స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారులందరూ వివిధ పనుల నిమిత్తం శుక్రవారం కార్యాలయానికి రాలేదని ఆ శాఖ కమిషనర్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అహ్మద్ నదీమ్ అంగీకరించారు.
- ‘రిజిస్ట్రేషన్ల శాఖకు సుస్తీ’పై స్పందించిన కమిషనర్
- విచారణకు ఆదేశించిన స్పెషల్ సీఎస్
సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారులందరూ వివిధ పనుల నిమిత్తం శుక్రవారం కార్యాలయానికి రాలేదని ఆ శాఖ కమిషనర్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అహ్మద్ నదీమ్ అంగీకరించారు. పలు సమస్యలతో ఆఫీసుకు వచ్చిన వారిని పట్టించుకునే వారు లేకపోవడంపై ‘రిజిస్ట్రేషన్ల శాఖకు సుస్తీ’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు అహ్మద్ వివరణ ఇచ్చారు. కార్మిక శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న తనకు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించిందని, శుక్రవారమంతా కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలోనే ఉండటం వలన రిజిస్ట్రేషన్ల శాఖకు వెళ్లలేకపోయానని తెలిపారు.
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్స్‌లో ఒకరు బెంగళూరులో వర్క్‌షాప్‌కు వెళ్లగా, మరొకరు అనారోగ్య కారణాలతో సెలవు పెట్టారని పేర్కొన్నారు. జాయింట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (జేఐజీ), అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఏఐజీ) శుక్రవారం కార్యాలయానికి వచ్చారని తెలిపిన కమిషనర్, వారు మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యాలయంలో లేకపోవడాన్ని ప్రస్తావించ లేదు. మొత్తం 54 మంది ఉద్యోగుల్లో 47 మంది హాజరయ్యారని చెబుతున్న కమిషనర్, వారిలో సగం మంది సీట్లలో లేకపోవడాన్ని కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
మరోవైపు ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర విచారణకు ఆదేశించడం రిజిస్ట్రేషన్ల శాఖలో అలజడి రేపింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఉన్నతాధికారులు, ఉద్యోగులు పత్తా లేకపోవడంపై స్పెషల్ సీఎస్ సీరియస్‌గా ఉన్నారని, బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయానికి వచ్చారని తెలిసింది.