నేటి నుంచి ఆధార్
ఆధార్ కార్డుల జారీపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయానికి వచ్చింది. శనివారం నుం చి రాష్ట్ర వ్యాప్తంగా 469 ప్రత్యేక శిబిరాల ద్వారా ఆధా ర్ కార్డులను జారీచేయాలని నిశ్చయించింది. చెన్నైలోనే 50 కేంద్రాల ద్వారా కార్డులు జారీ చేయనున్నారు.
* 469 ప్రత్యేక శిబిరాలు
* చెన్నైలోనే 50 శిబిరాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: భారత పౌరసత్వ నిర్ధారణకు గతంలోని యూపీఏ ప్రభుత్వం ఆధార్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆధార్ కార్డు ఒక స్మార్టు కార్డులా అన్ని ప్రయోజనాలు కలిగించేలా తీర్చిదిద్దాలని సంకల్పించింది. బయోమెట్రిక్ విధానంలో జారీచేసే ఈ కార్డు ద్వారా పాస్‌పోర్టు, రేషన్ కార్డులు, బ్యాంకు ఖాతాలు. తదితర ప్రయోజనాలు పొందేలా రూపకల్పన చేసింది. అయితే ఆధార్ కార్డుపై అదే ప్రభుత్వంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో అధార్ కార్డుల జారీ జాతీయ స్థాయిలో మందగించింది.
ఇందులో భాగంగా రాష్ట్రంలో సైతం ఆధార్ కార్డుల జారీ వ్యవహారం అర్ధాంతరంగా అటకెక్కింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆధార్‌కార్డుల అంశాన్ని పక్కన పెట్టేసింది. అయితే మరలా మనస్సు మార్చుకుని జారీచేసేందుకు సిద్ధమైంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 25.94 లక్షల ఆధార్ కార్డుల జారీతో 67 శాతంతో తొలిదశ పూర్తయింది. అప్పట్లో 89.23 శాతం కార్డుల జారీతో పెరంబలూరు జిల్లా ప్రథమస్తానంలో నిలిచింది. రామనాథపురం జిల్లా 85.65, అరియలూరు, తిరుచ్చీ జిల్లాలు 81.61, నాగపట్నం జిల్లా 81.54 శాతం కార్డులు జారీఅయ్యాయి.
అయితే ఆ తరువాత మలిదశ కుంటువడింది. తాజాగా మళ్లీ అదేశాలు రావడంతో యంత్రాంగం సిద్ధమైంది. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 469 ప్రత్యేక శిబిరాల ద్వారా ఆధార్ కార్డులను జారీచేసే ప్రక్రియను ప్రారంభించనుంది. వీటిల్లో 268 శాశ్వత శిబిరాలుగా నిర్ణయించారు. చెన్నైలో 50 శాశ్వత శిబిరాలను నిర్వహించనున్నారు. కార్పొరేషన్, మునిసిపాలిటీ, పంచాయతీ, తహశీల్దారు కార్యాలయాల్లో శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.