దేశంలో ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సుల్లో మెడిసిన్ ఒకటి. డాక్టర్ కావాలంటే ఎంతో శ్రమించాలి. చదువు పూర్తయ్యే వరకు లక్షలు లక్షలు ఖర్చుపెట్టడమే కాకుండా.. రాత్రి పగలు శ్రమించి చదవాలి.. అయినా వైద్యులు అవుతారనే నమ్మకం లేదు. కానీ కొంతమంది కష్టపడి చదవడం మానేసి అడ్డదారిలో డబ్బులు గుమ్మరించి డాక్టర్ పట్టా పొందాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడైనా ఎనిమిదో తరగతి చదివినా డాక్టర్ కావచ్చని తెలుసా; లేదా కేవలం రూ.70వేలు కట్టినా వైద్యవిద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు పొందవచ్చని విన్నారా?
వినడానికి నమ్మశక్యంగా లేని ఈ విషయాలు నిజంగా జరిగాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలా తప్పుడు ధ్రువపత్రాలు సంపాదించి డాక్టర్లుగా చలామణి అవుతున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. సూరత్‌లో 1,200 నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు కలిగి ఉన్న ముఠా గుట్టు రట్టు చేశారు.
ముగ్గురు వ్యక్తులు నకిలీ ధ్రువపత్రాలతో అల్లోపతి వైద్యం చేస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి సదరు క్లినిక్‌లపై దాడి చేశారు. వారిని ప్రశ్నించగా, బోర్డు ఆఫ్ ఎలక్ట్రో హోమియోపతిక్ మెడిసిన్ గుజరాత్ పేరిట ఉన్న ధ్రువపత్రాలను చూపించారు. దీంతో అవి నకిలీ సర్టిఫికెట్లుగా పోలీసులు తేల్చారు. అలాంటి పత్రాలను గుజరాత్ ప్రభుత్వం జారీ చేయడంలేదని పేర్కొన్నారు.
అయితే ఈ ముఠా 8వ తరగతి చదివిన వారి వద్ద ఒక్కొక్కరి నుంచి 70,000 వసూలు చేస్తూ నకిలీ వైద్య ధ్రువపత్రాలను అందించినట్లు తేలింది. ఈ ముఠా నుంచి డిగ్రీలు కొనుగోలు చేసిన 14 మంది నకిలీ వైద్యులను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వైద్య ధ్రువపత్రాలను అమ్ముతున్న ముఠా కీలక సభ్యుడు డాక్టర్ రమేశ్ గుజరాతీని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి వందలాది దరఖాస్తులు, సర్టిఫికెట్లు, స్టాంపులుస్వాధీనం చేసుకున్నట్లు పేర్కొ న్నారు.
అంతేకాకుండా అలా ఇచ్చే డిగ్రీలను ఏటా రెన్యూవల్ చేసుకోవాలి. అందుకోసం అదనంగా రూ. 5000 నుంచి రూ.15,000 వసూలు చేసేవారు. ఒకవేళ రెన్యూవల్ చేసుకోకుంటే సదరు ముఠా సభ్యులు బెదిరింపులకు దిగేవారు. ఇక సూరత్‌లో ఇటీవల కొందరు నకిలీ వైద్యులు భారీ స్థాయిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి తెరిచి అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment