మేల్కొంటేనే సాగునీరు!
కాలువల లైనింగ్ పూర్తిచేయాలని తాండవ రైతుల వినతి
నాతవరం : ఖరీఫ్ సీజన్‌లో తాండవ శివారు భూములకు సాగునీరు అందాలంటే అధికారులు తక్షణం మేల్కొని కాలువ లైనింగ్ పనులు పూర్తిచేయాలని పలువురు సూచిస్తున్నారు. లేకుంటే 10 వేల ఎకరాలకు సాగునీటి సమస్య తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో సుమారు 52 వేల ఎకరాలు తాండవ జలాశయం ఆధారంగా సాగవుతోంది.
అయితే ఇటీవల కాలంలో తాండవ కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనివల్ల శివారు భూములకు సాగునీరు అందడం లేదు. ఈ నేపథ్యంలో తాండవ కాలువల అభివృద్ధికి 2007లో రూ.55 కోట్లు ప్రభుత్వం మంజూరుచేసింది. ఈ నిధులతో కాలువల సిమెంటు లైనింగ్ పనులు చేపట్టారు. సుమారు 80 శాతం మేర పూర్తయ్యాయి. గతేడాది సంభవించిన హుద్‌హుద్ తుపానుకు కొండగెడ్డల ఉధృతికి కుడి, ఎడమ కాలువకు సుమారు 178 చోట్ల లైనింగ్ దెబ్బతింది. వీటికి మరమ్మతులు చేపట్టకపోవడంతో కాలువలు అధ్వానంగా మారాయి.
ఇండిగబెల్లి, కోటనందూరు మేజర్ కాలువల్లో...
తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలంలోని ఇండిగబెల్లి, కోటనందూరు మేజర్ కాలువల సిమెంటు లైనింగ్ పనులు అప్పటిలో నిలిపివేశారు. సిమెంట్ లైనింగ్ మెరుగ్గా ఉన్నంత వరకు సాగునీరు సక్రమంగా అందేది. మిగతా ప్రాంతాలకు వెళ్లకపోవడంతో రైతులు శ్రమదానంతో నీటిని తరలించేవారు. గతేడాది జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నందున శివారుకు నీరు సక్రమంగా అందేది. ప్రస్తుతం నీటిమట్టం ఆశాజనకంగా లేదు.
విడుదల చేసిన నీరు సక్రమంగా అందాలంటే లైనింగ్ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. తాండవ నీటి విడుదలకు మరో 20 రోజుల గడువు ఉన్నందున ఇప్పటికైనా లైనింగ్ పనులు చేపట్టాలని శివారు రైతులు కోరుతున్నారు. లేకుంటే ఈరెండు మేజర్ కాలువల పరిధిలోని 10 వేల ఎకరాలకు సాగునీటి కష్టాలు తప్పవని వారు ఆందోళన చెందుతున్నారు. దీనిపై తాండవ డీఈ శ్రీనివాస్ మాట్లాడుతూ కాలువలో పూడిక తొలగిస్తామన్నారు. శివారు భూములకు నీరందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.