ఓ దొంగతనం.. ఆపై పంచాయితీ.. | Mother and son jump into Manjira | Sakshi
Sakshi News home page

ఓ దొంగతనం.. ఆపై పంచాయితీ..

Published Wed, Nov 27 2024 4:43 AM | Last Updated on Wed, Nov 27 2024 4:43 AM

Mother and son jump into Manjira

మంజీరాలో దూకిన తల్లి, కుమారుడు

లభించని ఆచూకీ

వట్‌పల్లి (అందోల్‌): దొంగతనం విషయంలో పంచాయితీకి పిలవడంతో తల్లీకుమారుడు ఆత్మహత్యా యత్నం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంగారెడ్డికి చెందిన ఓ వ్యక్తి అందోలు మండలం చింతకుంట గ్రామంలో జరిగిన విందుకు ఆదివారం టాటా ఏస్‌ వాహనంలో వచ్చాడు. సోమవారం తిరిగి వెళ్లిపోదామని నిర్ణయించుకొని వాహనాన్ని గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో నిలిపాడు. అదే గ్రామానికి చెందిన తాగుడుకు బానిసైన వడ్ల శ్యామ్‌ (21) ఆ వాహనాన్ని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎత్తుకెళ్లాడు. 

కౌడిపల్లి మండలం బుజరంపేట గ్రామ శివారుకు వెళ్లగానే వాహనం కాల్వలో ఇరుక్కుపోయింది. దానిని బయటకు తీసే ప్రయత్నంలో భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు లేచి దొంగ దొంగ అని అరిచారు. దీంతో శ్యామ్‌ వెంటనే సమీపంలోని ఓ బైక్‌ను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. బుజరంపేట గ్రామస్తులు దుంపలకుంటలోని సీసీ ఫుటేజీని పరిశీలించి వడ్ల శ్యామ్‌ను గుర్తించారు. గ్రామ పెద్దలతో సమావేశమై శ్యామ్‌ను తమకు అప్పగించాలని, లేకపోతే వాహనాన్ని ఇచ్చేది లేదని హెచ్చరించారు. అనంతరం శ్యామ్‌ తండ్రి యాదయ్యను పిలిపించి జరిగిన విషయాన్ని వివరించారు. 

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం శ్యామ్‌ అతడి తల్లిదండ్రులు యాదయ్య, బాలమణి (46), చిన్నమ్మ మమత బుజరంపేటకు పంచాయితీకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. తండ్రి, చిన్నమ్మ బస్‌లో బయలుదేరగా, శ్యామ్‌ తల్లి బాలమణితో బైక్‌పై బయలుదేరాడు. చింతకుంట బ్రిడ్జిపైకి రాగానే బైక్‌ను ఆపి మొదట శ్యామ్‌ మంజీరా నీళ్లలోకి దూకగా, అనంతరం తల్లి దూకింది. విషయం తెలుసుకున్న జోగిపేట, చిలప్‌చెడ్‌ పోలీసులు వేర్వేరుగా గాలింపు చర్యలు చేపట్టినా వారి ఆచూకీ లభ్యం కాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement