సీబీఐ డైరెక్టర్‌ నాగేశ్వర రావుపై ఆంక్షలు | Retd SC judge AK Patnaik to supervise CVC probe against Alok Verma | Sakshi
Sakshi News home page

రెండు వారాల్లో తేల్చండి

Published Sat, Oct 27 2018 3:21 AM | Last Updated on Sat, Oct 27 2018 11:05 AM

Retd SC judge AK Patnaik to supervise CVC probe against Alok Verma - Sakshi

అలోక్‌ వర్మ, కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ చౌదరి

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను కేంద్ర నిఘా కమిషన్‌ (సీవీసీ) రెండు వారాల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ విచారణను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే పట్నాయక్‌ పర్యవేక్షిస్తారంది. అలోక్‌ వర్మ, సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాల మధ్య వర్గపోరు నేపథ్యంలో వారిద్దరినీ కేంద్రం  విధుల నుంచి తప్పించి సెలవుపై పంపడం తెలిసిందే. దీంతో తనను ప్రభుత్వం అక్రమంగా విధుల నుంచి తప్పించిందనీ, సీబీఐ స్వతంత్ర అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందని ఆరోపిస్తూ అలోక్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. సీబీఐలో జేడీగా ఉన్న, ప్రస్తుతం డైరెక్టర్‌ విధులు నిర్వహిస్తున్న నాగేశ్వర రావు ఎలాంటి విధానపరమైన, కీలక నిర్ణయాలూ తీసుకోకూడదని కోర్టు ఆంక్షలు విధించింది.

డైరెక్టర్‌ విధులను తాత్కాలికంగా నాగేశ్వర రావుకు కట్టబెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏయే అధికారులను బదిలీ చేశారు, ఇప్పటికే విచారణలో ఉన్న కేసులను ఎవరి నుంచి ఎవరికి అప్పగించారు తదితర వివరాలన్నింటినీ సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని కోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎస్కే కౌల్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తదుపరి విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేస్తూ, అప్పటిలోగా నాగేశ్వర రావు నిర్ణయాలకు సంబంధించిన వివరాలను అందించాలని స్పష్టం చేసింది. తనను విధుల నుంచి తప్పించడాన్ని సవాల్‌ చేస్తూ అస్థానా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినప్పటికీ ఆ కేసును తర్వాత విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది.

ప్రభుత్వంపై పైచేయి కాదు..
జస్టిస్‌ ఏకే పట్నాయక్‌ పర్యవేక్షణలో విచారణ జరగాలని తాము చెప్పడాన్ని ప్రభుత్వంపై ఆధిపత్యంలా చూడకూడదని జడ్జీలు వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఉన్న విపరీత ఆరోపణల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం తప్పనిసరైందన్నారు. నాగేశ్వర రావు నిర్ణయాలను అమలు చేయకూడదని తొలుత చెప్పిన కోర్టు.. తర్వాత మాత్రం ఇకపై ఆయన ఏ కీలక నిర్ణయాలూ తీసుకోకుండా నిలువరిస్తూ, ఇప్పటికే చేపట్టిన చర్యలను సమీక్షించిన అనంతరం ఓ నిర్ణయానికి వస్తామంది. అలోక్‌ పిటిషన్‌పై కేంద్రం, సీవీసీల స్పందనలను కోరింది.

సీబీఐ అధికారులపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ జరిపించాలంటూ కామన్‌కాజ్‌ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్‌ లాయరు ప్రశాంత్‌ భూషణ్‌ వేసిన పిటిషన్‌నూ ఇదే బెంచ్‌ విచారించింది. ఈ పిటిషన్‌పై నవంబర్‌ 12లోగా స్పందించాల్సిందిగా కేంద్రం, సీబీఐ, సీవీసీ, అలోక్, అస్థానా, నాగేశ్వర రావులను ఆదేశించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ వేణుగోపాల్, సీవీసీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్, అలోక్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఫాలీ నారీమన్‌ వాదనలు వినిపించారు. సీవీసీ విచారణను పది రోజుల్లోనే పూర్తి చేయాలన్న ధర్మాసనం.. ఇంకాస్త ఎక్కువ సమయం ఇవ్వాలని తుషార్‌ మెహతా కోరడంతో గడువును రెండు వారాలకు పెంచింది.

సీవీసీకి చిత్తశుద్ధి లేదని కాదు: అధికారి
అలోక్‌ వర్మపై సీవీసీ విచారణను పర్యవేక్షించేందుకు జస్టిస్‌ ఏకే పట్నాయక్‌ను కేంద్రం నియమించిందంటే సీవీసీకి చిత్తశుద్ధి లేనట్లేమీ కాదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ‘అలోక్, అస్థానాలను బాధ్యతల నుంచి తప్పిస్తూ, డైరెక్టర్‌ విధులను నాగేశ్వర రావుకు అప్పగిస్తూ సీవీసీ, కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేయలేదు. విశ్రాంత జడ్జి పర్యవేక్షణలో విచారణ జరగాలని చెప్పినంత మాత్రాన సీవీసీ చిత్తశుద్ధిని శంకించినట్లు కాదు. విచారణను సీవీసీయే చేస్తుంది కదా. ఈ కేసులో ఉన్న కొన్ని అసాధారణ అంశాల వల్ల కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది’ అని అధికారి వివరించారు.

సానుకూల పరిణామం: జైట్లీ
కోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులు గొప్ప సానుకూలాంశమని  ఆర్థిక మంత్రి జైట్లీ అన్నారు. ఈ ఆదేశాలతో నిజాలు బయటకొచ్చి దేశ ప్రయోజనాలు నిలబడతాయని అన్నారు. సీబీఐ సమగ్రత, నిబద్ధతను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఒక నిర్దిష్ట వ్యక్తికి అనుకూలంగా, మరొకరికి వ్యతిరేకంగా వ్యవహరించే ఉద్దేశం తమకు లేదన్నారు.

నిజం నిలిచింది: కాంగ్రెస్‌
సుప్రీంకోర్టు ఆదేశాలను కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తూ నిజం నిలబడిందని వ్యాఖ్యానించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ఓ ట్వీట్‌ చేస్తూ ‘తమ చెప్పుచేతల్లో ఉండే మనుషులను నియమించుకుని సీబీఐని చేజిక్కించుకోవాలన్న మోదీ ప్రభుత్వ దుష్ట ప్రయత్నం విఫలమైంది. సుప్రీంకోర్టులో ఎప్పుడైనా నిజం నిలబడుతుంది. సీబీఐ స్వతంత్రతను దెబ్బతీయాలని చూసిన నిరంకుశ పాలకుల చెంప చెళ్లుమనేలా ఈ తీర్పు ఉంది. మోదీ ప్రభుత్వ పావుగా సీవీసీ ఇక వ్యవహరించలేదు. జస్టిస్‌ ఏకే పట్నాయక్‌ పర్యవేక్షణలో విచారణ పారదర్శకంగా జరుగుతుంది’ అని అన్నారు.

‘పంజరం చిలుక’కు స్వేచ్ఛనిచ్చిన వ్యక్తి
సీవీసీ విచారణను పర్యవేక్షించేందుకు నియమితులైన సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్‌ అనంగ కుమార్‌ పట్నాయక్‌ గతంలో సీబీఐకి సంబంధించిన పలు కేసుల్లో కీలక తీర్పులు వెలువరించారు. సంయుక్త కార్యదర్శి లేదా ఆపై స్థాయి అధికారులపై సీబీఐ విచారణ ప్రారంభించాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తూ నాటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త నిబంధనలను తెచ్చింది. ఈ నిబంధనలను 2014లో కొట్టేసి, సీబీఐకి స్వేచ్ఛనిచ్చిన ఐదుగురు జడ్జీల్లో జస్టిస్‌ పట్నాయక్‌ ఒకరు. 1949లో ఒడిశాలో జన్మించిన ఆయన మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీజేగా చేశారు. తర్వాత సుప్రీంకోర్టులో ఉండి పలు కీలక తీర్పులను ఇచ్చారు.

కోల్‌కతాలోని అమెరికన్‌ సెంటర్‌పై  ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారులు అఫ్తాబ్‌ అన్సారీ, జములుద్దీన్‌ నజీర్‌లకు ఉరిశిక్షను రద్దు చేసిన ద్విసభ్య ధర్మాసనంలో ఈయన ఒకరు. అహ్మదాబాద్‌లోని అక్షరధామ్‌ ఆలయంపై జరిగిన దాడి కేసులోనూ ఆరుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసిన బెంచ్‌లో పట్నాయక్‌ సభ్యుడు. బీసీసీఐ చీఫ్‌ పదవి నుంచి శ్రీనివాసన్‌ దిగిపోవాలని ఆదేశించిన కోర్టు, 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణానికి సంబంధించిన అన్ని కేసులనూ విచారించేందుకు నియమితమైన ద్విసభ్య బెంచ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏవైనా కేసుల్లో దోషులుగా తేలినప్పటికీ, పై కోర్టుల్లో వారు అప్పీల్‌ చేసుకున్నప్పుడు ఆయా ప్రజాప్రతినిధులకు లాభం కలిగించేలా ప్రజాప్రతిధుల చట్టంలో ఉన్న సెక్షన్‌ 8(4)ను రద్దు చేసిన ధర్మాసనాల్లోనూ పట్నాయక్‌ సభ్యుడే.

సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే పట్నాయక్‌

వివాదం పూర్వాపరాలు..
2017 జనవరి 19: సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌ వర్మ నియామకం.
అక్టోబర్‌ 22: సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌గా రాకేశ్‌ అస్థానాకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం.
నవంబర్‌ 2: అస్థానా నియామకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌. పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.
2018 జూలై 12: పదోన్నతులు, కొత్త నియామకాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసిన సీవీసీ. అప్పటికే అలోక్‌ విదేశాలకు వెళ్లారనీ, ఆయన స్థానంలో ఈ భేటీకి హాజరయ్యే అధికారం అస్థానాకు లేదని చెప్పిన సీబీఐ.
ఆగస్టు 24: అలోక్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ కేబినెట్‌ కార్యదర్శికి లేఖ రాసిన అస్థానా. విషయాన్ని సీవీసీకి అప్పగించిన కేంద్రం.
సెప్టెంబర్‌ 21: అస్థానానే 6 అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారని సీవీసీకి వివరణ ఇచ్చిన సీబీఐ.
అక్టోబర్‌ 15: అస్థానా, సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్, మధ్యవర్తులు మనోజ్‌ ప్రసాద్, సోమేశ్‌ ప్రసాద్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ.
అక్టోబర్‌ 22: సోదాల అనంతరం అస్థానా బృందంలోని డీఎస్పీ దేవేంద్ర కుమార్‌ అరెస్ట్‌.
అక్టోబర్‌ 23: అస్థానాపై చర్యల విషయంలో యథాతథ స్థితి విధించిన ఢిల్లీ హైకోర్టు. దేవేంద్రకు కస్టడీ విధించిన సీబీఐ కోర్టు. అలోక్, అస్థానాలను విధుల నుంచి తప్పించి నాగేశ్వర రావుకు డైరెక్టర్‌ బాధ్యతలు అప్పగించిన కేంద్రం.
అక్టోబర్‌ 24: సీబీఐ స్వతంత్రాధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుందంటూ కోర్టుకెళ్లిన అలోక్‌.
అక్టోబర్‌ 26: విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలని సీవీసీకి సుప్రీంకోర్టు ఆదేశం.  



‘సీబీఐ.. పంజరంలో చిలక’ అని చూపుతూ ఢిల్లీలో కాంగ్రెస్‌ కార్యకర్తల ప్రదర్శన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement