The UPA government
-
అవసరమైతే మార్పులు చేస్తాం..!
న్యూఢిల్లీ: ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ విషయంలో తమ ప్రభుత్వానికి, గత యూపీఏ ప్రభుత్వానికి పోలిక లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ‘భావప్రకటన స్వేచ్ఛ హక్కుకు కట్టుబడి ఉన్నామని మేం లిఖితపూర్వకంగా కోర్టుకు తెలిపాం. యూపీఏ ప్రభుత్వం మాత్రం తమను వ్యతిరేకిస్తున్నవారిపై, వ్యంగ్యంగా చిత్రిస్తున్నవారిపై కక్షసాధింపునకు మార్గంగా ఈ చట్టాన్ని ఉపయోగించుకుంది’ అన్నారు. ‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. కానీ ఈ తీర్పు నేపథ్యంలో చట్టంలో ఏమైనా మార్పులు అవసరమని భద్రతా సంస్థలు భావిస్తే.. చట్టపరంగా, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలగకుండా.. అవసరమైన చర్యలు చేపడతాం’ అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ముందు ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ రాజ్యాంగబద్ధతను కేంద్రప్రభుత్వం సమర్ధించిన విషయం తెలిసిందే. -
భూసేకరణ ఆర్డినెన్సుపై పోరాటం
అసెంబ్లీలో తీర్మానం చేయాలని టీపీసీసీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రైతుల పొట్టకొట్టేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమించాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. భూసేకరణ ఆర్డినెన్స్‌పై శనివారం గాంధీభవన్‌లో పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు మాట్లాడుతూ ప్రజల అవసరాల ముసుగులో కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని, ఇది పెట్టుబడిదారులకు కొమ్ముకాసేలా ఉందని విమర్శించారు. భూసేకరణ ఆర్డినెన్సులో పేద రైతులకు నష్టం కలిగించే, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న అంశాలను సమావేశంలో వివరించారు. 2013 ఫిబ్రవరిలో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన చట్టంలోని అంశాలను కూడా ఈ సందర్భంగా కొప్పుల రాజు వివరించారు. 23న దేశవ్యాప్త ఉద్యమం: పొన్నాల తెలంగాణ పేదలకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్న భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని పొన్నాల డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం పార్టీ నేతలు ఎం.కోదండరెడ్డి, అధికార ప్రతినిధులు దాసోజు శ్రవణ్, మల్లు రవి, శ్యాంమోహన్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. దొంగచాటుగా తెచ్చిన ఆర్డినెన్స్ వల్ల తెలంగాణ రైతులు పెద్ద ఎత్తున భూములు కోల్పోతారన్నారు. పరిశ్రమ అవసరాలకు తీసుకున్న భూమిలో, పరిశ్రమ పెట్టకుండా పడావు పెట్టినా అసలు రైతులకు ఈ ఆర్డినెన్సు ద్వారా ఆ భూమి దక్కకుండాపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలకతీతంగా ఈ ఆర్డినెన్సును వ్యతిరేకించాలని, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే ఫిబ్రవరి 23న ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త పోరాటం చేస్తామని చెప్పారు. ఫిబ్రవరి 10 నుంచి జిల్లాల వారీగా కాంగ్రెస్ ఎస్సీ సెల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు పొన్నాల తెలిపారు. కాగా, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు చేయకుండా, వేధింపులకు గురిచేస్తున్న ప్రభుత్వ విధానానికి నిరసనగా అన్ని పార్టీలను, సంఘాలను కూడగట్టడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పొన్నాల ఒక కమిటీని ప్రకటించారు. మల్లు రవి, బి.మహేశ్‌కుమార్ గౌడ్, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, కొనగాల మహేష్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని చెప్పారు. -
నేటి నుంచి నగదు బదిలీ
జిల్లాలో 74 శాతం ఆధార్ అనుసంధానం బ్యాంక్‌ల్లో ఆధార్ నంబర్ తప్పనిసరి 75 వేల ఇండేన్ గ్యాస్ కనక్షన్లు తాత్కాలికంగా నిలుపుదల ! మార్చి నుంచి పూర్తి స్థాయిలోబదిలీ ప్రక్రియ అమలు ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లాలో వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం నేటి నుంచి అమలు కానుంది. నూతన సంవత్సరంలో గ్యాస్ వినియోగదారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో యూపీఏ ప్రభుత్వం గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో మధ్యలోనే నిలిచిపోయింది. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ నగదు బదిలీని తెరపైకి తీసుకొచ్చింది. దీంతో జిల్లాలో నేటి నుంచి ఈ పథకం అమలు కానుంది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాని గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ వర్తించదు. వారికి గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇకపై రూ. 981 చెల్లించాలి. తొలుత గ్యాస్ వినియోగదారులు గ్యాస్ ధర మొత్తాన్ని చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. కొద్దిరోజుల తర్వాత సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 5,05,446 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం 5,00,114 కనెక్షన్లు వినియోగంలో ఉన్నాయి. వీటిలో 74 శాతం మంది ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నారు. మార్చిలోపు అనుసంధానం కాకుంటే అదనపు భారం.. జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారభింస్తున్నప్పటికీ ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం చేసుకునేందుకు మార్చి వరకు గడువు ఉంది. అప్పటికి కూడా అనుసంధానం చేసుకోకుంటే అదనపు భారం మోయాల్సి వస్తుంది. గ్యాస్ కనెక్షన్లు తాత్కాలిక నిలుపుదల..! నగదు బదిలీ అమల్లో భాగంగా బ్యాంక్ ఖాతాలకు అధార్ అనుసంధానం చేసుకోని పలువురు వినియోగదారుల ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. వీటిలో ఇండేన్ గ్యాస్ వినియోగదారులైన 75 వేల మంది బ్యాంకుల్లో ఆధార్ అనుసంధానం చేసుకోకపోవటంతో వారి కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. వినియోగదారుల్లో గందళగోళం... గ్యాస్ వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు. జనవరి 1నుంచి నగదు బదిలీ అమలవుతుందని, ఇక నుంచి సిలిండర్‌కు సబ్సిడీ వర్తించద ని ప్రకటించడంతో వారు ఆందోళన చెందుతున్నా రు. గత ఏడాది జిల్లాను పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి నగదు బదిలీ అమలు చేసే సమయంలో దాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే కొందరు లబ్ధిదారులు నగదు బదిలీ చేయించుకోవడంతో సబ్సిడీలో కొంత గందరగోళం నెలకొంది. ఒక వినియోగదారుడి సబ్సిడీ మరొకరి ఖాతాలోకి వెళ్లడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. తాజాగా మళ్లీ నగదు బదిలీ వ్యవహారం తెరపైకి రావడంతో ఒక వైపు ఆధార్ పూర్తికాక పోవడం, మరో వైపు బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోవడంతో అయోమయంలో పడ్డారు. గ్యాస్ వివరాలు ఇలా... జిల్లా వ్యాప్తంగా 5,00,114 గ్యాస్ కనక్షన్లు వినియోగంలో ఉన్నాయి. వీటిలో గ్యాస్ ఏజెన్సీల్లో అనుసంధానం అయినవి 3,69,816 కాగా, బ్యాంక్‌లో అనుసంధానం అయినవి 2,67,295 ఉన్నాయి. జిల్లాలో భారత్ పెట్రోలియం కంపెనీకి చెందినవి 76,805, ఇండియన్ అయిల్ కార్పొరేషన్ 1,66,118, హిందుస్థాన్ పెట్రోలియం 2,57,191 కనక్షన్లు ఉన్నాయి. -
ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఓకే
భూసేకరణ సవరణలకు ఆమోదం న్యూఢిల్లీ: భూసేకరణ చట్టంలో సవరణలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం లభించింది. గతంలో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టంలో సవరణలతో కేంద్ర మంత్రివర్గం గత నెల 29న ఆమోదించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి బుధవారం ఆమోదముద్ర వేశారు. పారిశ్రామిక కారిడార్లు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, రక్షణ, గృహనిర్మాణ రంగాలకోసం జరిపే భూసేకరణకు సంబంధించిన నిబంధనల్లో మార్పు చేస్తూ తయారు చేసిన ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపి, రాష్ట్రపతి ఆమోదానికి పంపించింది. ఆర్డినెన్స్‌ను ఆమోదిస్తూ రాష్ట్రపతి సంతకం చేసినట్టు రాష్ట్రపతి మీడియా కార్యదర్శి వేణు రాజమొనీ చెప్పారు. కాగా, ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జిల నియామకానికి ఇప్పటివరకు అనుసరిస్తున్న కొలీజియం విధానం రద్దుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కూడా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. పార్లమెంటు ఆమోదించిన జాతీయ న్యాయసంబంధ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ‘ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో వ్యతిరేకిస్తాం’ భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌నురాబోయే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఆర్డినెన్స్ ఉన్నదున్నట్టుగా చట్టం కాజాలదని, పరిస్థితుల ఒత్తిడితో మాత్రమే ఆర్డినెన్స్‌లు తేవాల్సి ఉండగా, ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఏడునెలలోనే తొమ్మిది ఆర్డినెన్స్‌లు తీసుకువచ్చిందని ఆరోపించింది. -
మన్మోహన్ ను ప్రశ్నించనున్న సీబీఐ
-
మన్మోహన్ ను ప్రశ్నించనున్న సీబీఐ?
ఢిల్లీ: కోల్‌స్కాం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను విచారించడానికి సీబీఐ సన్నద్ధమయినట్లు తెలుస్తోంది. యూపీఏ ప్రభుత్వంలో బొగ్గుశాఖ బాధ్యతలను అదనంగా నిర్వర్తించిన ఆనాటి ప్రధాని మన్మోహన్ కూడా విచారించాలని సీబీఐ యోచిస్తోంది. హిందూల్కోకు బొగ్గు గనుల కేటాయింపుపై సీబీఐ సమర్పించిన తుది నివేదికను ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. హిందూల్కోకు బొగ్గు గనుల కేటాయింపులో మన్మోహన్ వాంగ్మూలం నమోదు చేయాలని సీబీఐకి ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మన్మోహన్ ను సీబీఐ విచారించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. -
మన్మోహన్‌ను విచారించలేదేం?
బొగ్గు స్కాం కేసులో సీబీఐని ప్రశ్నించిన ప్రత్యేక కోర్టు మాజీ ప్రధానిని ప్రశ్నించేందుకు అనుమతివ్వలేదన్న సీబీఐ సీబీఐ న్యాయవాదిపై {పశ్నల వర్షం కురిపించిన జడ్జి న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంలో బొగ్గుశాఖ బాధ్యతలను అదనంగా నిర్వర్తించిన నాటి ప్రధాని మన్మోహన్సింగ్ను కోల్‌స్కాం కేసులో విచారించడానికి తమకు అనుమతి రాలేదని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టుకు సీబీఐ తెలిపింది. ఒరిస్సాలోని తలాబిరా-2, 3బొగ్గుగనుల కేటాయింపుల్లో అక్రమాలకు సంబంధించిన కేసు మంగళవారం కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ఈ కేసులో పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌తోపాటు హిందాల్కో కంపెనీ అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి భరత్ పరాశర్.. సీబీఐదర్యాప్తు అధికారిపై ప్రశ్నల పరంపర కురిపించారు. ‘ఈ కేసులో నాటి బొగ్గుశాఖ మంత్రిని విచారించాల్సిన అవసరం లేదని మీరు భావించారా? కేసులో అనేక అంశాలపై స్పష్టత వచ్చేందుకు ఆయన వాంగ్మూలం అవసరమని మీకు ఎందుకు అనిపించలేదు’ అని ప్రశ్నించారు. దర్యాప్తు అధికారి బదులిస్తూ.. ‘మొదట మన్మోహన్‌ను ప్రశ్నించాలని భావించాం. కానీ ప్రధాని కార్యాలయం అధికారులు నాయర్, జావెద్ ఉస్మానీలను ప్రశ్నించాం. వారి వాంగ్మూలం సరిపోతుందనుకున్నాం.’ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో నాటి బొగ్గుశాఖ బాధ్యతలను చూసిన ప్రధానిని విచారించేందుకు తమకు అనుమతి రాలేదని వివరించారు. ఈ సందర్భంగా పీఎంవో అధికారులను ముఖాముఖీ ప్రశ్నించా రా? లేదా వారికి ప్రశ్నావళిని పంపి సమాధానాలు అడిగారా? అని న్యాయమూర్తి అడిగారు. ఇందుకు నేరుగానే ప్రశ్నించామని న్యాయవాది బదులిచ్చారు. తర్వాత న్యాయమూర్తి... ‘దీనిపై సమగ్ర అవగాహనకు రావాలంటే కేసు దర్యాప్తు ఎలా సాగింది, ఎవరెవరిని ఎలా ప్రశ్నించారన్న విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ కేసు డైరీ, ఇతర ఫైళ్లన్నీ సీల్డ్ కవర్లో మా ముందుంచండి’అని సీబీఐని ఆదేశించారు. కేసు తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. 2005లో ప్రధాని మన్మోహన్ అదనంగా బొగ్గుశాఖ బాధ్యతలను నిర్వర్తించారు. కాగా, తలాబిరా బొగ్గు గనుల కేటాయింపు కేసు డైరీ, సంబంధిత ఫైళ్లన్నీ న్యాయస్థానానికి అందజేస్తామని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా చెప్పారు. వాటిని పరిశీలించాక మన్మోహన్‌ను ప్రశ్నించకపోవడం తప్పో కాదో నిర్ణయించాల్సింది కోర్టేనని అన్నారు. -
నేటి నుంచి ఆధార్
ఆధార్ కార్డుల జారీపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయానికి వచ్చింది. శనివారం నుం చి రాష్ట్ర వ్యాప్తంగా 469 ప్రత్యేక శిబిరాల ద్వారా ఆధా ర్ కార్డులను జారీచేయాలని నిశ్చయించింది. చెన్నైలోనే 50 కేంద్రాల ద్వారా కార్డులు జారీ చేయనున్నారు. * 469 ప్రత్యేక శిబిరాలు * చెన్నైలోనే 50 శిబిరాలు చెన్నై, సాక్షి ప్రతినిధి: భారత పౌరసత్వ నిర్ధారణకు గతంలోని యూపీఏ ప్రభుత్వం ఆధార్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆధార్ కార్డు ఒక స్మార్టు కార్డులా అన్ని ప్రయోజనాలు కలిగించేలా తీర్చిదిద్దాలని సంకల్పించింది. బయోమెట్రిక్ విధానంలో జారీచేసే ఈ కార్డు ద్వారా పాస్‌పోర్టు, రేషన్ కార్డులు, బ్యాంకు ఖాతాలు. తదితర ప్రయోజనాలు పొందేలా రూపకల్పన చేసింది. అయితే ఆధార్ కార్డుపై అదే ప్రభుత్వంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో అధార్ కార్డుల జారీ జాతీయ స్థాయిలో మందగించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో సైతం ఆధార్ కార్డుల జారీ వ్యవహారం అర్ధాంతరంగా అటకెక్కింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆధార్‌కార్డుల అంశాన్ని పక్కన పెట్టేసింది. అయితే మరలా మనస్సు మార్చుకుని జారీచేసేందుకు సిద్ధమైంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 25.94 లక్షల ఆధార్ కార్డుల జారీతో 67 శాతంతో తొలిదశ పూర్తయింది. అప్పట్లో 89.23 శాతం కార్డుల జారీతో పెరంబలూరు జిల్లా ప్రథమస్తానంలో నిలిచింది. రామనాథపురం జిల్లా 85.65, అరియలూరు, తిరుచ్చీ జిల్లాలు 81.61, నాగపట్నం జిల్లా 81.54 శాతం కార్డులు జారీఅయ్యాయి. అయితే ఆ తరువాత మలిదశ కుంటువడింది. తాజాగా మళ్లీ అదేశాలు రావడంతో యంత్రాంగం సిద్ధమైంది. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 469 ప్రత్యేక శిబిరాల ద్వారా ఆధార్ కార్డులను జారీచేసే ప్రక్రియను ప్రారంభించనుంది. వీటిల్లో 268 శాశ్వత శిబిరాలుగా నిర్ణయించారు. చెన్నైలో 50 శాశ్వత శిబిరాలను నిర్వహించనున్నారు. కార్పొరేషన్, మునిసిపాలిటీ, పంచాయతీ, తహశీల్దారు కార్యాలయాల్లో శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. -
బాబోయ్..మాకొద్దు నగదు బదిలీ
లబ్ధిదారుల హడల్ పలువురికి నేటికీ అందని సబ్సిడీ ఎన్డీయే ప్రభుత్వంపై ఆగ్రహం నగర శివారు వాంబే కాలనీలో నివసిస్తున్న ఒడగట్ల పైడమ్మ సబ్సిడీ రాక ఫిబ్రవరి నుంచి బ్యాంక్, గ్యాస్ ఏజెన్సీ చుట్టూ తిరుగుతోంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ ఖాతా నంబరు ఇచ్చినా ఆమె డబ్బు జమ పడలేదు. ఏజెన్సీ నిర్వాహకులు తమకు సంబంధం లేదంటున్నారు. భవానీపురానికి చెందిన అలీం జనవరి, ఫిబ్రవరిల గ్యాస్ సబ్సిడీ జమ పడక నానా అగచాట్లు పడుతోంది. ఇటు బ్యాంకర్లు, అటు గ్యాస్ ఏజెన్సీల పట్టించుకోకపోవటంతో డబ్బు వెనక్కి రాలేదని ఆమె గగ్గోలు పెడుతోంది. వాంబే కాలనీకి చెందిన శీలం చుక్కమ్మ పోయిన సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల్లో తీసుకున్న గ్యాస్ సిలెండర్లకు సంబంధించిన నగదు ఖాతాల్లో జమ పడలేదు. అప్పట్లో రూ. 1300 చొప్పున గ్యాస్ కొనుగోలు చేసినట్లు ఆమె వివరించింది. విజయవాడ : ప్రజల్లో నగదు బదిలీపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ అమలులోకి వస్తే అగచాట్లు తప్పవని నిరసన తెలుపుతున్నారు. యూపీఏ ప్రభుత్వం మార్చి వరకు నగదు బదిలీ అమలు చేసింది. అయితే కొందరు ఖాతాల్లో నగదు పడలేదు. దాని సంగతి ప్రస్తావించకుండా వచ్చే నెల 10వ తేదీ నుంచి పథకాన్ని ఎన్డీయే అమలు చేయడంపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 12 వేల మందికి అందని నగదు నగరంలో, జిల్లాలో 11లక్షల గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. జిల్లాలో దాదాపు 12వేల మందికి ఇంకా సబ్సిడీ నగదు జమ పడ లేదు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం గాక, మరికొన్ని అన్లైన్లో పొరపాట్ల వల్ల నగదు అందలేదు. ఈలోగా కోర్టు ఉత్తర్వులు రావటంతో ప్రభుత్వం సబ్సిడీని నేరుగా మినహాయించి గ్యాస్ సరఫరా చేయడంతో నగదు బదిలీ గురించి పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. పేదల్లో భయం గతంలో నగదు బదిలీ పథకంతో ఇబ్బంది పడ్డామని పేద ప్రజలు వాపోతున్నారు. పూర్తిగా డబ్బు చెల్లించి గ్యాస్ కొనుగోలు చేసే స్థోమత తమకు లేదని పేర్కొంటున్నారు. ఆధార్ లేకపోయినా బ్యాంకు ఖాతాలు ఉంటే సబ్సిడీ వేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అసలు బ్యాంకు ఖాతా తెరవాలంటే ఆధార్ లేదా రేషన్ కార్డు తప్పని సరి అని బ్యాంకర్లు అంటున్నారని పేదలు వాపోతున్నారు. నగదు బదిలీతో రానున్న ఇబ్బందులు ఆధార్ కార్డు ఆధారంగా తెరిచిన బ్యాంకు ఖాతాల్లో పేర్లు, గ్యాస్ కనెక్షన్‌పై ఉన్న పేరుకు తేడా వస్తే సబ్సిడీ గల్లంతే. పేరు మార్చాలంటే కొత్త కనెక్షన్ చార్జి కంపెనీలకు చెల్లించాల్సిందే. ఆధార్ తీయించుకోకున్నా, దాంట్లో పేర్లు తప్పుపడినా గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు తప్పవు. -
నల్ల కుబేరుల్లో యూపీఏ మంత్రి!
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలు అన్ని వివరాలు కోర్టుకు సమర్పిస్తామని వెల్లడి న్యూఢిల్లీ: విదేశాల్లో నల్లధనం దాచిన వివరాలు వెల్లడైతే కాంగ్రెస్ వారికే ఇబ్బందంటూ మంగళవారం వ్యాఖ్యానించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. విదేశీ బ్యాంకుల్లో భారీ ఎత్తున బ్లాక్‌మనీ దాచిన నల్ల కుబేరుల జాబితాలో గత యూపీఏ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి పేరు ఉందంటూ బుధవారం సంకేతాలిచ్చి సంచలనం సృష్టించారు. సరైన సమయంలో ఆ వివరాలు బహిర్గతమవుతాయంటూ పలు జాతీ య చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. మన్మోహన్సింగ్ ప్రభుత్వంలోని ఒక మంత్రి ఆ జాబితాలో ఉన్నారన్న వార్తను మీరు ఖండిస్తారా? అన్న ప్రశ్నకు జైట్లీ జవాబిస్తూ.. ‘నేనా వార్తను ఖండించను. వాస్తవమని చెప్పను. నేను నవ్వుతున్నానంతే’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దగ్గరున్న నల్ల కుబేరుల వివరాలను ఇప్పుడు వెల్లడించలేనని, అలా వెల్లడిస్తే.. అది ఆయా దేశాలతో కుదిరిన సమాచార మార్పిడి ఒప్పందాల ఉల్లంఘన కిందకు వస్తుందని వివరించారు. విదేశీ ప్రభుత్వాలు తమకు అందించిన బ్లాక్‌మనీ అకౌంట్‌దారుల వివరాలున్న సమాచారాన్ని సుప్రీంకోర్టుకు అందజేస్తామని, అనంతరం ఆ వివరాలు సహజంగానే బహిర్గతమవుతాయని తెలిపారు. ‘ప్రభుత్వం దగ్గరున్న నల్ల కుబేరుల జాబితాలో.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక పలుకుబడి కలిగిన నేత పేరుందా?’ అన్న ప్రశ్నకు ‘ఎవరిపైన అయినా సరే.. అభియోగాలను రుజువు చేయగలిగే సమాచారం మా వద్ద ఉంటే ఆ సమాచారాన్ని కోర్టుకు అందజేస్తామని’ అన్నారు. వైరుధ్యాలకు అతీతంగా పార్టీలు సహకరించుకునే పద్ధతిలో భాగంగా.. కాంగ్రెస్ వారి పేర్లను వెల్లడించడం లేదా? అన్న ప్రశ్నకు.. ‘అది తప్పు. నా ప్రత్యర్థి పేరు అందు లో ఉంటే.. దాన్ని వెల్లడించేందుకు మరింత ఉత్సాహపడతా’ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీ హర్యానాలో జరిపిన భూ లావాదేవీల వివాదంలోఆ రాష్ట్రంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయమై సోనియాగాంధీ, రాహుల్‌లు చాలా ప్రశ్నలకు జవాబివ్వాల్సి ఉందన్నారు. ‘బెదిరింపులు మానండి’ నల్లధనం వివరాల వెల్లడి విషయంలో లీకేజీలతో బ్లాక్‌మెయిలింగ్ చేయడం మానేసి ధైర్యముంటే పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయాలని మోదీ సర్కారుకు కాంగ్రెస్ పార్టీ సవాల్ విసిరింది. విదేశీ ఖాతాదారుల వివరాలు వెల్లడిస్తే కాంగ్రెస్ ఇరుకునపడటం ఖాయమన్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. లీకేజీలు, అసమగ్ర వివరాలతో బెదిరింపులకు పాల్పడటాన్ని ప్రభుత్వం మానుకోవాలని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి అజయ్ మాకెన్ హితవు పలికారు. ‘మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయలేరు. ఆ ప్రయత్నం చేయకండి. నల్లధనం కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి’ అని మాకెన్ వ్యాఖ్యానించారు. నల్లధనం వ్యవహారం నుంచి దూరంగా పారిపోవడానికి జైట్లీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని మాట ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకెప్పుడు ఆ పని పూర్తి చేస్తారన్నారు. నల్లధనం అంశంపై మోదీ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఎం పార్టీ సీనియర్ నేత సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. పవర్లో ఉన్న పదేళ్లు ఏం చేశారు?: బీజేపీ నల్లధనం వ్యవహారంపై కాంగ్రెస్ విమర్శలకు బీజేపీ సమాధానమిచ్చింది. ఈ విషయంలో బీజేపీని ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, అధికారంలో ఉన్న గత పదేళ్ల కాలంలో విదేశాల నుంచి నల్ల ధనాన్ని తిరిగి తెప్పించేందుకు ఆ పార్టీ ఏం చేసిందని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ సూటిగా ప్రశ్నించారు. -
నల్లధనం మిథ్య! స్విస్ ఖాతాలు మిథ్య!
విదేశాల్లోని నల్లధనాన్ని తిరిగి తెస్తామంటూ మోదీ గత ఎన్నికల్లో చేసిన వాగ్దానం దాదాపుగా చంద్రబాబు రుణమాఫీ నినాదమంత ప్రభావాన్ని చూపింది. కాబట్టే బీజేపీని ఇరకాటంలో పెట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో లబ్ధి పొందాలని సోనియా ‘నల్లధనం మాటేమిటి?’ అని నిలదీస్తున్నారు. ‘నల్లధనం మాటేమి టి?’ మహారాష్ట్ర ఎన్నికల సమరంలో సోనియా గాంధీ సంధించిన తాజా అస్త్రం ఇది. ‘విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కు రప్పించడమే నా ప్రధాన లక్ష్యం’ అంటూ నేటి ప్రధా ని నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో చేసిన వాగ్దానమే ఆయన గెలుపునకు కారణం కావచ్చు. కానీ అది చం ద్రబాబు రుణమాఫీ నినాదం అంత ప్రభావాన్ని చూపింది. కాబట్టే బీజేపీని, మోదీని ఇరకాటంలో పెట్టి లబ్ధి పొందవచ్చని సోనియా తాపత్రయం. యూపీఏ ప్రభుత్వంపైకి ఎల్కే ఆద్వానీ, మోదీలు సంధించిన అస్త్రాన్నే ఆమె కూడా అందుకున్నారు. ఏ ఎన్నికల్లోనైనా అన్ని పార్టీలు చేయక తప్పని జపం ఇది. చిత్తశుద్ధికి వస్తే అన్నీ ఒక తానులోని ముక్కలే. మోదీ ప్రభుత్వం నల్లధనం గుట్టు రాబట్టడానికి ‘సిట్’ను ఏర్పాటు చేసిందని ఘనంగా చెప్పుకోన వసరం లేదు. దానికి సుప్రీం కోర్టు విధించిన గడువే కారణం. ‘విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెన క్కు తెప్పించాల’ని కోరుతూ 2009లో రామ్జెఠ్మ లానీ తదితరులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశా రు. ‘ప్రభుత్వం కళ్లుగప్పి విదేశీ బ్యాంకుల్లో డబ్బును అక్రమంగా దాచుకున్న వారి పేర్లను వెల్లడించండి’ అంటూ 2011 జనవరిలో సుప్రీం మధ్యంతర ఉత్త ర్యులను జారీ చేసింది. ప్రభుత్వం తాత్సారం చేస్తుం డటంతో 2011 జూలై 4న కోర్టే ‘సిట్’ను (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దానికి మాజీ న్యాయమూర్తి జీవన్‌రెడ్డి నేతృ త్వం వహించాలని నిర్దేశించింది. ‘సిట్’కేవలం జీవ న్‌రెడ్డికి మాత్రమే దర్యాప్తు సమాచారాన్ని వెల్లడించాలని జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి, ఎస్ఎస్ నిజ్జార్లు సూచించారు. (సుప్రీం సూచించే ఇలాంటి నైతిక సూత్రాలను హోంశాఖ కింద పనిచేసే ఏ దర్యాప్తు సంస్థ లేదా బృందం పాటించడం అరుదు). ‘ఇలాంటి నేరాలను అదుపు చేయలేకపోవడం ప్రభుత్వ అసమర్థతగా భావిస్తున్నాం’ అని కోర్టు నిష్కర్షగా పేర్కొంది. ప్రభుత్వం దాన్ని అవమానంగా భావిం చి ‘ఇది ప్రభుత్వ అసమర్థత కిందికి రాదు’ అంటూ అప్పీలుకు వెళ్లింది. ఈలోగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పదవీ విర మణ చేయగా ఆయన స్థానంలో జస్టిస్ అల్తమస్ కబీర్ నియమితులయ్యారు. నిజ్జార్‌కు భిన్నంగా ఆయన ప్రభుత్వ వాదనతో ఏకీభవించ డంతో ‘మూడవ అభిప్రాయం’ కోసం అది పైకి వెళ్లి అక్కడే ఉండిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కిం చుకునే ఆశల్లేని సోనియా యూపీఏ ప్రభుత్వం 2014 ఏప్రిల్‌లో స్విట్జర్లాండ్‌లోని ‘లిచ్ టెనిష్టియన్ బ్యాంక్’ ఇచ్చిన 26 మంది పేర్లను సుప్రీం కోర్టుకు అందజేసింది. ఇది రాబోయే ప్రభుత్వాన్ని ఇరకా టంలో పెట్టడానికి వేసిన ఎత్తుగడే. ప్రపంచ అక్రమార్జనాపరుల స్వర్గసీమ స్విట్టర్లాండ్‌లో 312 బ్యాంకులున్నాయి, వాటికి 3,120 శాఖలున్నాయి. వివిధ దేశాల నుండి పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు కోరితే సంబంధిత ఖాతాదారుల వివరాలను వెల్లడించాలనే నిబంధన ఇటీవలి కాలంలో అక్కడ అమల్లోకి వచ్చింది. విదే శాల్లో నల్లధనాన్ని దాచేవారు సాధారణంగా బినా మీల పేర్లతోనే ఖాతాలు తెరుస్తారు. నల్లధనాన్ని వెలికి తీసే ప్రయత్నాలు వేగంగా జరగాల్సి ఉంటుం ది. పూనెకు చెందిన హసన్ ఆలీ ఖాన్ అనే పందెపు గుర్రాల వ్యాపారి పేరు రచ్చకెక్కేటప్పటికే అతగాడు దాచిన డబ్బు అక్కడి నుండి రెక్కలు కట్టుకుని ఎగిరి పోయింది. ఇటీవలి కాలంలో స్విట్జర్లాండ్‌ను తల దన్నేలా సింగపూర్‌లాంటి నల్లధనం కోటలు చాలా నే పుట్టుకొచ్చాయి. నల్లధనం వెలికితీతపై ‘సిట్’ ఏర్పాటుకు సుప్రీం తుది గడువు 2014 మే 29. దీంతో మోదీ మే 28 మంత్రివర్గ సమావేశంలో రిటైర్డ్ న్యాయమూర్తి ఎమ్బీ షా నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్ జస్టిస్ జీవన్‌రెడ్డి. బీజేపీకి చెందిన రామ్‌జెఠ్మలానీ పిటీషన్ వేసి ఐదేళ్లు నిండాయి. ‘సిట్’ని నియమించాలని సుప్రీం ఆదేశించి మూడేళ్ల యింది. హడావుడిగా ‘సిట్’ను నియమించి ఐదు నెల్లు గడుస్తున్నా దాని అతీ గతీ మోదీకి పట్టలేదు. ఇప్పుడు సోనియాలాగే ఆయనకు కూడా మహా రాష్ట్ర ఎన్నికల జ్వరం పట్టుకున్నట్టుంది. ఏదో చేస్తు న్నామనిపించుకోవడానికి రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి ప్రతి నిధి బృందాన్ని స్విట్జర్లాండ్‌కు పంపుతున్నట్టు తాజా గా ప్రభుత్వం ప్రకటించింది. చట్ట విరుద్ద మార్గాల ద్వారా సేకరించిన అక్రమార్జనాపరుల జాబితాలను పరిగణనలోకి తీసుకునేదే లేదని, ఖాతాదారుల వివరాలను వెల్లడించే ప్రసక్తే లేదని ఫిబ్రవరిలో వచ్చిన సమాధానమే వస్తుంది గామోసు. సుప్రీం కోర్టు నల్లధనంపై కొరడా విసరడానికి ముందు స్విట్టర్లాండ్‌లోని మన నల్లధనం 5 లక్షల కోట్ల డాల ర్లు కాగా, ప్రస్తుతం అది 5 వేల కోట్ల డాలర్లకు చిక్కి పోయిందని అంచనా! మిగిలిన ఆ నాలుగు రాళ్లూ ‘సిట్’ దర్యాప్తు చేసి స్వయంగా ఖాతాదార్ల పేర్లు కనిపెట్టేసరికి మిగలవు. నల్లధనం మన ఎన్నికల వ్యవస్థకు ఊపిరిగా ఉన్నంత కాలం దానిపై పోరు ఎన్నికల నినాదంగానే మిగలక తప్పదు. - నన్నూరి వేణుగోపాల్ -
పేర్లు తీసేయాలని ఒత్తిడి చేశారు
కోల్గేట్, కామన్వెల్త్ గేమ్స్ ఆడిట్ నివేదికల్లో కొన్ని పేర్లు తొలగించమన్నారు యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్పై మాజీ కాగ్ వినోద్ రాయ్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై మరో మాజీ ఉన్నతాధికారి గళమెత్తారు. కోల్గేట్, కామన్వెల్త్ గేమ్స్ స్కాం ఆడిట్ రిపోర్టుల నుంచి కొన్ని పేర్లు తొలగించాలని అప్పటి రాజకీయ నేతలతో తనపై ఒత్తిడి తెచ్చారని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఆ పేర్లు తప్పించేలా తనను ఒప్పించడానికి తన సహచర ఐఏఎస్‌లతో కూడా ప్రయత్నించారన్నారు. ఈ విషయాలన్నీ అక్టోబర్‌లో విడుదల చేయబోయే తన పుస్తకం ‘నాట్ జస్ట్ యాన్ అకౌంటెంట్’లో వివరిస్తానని పేర్కొన్నారు. శనివారం ఇక్కడ ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మన్మోహన్ సింగ్, యూపీఏ ప్రభుత్వంపై ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం ఆలోచన లేకుండా, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఖజానాకు ఏ విధంగా నష్టం జరిగిందనే విషయాలపై పూర్తి స్థాయిలో వివరిస్తానని రాయ్ తెలిపారు. ‘‘ప్రధాని కీలకమైన వ్యక్తి. ఆయన తుది నిర్ణయం తీసుకోవాలి. మన్మోహన్ కొన్ని సార్లు తీసుకున్నారు. కొన్ని సార్లు తీసుకోలేదు. అధికారం నిలబెట్టుకోవడానికి అన్నింటినీ త్యాగం చేయకూడదు. సంకీర్ణ రాజకీయాలకోసం పాలనను బలి చేయకూడదు. అవన్నీ నేను పుస్తకంలో చెప్పాను’’ అని మాజీ ప్రధానిపై రాయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం, మాజీ ప్రధాని మన్మోహన్ నిష్క్రియాపరత్వంపై పీసీ పరేఖ్, సంజయ్ బారు, నట్వర్‌సింగ్ తమ పుస్తకాల్లో విమర్శించడం తెలిసిందే. అదే తరహాలో రాయ్ కూడా అప్పటి ప్రభుత్వంపై పెన్ను ఎత్తడం దుమారం రేపుతోంది. గతేడాది పదవి నుంచి నిష్ర్కమించిన రాయ్.. 2జీ, కోల్‌బ్లాక్ స్కాంలలో ప్రభుత్వం నష్టపోయిన నిధుల్ని అంచనావేశారు. కాంగ్రెస్ మండిపాటు.. ఈ మధ్యన ఏదోటి రాస్తూ.. దాన్ని సంచలనం చేస్తూ రిటైర్మెంట్ తర్వాత పింఛను సంపాదనలా మారిన దాన్ని రాయ్ కూడా అనుసరిస్తున్నారంటూ కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ మండిపడ్డారు. ఆయన చెప్పిన విషయాలపై చర్చకైనా సిద్ధమన్నారు. మన్మోహన్ మౌనం వీడాలి.. బీజేపీ నేత విజయ్ శంకర్ శాస్త్రి మాట్లాడుతూ.. మన్మోహన్ మాట్లాడే సమయం ఆసన్నమైందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థల్ని దుర్వినియోగం చేసిందన్నారు. -
హక్కులను హరించడం ఫాసిజమే: కేటీఆర్
హైదరాబాద్: తమ హక్కుల కోసం పోరాడడం ప్రజాస్వామ్యమ ని, ఒకరి హక్కులను హరించడం ఫాసిజం అని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కొనసాగించడానికే ఎన్డీయే ప్రభుత్వం ఉందా అని ఆయన ప్రశ్నిం చారు. అలా చేస్తే.. దానిని ప్రజలు యూపీఏ-3 గా పరిగణిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో యూపీఏని తిరస్కరించిన విషయం గుర్తు పెట్టుకోవాలని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించే విధంగా కేంద్ర హోం శాఖ తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖపై ఆయన పై విధంగా స్పందించారు. అర్హులను గుర్తించేందుకే సర్వే సిరిసిల్ల: సంక్షేమ పథకాల్లో అర్హులకు న్యా యం చేసేందుకే ఈ నెల 19న ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రణాళిక రూపకల్పనకు సర్వే దోహదపడుతుందన్నారు. -
ముగ్గురు సీజేఐలు ‘రాజీ’!
అవినీతి జడ్జిని కొనసాగించడానికి ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ మార్కండేయ కట్జూ సంచలన వ్యాఖ్యలు మద్రాస్ హైకోర్టుకు చెందిన ఆ అదనపు జడ్జి అవినీతికి పాల్పడ్డారన్న ఐబీ ఆయన్ను పదవిలో కొనసాగించకూడదని సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది కొనసాగించాల్సిందేనని యుపిఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన తమిళనాడు పార్టీ న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అదనపు జడ్జిని కొనసాగించేందుకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు(సీజేఐలు) ముగ్గురు ‘అసమంజసంగా రాజీ’పడ్డారంటూ ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. పేరు ప్రస్తావించకుండా తమిళనాడులోని మద్రాస్ హైకోర్టుకు చెందిన జడ్జి అంటూ కట్జూ చేసిన వ్యాఖ్యలపై సోమవారం పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి. రాజ్యసభ పలుమార్లు ఇదే అంశంపై వాయిదా పడింది. తమిళనాడులోని మిత్రపక్షం(డీఎంకే అయి ఉంటుందని భావిస్తున్నారు) నుంచి యూపీఏ-1 ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అదనపు జడ్జి పదవీకాలం ఎలా పొడిగించారో, తర్వాత శాశ్వత జడ్జి హోదా ఎలా ఇచ్చారో చెబుతూ కట్జూ ఓ ఆంగ్ల పత్రికలో కథనం రాశారు. తర్వాత సోమవారం టీవీ చానళ్లతో మాట్లాడారు. అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపిన ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ఇచ్చిన నివేదిక ప్రతికూలంగా ఉన్నప్పటికీ ముగ్గురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు-జస్టిస్‌లు ఆర్.సి.లహోతీ, వై.కె.సబర్వాల్, కె.జి.బాలకృష్ణన్- ఆ జడ్జిని ఆ పదవిలో కొనసాగించడానికి అసమంజసంగా రాజీపడ్డారన్నారు. నేను ఆశ్చర్యపోయాను..: ‘నేను మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు.. ఆ అదనపు జడ్జిపై చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇంటెలిజెన్స్ బ్యూరోతో రహస్య దర్యాప్తు చేయించాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ లహోతీని కోరాను. ఆరోపణల్లో నిజముందని ఐబీ నివేదిక తేల్చింది. దీంతో ఆ జడ్జిని పదవి నుంచి తప్పించాలి. కానీ అలా జరగలేదు’ అని కట్జూ తెలిపారు. ఈ జడ్జి విషయం సుప్రీంకోర్టులోని కొలీజియం దృష్టికి వెళ్లిందని, లహోతీ, సబర్వాల్ ఇద్దరూ అందులో సభ్యులుగా ఉన్నారని కట్జూ చెప్పారు. ఆ అదనపు జడ్జిని కొనసాగించకూడదని కొలీజియం కూడా సిఫార్సు చేసిందన్నారు. ప్రభుత్వం పడిపోతుందన్నారు: ‘‘ఆ సమయంలో ప్రధాని మన్మోహన్ సింగ్.. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకుగాను న్యూయార్క్ వెళ్లడానికి ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లగా తమిళనాడు పార్టీ మంత్రులు ఆయన్ను కలిసినట్లు తెలిసింది. (జడ్జిని కొనసాగించకపోతే) తాము మద్దతు ఉపసంహరించుకుంటాం కాబట్టి ఆయన తిరిగొచ్చేటప్పటికి ప్రభుత్వం పడిపోతుందని అన్నట్లు తెలిసింది’’ అని కట్జూ వివరించారు. ఇందులో ఎంత నిజం ఉందో తనకు తెలీదన్నారు. అయితే ఆందోళన పడవద్దని, తాను మేనేజ్ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ మంత్రి ఒకరు ప్రధానితో అన్నట్లు తెలిసిందన్నారు. లహోతీతో మొదలై.. జస్టిస్ లహోతీ ఈ రాజీని మొదలుపెట్టగా.. జస్టిస్ సబర్వాల్, జస్టిస్ బాలకృష్ణన్ దాన్నికొనసాగించారని కట్జూ పేర్కొన్నారు. మొదటి ఇద్దరూ ఆయన పదవీకాలాన్ని కొనసాగిస్తే.. జస్టిస్ బాలకృష్ణన్ శాశ్వత జడ్జిగా నియమించారని తెలిపారు. ‘‘ఈ సీజెఐలు లొంగిపోగలరు. రాజకీయ ఒత్తిళ్లకు వాళ్లు తలొగ్గారు’’ అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. యూపీఏ ప్రభుత్వం మిత్రపక్షాలపై ఆధారపడి ఉండడం, వాటిలో ఒకటి తమిళనాడు పార్టీ కావడమే దీనికి కారణమని తర్వాత తెలిసిందని కట్జూ పేర్కొన్నారు. ఇప్పుడెందుకు బయటపెట్టారు? ఈ విషయాన్ని పదేళ్లపాటు దాచి ఇప్పుడెందుకు బయటపెట్టారని కట్జూను ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో విలేకరులు ప్రశ్నించగా.. ఎప్పుడన్నది విషయం కాదని, ఇది నిజమా కాదా అన్న దానిపై దర్యాప్తు చేయాలని అన్నారు. ఇదే అంశంపై మరోసారి ప్రశ్నించగా.. ఆయన విసురుగా లేచి వెళ్లిపోయారు. ఆరోపణలు అవాస్తవం.. జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమైనవని.. ఆధారాలు లేనివని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఖండించారు. ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తడంలో ఉద్దేశమేమిటని ఆయన ప్రశ్నించారు. తమిళనాడులో న్యాయమూర్తిని కొనసాగించటం అన్నది పూర్తిగా నిబంధనలను అనుసరించే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. సదరు న్యాయమూర్తి చనిపోయిన తరువాత ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేయటంలో అర్థం లేదని బాలకృష్ణన్ అన్నారు. ఆ న్యాయమూర్తికి తమిళనాడులో అధికార పార్టీతో సత్సంబంధాలున్నట్టుగా ఆరోపణలు ఉన్న మాట వాస్తవమేనని అందుకే ఆయన్ని ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేశామని బాలకృష్ణన్ చెప్పారు. జస్టిస్ లాహోతీ కూడా కట్జూ ఆరోపణలను ఖండించారు. కట్జూ చేసిన ఆరోపణలపై తమిళనాడులోని రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ఈ ఆరోపణలపై వెంటనే దర్యాప్తు జరిపించాలని అన్నాడీఎంకే నేత తంబిదురై లోక్‌సభలో డిమాండ్ చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ అంశం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమన్నారు. ఈ అరోపణలను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. వార్తల్లో ఉండటంతో పాటు ప్రస్తుత ప్రభుత్వానికి దగ్గర కావటం కోసమే కట్జూ ఈ ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా అన్నారు. ఇన్నాళ్లూ కట్జూ ఈ విషయంపై ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని సీనియర్ న్యాయవాది రాంజెత్మలానీ అన్నారు. కాగా కట్జూ ఆరోపించిన అదనపు న్యాయమూర్తి, 2001లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరుణానిధిని అర్ధరాత్రి అరెస్టు చేసిన సందర్భంగా ఆయనకు బెయిలిచ్చిన న్యాయమూర్తే అయి ఉండవచ్చని ఎన్డీటీవీ కథనం.కాగా ఈ విషయంపై స్పందించటానికి మాజీ ప్రధాని మన్మోహన్ నిరాకరించారు. -
పర్యావరణ గాంధేయుడు
యూపీఏ ప్రభుత్వం గద్దెదిగుతూ తీసుకొన్న ఏకైక మంచి నిర్ణయం అంటూ అనేక మంది ప్రశంసిస్తున్నారు.. యాభై సంవత్సరాల ఆ ఉద్యమ రూపానికి ఈ అవార్డు దక్కడం హర్షణీయమని మరికొందరంటున్నారు. ఆయనకు ‘గాంధీ శాంతి పురస్కారం’ ప్రదానం చేయడం గాంధేయవాదానికే పురస్కారం అనే ప్రశంసలూ వినిపిస్తున్నాయి. ఈ విధంగా నేటి తరానికి పునఃపరిచయమవుతున్నారు చండీప్రసాద్ భట్. దశాబ్దాల క్రితమే పర్యావరణ వేత్తగా పేరు తెచ్చుకొని... ఆ పేరుతో పనిలేకుండా తన మటుకు తాను హిమాలయపర్వత సానువుల్లో ప్రకృతి పరిరక్షణకు పాటుపడుతూ ఉన్న చండీప్రసాద్ను ‘గాంధీ పీస్ ప్రైజ్’ వరించింది. ఇటీవలే రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్న ఆయన... ఇప్పటికే రామన్ మెగసేసే, పద్మభూషణ్ అవార్డులను అందుకొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం జరిగిన ముఖ్యమైన సామాజిక ఉద్యమాల్లో ఒకటి ‘చిప్కో’ ఉద్యమం. చరిత్రలో అంతకు ముందు ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఉద్యమం అది. చెట్లను కాపాడుకోవడానికి వాటిని కౌగిలించుకొని, తమను నరికిన తర్వాతే వాటిని నరకాలంటూ హిమాలయ పర్వత సానువుల్లోని ప్రజలు చేసిన ఉద్యమం అది. అలాంటి ఉద్యమానికి అండదండగా నిలిచిన వ్యక్తుల్లో చండీప్రసాద్ భట్ ముఖ్యులు. సుందర్‌లాల్ బహుగుణ వంటి వారితో కలిసి గ్రామీణ ప్రాంత ప్రజల్లో స్ఫూర్తి నింపారాయన. రిషికేష్ - బదరీనాథ్ ప్రాంతంలో బస్ కండక్టర్‌గా పనిచేస్తున్న చండీప్రసాద్‌కు అప్పటి సోషలిస్టు నేత జయప్రకాశ్‌నారాయణ్ అంటే అభిమానం. ఆయన ప్రసంగాలు విని స్ఫూర్తి పొందిన భట్... తన జీవితాన్ని సమాజ శ్రేయస్సుకే అంకితమివ్వాలని భావించారు. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో భాగమైన గోపీశ్వర్ ప్రాంతంలో ప్రజాశ్రేయస్సును లక్ష్యంగా చేసుకొని 1964లో దషోలి గ్రామస్వరాజ్ సంఘ్‌ను స్థాపించారు. పండ్లతోటలు, పశుపోషణ, అటవీ ఉత్పత్తులు, అడవులు-సహజవనరుల పరిరక్షణే లక్ష్యంగా అటవీ ప్రాంత ప్రజల్లో అవగాహన నింపడమే ఆ సంస్థ లక్ష్యం. ప్రశాంతంగా ఉన్న గోపీశ్వర్ ప్రాంతాన్ని 1970లో అలకనందా వరదలు ముంచెత్తడంతో జనజీవితం అతలాకుతలం అయ్యింది. చరిత్రలో ఎన్నడూ కలగనంత నష్టం జరిగింది. ప్రభుత్వం దాన్ని ప్రకృతి విపత్తుగా ప్రకటించింది. అయితే దషోలీ గ్రామ్ స్వరాజ్ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు. అది ప్రకృతి విపత్తు కాదు, మానవ తప్పదం వల్ల జరిగిన తప్పు అంటూ వాదించారు. సహజంగా తన దారిన వెళ్లాల్సిన అలకనందా నదికి అభివృద్ధి పేరుతో జరిగిన విఘాతమే వరదలకు కారణమని వారు అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం వారి వాదనను పట్టించుకోలేదు. దాంతో దషోలీ గ్రామ్స్వరాజ్ మండల్ రంగంలోకి దిగింది. వరదలు ఎందుకు వచ్చాయో ప్రజలకు తెలియజెప్పింది. చెట్లను కాపాడుకోవాలని ఉద్బోధించింది. ప్రభుత్వానికి ఆ విషయం అర్థం కాలేదు కానీ, ప్రజలకు మాత్రం బాగా అర్థమైంది. అందుకు రుజువే చిప్కో ఉద్యమం. 1980 నాటికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యాపార అవసరాల కోసం చెట్లను నరకడాన్ని పూర్తిగా నిషేధించడంతో చిప్కో ఉద్యమం విజయవంతం అయ్యింది. చండీప్రసాద్ సేవకు గానూ 1984లో ఆసియా నోబెల్ప్రైజ్గా పేరు పొందిన ‘రామన్ మెగసేసే’ అవార్డు దక్కింది. భట్ సేవలను భారత ప్రభుత్వం ఆలస్యంగానైనా గుర్తించి, 2005లో ‘పద్మభూషణ్’తో సత్కరించింది. ఈ యేడు మార్చిలో ‘గాంధీ శాంతి బహుమతి’ని ప్రకటించింది. జూలై 15వ తేదీన ఆయనకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేసింది. ప్రస్తుతం భట్ వయసు 80 యేళ్లు. ఇప్పటికీ ఆయన గోపేశ్వర్ ప్రాంతంలో, రిషికేష్ పక్కన ఉన్న పర్వత సానువుల్లో తిరుగుతూ అక్కడి ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు. అడవులను, ప్రకృతి సంపదను కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తూ ఉంటారు. జీవితాంతం ఇలా పర్యావరణ పరిరక్షకుడిగానే కొనసాగుతానంటాడు ఈ అసమాన సేవకుడు! - బి. జీవన్‌రెడ్డి -
యూపీఏను సాగనంపాలి: గోవా సీఎం పారికర్
హైదరాబాద్, న్యూస్‌లైన్: దేశంలో ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, అన్ని విధాలా భ్రష్టుపట్టిన యూపీఏ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. శుక్రవారం బేగంపేట పర్యాటక భవన్‌లోని హరితా హోటల్లో ‘ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలోను, అంతకు ముందు మీడియాతో ఆయన మాట్లాడారు. టీడీపీతో పొత్తు ఇరుపార్టీలకు మేలు చేస్తుందన్నారు. సీమాంధ్రలో బీజేపీ-టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని, తెలంగాణలో ఆశించిన స్థాయిలో స్థానాలు కైవసం చేసుకుంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తోందని, స్పష్టమైన మెజార్టీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. -
యూపీఏ ప్రజల విశ్వాసం కోల్పోయింది
దేవీచౌక్ (రాజమండ్రి), న్యూస్‌లైన్ : యూపీఏ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది, అన్ని రంగాల్లోను దేశాన్ని అథోగతి పాలుచేసిందని కేంద్ర మాజీ మంత్రి, సీమాంధ్ర బీజేపీ ప్రచార కమిటీ కన్వీనర్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ‘ప్రధానిగా మోడీ-సీమాంధ్రలో అభివృద్ధికై బీజేపీ’ నినాదంతో స్థానిక జాంపేట శ్రీఉమారామలింగేశ్వరస్వామి కల్యాణ మండపంలో గురువారం జరిగిన సీమాంధ్ర ఎన్నికల ప్రచార యాత్ర సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ పురోభివృద్ధి రేటు 8 శాతం నుంచి 5 శాతానికి యూపీఏ పాలనలో దిగజారిందన్నారు. యువకులు ఉద్యోగావకాశాలు లేక అసంతృప్తితో ఉన్నారన్నారు. యూపీఏ పాలనలో మహిళలు నిర్లక్ష్యానికి గురయ్యారని పేర్కొన్నారు. గిట్టుబాటు ధర లభించక రైతులు నిరాశలో ఉన్నారన్నారు. రాష్ట్ర విభజన అప్రజాస్వామికంగా జరిగిందని పురంధేశ్వరి అన్నారు. రాజ్యసభలో బీజేపీ ఒత్తిడి వలనే ప్రధాని మన్మోహన్సింగ్ సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వడానికి, పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో విలీనం చేయడానికి అంగీకరించారన్నారు. యూపీఏకు తెలుగువాడు గుణపాఠం చెప్పవలసిన తరుణం ఆసన్నమయిందన్నారు. మాజీ మంత్రి కృష్ణంరాజు మాట్లాడుతూ సీమాంధ్రను సింగపూర్ చేస్తామని కొందరు చెబుతున్నారని, కానీ నరేంద్రమోడీ గుజరాత్లో మారుమూల పల్లెసీమల్లో కూడా విద్యుత్ కోతలు లేకుండా చేశారన్నారు. 60 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించలేని ప్రగతిని 60 నెలల్లో మోడీ సాధించగలరని కృష్ణంరాజు అన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. పార్టీ సీమాంధ్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక, దేశాన్ని ఒకే ఫుడ్ జోన్‌గా ప్రకటిస్తుందన్నారు. పోలవరం డిజైన్‌ను రూపొందించవలసింది సాంకేతిక నిఫుణులేకానీ కేసీఆర్ కాదన్నారు. దున్నపోతుకు గడ్డివేసి, గేదెను పాలిమ్మంటే ఇవ్వదు, మిగతా పార్టీలకు ఓటు వేయడం వలన మోడీ అభివృద్ధి ఫలాలు మనకు అందవన్నారు. జాతీయ కార్యవర్గసభ్యుడు సోము వీర్రాజు, రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడు క్షత్రియ బాల సుబ్రహ్మణ్యం సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి, డాక్టర్ ఆకుల సత్యనారాయణ, సూర్యనారాయణరాజు, పొట్లూరి రామ్మోహనరావు, గరిమెళ్ల చిట్టిబాబు, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణారావు, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే, దివంగత ఏసీవై రెడ్డి అన్న కుమార్తె, మాజీ కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి తదితరులు బీజేపీలో చేరారు.