మన్మోహన్‌ను విచారించలేదేం?
బొగ్గు స్కాం కేసులో సీబీఐని ప్రశ్నించిన ప్రత్యేక కోర్టు
మాజీ ప్రధానిని ప్రశ్నించేందుకు అనుమతివ్వలేదన్న సీబీఐ
సీబీఐ న్యాయవాదిపై {పశ్నల వర్షం కురిపించిన జడ్జి
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంలో బొగ్గుశాఖ బాధ్యతలను అదనంగా నిర్వర్తించిన నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కోల్‌స్కాం కేసులో విచారించడానికి తమకు అనుమతి రాలేదని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టుకు సీబీఐ తెలిపింది. ఒరిస్సాలోని తలాబిరా-2, 3బొగ్గుగనుల కేటాయింపుల్లో అక్రమాలకు సంబంధించిన కేసు మంగళవారం కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ఈ కేసులో పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌తోపాటు హిందాల్కో కంపెనీ అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి భరత్ పరాశర్.. సీబీఐదర్యాప్తు అధికారిపై ప్రశ్నల పరంపర కురిపించారు. ‘ఈ కేసులో నాటి బొగ్గుశాఖ మంత్రిని విచారించాల్సిన అవసరం లేదని మీరు భావించారా? కేసులో అనేక అంశాలపై స్పష్టత వచ్చేందుకు ఆయన వాంగ్మూలం అవసరమని మీకు ఎందుకు అనిపించలేదు’ అని ప్రశ్నించారు. దర్యాప్తు అధికారి బదులిస్తూ.. ‘మొదట మన్మోహన్‌ను ప్రశ్నించాలని భావించాం. కానీ ప్రధాని కార్యాలయం అధికారులు నాయర్, జావెద్ ఉస్మానీలను ప్రశ్నించాం. వారి వాంగ్మూలం సరిపోతుందనుకున్నాం.’ అని పేర్కొన్నారు.
ఇదే సమయంలో నాటి బొగ్గుశాఖ బాధ్యతలను చూసిన ప్రధానిని విచారించేందుకు తమకు అనుమతి రాలేదని వివరించారు. ఈ సందర్భంగా పీఎంవో అధికారులను ముఖాముఖీ ప్రశ్నించా రా? లేదా వారికి ప్రశ్నావళిని పంపి సమాధానాలు అడిగారా? అని న్యాయమూర్తి అడిగారు. ఇందుకు నేరుగానే ప్రశ్నించామని న్యాయవాది బదులిచ్చారు. తర్వాత న్యాయమూర్తి... ‘దీనిపై సమగ్ర అవగాహనకు రావాలంటే కేసు దర్యాప్తు ఎలా సాగింది, ఎవరెవరిని ఎలా ప్రశ్నించారన్న విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ కేసు డైరీ, ఇతర ఫైళ్లన్నీ సీల్డ్ కవర్‌లో మా ముందుంచండి’అని సీబీఐని ఆదేశించారు. కేసు తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. 2005లో ప్రధాని మన్మోహన్ అదనంగా బొగ్గుశాఖ బాధ్యతలను నిర్వర్తించారు. కాగా, తలాబిరా బొగ్గు గనుల కేటాయింపు కేసు డైరీ, సంబంధిత ఫైళ్లన్నీ న్యాయస్థానానికి అందజేస్తామని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా చెప్పారు. వాటిని పరిశీలించాక మన్మోహన్‌ను ప్రశ్నించకపోవడం తప్పో కాదో నిర్ణయించాల్సింది కోర్టేనని అన్నారు.