరకర్త జాకీర్ హుస్సేన్(73) కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తన ఏడేళ్ల వయసులోనే జాకీర్ హుస్సేన్ తబలా వాయించడంలో ప్రావీణ్యం సంపాదించారు. అభిమానులు, శ్రేయోభిలాషులకు జాకీర్ హుస్సేన్ వృత్తిపరమైన విజయాల గురించి తెలుసుకానీ, అతని వ్యక్తిగత వివరాలు అంతగా తెలియదు. జాకీర్ హుస్సేన్ ప్రేమకథ సినిమా స్టోరీని తలపిస్తుంది.
జాకీర్ హుస్సేన్ కథక్ నర్తకి ఆంటోనియా మిన్నెకోలాను వివాహం చేసుకున్నారు. ఆమె అతనికి మేనేజర్‌గా వ్యవహరించారు. జాకీర్ హుస్సేన్, ఆంటోనియా మిన్నెకోలాలకు 1978లో వివాహం జరిగింది. వీరికి అనిసా ఖురేషి, ఇసాబెల్లా ఖురేషి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. జాకీర్ హుస్సేన్, ఆంటోనియాలు తొలిసారిగా 70వ దశకం చివరలో కాలిఫోర్నియాలోని బే ఏరియాలో తబలా, కథక్‌లలో శిక్షణ తీసుకుంటున్నప్పుడు కలుసుకున్నారు.
జాకీర్ మొదటి చూపులోనే ఆంటోనియాను ఇష్టపడ్డారు. క్రమంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. కానీ ఆంటోనియా మిన్నెకోలా.. జాకీర్ హుస్సేన్‌ను ప్రేమించే విషయంలో వెనుకాడారు. అయితే జాకీర్ ఆమె కోసం ప్రతిరోజూ తరగతి గది బయట వేచి ఉండేవాడు. జాకీర్, ఆంటోనియాలు ఎనిమిదేళ్లు స్నేహం కొనసాగించిన అనంతర వివాహం చేసుకున్నారు. దీనికి ముందు కొంతకాలంపాటు డేటింగ్ చేశారు. ఈ విషయంలో ఇరుకుటుంబాల వారికి తెలుసు.
ఆ సమయంలో జాకీర్‌కు సరైన ఆదాయం లేకపోవడంతో ఆంటోనియా తండ్రి ఈ వివాహానికి అభ్యంతరం తెలిపారు. ఇదిలా కొనసాగుతుండగానే జాకీర్, ఆంటోనియాలు 1979లో పెళ్లి చేసుకున్నారు. జాకీర్ ఒక ఇంటర్య్యూలో తాను తన కుటుంబంలోనివారికి భిన్నంగా మతాంతర వివాహంచేసుకున్నానని తెలిపారు. ఆంటోనియాను తాను వివాహం చేసుకుంటానంటే తన తల్లి అందుకు నిరాకరించారని, అయితే తన తండ్రి తమ రహస్య వివాహానికి సహకరించారని జాకీర్ వివరించారు. తరువాతి కాలంలో తన తల్లి ఆంటోనియాను కోడలిగా అంగీకరించారని తెలిపారు.
జాకీర్ హుస్సేన్, ఆంటోనియా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఆంటోనియా అమెరికాలో ఉంటూ తమ కుమార్తెలను చూసుకుంటున్నారని గతంలో జాకీర్ తెలిపారు. జాకీర్ కెరియర్ కోసం, ఆయనకు అన్ని విషయాల్లో సహాయం అందించేందుకు ఆంటోనియా తన కెరియర్‌ను వదులుకున్నారు. జాకీర్ విదేశాలకు వెళ్లేటప్పుడు భావోద్వేగాలకు లోనయ్యేవారని ఆంటోనియా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. భార్యాభర్తలుగా తామిద్దరం ఒకరి ఆచార వ్యవహారాలను, కుటుంబ విలువలను పరస్పరం గౌరవించుకుంటూ మెలుగుతున్నామని, తమ పిల్లలకు కూడా సదాచార లక్షణాలు నేర్పించామని ఆంటోనియా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎప్పటికీ గుర్తుండే 10 రాజకీయ ఘటనలు
Comments
Please login to add a commentAdd a comment