సంగారెడ్డి: వృద్ధాప్యంలో ఏ తల్లిదండ్రులైనా తన కొడుకుల చేత తలకొరివి పెట్టించుకోవాలని కోరుకుంటారు. కానీ, తనయుడికే అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం పలువురి మనసులను కలచివేసింది. ఈ సంఘటన మండలకేంద్రం మిరుదొడ్డిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నరేష్, గ్రామస్తులు శనివారం తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన గొట్టం లింగం–లలిత దంపతులకు ఇద్దరు కొడుకులు కుమార్, కోటేశ్వర్(28)లు ఉన్నారు.
పెద్ద కొడుకు కుమార్ భార్యా పిల్లలతో ఉంటున్నాడు. అవివాహితుడైన చిన్న కొడుకు కోటేశ్వర్ గ్రామ పంచాయతీలో వాటర్‌మెన్‌గా పని చేస్తున్నాడు. తండ్రి ఐదేళ్లక్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కోటేశ్వర్ కొద్దిరోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకున్నా ఫలితం లేదు. దీనికి తోడు కుటుంబ కలహాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన కోటేశ్వర్ ఈ నెల 17న స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక పురుగుల మందు తాగాడు.
అపస్మారక స్థితిలో ఉండగా అన్నకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే కుటుంబ సభ్యులు కోటేశ్వర్‌ను సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కోటేశ్వర్ అవివాహితుడు కావడం, తండ్రి చనిపోవడంతో తల్లి తలకొరివి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment