Ahmad Nadeem
-
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అహ్మద్‌నదీమ్ సిద్దిపేట జోన్: రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ భూసేకరణ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా శాఖపరమైన సంస్కరణలను తాత్కాలికంగా చేపట్టినట్లు రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ అహ్మద్ నదీమ్ అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రిజర్వాయర్ల కోసం 25 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. సంబందిత సేకరణ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను రైతులకు ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా వేగవంతంగా చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు అందులో బాగంగా తాత్కలికంగా సేకరణ భూముల రిజిస్ట్రేషన్ల కోసం 5 కేంద్రానలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కోన్నారు. కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి, తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహడ్, సిద్దిపేట మండలం ఇమాంబాద్‌లో సెప్టెంబర్ 1 నుంచి తాత్కలిక రిజిస్ట్రేషన్ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. -
నిజమే.. అధికారులెవరూ ఆఫీసులో లేరు
- ‘రిజిస్ట్రేషన్ల శాఖకు సుస్తీ’పై స్పందించిన కమిషనర్ - విచారణకు ఆదేశించిన స్పెషల్ సీఎస్ సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారులందరూ వివిధ పనుల నిమిత్తం శుక్రవారం కార్యాలయానికి రాలేదని ఆ శాఖ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ అహ్మద్ నదీమ్ అంగీకరించారు. పలు సమస్యలతో ఆఫీసుకు వచ్చిన వారిని పట్టించుకునే వారు లేకపోవడంపై ‘రిజిస్ట్రేషన్ల శాఖకు సుస్తీ’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు అహ్మద్ వివరణ ఇచ్చారు. కార్మిక శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న తనకు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించిందని, శుక్రవారమంతా కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలోనే ఉండటం వలన రిజిస్ట్రేషన్ల శాఖకు వెళ్లలేకపోయానని తెలిపారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్స్‌లో ఒకరు బెంగళూరులో వర్క్‌షాప్‌కు వెళ్లగా, మరొకరు అనారోగ్య కారణాలతో సెలవు పెట్టారని పేర్కొన్నారు. జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ (జేఐజీ), అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఏఐజీ) శుక్రవారం కార్యాలయానికి వచ్చారని తెలిపిన కమిషనర్, వారు మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యాలయంలో లేకపోవడాన్ని ప్రస్తావించ లేదు. మొత్తం 54 మంది ఉద్యోగుల్లో 47 మంది హాజరయ్యారని చెబుతున్న కమిషనర్, వారిలో సగం మంది సీట్లలో లేకపోవడాన్ని కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. మరోవైపు ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర విచారణకు ఆదేశించడం రిజిస్ట్రేషన్ల శాఖలో అలజడి రేపింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఉన్నతాధికారులు, ఉద్యోగులు పత్తా లేకపోవడంపై స్పెషల్ సీఎస్ సీరియస్‌గా ఉన్నారని, బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయానికి వచ్చారని తెలిసింది. -
భూముల విలువకు రెక్కలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల విలువలకు రెక్కలొస్తున్నాయి. రిజిస్ట్రేషన్ ధరల హేతుబద్ధీక రణపై జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. సవరించే ధరలను వచ్చే ఆగస్ట్ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భూ విలువలపై కసరత్తు ప్రారంభించింది. సర్కారు ఖజానాకు ప్రధాన ఆదాయార్జన భూముల రిజిస్ట్రేషన్లపైనే వస్తుండడంతో ప్రభుత్వం వీటిపై దృష్టి సారించింది. ప్రతి రెండేళ్లకోసారి భూముల విలువలను సమీక్షించి.. సవరిస్తున్నప్పటికీ రెండేళ్లుగా పెంపు జోలికి వెళ్లలేదు. దీనికితోడు స్థిరాస్తి రంగం కూడా ఒడిదుడుకులను ఎదుర్కొనడంతోపాటు ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో స్థలాల క్రయవిక్రయాలు మందగించాయి. తాజాగా ఆశావహ పరిస్థితులు నెలకొనడంతో రియల్ఎస్టేట్ క్రమేణా పుంజు కుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో రియల్ వ్యాపారం జోరుగా సాగుతుందని ఆశించినప్పటికీ, రాజధానిపై స్పష్టత లేకపోవడం.. అసాధారణంగా ధరలు పెరగడంతో రియల్టీ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. దీంతో మళ్లీ హైదరాబాద్‌కు రియల్టర్లు బారులు తీరారు. ఈ నేపథ్యంలోనే మనజిల్లాలో కూడా భూముల లావాదేవీలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితులను అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం రాబడి పెంచుకునే ఎత్తుగడ వేసింది. రిజిస్ట్రేషన్ల ధరల హేతుబద్ధీకరణ పేర.. భూముల విలువలను పెంచే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ జిల్లా యంత్రాంగానికి లేఖ రాశారు. కనిష్టంగా 10శాతం మేర కనీస ధరలను పెంచేలా ప్రతిపాదనలు రూపొందించిన రిజిస్ట్రేషన్ల శాఖ.. క్ర యవిక్రయాలు ఎక్కువగా జరిగే చోట్ల మాత్రమే మార్కెట్ ధరలను పెంచాలని నిర్ణయించింది. అలాగే కొన్నిచోట్ల అసాధారణంగా కనీస ధరలను కుదించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసి.. జూలై 24లోపు ప్రభుత్వానికి నివేదించాలని కమిషనర్ స్పష్టంచేయడంతో గురువారం జిల్లా రిజిస్ట్రార్లు జేసీ-1 రజత్‌కుమార్ సైనీతో సమావేశమై.. ప్రతిపాదలను అందజేశారు. వారం రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి ప్రాంతాలవారీగా ధరలను సమీక్షించనున్నట్లు జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. -
న్యూ ఇయర్ వేడుకల టార్గెట్ రూ. 150 కోట్లు
* కొత్త సంవత్సరం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ దృష్టి * జిల్లాల అధికారులకు కమిషనర్ అహ్మద్ నదీం నిర్దేశం * నూతన సంవత్సర పార్టీలకు ‘ఈవెంట్ పర్మిట్’ తప్పనిసరి * పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని నియంత్రించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఆ శాఖకు రోజు వారీగా వచ్చే రాబడి కన్నా ఏకంగా ఐదు రెట్లు అధికంగా రాబట్టాలని భావిస్తోంది. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాల ద్వారా కనీసం రూ. 150 కోట్లు ఆదాయం పొందాలని అధికార యంత్రాంగం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు రూ. 30 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతాయి. అయితే డిసెంబర్ 31న సాగే విక్రయాలను దృష్టిలో ఉంచుకొని మద్యం వ్యాపారులు ఈ నెల 22వ తేదీ నుంచే స్టాక్‌ను భారీగా కొనుగోలు చేస్తున్నారు. 25, 26 తేదీల్లో సెలవు దినాలు రావడంతో శనివారం మద్యం కొనుగోళ్లు పెద్దఎత్తున సాగాయి. ఒక దశలో డిపోల్లో సర్వర్లు కూడా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆదివారం మళ్లీ సెలవుకావడంతో 29, 30 తేదీల్లో మద్యం డిపోలకు తాకిడి పెరిగే అవకాశముంది. ఈ మద్యం మొత్తం 31, 1వ తేదీల్లో ఖాళీ అవుతుందని అధికారుల అంచ నా. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలతో కనీసం రూ. 150 కోట్లు ఆర్జించాలని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లతో ఎక్సైజ్ శాఖ కమిషనర్ అహ్మద్ నదీం శనివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో సూచించినట్లు సమాచారం. బ్రూవరేజ్ కార్పొరేషన్ అధికారులతో కూడా ఆ యన మాట్లాడి లిక్కర్ డిపోల్లో మద్యం స్టాక్ వి వరాలను తెలుసుకున్నారు. ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్లు కొన్ని అందుబాటులో లేవంటూ వైన్‌షాపులు, బార్ల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, 30వ తేదీ వరకు భారీ ఎత్తున స్టాక్‌ను ఖాళీ చే యాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాజధానిపై ప్రత్యేక దృష్టి రాష్ట్రంలో సాధారణ రోజుల్లో కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే రాబడే ఎక్కువ. ఇక్కడ అధిక ధర పలికే ప్రీమియం బ్రాండ్ల మద్యం అమ్మకాలు ఎక్కువ. అలాగే స్టార్ హోటళ్లు, బార్లు, క్లబ్బులు, రిసార్టులు ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకల ద్వారా ఈ రెండు జిల్లాల్లో మద్యం విక్రయాల రూపంలో కనీసం రూ. 75 కోట్ల మేర వస్తుందని అధికారుల అంచనా. ఇక కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ భారీగానే మద్యం విక్రయాలు సాగుతాయని భావిస్తున్నారు. అయితే... ప్రైవేటు వ్యక్తులు గ్రూపులుగా ఏర్పాటై చేసుకునే పార్టీలకు సంబంధించి ఎక్సైజ్ సూపరింటెండెంట్లను అప్రమత్తం చేయాలని ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం అధికారులకు సూచించారు. అనుమతి లేకుండా హోటళ్లు, లాడ్జీలు, రిసార్టుల్లో మద్యంతో వేడుకలు చేసుకోకుండా చూడాలని జిల్లాల డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. పట్టణాల నుంచి నగరాల వరకు రూ. 3 వేల నుంచి రూ. 6 వేల వరకు చెల్లించి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ద్వారా ‘ఈవెంట్ పర్మిట్’ పొందిన తరువాతే పార్టీలకు అనుమతివ్వాలన్నారు. సరిహద్దులపై ప్రత్యేక నిఘా.. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెంచినట్లు ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం తెలిపారు. ఇప్పటి నుంచి సంక్రాంతి వరకు రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా, కల్తీ మద్యాన్ని నిరోధించడంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు ఆయన చెప్పారు. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ద్వారా దేశీదారు మద్యం.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి సరిహద్దుల ద్వారా కర్ణాటక నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉందని... దీనిని అరికట్టేందుకు చర్యలు చేపట్టామని నదీం పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం తప్పనిసరిగా ఈవెంట్ పర్మిట్ తీసుకోవాలని, ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎక్సైజ్ ఆదాయం పెరగడం సహజమేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.