Markandeya
-
మరణాన్ని జయించిన మార్కండేయుడు..శివానుగ్రహంతో చిరంజీవిగా
మృకండు మహర్షి భృగు సంతతికి చెందినవాడు. ఆయన భార్య మరుద్వతి. ఎన్నాళ్లయినా వాళ్లకు సంతానం కలగలేదు. సంతానం కోసం దంపతులిద్దరూ తీర్థయాత్రలు చేయసాగారు.కేదారక్షేత్రం దర్శించుకున్నప్పుడు ‘మీకు పుత్రభాగ్యం కలుగుతుంది’ అని అశరీరవాణి వినిపించింది. మృకండుడు, మరుద్వతి తీర్థయాత్రలు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. కొన్నాళ్లకు మరుద్వతికి పండంటి మగశిశువు కలిగాడు. మృకండు దంపతుల పుత్రోత్సాహానికి భంగం కలిగిస్తూ, ‘ఈ బాలుడు అల్పాయుష్కుడు. పన్నెండేళ్లు మాత్రమే ఇతడి ఆయుష్షు’ అశరీరవాణి వినిపించింది. ఈ మాటలకు వారు దుఃఖించినా, అంతా పరమశివుని లీల అని సరిపెట్టుకున్నారు. పుత్రుడికి శాస్త్రోక్తంగా జాతకర్మ జరిపించి, మార్కండేయుడు అని నామకరణం చేశారు. దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న మార్కండేయుడికి మృకండు మహర్షి ఉపనయనం చేసి, గురుకులానికి పంపాడు. పదకొండేళ్ల వయసు వచ్చేసరికి మార్కండేయుడు అన్ని విద్యలూ నేర్చుకున్నాడు. తిరిగి తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. బ్రహ్మతేజస్సుతో గురుకులవాసం నుంచి తిరిగి వచ్చిన మార్కండేయుణ్ణి చూసి మృకండుడు సంతోషించాడు. మరుద్వతి కొడుకును అక్కున చేర్చుకుని మురిసిపోయింది. అతడికి పదకొండేళ్లు నిండాయని ఇంకొక్క ఏడాదే గడువు ఉందనే సంగతి గుర్తుకొచ్చి ఆ దంపతులకు గుండెతరుక్కుపోయింది. మృకండుడు గుండెచిక్కబట్టుకున్నా, మరుద్వతి కొడుకును పట్టుకుని వలవలా కన్నీరు కార్చసాగింది. ఈ దుఃఖానికి కారణమేమిటని తరచి తరచి అడిగినా మరుద్వతి బదులివ్వలేదు సరికదా, బిగ్గరగా రోదించసాగింది.చివరకు మృకండుడే చెప్పలేక చెప్పలేక అసలు సంగతిని కొడుకుతో చెప్పాడు.‘నాయనా! నీ ఆయువు ఇంకొక్క ఏడాది మాత్రమే ఉంది’ అన్నాడతడు. తండ్రి మాటకు మార్కండేయుడు ఏమాత్రం తొణకలేదు. ‘తండ్రీ! అన్నింటికీ ఆ పరమశివుడే రక్ష. నేను ఆయన గురించి తపస్సు చేస్తాను. మృత్యుంజయుడినై తిరిగి వస్తాను. ఆశీర్వదించండి’ అంటూ తల్లిదండ్రుల దీవెనలు పొందాడు. మార్కండేయుడు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, అక్కడకు నారదుడు వచ్చాడు. మార్కండేయుని సంకల్పం తెలుసుకుని, ప్రశంసించాడు. ‘నాయనా! ఇక్కడి నుంచి గౌతమీ తీరానికి వెళ్లు. పంచాక్షరీ జపంతో శివుడిని అర్చించు. నీ సంకల్పం నెరవేరుతుంది’ అని ఆశీర్వదించాడు. మార్కండేయుడు గౌతమీ తీరానికి వెళ్లి, అక్కడొక సైకతలింగాన్ని ప్రతిష్ఠించి, శివుడి కోసం తపస్సు చేయసాగాడు. లోకసంచారం చేస్తూ, నారదుడు యముడి దగ్గరకు వెళ్లాడు. ‘మృత్యువును జయించడానికి మార్కండేయుడనే మునిబాలకుడు శివుడి కోసం తపస్సు చేస్తున్నాడు. నీ బలాబలాలేమిటో తేలే సమయం వచ్చింది’ అని చెప్పి చల్లగా జారుకున్నాడు. మార్కండేయుడికి మృత్యుఘడియ రానేవచ్చింది. అతడి ప్రాణాలను తోడితెమ్మని యముడు తన దూతలను పంపాడు. శివలింగం నుంచి వెలువడే తేజస్సుకు కళ్లుచెదిరి అతణ్ణి సమీపించలేకపోయారు. చేసేదేమీ లేక వెనుదిరిగి, యముడికి జరిగినదంతా చెప్పారు. ఇక యముడే స్వయంగా మహిషాన్ని అధిరోహించి బయలుదేరాడు. సైకతలింగాన్ని గట్టిగా వాటేసుకుని, దానిపైనే తల ఆన్చి నిద్రిస్తున్న మార్కండేయుణ్ణి చూశాడు. అతడి ప్రాణాలు తీయడానికి తన కాలపాశాన్ని మార్కండేయుడి కంఠం మీదకు విసిరాడు.అంతే! హుంకారం చేస్తూ, శివలింగం నుంచి సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. మార్కండేయుడి మీదకు పాశాన్ని విసిరిన యముడి మీదకు తన త్రిశూలాన్ని ఎక్కుపెట్టాడు. రౌద్రాకారంలో కనిపించిన శివుడిని చూసి యముడు గజగజలాడాడు. ‘హర హరా! రక్షించు’ అంటూ మోకరిల్లాడు. శివుడు యముణ్ణి క్షమించి, విడిచిపెట్టాడు. మార్కండేయుని తలపై నిమిరి లేవదీశాడు. ‘వత్సా! నీకిక మృత్యుభయం లేదు. కల్పకల్పాంతరాల వరకు చిరంజీవిగా ఉంటావు’ అని వరమిచ్చాడు. శివానుగ్రహంతో చిరంజీవి అయిన మార్కండేయుడు కళకళలాడుతూ తల్లిదండ్రులను చేరుకున్నాడు. -సాంఖ్యాయన -
ఢిల్లీ చేరనున్న ‘డ్యాం’ పంచాయితీ..!
సాక్షి, చెన్నై: కావేరి తీరంలోని మేఘదాతు వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మాణ తలపెట్టిన డ్యాం వ్యవహారం ఢిల్లీకి చేరనుంది. అనుమతులు ఇవ్వొద్దని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి దురై మురుగన్ ఢిల్లీ ప్రయాణానికి సిద్ధమయ్యారు. డ్యాం నిర్మాణ ప్రయత్నాలను వీడాలని కర్ణాటక సీఎం యడ్యూరప్పకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదివారం లేఖ రాశారు. డ్యాం నిర్మాణానికి అడ్డుచొప్పొద్దని కోరుతూ సీఎం స్టాలిన్‌కు కర్ణాటక సీఎం యడ్యూరప్ప శనివారం లేఖ రాసిన విషయం తెలిసిందే. డ్యాం వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ పాలకులు కర్ణాటకలోని తమ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించబోతున్న సంకేతాలతో ఆదిలోనే అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ను కలిసి డ్యాం నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వ కూడదని ఒత్తిడి తెచ్చేందుకు నీటి పారుదల శాఖ మంత్రి దురై మురుగన్ నేతృత్వంలోని బృందం సోమవారం ఢిల్లీకి వెళ్లనుంది. మంగళవారం ఈ బృందం కేంద్ర మంత్రితో భేటీ కానుంది. కావేరి జల వివాదం, డ్యాం నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని పట్టుబట్టడమే కాకుండా, మార్కండేయ నదిలో కర్ణాటక నిర్మించిన ఆనకట్ట తదితర అంశాల గురించి చర్చించనున్నారు. అలాగే సీఎం స్టాలిన్ తరఫున కేంద్ర మంత్రికి లేఖ సమరి్పంచనున్నారు. యడ్డీకి లేఖాస్త్రం తనకు యడ్యూరప్ప రాసిన లేఖకు సమాధానంగా సీఎం స్టాలిన్ ఆదివారం లేఖాస్త్రం సంధించారు. అందులో కావేరి జల వివాదం, కోర్టు తీర్పు, నీటి పంపిణీ తదితర అంశాలను ప్రస్తావించారు. అలాగే తమిళనాడులో సాగుతున్న కావేరి పథకాలను గుర్తు చేస్తూ, ఈ పథకాల కారణంగా తమ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. అయితే కర్ణాటకలోని మేఘదాతులో నిర్మించతలపెట్టిన డ్యాం కారణంగా తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్ప మేరకు సరిహద్దులోకి నీళ్లు సక్రమంగా వచ్చి చేరాల్సి ఉందన్నారు. తమిళ రైతులకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేయ వద్దని కోరారు. బెంగళూరుకు నీటి అవసరాల పేరిట ఈ డ్యాం నిర్మాణాలు సాగడం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ, రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల మెరుగు, కొనసాగింపు లక్ష్యంగా ఈ డ్యాం నిర్మాణ ప్రయత్నాన్ని వీడాలని కోరారు. ఇదిలా ఉండగా మార్కండేయ నదిపై ఆనకట్ట నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కృష్ణగిరిలో రైతులు నిరసన తెలపనున్నారు. -
భక్తి ప్రపంచానికి బాలకులే పాలకులు
బాల్యంలోనే భక్తికి భాష్యం చెప్పిన మహనీయులు ఎందరో ఉన్నారు. బాలల దినోత్సవం నాడు అటువంటి బాలురను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. మన పిల్లలకు వారి చరిత్రలను చెప్పాలి. వారిలో ఉత్తేజాన్ని కలిగించాలి. రాబోయే కాలంలో మంచి సమాజం ఏర్పడేందుకు అనుగుణంగా ఈనాడే మన బాలల మనస్సులను మనమే సభక్తికంగా తీర్చిదిద్దాలి. మొక్కై వంగనిది మానై వంగునా! అన్నది అనాదిగా వస్తున్న పెద్దలమాట. ఆ మాటను ముఖ్యంగా క్రమశిక్షణ విషయంలో ఉపయోగిస్తారు. ఎవరికి దైవం మీద భక్తి ఉంటుందో వారికి పాపభీతి ఉంటుంది. పాపభీతి ఉన్నవాడు తప్పుడు పనులు చేయడానికి సాహసింపడు. తప్పు చేయకపోవడమే క్రమశిక్షణ. ఆ లక్షణం చిన్నప్పటి నుండీ అభ్యాసంలో ఉండాలి. ప్రహ్లాదుడు పురాణ చరిత్రలోకి వెడితే ముక్కుపచ్చలారని కొందరు బాలకులు అసాధారణ భక్తిభావంతో పెద్దలకు కనువిప్పు కలిగించినవారు, భగవంతుని ప్రత్యక్షం చేసికొని ప్రపంచాన్ని విస్మయపరచినవారు కనిపిస్తారు. వారి పేర్లు లోకంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. అలాంటివారిలో ప్రథమగణ్యుడు ప్రహ్లాదుడు. అతనిని బాలభక్తుడని అనడానికి కూడా వీలు కాదు. శిశుభక్తుడు. ఇంకా చెప్పాలంటే ఆగర్భభక్తుడు. కడుపులో ఉన్నప్పుడే ఇంద్రుడు అతని తల్లిని బంధించి తీసుకుపోతుంటే నారదుడు వారించి, వెనుకకు తీసికొనివచ్చి, గర్భస్థ శిశువునకు నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. నాటి నుండి, అంటే ఇంకా భూమి మీద పడకుండగానే నారాయణ భక్తిలో మునిగిపోయాడు ప్రహ్లాదుడు. వాని తండ్రి హిరణ్యకశిపుని నిరంకుశత్వానికి శిరసు వంచి, ప్రపంచమంతా ఆ రాజునే దేవునిగా భావిస్తుంటే, పాలబుగ్గల ప్రహ్లాదుడు మాత్రం తండ్రిని ఎదిరించి, మనందరికీ అధినాథుడైన నారాయణుడే దైవమని నొక్కి వక్కాణించాడు. తనకే ఎదురు చెప్పిన ప్రహ్లాదుణ్ణి, కొడుకు అని కూడా చూడకుండా ఏనుగులతో తొక్కించాడు, గదలతో మోదించాడు, పాములతో కరిపించాడు, విషాన్ని తాగించాడు, మంటలోకి తోయించాడు, కొండలపై నుంచి లోయలలోనికి గెంటించాడు, సముద్రంలో పడవేయించాడు. ఎన్ని చేసినా కేవలం నారాయణ నామస్మరణంతో బ్రతికి వచ్చిన కుమారుని చూచి విసిగి చివరకు నీ నారాయణుడు ఎక్కడున్నాడో చెప్పమంటాడు. ‘‘ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన నందందే గలడు దానవాగ్రణి వింటే’’ అన్నాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో చూపించమన్నాడు తండ్రి. చూడమన్నాడు కుమారుడు. వెంటనే తన చెంతనున్న బలమైన గదతో ఆ స్తంభాన్ని బద్దలుకొడితే అందులో నుండి శ్రీహరి నరసింహరూపంలో బయటకు వచ్చి లోకకంటకుడైన హిరణ్యకశిపుని వధించి, ప్రహ్లాదుని రక్షించాడు. కన్నతండ్రే పిల్లలకు చెడును నూరిపోస్తుంటే, తన కళ్ళ ఎదుటే అధర్మాన్ని ఆచరిస్తుంటే, ఆచరించమని ప్రోత్సహిస్తుంటే అటువంటి తండ్రిని ఎదిరించడమే ధర్మమని లోకానికి తెలియజేసిన మొదటివ్యక్తి, అప్పటికి కేవలం ఐదేళ్ళ వయసున్న బాలుడు ప్రహ్లాదుడు. ధ్రువుడు ధ్రువుడనే బాలకుడు రాజకుమారుడు. సవతి తల్లి పెత్తనం ముందు తన తల్లిమాట నెగ్గక, తండ్రి ప్రేమకు నోచుకోలేక పోయాడు. కనీసం సవతి తమ్మునితో బాటుగా నాన్న ఒడిలో కూర్చోడానికి కూడా ఆ సవతి తల్లి ఒప్పుకోలేదు. నొచ్చుకున్నాడు. తన తల్లి దగ్గర తన బాధను చెప్పుకొన్నాడు. ఆమె ఓదారుస్తూ నాన్నగారి ఒడిలో కూర్చోవాలని ఎందుకు కోరుకుంటున్నావు. భక్తితో శ్రీహరిని సేవించు. ఆయన ఒడిలోనే కూర్చోవచ్చు అని మాటవరుసకు అంది. అంతే! మనసులో ఏదో ప్రేరణ కలిగింది. వెంటనే ఇల్లు, వాకిలి విడిచిపెట్టి అడవికి పోయి. నారయణుని కోసం తీవ్రమైన తపస్సు చేసి, చివరకు ఆ స్వామిని ప్రత్యక్షం చేసికొన్నాడు. ఏం కావాలని అడిగాడు. అప్పుడు ధ్రువుడు, భోగభాగ్యాలను కోరుకోకుండా మోక్షాన్ని ప్రసాదించమని కోరితే నారాయణుడే ఆశ్చర్యపోయాడు. అప్పుడే కాదు, పెద్దవాడివై, రాజ్యాన్ని ప్రజానురంజకంగా పాలించి, ఎన్నో పుణ్యకార్యాలు చేసి, ఆ తరువాత నక్షత్రంగా మారి లోకానికి వెలుగిస్తావని వరమిచ్చాడు శ్రీహరి. అంతే! జన్మాంతమందు అలాగే ధ్రువనక్షత్రంగా మారి ఈనాటికీ అందరి నమస్కారాలు అందుకొంటున్నాడు ఆనాటి పసిబాలుడు ధ్రువుడు. మార్కండేయుడు సంతానం కోసం తపస్సు చేసిన మృకండు మహర్షికి శివుడు ప్రత్యక్షమై అల్పాయువైన గుణవంతుడు కావాలా? దీర్ఘాయువైన మూర్ఖుడు కావాలా? అని అడిగితే అల్పాయువైనా గుణవంతుడే కావాలని అర్థించాడు. అలా జన్మించినవాడు మార్కండేయుడు. ఎలాగూ ఎంతోకాలం బతకనివాడికి నామకరణం కూడానా అని మానుకొన్నాడు తండ్రి. మృకండుని కుమారుడు కనుక మార్కండేయుడని లోకం పిలువసాగింది. చివరకు అదే వాని శాశ్వతనామధేయం అయిపోయింది. చిన్ననాటినుండీ శివారాధనలో మునిగిపోయాడా బాలుడు. శివధ్యానం, శివనామస్మరణ తప్ప వేరే ప్రపంచం లేనట్లుగా ప్రవర్తిస్తున్నాడు. అందరూ వాని అచంచల భక్తిని చూచి ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు. అలా పదునారేండ్లు గడిచాయి. ఆయువు తీరే గడియ రానే వచ్చింది. ఆ సమయంలో కూడా మార్కండేయుడు శివాలయంలోనే ఉన్నాడు. పసిప్రాయంనుండే శివారాధన తత్పరుడైన వాని ప్రాణాలను హరించడం కింకరులకు సాధ్యం కాదని యముడే స్వయంగా బయలుదేరాడు. బాలకుడు తన తపోమహిమ వలన యముని కనులారా చూడగలిగాడు. కొంత భయం వేసింది. బతుకుమీద కోరికతో కాకుండా తగినంత తపస్సు చేస్తేనేగాని మోక్షం రాదని, తపస్సు చేయాలంటే తాను ఇంకా కొంతకాలం బతికి ఉండాలని భావించి, యముని బారి నుండి కాపాడమని మృత్యుంజయుడైన పరమేశ్వరుని ప్రార్థిస్తూ, ధ్యానిస్తూ, ఆ శివలింగాన్నే కౌగలించుకొని ఉండిపోయాడు. ‘‘చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః’’ అంటూ స్తోత్రం చేశాడు. అయినా బలవంతంగా వాని ప్రాణాలను హరించేందుకు ప్రయత్నించిన యమధర్మరాజును శివుడు ప్రత్యక్షమై నిలువరించాడు. మార్కండేయుని చిరంజీవిని చేశాడు. అలా బాల్యంలోనే పరమేశ్వరుని ప్రత్యక్షం చేసికొని మృత్యువునే ఎదిరించి అల్పాయువును చిరాయువుగా మార్చుకొన్న మహనీయుడు మార్కండేయుడు. సిరియాళుడు పరమశివభక్తులైన దంపతులను పరీక్షించేందుకు ఒకనాడు పరమేశ్వరుడే జంగమదేవర రూపంలో వారి ఇంటికి అతిథిగా వచ్చాడు. మా ఇంట భోజనం చేయమని ఆ దంపతులు ప్రార్థించారు. నాకు నరమాంసం వండిపెడితే తింటానన్నాడు ఆ జంగమ దేవర. ఒక్కసారి వారు అవాక్కయ్యారు. అతిథిని భోజనానికి పిలిచి అన్నం పెట్టకుండా పంపిస్తే మహాపాపం. అలాగని నరమాంసం ఎక్కడనుండి తెస్తారు. ఎవరు తన ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడతారు. అయోమయమై చింతిస్తుంటే వారి కుమారుడు ‘సిరియాళుడు’ ‘‘అమ్మా! నాన్నగారూ! దీనికి ఇంత చింత ఎందుకు? నన్ను చంపి నా మాంసంతో అతిథిని తృప్తిపరచండి’’ అంటాడు. కన్న తల్లిదండ్రులు ఎవరైనా ఆ పని చేయగలరా! వారు శోకసముద్రంలో మునిగిపోయారు. అపుడా చిన్ని బాలుడు వారితో ‘‘సంసార భ్రమమించుకేనియును మత్స్వాంతంబునన్ లేదు మీ వంశంబీపరిపాటిదా!’’ అని వారికి నచ్చజెప్పి సిద్ధపడేలా చేశాడు. వారు తన కుమారుని చంపి, ఆ మాంసం వండి, అతిథికి వడ్డించారు. ఇంకా పరీక్షించడం మానలేదు పరమేశ్వరుడు. పుత్రులు లేని ఇంట నేను భోజనం చేయను. మీ బిడ్డను పిలవండి అన్నాడు. నిలువునా నీరైపోయారు ఆ పుణ్యదంపతులు. ఆమె గొడ్రాలు కాదు. కాని ఇప్పుడు ఆ బిడ్డ లేడు. ఏం చేయాలో పాలుపోలేదు. ‘ఏంమీకు సంతానం లేదా?’ అని అడిగాడు అతిథి. ఇంతకుముందు వరకూ కుమారుడున్నాడు. కాని ఇప్పుడు లేడన్నారు ఆ దంపతులు. లేకపోతే వస్తాడు. గట్టిగా పిలవండి. అన్నాడు అతిథి. ఏమనాలో తెలియక ‘‘నాయనా సిరియాళా! ఎక్కడున్నా వెంటనే రా! నీ కోసం అతిథి నిరీక్షిస్తున్నాడు’’ అని గట్టిగా అరిచారు. ఆశ్చర్యం. ఆడుకొంటున్న పిల్లవాడు తల్లి పిలవగానే బయటి నుండి ఇంటికి వచ్చినట్లుగా గబగబ లోనికి వచ్చాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై తాను పెట్టిన పరీక్షలో వారు కృతార్థులైనట్లు చెప్పి ఆశీర్వదించాడు. ఆ రకంగా బాల్యంలోనే శివునికి ఆహారంగా తనను తాను సమర్పించుకోవడానికి ఏమాత్రమూ సంకోచించక రోట్లో తలపెట్టిన సాహసిక బాలభక్తుడు సిరియాళుడు. శంకరాచార్యులు ఆధునిక చారిత్రక కాలానికి వస్తే శంకరాచార్యులు బాల్యంలోనే మహాభక్తుడు కావడమే కాదు, భారతదేశమంతా పాద చారియై సంచరించి, ఎన్నో ఆధ్యాత్మిక పీఠాలను స్థాపించి, నాస్తిక వాదాలను ఖండించి, అసంఖ్యాకంగా గ్రంథాలను వ్రాసి, ముఖ్యంగా ప్రస్థానత్రయమనే వేదాంతశాస్త్రానికి మహాభాష్యాన్ని అందించిన మహనీయుడు. వాని తల్లిదండ్రులు కూడా శివకటాక్షంతో శంకరునికి జన్మనిచ్చారు. బాల్యంలోనే తండ్రి మరణించాడు. తల్లి పెంపకంలో పెరుగుతూ చిన్న వయసులోనే భగవంతునియందు అచంచలమైన భక్తిని సముపార్జించుకోవడమే కాక, తన మనసు నిండా వైరాగ్యభావాన్ని నింపుకొన్నాడు. సంసారమంటే ఏమిటో కూడా తెలియని వయసులోనే సంసారంపై విరక్తిని పెంచుకొన్నాడు. సన్యాసిగా జీవితాన్ని గడపాలనుకొన్నాడు. కాని తల్లి అందుకు అంగీకరించలేదు. తల్లి అనుమతి లేనిదే సన్యాసదీక్షను స్వీకరించేందుకు అర్హత లేదు. ఎలా అయినా ఆమెను ఒప్పించాలని, చిన్ననాటి నుండే తపస్సు ప్రారంభించాడేమో ఆ శక్తితో తల్లి చూస్తుండగా ఒక నదిలో స్నానం చేస్తూ ఒక కపటపు మొసలిని సృష్టించాడు. అది వాని కాలిని పట్టుకొని నీటిలోనికి లాగసాగింది. ‘‘అమ్మా! నన్ను మొసలి పట్టుకొంది. నన్ను నీటిలోనికి లాగేస్తోంది’’ అని వాపోయాడు. పాపం తల్లి గట్టు మీద నుండే ఏడుస్తూ కేకలు వేస్తోంది. ‘‘అమ్మా! సన్యాసిని మొసలి తినదు. కనుక నేను సన్యాస దీక్ష తీసికోవడానికి నీవు అనుమతిని ఇస్తే ఇప్పటికిప్పుడే సన్యాసదీక్షను తీసికొంటాను. మొసలి నన్ను వదిలేస్తుంది. నేను బతుకుతాను’’ అన్నాడు. బిడ్డ బతికితే అదే చాలు అనుకొని ‘‘అలాగే’’ అని అనుమతినిచ్చింది తల్లి. అంతే మొసలి మాయమైపోయింది. శంకరుడు సన్యాసిగా బయటికి వచ్చాడు. శంకరాచార్యులయ్యాడు. జగద్గురువుగా మిగిలిపోయాడు. ఇలా బాల్యంలోనే భక్తికి భాష్యం చెప్పిన మహనీయులు ఎందరో ఉన్నారు. మన పిల్లలకు వారి చరిత్రలను చెప్పాలి. వారిలో ఉత్తేజాన్ని కలిగించాలి. రాబోయే కాలంలో మంచి సమాజం ఏర్పడేందుకు అనుగుణంగా ఈనాడే మన బాలల మనస్సులను మనమే తీర్చిదిద్దాలి. అప్పుడే భావి ప్రపంచం ప్రశాంతంగాను, ఉదాత్తంగాను, సంస్కారవంతంగాను జీవిస్తుంది. నేటి బాలలే రేపటి మహాభక్తులు. - గురుసహస్రావధాని డా. కడిమిళ్ళ వరప్రసాద్ -
ముగ్గురు సీజేఐలు ‘రాజీ’!
అవినీతి జడ్జిని కొనసాగించడానికి ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ మార్కండేయ కట్జూ సంచలన వ్యాఖ్యలు మద్రాస్ హైకోర్టుకు చెందిన ఆ అదనపు జడ్జి అవినీతికి పాల్పడ్డారన్న ఐబీ ఆయన్ను పదవిలో కొనసాగించకూడదని సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది కొనసాగించాల్సిందేనని యుపిఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన తమిళనాడు పార్టీ న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అదనపు జడ్జిని కొనసాగించేందుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు(సీజేఐలు) ముగ్గురు ‘అసమంజసంగా రాజీ’పడ్డారంటూ ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. పేరు ప్రస్తావించకుండా తమిళనాడులోని మద్రాస్ హైకోర్టుకు చెందిన జడ్జి అంటూ కట్జూ చేసిన వ్యాఖ్యలపై సోమవారం పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి. రాజ్యసభ పలుమార్లు ఇదే అంశంపై వాయిదా పడింది. తమిళనాడులోని మిత్రపక్షం(డీఎంకే అయి ఉంటుందని భావిస్తున్నారు) నుంచి యూపీఏ-1 ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అదనపు జడ్జి పదవీకాలం ఎలా పొడిగించారో, తర్వాత శాశ్వత జడ్జి హోదా ఎలా ఇచ్చారో చెబుతూ కట్జూ ఓ ఆంగ్ల పత్రికలో కథనం రాశారు. తర్వాత సోమవారం టీవీ చానళ్లతో మాట్లాడారు. అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపిన ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ఇచ్చిన నివేదిక ప్రతికూలంగా ఉన్నప్పటికీ ముగ్గురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు-జస్టిస్‌లు ఆర్.సి.లహోతీ, వై.కె.సబర్వాల్, కె.జి.బాలకృష్ణన్- ఆ జడ్జిని ఆ పదవిలో కొనసాగించడానికి అసమంజసంగా రాజీపడ్డారన్నారు. నేను ఆశ్చర్యపోయాను..: ‘నేను మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు.. ఆ అదనపు జడ్జిపై చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇంటెలిజెన్స్ బ్యూరోతో రహస్య దర్యాప్తు చేయించాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ లహోతీని కోరాను. ఆరోపణల్లో నిజముందని ఐబీ నివేదిక తేల్చింది. దీంతో ఆ జడ్జిని పదవి నుంచి తప్పించాలి. కానీ అలా జరగలేదు’ అని కట్జూ తెలిపారు. ఈ జడ్జి విషయం సుప్రీంకోర్టులోని కొలీజియం దృష్టికి వెళ్లిందని, లహోతీ, సబర్వాల్ ఇద్దరూ అందులో సభ్యులుగా ఉన్నారని కట్జూ చెప్పారు. ఆ అదనపు జడ్జిని కొనసాగించకూడదని కొలీజియం కూడా సిఫార్సు చేసిందన్నారు. ప్రభుత్వం పడిపోతుందన్నారు: ‘‘ఆ సమయంలో ప్రధాని మన్మోహన్ సింగ్.. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకుగాను న్యూయార్క్ వెళ్లడానికి ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లగా తమిళనాడు పార్టీ మంత్రులు ఆయన్ను కలిసినట్లు తెలిసింది. (జడ్జిని కొనసాగించకపోతే) తాము మద్దతు ఉపసంహరించుకుంటాం కాబట్టి ఆయన తిరిగొచ్చేటప్పటికి ప్రభుత్వం పడిపోతుందని అన్నట్లు తెలిసింది’’ అని కట్జూ వివరించారు. ఇందులో ఎంత నిజం ఉందో తనకు తెలీదన్నారు. అయితే ఆందోళన పడవద్దని, తాను మేనేజ్ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ మంత్రి ఒకరు ప్రధానితో అన్నట్లు తెలిసిందన్నారు. లహోతీతో మొదలై.. జస్టిస్ లహోతీ ఈ రాజీని మొదలుపెట్టగా.. జస్టిస్ సబర్వాల్, జస్టిస్ బాలకృష్ణన్ దాన్నికొనసాగించారని కట్జూ పేర్కొన్నారు. మొదటి ఇద్దరూ ఆయన పదవీకాలాన్ని కొనసాగిస్తే.. జస్టిస్ బాలకృష్ణన్ శాశ్వత జడ్జిగా నియమించారని తెలిపారు. ‘‘ఈ సీజెఐలు లొంగిపోగలరు. రాజకీయ ఒత్తిళ్లకు వాళ్లు తలొగ్గారు’’ అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. యూపీఏ ప్రభుత్వం మిత్రపక్షాలపై ఆధారపడి ఉండడం, వాటిలో ఒకటి తమిళనాడు పార్టీ కావడమే దీనికి కారణమని తర్వాత తెలిసిందని కట్జూ పేర్కొన్నారు. ఇప్పుడెందుకు బయటపెట్టారు? ఈ విషయాన్ని పదేళ్లపాటు దాచి ఇప్పుడెందుకు బయటపెట్టారని కట్జూను ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో విలేకరులు ప్రశ్నించగా.. ఎప్పుడన్నది విషయం కాదని, ఇది నిజమా కాదా అన్న దానిపై దర్యాప్తు చేయాలని అన్నారు. ఇదే అంశంపై మరోసారి ప్రశ్నించగా.. ఆయన విసురుగా లేచి వెళ్లిపోయారు. ఆరోపణలు అవాస్తవం.. జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమైనవని.. ఆధారాలు లేనివని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఖండించారు. ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తడంలో ఉద్దేశమేమిటని ఆయన ప్రశ్నించారు. తమిళనాడులో న్యాయమూర్తిని కొనసాగించటం అన్నది పూర్తిగా నిబంధనలను అనుసరించే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. సదరు న్యాయమూర్తి చనిపోయిన తరువాత ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేయటంలో అర్థం లేదని బాలకృష్ణన్ అన్నారు. ఆ న్యాయమూర్తికి తమిళనాడులో అధికార పార్టీతో సత్సంబంధాలున్నట్టుగా ఆరోపణలు ఉన్న మాట వాస్తవమేనని అందుకే ఆయన్ని ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేశామని బాలకృష్ణన్ చెప్పారు. జస్టిస్ లాహోతీ కూడా కట్జూ ఆరోపణలను ఖండించారు. కట్జూ చేసిన ఆరోపణలపై తమిళనాడులోని రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ఈ ఆరోపణలపై వెంటనే దర్యాప్తు జరిపించాలని అన్నాడీఎంకే నేత తంబిదురై లోక్‌సభలో డిమాండ్ చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ అంశం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమన్నారు. ఈ అరోపణలను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. వార్తల్లో ఉండటంతో పాటు ప్రస్తుత ప్రభుత్వానికి దగ్గర కావటం కోసమే కట్జూ ఈ ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా అన్నారు. ఇన్నాళ్లూ కట్జూ ఈ విషయంపై ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని సీనియర్ న్యాయవాది రాంజెత్మలానీ అన్నారు. కాగా కట్జూ ఆరోపించిన అదనపు న్యాయమూర్తి, 2001లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరుణానిధిని అర్ధరాత్రి అరెస్టు చేసిన సందర్భంగా ఆయనకు బెయిలిచ్చిన న్యాయమూర్తే అయి ఉండవచ్చని ఎన్డీటీవీ కథనం.కాగా ఈ విషయంపై స్పందించటానికి మాజీ ప్రధాని మన్మోహన్ నిరాకరించారు.