ఇప్పటివరకు 2వేల మంది గుర్తింపు
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్
బెంగళూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు వేల మంది నకిలీ వైద్యులను గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ వెల్లడించారు. వీరు నిర్వహిస్తున్న క్లినిక్‌లను సైతం మూయించేశామని చెప్పారు. శుక్రవారమిక్కడి ఓ హోటల్‌లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సువర్ణ భవన’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలను మోసం చేస్తున్న నకిలీ వైద్యులపై ఇప్పటికే 230 ఎఫ్‌ఐఆర్‌లను సైతం నమోదు చేసినట్లు చెప్పారు. నకిలీ వైద్యుల బెడదను తప్పించేందుకు ఆయుష్ మండలి ఇప్పటికే దేశంలోనే మొట్టమొదటి సారిగా బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని యు.టి.ఖాదర్ తెలిపారు. గతంలొ కలకత్తా, ఢిల్లీ వంటి వివిధ ప్రాంతాల్లో తాము వైద్యవిద్యను పూర్తి చేశామని చెప్పుకొని చాలా మంది నకిలీ వైద్యులు ఆస్పత్రులను నిర్వహించే వారని పేర్కొన్నారు.
వారు చూపించే ధ్రువీకరణ పత్రాలు అసలైనవా లేక నకిలీవా అని గుర్తిచండం చాలా క్లిష్టమైన సమస్యగా ఉండేదని చెప్పారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనగలిగామని వెల్లడించారు. రాష్ట్రంలో ఆయుష్ మండలి చక్కగా పనిచేస్తోందని, అందువల్లనే అంతర్జాతీయ ఆయుర్వేద ఎక్స్‌పో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు అవకాశాన్ని కల్పించిందని వివరించారు. సెప్టెంబర్‌లో ఈ ఎక్స్‌పో జరగనుందని మంత్రి యు.టి.ఖాదర్ వెల్లడించారు.
ఏ బాల్ అయినా బ్యాటింగ్ చేస్తా....
‘మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణలో మంత్రి స్థానం పోతుందనో లేదంటే శాఖ మారుతుందనో నాకు భయం లేదు. ఏ బాల్ అయినా బ్యాటింగ్ చేయడానికి సిద్ధం, ఏ శాఖ అయినా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతించేందుకు సన్నద్ధంగా ఉన్నాను’ అని యు.టి.ఖాదర్ స్పష్టం చేశారు.