సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల విలువలకు రెక్కలొస్తున్నాయి. రిజిస్ట్రేషన్ ధరల హేతుబద్ధీక రణపై జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. సవరించే ధరలను వచ్చే ఆగస్ట్ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భూ విలువలపై కసరత్తు ప్రారంభించింది.
సర్కారు ఖజానాకు ప్రధాన ఆదాయార్జన భూముల రిజిస్ట్రేషన్లపైనే వస్తుండడంతో ప్రభుత్వం వీటిపై దృష్టి సారించింది. ప్రతి రెండేళ్లకోసారి భూముల విలువలను సమీక్షించి.. సవరిస్తున్నప్పటికీ రెండేళ్లుగా పెంపు జోలికి వెళ్లలేదు. దీనికితోడు స్థిరాస్తి రంగం కూడా ఒడిదుడుకులను ఎదుర్కొనడంతోపాటు ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో స్థలాల క్రయవిక్రయాలు మందగించాయి. తాజాగా ఆశావహ పరిస్థితులు నెలకొనడంతో రియల్‌ఎస్టేట్ క్రమేణా పుంజు కుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో రియల్ వ్యాపారం జోరుగా సాగుతుందని ఆశించినప్పటికీ, రాజధానిపై స్పష్టత లేకపోవడం.. అసాధారణంగా ధరలు పెరగడంతో రియల్టీ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. దీంతో మళ్లీ హైదరాబాద్‌కు రియల్టర్లు బారులు తీరారు.
ఈ నేపథ్యంలోనే మనజిల్లాలో కూడా భూముల లావాదేవీలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితులను అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం రాబడి పెంచుకునే ఎత్తుగడ వేసింది. రిజిస్ట్రేషన్ల ధరల హేతుబద్ధీకరణ పేర.. భూముల విలువలను పెంచే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ జిల్లా యంత్రాంగానికి లేఖ రాశారు. కనిష్టంగా 10శాతం మేర కనీస ధరలను పెంచేలా ప్రతిపాదనలు రూపొందించిన రిజిస్ట్రేషన్ల శాఖ.. క్ర యవిక్రయాలు ఎక్కువగా జరిగే చోట్ల మాత్రమే మార్కెట్ ధరలను పెంచాలని నిర్ణయించింది.
అలాగే కొన్నిచోట్ల అసాధారణంగా కనీస ధరలను కుదించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసి.. జూలై 24లోపు ప్రభుత్వానికి నివేదించాలని కమిషనర్ స్పష్టంచేయడంతో గురువారం జిల్లా రిజిస్ట్రార్లు జేసీ-1 రజత్‌కుమార్ సైనీతో సమావేశమై.. ప్రతిపాదలను అందజేశారు. వారం రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి ప్రాంతాలవారీగా ధరలను సమీక్షించనున్నట్లు జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు.
భూముల విలువకు రెక్కలు!
Published Thu, May 28 2015 11:56 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement