రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్ధం!
సాక్షి, అమరావతి బ్యూరో : తుళ్లూరులో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే అనంతవరం, ఉండవల్లి, మందడంలో మరో వారం పది రోజుల్లో రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రారంభించి పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కార్యాలయాలు పూర్తయిన వెంటనే రైతుల భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల పరిధిలో రైతుల నుంచి భూములు సమీకరించిన విషయం తెలిసిందే. సమీకరణ తరువాత ప్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం మినహా మిగిలిన గ్రామాల రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అనేక మంది రైతులకు అదే ఊరులో కాకుండా కాలువలు, చెరువుల్లో ప్లాట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత ప్లాట్ల అభివృద్ధిని మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఏడు నెలలైనా లేఅవుట్లకు నోచుకోని గ్రామాలు ...
రైతులకు పరిహారం కింద ఇచ్చే ప్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని గత ఏడాది జూన్ 25న సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మొదట నేలపాడు గ్రామస్తులకు, ఆ తరువాత ఒక్కో గ్రామానికి ప్లాట్లు కేటాయిస్తూ వచ్చారు. ప్లాట్ల కేటాయింపు ప్రారంభించి సుమారు ఎనిమిది నెలలు కావస్తున్నా, ప్లాట్లను అభివృద్ధి చేసిన దాఖలాలు కనిపించలేదు. నేలపాడు గ్రామంలో ప్లాట్ల అభివృద్ధి కార్యక్రమాన్ని మాత్రమే ప్రారంభించారు. మిగిలిన ఏ ఒక్క గ్రామంలో కనీసం ప్లాట్ల కోసం లేఅవుట్లు వేయలేదు. ఆ గ్రామాల్లో ఎప్పుడు లేఅవుట్లు వేస్తారో తెలియని పరిస్థితి. తొలుత లేఅవుట్లు వేసి ఆ తరువాత ప్లాట్లు అభివృద్ధి చేయాల్సి ఉంది. అనంతరమే ప్లాట్లు పూర్తి స్థాయిలో రైతుల చేతికొచ్చే అవకాశం ఉంది. అయితే ఇవేమీ చేయకుండానే ప్రభుత్వం ఏకంగా రైతుల భూములను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
భూములు రిజిస్ట్రేషన్ చేయించాక ప్లాట్లను త్వరితగతిన అభివృద్ధి చేసే పరిస్థితి ఉండదని అధికారవర్గాల సమాచారం. అదే విధంగా రైతులు తమ భూములను ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన వెంటనే... కేటాయించిన ప్లాట్లను కూడా రైతులకు రిజిస్ట్రేషన్ చేయిస్తేనే మేలు జరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా కాకుండా రైతులు భూములు రిజిస్ట్రేషన్ చేశాక, ఆ తరువాత ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయిస్తామంటే.. రైతులకు తీవ్రఅన్యాయం జరిగే అవకాశం లేకపోలేదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రైతులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉన్నట్టు తెలుస్తోంది.