బయోమెట్రిక్’తో విద్యార్థుల గైర్హాజరీకి చెక్ | Biometric method is stop the student's absence | Sakshi
Sakshi News home page

బయోమెట్రిక్’తో విద్యార్థుల గైర్హాజరీకి చెక్

Published Sun, Sep 21 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

Biometric method is stop the student's absence

మిరుదొడ్డి: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టి  గైర్హాజరయ్యే విద్యార్థులకు చెక్ పెట్టనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా  అధికారి ఎన్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం మిరుదొడ్డి ఎస్సీ  బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనీఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. అనంతరం బయోమెట్రిక్ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది వరకు ఉన్న హాజరు రిజిస్టర్ స్థానంలో బయోమెట్రిక్ విధాన్నాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా గైర్హాజరయ్యే విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తామన్నారు. దీనిద్వారా విద్యార్థి హాజరు కాకపోవడానికి గల కారణాలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. బయోమెట్రిక్ విధానంలో విద్యార్థుల  చేతి వే లి ముద్రల ద్వారా ఏ రోజుకారోజు  హాజరు నమోదు చేస్తామని తెలిపారు.

బయోమెట్రిక్ నమోదు చేసుకోక పోతే విద్యార్థులకు ఆరోజు ఎలాంటి భోజన వసతి కల్పించడం జరగదని స్పష్టం చేశారు. జిల్లాలో 83 సంక్షేమ హాస్టళ్లు  ఉండగా మెదటి విడతగా 61 సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్‌ను ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల వేలి ముద్రల ఆధారంగా ప్రతి రోజు హాజరును రికార్డు చేస్తామన్నారు.  మిరుదొడ్డి ఎస్సీ హాస్టల్‌లో 9వ తరగతి వరకు చదివే అవకాశం ఉండగా విద్యార్థుల సంఖ్యను బట్టి  వచ్చే విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులకు అనుమతి ఇస్తామన్నారు.

 నిబంధనలను విస్మరిస్తే చర్యలు
 బయోమెట్రిక్ విధానంలో హాస్టల్ వెల్ఫేర్ అధికారులు విస్మరిస్తే చర్యలు తప్పవని జిల్లా వెల్ఫేర్ అధికారి ఎన్ సత్యనారాయణ హెచ్చరించారు. హాస్టళ్లలో బస చేసే  విద్యార్థులకు  కొత్త మెనూ అమలు చేస్తామన్నారు. పౌష్టికాహారంతో  వారం రోజల పాటు గుడ్లు, ఆరు రోజుల పాటు పండ్లు, ఆదివారం చికెన్, బటర్ మిల్క్, ప్రతి రోజు స్నాక్స్ అందిస్తామని తెలిపారు.

 హాస్టళ్లను తనిఖీ చేసిన జిల్లా సంక్షేమాధికారి
 రామాయంపేట: మండలంలోని రామాయంపేటలోని ఎస్సీ బాలుర ,బాలికల హాస్టళ్లతోపాటు  నిజాంపేటలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను ఆదివారం జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి సత్యనారాయణ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన హాస్టళ్లలో నెలకొని ఉన్న సమస్యలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు.  భోజనం ఎలా పెడుతున్నారని ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

 కాస్మొటిక్ చార్జీలు, బట్టలు, బెడ్‌షీట్లు, ప్లేట్లు ఇచ్చారా లేదా అనే విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.  నిజాంపేట హాస్టల్‌కు మంజూరైన ప్రహారీగోడ, మరుగుదొడ్ల నిర్మాణం ఎందుకు చేపట్టలేదని ఆయన వార్డెన్‌ను ప్రశ్నించారు. త్వరితగతిన పనులు పూర్తయ్యేవిధంగా చూడాలని వార్డెన్‌ను ఆదేశించారు. హాస్టల్‌లోని చిన్న చిన్న మరమ్మతులకు గాను రూ. ఐదువేలు మంజూరైనట్లు  తెలిపారు. ఆయన వెంట వార్డెన్  వెంకటయ్య తదితరులున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement