Biometric policy
-
రాష్ట్రంలో భారీగా పెరిగిన లబ్ధిదారుల సంఖ్య
-
58,99,065 మందికి పింఛన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛనుదారుల సంఖ్య 58,99,065కు చేరుకుంది. ఫిబ్రవరిలో 54,68,322 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ లెక్కన గత నెలతో పోల్చితే 4,30,743 పింఛన్లు పెరిగాయి. నెలన్నర వ్యవధిలో ప్రభుత్వం 7.41 లక్షల మందికి (ఫిబ్రవరిలో 6.14 లక్షలు, మార్చిలో 1,27,207 లక్షలు) కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. మార్చి 1వ తేదీ అదివారం సెలవు రోజు అయినప్పటికీ పింఛన్‌దారులకు వారి ఇంటి వద్దే డబ్బులు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నాని కల్లా వంద శాతం పంపిణీ పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో రాజాబాబు తెలిపారు. పింఛన్లు పంపిణీ చేసేందుకు వలంటీరు తమ పరిధిలో ఉండే ఫించనుదారులందరినీ ఒక చోటుకు పిలిపించడం చేయరాదని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా లబ్ధిదారుల వేలి ముద్రలు తీసుకున్న తర్వాత నగదు పంపిణీ చేయాలని సూచించామని చెప్పారు. ఈ ప్రక్రియతో సంబంధం లేని ప్రైవేట్ వ్యక్తులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు తీసుకెళ్లొద్దని వలంటీర్లకు సూచించామన్నారు. -
ఉత్తర్వులే
► జూనియర్ కళాశాలల్లో కానరాని బయోమెట్రిక్ విధానం ► బోగస్ హాజరుతో స్కాలర్షిప్లు మెక్కుతున్న యాజమాన్యాలు! ► పట్టించుకోని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు నెల్లూరు (టౌన్) : ఇంటర్మీడియెట్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు నమోదుకు విధిగా బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సర ప్రారంభం నుంచి బయోమెట్రిక్ విధానంలోనే విద్యార్థుల హాజరు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే, జిల్లాలో ఒక్క కళాశాలలోనూ బయోమెట్రిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఈ విధానం అమలుకు నిరాకరించే కళాశాలల గుర్తింపు రద్దు చేస్తామన్న హెచ్చరి కను సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాలను విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ఇంటర్మీ డియెట్ బోర్డు అ«ధికారులు సైతం ఈ విషయంలో మిన్నకుండిపోతున్నారు. ఉపకార వేతనాలను మేసేందుకేనా! జిల్లాలో 121 కార్పొరేట్, 26 ప్రభుత్వ, 15 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 60 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రతినెలా రూ.325 చొప్పున 10 నెలలకు రూ.3,250 స్కాలర్షిప్ మంజూరవుతోంది. ఈ సొమ్ము కోసం చాలా కళాశాలలు అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కళాశాలలకు రావాల్సిన అవసరం ఉండదని, పాస్ చేయించే బాధ్యత తమదేనని భరోసా ఇస్తూ పలు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను తరగతుల్లో చేర్చుకుంటున్నాయి. విద్యార్థులు రోజూ కళాశాలకు రాకపోయిన రికార్డులో హాజరు చూపిస్తూ స్కాలర్ షిప్పు మొత్తాలను కాజేస్తున్నాయి. మరోవైపు ఇతర విద్యార్థులు తరగతులకు రాకపోయినా హాజరు నమోదు చేసి వారినుంచి వేలకు వేలు దండుకుంటున్నారు. కొన్ని సంద ర్భాల్లో హాజరు తక్కువగా ఉందంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారు. అక్రమాలను అరికట్టేందుకే బయోమెట్రిక్ జూనియర్ కళాశాలల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తెరపైకి తెచ్చింది. ప్రతి విద్యార్థి ఆధార్ నంబర్‌ను బయోమెట్రిక్‌కు అనుసంధానం చేసింది. కళాశాలకు వచ్చే ప్రతి విద్యార్థి ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా వేలిముద్ర ద్వారా హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే ప్రభుత్వం స్కాలర్షిప్ సొమ్ము విడుదల చేస్తుంది. ఈ దృష్ట్యా ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్ యంత్రం చొప్పున కళా శాలల్లో ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు ఆదేశించింది. ఇవి ఏర్పాటు కాకపోతే ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్ఐఓ) బాధ్యులవుతా రని ఉన్నతాధికారులు హెచ్చరించారు. అయినా జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయలేదు. జిల్లాలో జూనియర్ కళాశాలలు 162 కార్పొరేట్ కాలేజీలు 121 ప్రభుత్వ కళాశాలలు 26 ఎయిడెడ్ పరిధిలో 15 ఇంటర్మీడియెట్ విద్యార్థులు 60 వేలు సెప్టెంబర్ వరకు గడువిచ్చాం జిల్లాలోని కళాశాలల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు బయోమెట్రిక్ యంత్రాల ఏర్పాటుకు సెప్టెంబరు నెలాఖరు వరకు గడువు ఇచ్చాం. అప్పటికి ప్రతి జూనియర్ కళాశాలలో బయోమెట్రిక్ యంత్రాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. లేకుంటే విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు కాదు. బయోమెట్రిక్ ద్వారా వచ్చే హాజరునే పరిగణనలోకి తీసుకుంటాం. – బాబూజాకబ్, ఆర్ఐఓ, ఇంటర్మీడియెట్ బోర్డు. -
నిజమే.. అధికారులెవరూ ఆఫీసులో లేరు
- ‘రిజిస్ట్రేషన్ల శాఖకు సుస్తీ’పై స్పందించిన కమిషనర్ - విచారణకు ఆదేశించిన స్పెషల్ సీఎస్ సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారులందరూ వివిధ పనుల నిమిత్తం శుక్రవారం కార్యాలయానికి రాలేదని ఆ శాఖ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ అహ్మద్ నదీమ్ అంగీకరించారు. పలు సమస్యలతో ఆఫీసుకు వచ్చిన వారిని పట్టించుకునే వారు లేకపోవడంపై ‘రిజిస్ట్రేషన్ల శాఖకు సుస్తీ’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు అహ్మద్ వివరణ ఇచ్చారు. కార్మిక శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న తనకు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించిందని, శుక్రవారమంతా కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలోనే ఉండటం వలన రిజిస్ట్రేషన్ల శాఖకు వెళ్లలేకపోయానని తెలిపారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్స్‌లో ఒకరు బెంగళూరులో వర్క్‌షాప్‌కు వెళ్లగా, మరొకరు అనారోగ్య కారణాలతో సెలవు పెట్టారని పేర్కొన్నారు. జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ (జేఐజీ), అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఏఐజీ) శుక్రవారం కార్యాలయానికి వచ్చారని తెలిపిన కమిషనర్, వారు మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యాలయంలో లేకపోవడాన్ని ప్రస్తావించ లేదు. మొత్తం 54 మంది ఉద్యోగుల్లో 47 మంది హాజరయ్యారని చెబుతున్న కమిషనర్, వారిలో సగం మంది సీట్లలో లేకపోవడాన్ని కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. మరోవైపు ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర విచారణకు ఆదేశించడం రిజిస్ట్రేషన్ల శాఖలో అలజడి రేపింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఉన్నతాధికారులు, ఉద్యోగులు పత్తా లేకపోవడంపై స్పెషల్ సీఎస్ సీరియస్‌గా ఉన్నారని, బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయానికి వచ్చారని తెలిసింది. -
రాష్ర్టంలో నకిలీ వైద్యులు
ఇప్పటివరకు 2వేల మంది గుర్తింపు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ బెంగళూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు వేల మంది నకిలీ వైద్యులను గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ వెల్లడించారు. వీరు నిర్వహిస్తున్న క్లినిక్‌లను సైతం మూయించేశామని చెప్పారు. శుక్రవారమిక్కడి ఓ హోటల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సువర్ణ భవన’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలను మోసం చేస్తున్న నకిలీ వైద్యులపై ఇప్పటికే 230 ఎఫ్ఐఆర్లను సైతం నమోదు చేసినట్లు చెప్పారు. నకిలీ వైద్యుల బెడదను తప్పించేందుకు ఆయుష్ మండలి ఇప్పటికే దేశంలోనే మొట్టమొదటి సారిగా బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని యు.టి.ఖాదర్ తెలిపారు. గతంలొ కలకత్తా, ఢిల్లీ వంటి వివిధ ప్రాంతాల్లో తాము వైద్యవిద్యను పూర్తి చేశామని చెప్పుకొని చాలా మంది నకిలీ వైద్యులు ఆస్పత్రులను నిర్వహించే వారని పేర్కొన్నారు. వారు చూపించే ధ్రువీకరణ పత్రాలు అసలైనవా లేక నకిలీవా అని గుర్తిచండం చాలా క్లిష్టమైన సమస్యగా ఉండేదని చెప్పారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనగలిగామని వెల్లడించారు. రాష్ట్రంలో ఆయుష్ మండలి చక్కగా పనిచేస్తోందని, అందువల్లనే అంతర్జాతీయ ఆయుర్వేద ఎక్స్పో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు అవకాశాన్ని కల్పించిందని వివరించారు. సెప్టెంబర్‌లో ఈ ఎక్స్పో జరగనుందని మంత్రి యు.టి.ఖాదర్ వెల్లడించారు. ఏ బాల్ అయినా బ్యాటింగ్ చేస్తా.... ‘మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణలో మంత్రి స్థానం పోతుందనో లేదంటే శాఖ మారుతుందనో నాకు భయం లేదు. ఏ బాల్ అయినా బ్యాటింగ్ చేయడానికి సిద్ధం, ఏ శాఖ అయినా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతించేందుకు సన్నద్ధంగా ఉన్నాను’ అని యు.టి.ఖాదర్ స్పష్టం చేశారు. -
నేటి నుంచి ఓయూసెట్ పరీక్షలు
హైదరాబాద్: ఓయూతో పాటు తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల్లో వివిధ పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ళ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సోమవారం నుంచి ఓయూసెట్-2016 ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం ఎమ్మెస్సీ జాగ్రఫీ, మధ్యాహ్నం ఎంఏ థియేటర్ ఆర్ట్స్, ఎమ్మెస్సీ జాగ్రఫీ, ఎలక్ట్రానిక్స్, సాయంత్రం ఎంఏ లింగ్విస్టిక్స్ కోర్సులకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. బయోమెట్రిక్ విధానం కావడంతో పరీక్షకు అరగంట ముందుగా చేరుకోవాలని పీజీ అడ్మిషన్స్ జాయింట్ డెరైక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. -
కలెక్టర్ చెబితే వినాలా?
- బయోమెట్రిక్ హాజరుపై వైద్యుల వ్యతిరేకత - ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో వాగ్వాదం నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యు లు బయోమెట్రిక్ హాజరు విధానంపై మొండివైఖరి ప్రదర్శిస్తున్నారు. అమ లు కాకుండా అడ్డుకుంటున్నారు. సోమవారం ఆస్పత్రిలో వైద్యులు, సూపరింటెండెంట్ మధ్య సమావేశం జరిగింది. బయోమెట్రిక్ హాజరుతో ఎలాంటి ప్రయోజనం లేదని, అమలు చేయవద్దని సూపరిండెంట్‌తో వైద్యులు పేర్కొన్నారు. ఓ వైపు వైద్యుల కొరత ఉందని, మరోవైపు మెడికల్ కళాశాల అనుమతి కోసం ఎంసీఐ పర్యటించే అవకాశం ఉన్న సమయంలో బయోమెట్రిక్ విధానం ఎందుకని సూపరిండెంట్‌ను ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకా రం బయోమెట్రిక్ అమలు చేయడం తప్పనిసరి అని సూపరిండెంట్ పేర్కొన గా వైద్యులు వాగ్వివాదానికి దిగారు. అత్యవసర వైద్యసేవలు ఉండడంతో బ యోమెట్రిక్ విధానం సాధ్యం కాదని ఓ వైద్యురాలు పేర్కొనడం గమనార్హం. రాష్ట్రంలో ఎక్కడ కూడా మెడికల్ కళాశాలలో ఈ విధానం లేనప్పుడు ఇక్కడ ఎందుకు అమలు చేస్తున్నారని అన్నారు. అయినా జిల్లా కలెక్టర్ ఆదేశిస్తే వై ద్యులు వినాలా...అంటూ సూపరింటెండెంట్‌ను నిలదీసినట్లు సమాచారం. మెడికల్ కళాశాలకు డీఎంఈ ఉండగా కలెక్టర్ ఆదేశాలు ఎందుకు పాటించాలని అన్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని వైద్యులు పరోక్షంగా సూపరింటెండెంట్‌ను నిలదీశారు. కలెక్టర్ ఆదేశాల మేర కు సూపరింటెండెంట్ ఆస్పత్రిలో బయోమెట్రిక్ హాజరు అనుమతి కోసం డీ ఎంఈకి నివేదించారు. అనంతరం బయోమెట్రిక్‌ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వైద్యులు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరను కలిశారు. బయోమెట్రిక్ విధానం అమలు చేయవద్దని వైద్యులకు వెసులుబాటు కల్పించాలని కోరగా ప్రిన్సిపల్ అంగీకరించలేదు. తప్పనిసరిగా బయోమెట్రిక్ విధా నం అమలు చేయాల్సిందేనని, కలెక్టర్ ఆదేశాలను పాటించవల్సిందేనని తే ల్చిచెప్పారు. దీంతో వైద్యులు డీఎంఈవోతో మాట్లాడుతామని వెనుతిరిగా రు. సమావేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వాల వైద్యుల సంఘం అధ్యక్షు డు డాక్టర్ గోపాల్‌సింగ్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ఎన్నో సమస్యలు ఉన్నాయ ని, వైద్యుల కొరత, సిబ్బంది కొరత ఉందని ఇలాంటి సమయంలో బయోమెట్రిక్ విధానం ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. అలాగే మెడికల్ కళాశాలకు ఎంసీఐ వచ్చే అవకాశం ఉందని వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని బయోమెట్రిక్ విధానంను కొన్ని రోజుల పాటు వాయిదావేసుకుంటే బాగుంటుందన్నారు. -
ఇక అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలకు విద్యార్ధులు, టీచర్ల హాజరును పర్యవేక్షించడంతో పాటు మధ్యాహ్నభోజన పథకంలో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ విధానాన్ని చేపడుతోంది. వచ్చే విద్యాసంవత్సరంనుంచే ఈ బయోమెట్రిక్ విధానం అమల్లోకి రానుంది. దీనికోసం రూ.20 కోట్లను వెచ్చించి పరికరాలు సమకూర్చనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల వాస్తవ సంఖ్యకు రికార్డుల్లోని సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉంటోందని, దీనివల్ల సరైన ప్రణాళికల రూపకల్పనకు వీలులేకపోవడంతో పాటు దొంగ హాజరువల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగమవుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు బయోమెట్రిక్ పరికరాలు ఉపయోగపడతాయని వీటి ఏర్పాటుకు నిర్ణయించారు. ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, కస్తూరిబా బాలికా విద్యాలయాలు, సంఘిక సంక్షేమ హాస్టళ్లు తదితర అన్ని స్కూళ్లలోనూ బయోమెట్రిక్ పరికరాలు ఏర్పాటుచేయనున్నారు. ఈ పాఠశాలల్లో రోజువారీ హాజరు, మధ్యాహ్నభోజన వివరాలను ఎప్పటికప్పుడు ఈ బయోమెట్రిక్ పరికరాలనుంచి పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ సర్వీస్ కంప్యూటర్లకు అందుతుంది. దీన్ని ప్రతిరోజూ పర్యవేక్షించి తదనుగుణంగా చర్యలు చేపట్టనున్నారు. దీనివల్ల అర్హులైన వారికి మెరుగైన సేవలందించడానికి వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. పుస్తకాలు, యూనిఫారాలు, స్కాలర్షిప్పులు ఇతర ప్రోత్సాహకాల పంపిణీని ప్రక్షాళన చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. బడ్జెటింగ్, అకౌంటింగ్‌ను సరిగ్గా నిర్వహించడానికి ఎలక్ట్రానిక్ విధినిర్వహణ పద్ధతిని ప్రవేశపెడుతున్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్ధుల ఆధార్ లింకేజీని తప్పనిసరిచేస్తున్నారు. దీనివల్ల విద్యార్ధుల సమగ్ర డాటాబేస్‌ను రూపొందిస్తారు. విద్యార్ధుల హాజరులో నకిలీబాగోతాలను అరికట్టడం, విద్యార్ధులు, సిబ్బంది హాజరులో సమయపాలన ఉండేలా చూడడం ఈ బయోమెట్రిక్ ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ పద్ధతి వల్ల విద్యార్థులు ఏదైనా ఇతర పాఠశాలల్లో నమోదయ్యాడా? లేదా అనే విషయాన్ని పసిగట్టనున్నారు. డబుల్ నమోదును నివారించనున్నారు. ఆధార్ సంఖ్యతోపాటు ఆయా విద్యార్ధుల పుట్టిన తేదీ, తండ్రిపేరు, వయసు, సామాజికవర్గం, తదితర వివరాలను కూడా కంప్యూటరీకరణ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వ్యవస్థలోకి తెచ్చి లోపాలను అరికట్టాలన్నది దీని ముఖ్యోద్దేశమని అధికారులు పేర్కొన్నారు. విద్యార్ధులు, టీచర్లు సరైన సమయానికి స్కూళ్లకు వస్తున్నారా? లేదా పర్యవేక్షిస్తారు. స్కూళ్లలో ఆలస్యపు హాజరును నివారించడంతోపాటు విద్యాసంబంధ పనితీరును మెరుగుపర్చనున్నారు. రాష్ట్రంలో 48వేల ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఎంతమంది విద్యార్ధులు రోజువారీ భోజనాలను స్వీకరిస్తున్నారో అంచనాకు రానున్నారు. ఈ డేటా ఆధారంగా సరకుల పంపిణీ, నిధుల విడుదల సిబ్బంది నియామకాలోని లోపాలను సరిదిద్దనున్నారు. ప్రత్యేక అవసరాలు క ల వికలాంగులు తదితర పిల్లలకోసం వినియోగిస్తున్న నిధులు పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం భావిస్తోందని, ఈ బయోమెట్రిక్ ద్వారా దానికి అడ్డుకట్టపడుతుందని అధికారులు చెబుతున్నారు. విద్యార్ధుల వాస్తవిక సంఖ్యను అనుసరించి మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, ఇతర సదుపాయాలను కల్పించనున్నారు. కేంద్రీకృత పర్యవేక్షణ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరును కేంద్రీకృత సర్వర్‌లో అప్పటికప్పుడే నమోదయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరితో పాటు కాంట్రాక్టర్లు, ఆయా సరకుల సరఫరాదార్ల నుంచి అందుతున్న వివిధ సరకులు, పరికరాల సమాచారాన్నీ ఈ కేంద్రీకృత సర్వర్‌లో నమోదు చేయించనున్నారు. డీఈఓలు, సర్వశిక్ష అభియాన్ పీఓలు, పాఠశాలల యాజమాన్య కమిటీలు, కేజీబీవీల ఎస్ఓలు, స్కూళ్ల హెడ్మాస్టర్లు తమ పరిధిలోని సమాచారాన్ని కేంద్రీకృత సర్వర్ పరిధిలోకి నమోదు చేయాల్సి ఉంటుంది. -
పనిచేయకుంటే షాక్ ‘ట్రీట్మెంట్’
సంగారెడ్డి క్రైం: వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, లేకుంటే చర్యలు తప్పవని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ముఖ్యంగా అధికారులంతా సమన్వయంతో వ్యవహరిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితిపై మంత్రి హరీశ్‌రావు వైద్య ఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లోని సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు వైద్య సేవల్లో ఎక్కడా చిన్న లోపం కనిపించినా సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో అపరిష్కృతంగా వున్న సమస్యల పరిష్కారానికి అధికారులకు మార్గదర్శకాలను ఇచ్చారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలపై మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డిలు సమీక్షించారు. జిల్లాకు 13వ ఆర్థిక సంఘం మంజూరు చేసిన ఐదు ప్రాథమిక వైద్యశాలల పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించడానికి కావాల్సిన పరికరాలు పీహెచ్‌సీలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి మంజూరవుతున్నా వాటిని అందుబాటులోకి తేవడంలో జరుగుతున్న జాప్యంపై మండిపడ్డారు. జనని శిశు సురక్షా కార్యక్రమాన్ని సమీక్షిస్తూ మందులు, ఆహారం, వైద్య పరీక్షలు, రక్తం రవాణా కోసం డబ్బులు రోగులకు కచ్చితంగా అందే విధంగా చూడాలన్నారు. జహీరాబాద్, పటాన్చెరు, మెదక్‌లకు ఐసీయులకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంటి వద్దకే మందులు సరఫరా చేసే కార్యక్రమాన్ని జిల్లాలో వెంటనే ప్రారంభించాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ విధానం వెంటనే పునరుద్ధరించాలని, సీసీ కెమెరాల పనితీరును కూడా అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ కౌన్సిలర్లకు చెల్లించాల్సిన వేతనాలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. సదు సంవత్సరాలుగా ఒకే దగ్గర పనిచేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందిని వెంటనే బదిలీ చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. పటాన్చెరు, జోగిపేట, నర్సాపూర్, దుబ్బాక, రామాయంపేటలో కూడా రక్త నిధి సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్‌రెడ్డితో పాటు జిల్లా ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు. -
కటాఫ్ డేట్‌తో సరుకుల కోత
♦ సరఫరా చేసింది 68 శాతమే ♦ 5శాతం మందికి వేలిముద్రల నిరాకరణ ♦ స్వయం సహాయక సంఘం సభ్యులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ♦ నేటితో రేషన్ పంపిణీ బంద్ కర్నూలు : పౌర సరఫరా శాఖలో కొత్తగా తెచ్చిన బయోమెట్రిక్ విధానం కార్డుదారులకు ఓ పరీక్షగా మారింది. వేలిముద్రల ఆధారంగా సరుకుల పంపిణీ సమస్యగా మారిన నేపథ్యంలో రేషన్ పంపిణీకి కటాఫ్ తేదీ నిర్ణయించి కార్డుదారులకు ప్రభుత్వం శఠగోపం పెడుతోంది. గత నెల 15వ తేదీని రేషన్ సరఫరాకు కటాఫ్‌గా నిర్ణయించి 35 శాతం మందికి సరుకులు ఎగ్గొట్టింది. జూన్‌లో కూడా 18వ తేదీతో రేషన్ పంపిణీ నిలిపివేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ-పాస్ అమలవుతున్న కర్నూలు కార్పొరేషన్‌తో పాటు 9 మున్సిపాల్టీల పరిధిలో 458 చౌక డిపోలు, 2,61,487 కార్డుదారులున్నారు. అందులో 1,78,123 మంది కార్డుదారులకు మాత్రమే(68 శాతం) సరుకులు సరఫరా చేశారు. మిగిలిన 83,364(32 శాతం) మందిలో చౌక డిపోకు వచ్చి ఈ-పాస్ యంత్రంలో వేలిముద్రలు వేసినప్పటికీ వివిధ కారణాల చేత 13,468 మందికి(5 శాతం) సరుకులు అందలేదు. ఒక్కొక్క చౌక డిపోకు ఇద్దరు స్వయం సహాయక సభ్యులతో వారికి సరుకులు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు జేసీ హరికిరణ్ వెల్లడించారు. 69,892 మంది కార్డుదారులు(27 శాతం) సరుకుల కోసం రెండు నెలలుగా రావడం లేదని అధికారులు తేల్చారు. వారు అసలైన లబ్దిదారులా లేక బోగస్ కార్డులా అనే విషయంపై అధికారులు పరిశీలిస్తున్నారు. పనిచేయని సర్వర్: ఈ-పాస్ విధానంలో సర్వర్ సరిగా పనిచేయక రేషన్ అందడం లేదని కార్డుదారులు వాపోతున్నారు. మే నెలలో సర్వర్ సక్రమంగా పనిచేయక రేష న్ పంపిణీ సక్రమంగా జరగలేదు. 66.57 శాతం మంది లబ్దిదారులు మాత్రమే ఈ-పాస్ మిషన్ల ద్వారా సరుకు లు తీసుకున్నారు. 87,320 మంది కార్డుదారులు వివిధ కారణాలతో మే నెల కోటా సరుకులు తీసుకోకుండానే అధికారులు క్లోజింగ్ బ్యాలెన్స్ చూపించారు. సరుకుల కోసం కార్డుదారులు చౌక డిపోల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే అధికారులు ఈ-పాస్ విధానం వల్ల రేషన్ మిగిలిందని ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. ఐదు శాతం మంది వేలిముద్రల నిరాకరణ: చౌక దుకాణాల్లో వీకర్‌సెక్షన్ కాలనీలకు చెందిన ప్రజలే సరుకులు పొందలేకపోతున్నారు. పనులకు వెళ్తున్న వీరి వేలిముద్రలు ఈ-పాస్ మిషన్ నిరాకరిస్తుండటంతో సమస్యగా మారింది. జూన్ కు సంబంధించి 13,468 కార్డుదారుల వేలిముద్రలను ఈ-పాస్ మిషన్లు నిరాకరించడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అయితే అందుకు 20వ తేదీ వరకు మాత్రమే గడువు విధించడం సరికాదని కార్డుదారులు వాపోతున్నారు. -
నేటి నుంచి ఆధార్
ఆధార్ కార్డుల జారీపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయానికి వచ్చింది. శనివారం నుం చి రాష్ట్ర వ్యాప్తంగా 469 ప్రత్యేక శిబిరాల ద్వారా ఆధా ర్ కార్డులను జారీచేయాలని నిశ్చయించింది. చెన్నైలోనే 50 కేంద్రాల ద్వారా కార్డులు జారీ చేయనున్నారు. * 469 ప్రత్యేక శిబిరాలు * చెన్నైలోనే 50 శిబిరాలు చెన్నై, సాక్షి ప్రతినిధి: భారత పౌరసత్వ నిర్ధారణకు గతంలోని యూపీఏ ప్రభుత్వం ఆధార్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆధార్ కార్డు ఒక స్మార్టు కార్డులా అన్ని ప్రయోజనాలు కలిగించేలా తీర్చిదిద్దాలని సంకల్పించింది. బయోమెట్రిక్ విధానంలో జారీచేసే ఈ కార్డు ద్వారా పాస్‌పోర్టు, రేషన్ కార్డులు, బ్యాంకు ఖాతాలు. తదితర ప్రయోజనాలు పొందేలా రూపకల్పన చేసింది. అయితే ఆధార్ కార్డుపై అదే ప్రభుత్వంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో అధార్ కార్డుల జారీ జాతీయ స్థాయిలో మందగించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో సైతం ఆధార్ కార్డుల జారీ వ్యవహారం అర్ధాంతరంగా అటకెక్కింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆధార్‌కార్డుల అంశాన్ని పక్కన పెట్టేసింది. అయితే మరలా మనస్సు మార్చుకుని జారీచేసేందుకు సిద్ధమైంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 25.94 లక్షల ఆధార్ కార్డుల జారీతో 67 శాతంతో తొలిదశ పూర్తయింది. అప్పట్లో 89.23 శాతం కార్డుల జారీతో పెరంబలూరు జిల్లా ప్రథమస్తానంలో నిలిచింది. రామనాథపురం జిల్లా 85.65, అరియలూరు, తిరుచ్చీ జిల్లాలు 81.61, నాగపట్నం జిల్లా 81.54 శాతం కార్డులు జారీఅయ్యాయి. అయితే ఆ తరువాత మలిదశ కుంటువడింది. తాజాగా మళ్లీ అదేశాలు రావడంతో యంత్రాంగం సిద్ధమైంది. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 469 ప్రత్యేక శిబిరాల ద్వారా ఆధార్ కార్డులను జారీచేసే ప్రక్రియను ప్రారంభించనుంది. వీటిల్లో 268 శాశ్వత శిబిరాలుగా నిర్ణయించారు. చెన్నైలో 50 శాశ్వత శిబిరాలను నిర్వహించనున్నారు. కార్పొరేషన్, మునిసిపాలిటీ, పంచాయతీ, తహశీల్దారు కార్యాలయాల్లో శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. -
బయోమెట్రిక్’తో విద్యార్థుల గైర్హాజరీకి చెక్
మిరుదొడ్డి: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టి గైర్హాజరయ్యే విద్యార్థులకు చెక్ పెట్టనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎన్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం మిరుదొడ్డి ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనీఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. అనంతరం బయోమెట్రిక్ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది వరకు ఉన్న హాజరు రిజిస్టర్ స్థానంలో బయోమెట్రిక్ విధాన్నాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా గైర్హాజరయ్యే విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తామన్నారు. దీనిద్వారా విద్యార్థి హాజరు కాకపోవడానికి గల కారణాలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. బయోమెట్రిక్ విధానంలో విద్యార్థుల చేతి వే లి ముద్రల ద్వారా ఏ రోజుకారోజు హాజరు నమోదు చేస్తామని తెలిపారు. బయోమెట్రిక్ నమోదు చేసుకోక పోతే విద్యార్థులకు ఆరోజు ఎలాంటి భోజన వసతి కల్పించడం జరగదని స్పష్టం చేశారు. జిల్లాలో 83 సంక్షేమ హాస్టళ్లు ఉండగా మెదటి విడతగా 61 సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్‌ను ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల వేలి ముద్రల ఆధారంగా ప్రతి రోజు హాజరును రికార్డు చేస్తామన్నారు. మిరుదొడ్డి ఎస్సీ హాస్టల్లో 9వ తరగతి వరకు చదివే అవకాశం ఉండగా విద్యార్థుల సంఖ్యను బట్టి వచ్చే విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులకు అనుమతి ఇస్తామన్నారు. నిబంధనలను విస్మరిస్తే చర్యలు బయోమెట్రిక్ విధానంలో హాస్టల్ వెల్ఫేర్ అధికారులు విస్మరిస్తే చర్యలు తప్పవని జిల్లా వెల్ఫేర్ అధికారి ఎన్ సత్యనారాయణ హెచ్చరించారు. హాస్టళ్లలో బస చేసే విద్యార్థులకు కొత్త మెనూ అమలు చేస్తామన్నారు. పౌష్టికాహారంతో వారం రోజల పాటు గుడ్లు, ఆరు రోజుల పాటు పండ్లు, ఆదివారం చికెన్, బటర్ మిల్క్, ప్రతి రోజు స్నాక్స్ అందిస్తామని తెలిపారు. హాస్టళ్లను తనిఖీ చేసిన జిల్లా సంక్షేమాధికారి రామాయంపేట: మండలంలోని రామాయంపేటలోని ఎస్సీ బాలుర ,బాలికల హాస్టళ్లతోపాటు నిజాంపేటలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను ఆదివారం జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి సత్యనారాయణ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన హాస్టళ్లలో నెలకొని ఉన్న సమస్యలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. భోజనం ఎలా పెడుతున్నారని ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కాస్మొటిక్ చార్జీలు, బట్టలు, బెడ్షీట్లు, ప్లేట్లు ఇచ్చారా లేదా అనే విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నిజాంపేట హాస్టల్‌కు మంజూరైన ప్రహారీగోడ, మరుగుదొడ్ల నిర్మాణం ఎందుకు చేపట్టలేదని ఆయన వార్డెన్‌ను ప్రశ్నించారు. త్వరితగతిన పనులు పూర్తయ్యేవిధంగా చూడాలని వార్డెన్‌ను ఆదేశించారు. హాస్టల్లోని చిన్న చిన్న మరమ్మతులకు గాను రూ. ఐదువేలు మంజూరైనట్లు తెలిపారు. ఆయన వెంట వార్డెన్ వెంకటయ్య తదితరులున్నారు.