ముగ్గురు సీజేఐలు ‘రాజీ’!
అవినీతి జడ్జిని కొనసాగించడానికి
ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ మార్కండేయ కట్జూ సంచలన వ్యాఖ్యలు
మద్రాస్ హైకోర్టుకు చెందిన ఆ అదనపు జడ్జి అవినీతికి పాల్పడ్డారన్న ఐబీ
ఆయన్ను పదవిలో కొనసాగించకూడదని సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది
కొనసాగించాల్సిందేనని యుపిఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన తమిళనాడు పార్టీ
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అదనపు జడ్జిని కొనసాగించేందుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు(సీజేఐలు) ముగ్గురు ‘అసమంజసంగా రాజీ’పడ్డారంటూ ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. పేరు ప్రస్తావించకుండా తమిళనాడులోని మద్రాస్ హైకోర్టుకు చెందిన జడ్జి అంటూ కట్జూ చేసిన వ్యాఖ్యలపై సోమవారం పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి. రాజ్యసభ పలుమార్లు ఇదే అంశంపై వాయిదా పడింది. తమిళనాడులోని మిత్రపక్షం(డీఎంకే అయి ఉంటుందని భావిస్తున్నారు) నుంచి యూపీఏ-1 ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అదనపు జడ్జి పదవీకాలం ఎలా పొడిగించారో, తర్వాత శాశ్వత జడ్జి హోదా ఎలా ఇచ్చారో చెబుతూ కట్జూ ఓ ఆంగ్ల పత్రికలో కథనం రాశారు. తర్వాత సోమవారం టీవీ చానళ్లతో మాట్లాడారు. అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపిన ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ఇచ్చిన నివేదిక ప్రతికూలంగా ఉన్నప్పటికీ ముగ్గురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు-జస్టిస్‌లు ఆర్.సి.లహోతీ, వై.కె.సబర్వాల్, కె.జి.బాలకృష్ణన్- ఆ జడ్జిని ఆ పదవిలో కొనసాగించడానికి అసమంజసంగా రాజీపడ్డారన్నారు.
నేను ఆశ్చర్యపోయాను..: ‘నేను మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు.. ఆ అదనపు జడ్జిపై చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇంటెలిజెన్స్ బ్యూరోతో రహస్య దర్యాప్తు చేయించాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ లహోతీని కోరాను. ఆరోపణల్లో నిజముందని ఐబీ నివేదిక తేల్చింది. దీంతో ఆ జడ్జిని పదవి నుంచి తప్పించాలి. కానీ అలా జరగలేదు’ అని కట్జూ తెలిపారు. ఈ జడ్జి విషయం సుప్రీంకోర్టులోని కొలీజియం దృష్టికి వెళ్లిందని, లహోతీ, సబర్వాల్ ఇద్దరూ అందులో సభ్యులుగా ఉన్నారని కట్జూ చెప్పారు. ఆ అదనపు జడ్జిని కొనసాగించకూడదని కొలీజియం కూడా సిఫార్సు చేసిందన్నారు.
ప్రభుత్వం పడిపోతుందన్నారు: ‘‘ఆ సమయంలో ప్రధాని మన్మోహన్ సింగ్.. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకుగాను న్యూయార్క్ వెళ్లడానికి ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లగా తమిళనాడు పార్టీ మంత్రులు ఆయన్ను కలిసినట్లు తెలిసింది. (జడ్జిని కొనసాగించకపోతే) తాము మద్దతు ఉపసంహరించుకుంటాం కాబట్టి ఆయన తిరిగొచ్చేటప్పటికి ప్రభుత్వం పడిపోతుందని అన్నట్లు తెలిసింది’’ అని కట్జూ వివరించారు. ఇందులో ఎంత నిజం ఉందో తనకు తెలీదన్నారు. అయితే ఆందోళన పడవద్దని, తాను మేనేజ్ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ మంత్రి ఒకరు ప్రధానితో అన్నట్లు తెలిసిందన్నారు.
లహోతీతో మొదలై..
జస్టిస్ లహోతీ ఈ రాజీని మొదలుపెట్టగా.. జస్టిస్ సబర్వాల్, జస్టిస్ బాలకృష్ణన్ దాన్నికొనసాగించారని కట్జూ పేర్కొన్నారు. మొదటి ఇద్దరూ ఆయన పదవీకాలాన్ని కొనసాగిస్తే.. జస్టిస్ బాలకృష్ణన్ శాశ్వత జడ్జిగా నియమించారని తెలిపారు. ‘‘ఈ సీజెఐలు లొంగిపోగలరు. రాజకీయ ఒత్తిళ్లకు వాళ్లు తలొగ్గారు’’ అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. యూపీఏ ప్రభుత్వం మిత్రపక్షాలపై ఆధారపడి ఉండడం, వాటిలో ఒకటి తమిళనాడు పార్టీ కావడమే దీనికి కారణమని తర్వాత తెలిసిందని కట్జూ పేర్కొన్నారు.
ఇప్పుడెందుకు బయటపెట్టారు?
ఈ విషయాన్ని పదేళ్లపాటు దాచి ఇప్పుడెందుకు బయటపెట్టారని కట్జూను ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో విలేకరులు ప్రశ్నించగా.. ఎప్పుడన్నది విషయం కాదని, ఇది నిజమా కాదా అన్న దానిపై దర్యాప్తు చేయాలని అన్నారు. ఇదే అంశంపై మరోసారి ప్రశ్నించగా.. ఆయన విసురుగా లేచి వెళ్లిపోయారు.
ఆరోపణలు అవాస్తవం..
జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమైనవని.. ఆధారాలు లేనివని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఖండించారు. ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తడంలో ఉద్దేశమేమిటని ఆయన ప్రశ్నించారు. తమిళనాడులో న్యాయమూర్తిని కొనసాగించటం అన్నది పూర్తిగా నిబంధనలను అనుసరించే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. సదరు న్యాయమూర్తి చనిపోయిన తరువాత ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేయటంలో అర్థం లేదని బాలకృష్ణన్ అన్నారు. ఆ న్యాయమూర్తికి తమిళనాడులో అధికార పార్టీతో సత్సంబంధాలున్నట్టుగా ఆరోపణలు ఉన్న మాట వాస్తవమేనని అందుకే ఆయన్ని ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేశామని బాలకృష్ణన్ చెప్పారు. జస్టిస్ లాహోతీ కూడా కట్జూ ఆరోపణలను ఖండించారు.
కట్జూ చేసిన ఆరోపణలపై తమిళనాడులోని రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ఈ ఆరోపణలపై వెంటనే దర్యాప్తు జరిపించాలని అన్నాడీఎంకే నేత తంబిదురై లోక్‌సభలో డిమాండ్ చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ అంశం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమన్నారు. ఈ అరోపణలను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. వార్తల్లో ఉండటంతో పాటు ప్రస్తుత ప్రభుత్వానికి దగ్గర కావటం కోసమే కట్జూ ఈ ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా అన్నారు. ఇన్నాళ్లూ కట్జూ ఈ విషయంపై ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని సీనియర్ న్యాయవాది రాంజెత్మలానీ అన్నారు. కాగా కట్జూ ఆరోపించిన అదనపు న్యాయమూర్తి, 2001లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరుణానిధిని అర్ధరాత్రి అరెస్టు చేసిన సందర్భంగా ఆయనకు బెయిలిచ్చిన న్యాయమూర్తే అయి ఉండవచ్చని ఎన్డీటీవీ కథనం.కాగా ఈ విషయంపై స్పందించటానికి మాజీ ప్రధాని మన్మోహన్ నిరాకరించారు.