lining works
-
సీఎం రమేష్ చెప్పినట్టు వినాలి
సాక్షి, అమరావతి: తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన ప్రభుత్వ పెద్ద.. తప్పు చేసిన వారికే పనులు అప్పగించాలని అధికారులపై తీవ్ర స్థాయిలోఒత్తిడి తెచ్చారు. ఈ వ్యవహారానికి తెలుగుగంగ ప్రధాన కాలువలో మిగిలిపోయిన లైనింగ్ పనుల టెండర్ వేదికైంది. వివరాల్లోకి వెళితే.. తెలుగుగంగ ప్రాజెక్టు పనుల అంచనా వ్యయాన్ని రూ. 4,460.64 కోట్లుగా ఖరారు చేస్తూ మార్చి 20, 2007న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టులో 2009 నాటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం 5 శాతం పనులు మాత్రమే మిగిలి ఉండగా అంచనా వ్యయాన్ని రూ. 6,671.62 కోట్లకు పెంచేస్తూ 2018 మార్చి 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయించింది. అడ్డగోలుగా పెంచేసిన అంచనా వ్యయంతో.. మిగిలిన పనులను బినామీ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడానికి సీఎం చంద్రబాబు ఆదిలోనే స్కెచ్ వేశారు. తెలుగుగంగ ప్రధాన కాలువ 0.00 కి.మీ నుంచి 18.20 కి.మీ వరకు లైనింగ్ చేయడం, 18.200 కి.మీ నుంచి 42.566 కిమీ వరకు గతంలో లైనింగ్ చేయకుండా మిగిలిపోయిన పనులు, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్) నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసే లింక్ ఛానల్ 0.00 కి.మీ నుంచి 7.380 కి.మీ వరకు లైనింగ్ చేయకుండా మిగిలిపోయిన పనులను చేపట్టాలని నిర్ణయించారు. 2007 నాటి ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల విలువ రూ.172.99 కోట్లు. కానీ.. మార్చి 9, 2018న జారీ చేసిన ఉత్తరులలో ఈ పనుల విలువను రూ. 180.48 కోట్లుగా ఖరారు చేశారు. ఆ పనుల వ్యయాన్ని మళ్లీ పెంచాలని ముఖ్యనేత ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. వాటికి తలొగ్గిన అధికారులు ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ. 280.27 కోట్లకు పెంచేస్తూ జూన్ 8, 2018న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులకు రూ. 239.03 కోట్లను అంతర్గత విలువగా నిర్ణయించిన అధికారులు.. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థకు ఆ పనులు దక్కేలా నిబంధనలతో జూలై 16న ఎల్ఎస్–ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నెలల్లో ఈ పనులకు పూర్తి గడువు విధించారు. జూలై 31న టెక్నికల్ బిడ్‌ను తెరిచారు. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థతో పాటు ష్యూ, హెచ్‌ఈఎస్ ఇన్‌ఫ్రాలు బిడ్లు దాఖలు చేశాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో.. పనులు చేసిన అనుభవం లేకున్నా ఉన్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను చూపి.. అధికార బలంతో పనులు దక్కించుకోవడంలో రిత్విక్‌ది అందెవేసిన చేయిగా జలవనరుల శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. తెలుగు గంగ లైనింగ్ పనుల టెండర్లో టెక్నికల్ బిడ్‌ను తెరిచిన సమయంలో రిత్విక్ సంస్థ తప్పుడు అర్హత పత్రాలు సమర్పించినట్లు ష్యూ సంస్థ ప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మీర్జాపూర్, అలహాబాద్ జిల్లాల పరిధిలో బన్సాగర్ కెనాల్ ప్రాజెక్టు పనులను రిత్విక్ సంస్థ సబ్ కాంట్రాక్టర్లతో చేయించిందని.. కానీ ఆ పనులు తానే చేసినట్లు తప్పుడు పత్రాలు సమర్పించిందని, ఈ నేపథ్యంలో ఆ సంస్థపై అనర్హత వేటు వేయాలని కోరారు. కానీ, ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఆగస్టు 6న ప్రైస్ బిడ్ తెరిచారు. 2.88% అధిక ధర (ఎక్సెస్)కు రిత్విక్ (ఎల్–1), 3.61% ఎక్సెస్‌కు ష్యూ (ఎల్–2), 4.31 శాతం ఎక్సెస్‌కు హెచ్‌ఈఎస్ (ఎల్–3) సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు వెల్లడైంది. ఎల్–1గా నిలిచిన రిత్విక్ సంస్థకు పనులు అప్పగించాలని సీవోటీకి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ అక్రమ వ్యవహారాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేసింది. టెండర్‌ను ఖరారు చేసి సీఎం రమేష్‌కు అప్పగించాలని నవంబర్ 30న సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఈ అంశాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. దాంతో సీవోటీ అధికారులు టెండర్‌ను రద్దు చేశారు. అయినా తీరు మారలేదు.. తెలుగుగంగ ప్రధాన కాలువలో మిగిలిపోయిన లైనింగ్ పనులకు రూ. 239.03 కోట్ల అంచనా వ్యయంతో జనవరి 14న రెండోసారి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. సీఎం రమేష్ సంస్థకే పనులు దక్కేలా నిబంధనలు పెట్టారు. ఇతర సంస్థలు టెండర్లో షెడ్యూళ్లు దాఖలు చేయకుండా ఇప్పటికే తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. ఈ క్రమంలో సీఎం రమేష్ చెప్పినట్టు విని.. పనులు ఆయనకు చెందిన సంస్థకే అప్పగించాలని జలవనరుల శాఖ అధికారులు, తెలుగుగంగ ప్రాజెక్టు అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈనెల 11లోగా షెడ్యూల్ దాఖలు చేసుకోవచ్చు. 12న టెక్నికల్ బిడ్.. 16న ఫైనాన్స్ బిడ్ ఖరారు చేసి సుమారు 4.85 శాతం అధిక ధర (ఎక్సెస్)కు సీఎం రమేష్ సంస్థ దాఖలు చేసిన షెడ్యూల్‌ను ఆమోదించి.. పనులు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారు. -
మేల్కొంటేనే సాగునీరు!
కాలువల లైనింగ్ పూర్తిచేయాలని తాండవ రైతుల వినతి నాతవరం : ఖరీఫ్ సీజన్లో తాండవ శివారు భూములకు సాగునీరు అందాలంటే అధికారులు తక్షణం మేల్కొని కాలువ లైనింగ్ పనులు పూర్తిచేయాలని పలువురు సూచిస్తున్నారు. లేకుంటే 10 వేల ఎకరాలకు సాగునీటి సమస్య తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో సుమారు 52 వేల ఎకరాలు తాండవ జలాశయం ఆధారంగా సాగవుతోంది. అయితే ఇటీవల కాలంలో తాండవ కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీనివల్ల శివారు భూములకు సాగునీరు అందడం లేదు. ఈ నేపథ్యంలో తాండవ కాలువల అభివృద్ధికి 2007లో రూ.55 కోట్లు ప్రభుత్వం మంజూరుచేసింది. ఈ నిధులతో కాలువల సిమెంటు లైనింగ్ పనులు చేపట్టారు. సుమారు 80 శాతం మేర పూర్తయ్యాయి. గతేడాది సంభవించిన హుద్‌హుద్ తుపానుకు కొండగెడ్డల ఉధృతికి కుడి, ఎడమ కాలువకు సుమారు 178 చోట్ల లైనింగ్ దెబ్బతింది. వీటికి మరమ్మతులు చేపట్టకపోవడంతో కాలువలు అధ్వానంగా మారాయి. ఇండిగబెల్లి, కోటనందూరు మేజర్ కాలువల్లో... తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలంలోని ఇండిగబెల్లి, కోటనందూరు మేజర్ కాలువల సిమెంటు లైనింగ్ పనులు అప్పటిలో నిలిపివేశారు. సిమెంట్ లైనింగ్ మెరుగ్గా ఉన్నంత వరకు సాగునీరు సక్రమంగా అందేది. మిగతా ప్రాంతాలకు వెళ్లకపోవడంతో రైతులు శ్రమదానంతో నీటిని తరలించేవారు. గతేడాది జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నందున శివారుకు నీరు సక్రమంగా అందేది. ప్రస్తుతం నీటిమట్టం ఆశాజనకంగా లేదు. విడుదల చేసిన నీరు సక్రమంగా అందాలంటే లైనింగ్ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. తాండవ నీటి విడుదలకు మరో 20 రోజుల గడువు ఉన్నందున ఇప్పటికైనా లైనింగ్ పనులు చేపట్టాలని శివారు రైతులు కోరుతున్నారు. లేకుంటే ఈరెండు మేజర్ కాలువల పరిధిలోని 10 వేల ఎకరాలకు సాగునీటి కష్టాలు తప్పవని వారు ఆందోళన చెందుతున్నారు. దీనిపై తాండవ డీఈ శ్రీనివాస్ మాట్లాడుతూ కాలువలో పూడిక తొలగిస్తామన్నారు. శివారు భూములకు నీరందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
ఆధునికీకరణ పనుల్లో దగా!
లైనింగ్ పనులు పోయి రిటైనింగ్ వాల్ నిర్మాణాలు అధికారులతో కాంట్రాక్టర్ లాలూచీ రైతులకు ఉపయోగపడని పనులు చల్లపల్లి : కాంట్రాక్టర్లతో అధికారులు లాలూచిపడి ఇష్టారాజ్యంగా ఆధునికీకరణ పనులను మార్చేస్తున్నారు. రైతులకు ఉపయోగపడాల్సిన ఈ పనులు కాంట్రాక్టర్ల జేబులు నింపేవిగా మారాయి. సాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు ఆధునికీకరణ పనుల్లో భాగంగా ప్రధాన పంటకాలువలకు లైనింగ్ పనులు చేయాల్సి ఉండగా వాటిని మార్చి రైతులకు ఏవిధంగా ఉపయోగపడని రిటైనింగ్‌వాల్ నిర్మాణ పనులు చేపట్టడంపట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైనింగ్‌పోయి రిటైనింగ్ వచ్చే! రూ.2,180కోట్ల నిధులతో కృష్ణాజిల్లాలో డెల్టాను ఆధునికీకరించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 జూన్ 6న మోపిదేవి వార్పు వద్ద ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. మట్టిపని, లైనింగ్ చేయడం, వంతెనల నిర్మాణం, ఓటీలు, రెగ్యులేటర్లు, క్యాటిల్ ర్యాంపులు, మేజరు, మీడియం డ్రెయిన్ల పూర్తిస్థాయి ఆధునికీకరణ వంటి 25ప్యాకేజీల ద్వారా పనులు చేపట్టాల్సి ఉంది. శంకుస్థాపన నాటి నుంచి 51నెలల్లో పనులు పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఈ పనులు నత్తనడకన సాగాయి. పంటకాలువలకు లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. నాలుగు అంగుళాలలోపు మాత్రమే లైనింగ్ పనులకు ప్రభుత్వం అనుమతివ్వడంతో ఈ ప్రాంతంలో ఉన్న నల్లరేగడి నేలలో ఈ పనులు చేపడితే పగిలిపోతాయన్న ఉద్దేశంతో వీటిని రిటైనింగ్‌వాల్‌కు మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. లైనింగ్ పనులు చేపడితే సాగునీరు వృథాకాకుండా పంటపొలాలకు సక్రమంగా నీరందుతుంది. కోడూరు మండలం దింటిమెరక నుంచి ఊటగుండం వరకు, మచిలీపట్నం మండలంలోని 9/7వ నంబరు కాలువలో పెదయాదర నుంచి పల్లెతుమ్మలపాలెం వరకు లైనింగ్ పనులు చేయాల్సి ఉండగా వాటిని మార్చి రిటైనింగ్‌వాల్ నిర్మాణ పనులు చేపట్టడంపట్ల ఈ ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైనింగ్ పనులు చేయాల్సిన రూ.40కోట్ల నిధులతో ప్రస్తుతం అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ నుంచి అవనిగడ్డ వరకు, అవనిగడ్డ నుంచి కొత్తపేట వరకు, బందలాయిచెర్వు నుంచి గుడివాకవారిపాలెం వరకు రిటైనింగ్‌వాల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. వీటి వల్ల తమకు ఎలాంటి ఉపయోగం ఉండదని రైతులంటున్నారు. రైతుల ప్రయోజనం కోసం రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం నేడు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు ఉపయోగపడుతుందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. కోడూరు మండలం దింటిమెరక నుంచి ఊటగుండం వరకు 14, 14బీ కాలువకు 8కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉండగా రెండేళ్ల క్రితం దింటిమెరక మొదట్లో రెండు కిలోమీటర్లు లైనింగ్ పనులుచేసి తర్వాత రెండు కిలోమీటర్లు వదిలేశారు. దీని తర్వాత రామకృష్ణాపురంలో 14వ నెంబరు బీ కాలువలో మొదట్లో రెండు కిలోమీటర్లు లైనింగ్ పనులుచేసి తర్వాత రెండు కిలోమీటర్లు వదిలేశారు. ఇలా పూర్తిస్థాయిలో లైనింగ్ పనులు చేయకపోవడం వల్ల ఈ ప్రాంత పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో గతంలో రైతులు పలుసార్లు ఆందోళన చేశారు. గతంలో ఈ ప్రాంత రైతులు ఆందోళన చేసినప్పుడు అప్పటి కలెక్టర్ పీయూష్‌కుమార్ త్వరితగతిన లైనింగ్ పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ రెండేళ్ల నుంచి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. మేటవేసిన పంట కాలువలు ... ఆధునికీకరణలో భాగంగా తొలుత లైనింగ్ పనులు చేస్తామని చెప్పి తర్వాత వీటిని రిటైనింగ్‌వాల్‌గా మార్చటం వల్ల రైతులకు భవిష్యత్తులో సాగునీటి ఇబ్బందులు తప్పెటట్లు లేవు. పంటకాలువలు మట్టి మేటవేసి పూడుకుపోయాయి. ఈ విషయమై ఇరిగేషన్ డీఈ భానుబాబును వివరణ కోరగా నాలుగు అంగుళాలోపు మాత్రమే లైనింగ్ పనులకు అనుమతులివ్వడం వల్ల నల్లమట్టికి ఇవి అనుకూలంగా లేకపోవడంతో ఈ నిధులను రిటైనింగ్‌వాల్‌కు మార్చినట్లు చెప్పారు. దింటిమెరక, రామకృష్ణాపురంలో మిగిలిపోయిన లైనింగ్ పనులు ఈ ఏడాది చేపట్టలేమని తెలిపారు. -
ఎలా సాగుదాం?
పూడుకుపూయిన కాలువలు చివరి భూములకు అందని నీరు రైవాడ, పెద్దేరు కాలువకుపూర్తికాని లైనింగ్ పనులు ఆందోళన చెందుతున్న రైతులు ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. ఏడాదిలో మొదటి పంట, అదీ పెద్ద పంట వేసేందుకు రైతులంతా సిద్ధమవుతున్నారు. వరి, చెరకుతోపాటు అపరాలు, వేరుశనగ, ఇతర వాణిజ్య పంటలు సైతం వేసేందుకు ఇదే అదును. సాగునీటికి ఇటు రిజర్వాయర్లు, అటు కొండగెడ్డలు, నదులతో అనుసంధానంగా వందలాది పంటకాలువలు ఎన్నో ఉన్నాయి...అయితే వీటిలో సగానికి పైగా కాలువలు పూడుకుపోయాయి...మరికొన్ని ఆక్రణమలకు గురయ్యాయి... స్లూయీస్‌లు, ఇతర గేట్లు మరమ్మతులకు నోచుకోలేదు. కాల్వల లైనింగ్ పనులు అసంపూర్తిగానే ఉండిపోయాయి...ఇక పొలాలకు నీరందేదెలా?...నిధులున్నా ఏటా పనుల సా...గతీత కారణంగా వేలాది ఎకరాలకు నీరందడం లేదు... చోడవరం,న్యూస్‌లైన్: ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. జిల్లాలో వరి, చెరకుతోపాటు అపరాలు, వేరుశనగ, ఇతర వాణిజ్య పంటలు సైతం వేసేందుకు ఇదే అదును. అయితే నీటి వనరులు అంతంతమాత్రమే ఉన్న ఈ ప్రాంతంలో వ్యవసాయానికి పంటకాలువలే కీలకం. ఇటు రిజర్వాయర్లు, అటు కొండగెడ్డలు, నదులతో అనుసంధానంగా వందలాది పంటకాలువలు ఉన్నాయి. అయితే వీటిలో సగానికి పైగా కాలువలు పూడుకుపోయి, ఆక్రణమలకు గురై ఉండగా, కొన్ని చెరువులు పూడికలు తీసినా స్లూయీస్‌లు, ఇతర గేట్లు మరమ్మతులకు నోచుకోలేదు. పెద్దేరు రిజర్వాయరు సంబంధించి కుడికాలువ పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. మా డుగుల నుంచి బుచ్చెయ్యపేట ఎర్రవా యు ప్రాంతానికి వచ్చే కుడికాలువకు సుమారె 15 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు జరగలేదు. దీనివల్ల దిగువన ఉన్న సుమారు ఐదువేల ఎకరాలకు సాగునీటి సమస్యగా ఉంది. రైవాడ జలాశయం కుడికాలువ లక్కవరం ఛానల్ కాలువ పనులు ఐదేళ్లుగా వివిధ కారణాల వల్ల ఆదునీకరణకు నోచుకోలేదు. దీంతో ఈ కాలువ కింద ఆరువేల ఎకరాలకు సాగునీరందలేదు. నిధులిచ్చినా ఖర్చు చేయని వైనం : గతంలో మంజూరైన నిధులు సకాలంలో ఖర్చుచేయకపోవడంతో అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు పెట్టినా అవి మంజూరు కాలేదు. గత నాలుగేళ్లలో శారద, బొడ్డేరు పెద్దేరు, తాచేరు నదులతోపాటు పలు కొండగెడ్డలు గట్లు దెబ్బతిన్నాయి. వీటినుంచి పంట భూములకు వెళ్లే పిల్లకాలువలు సుమారు వందకు పైగా కోతకు గురికాగా మరికొన్ని చోట్ల స్లూయీస్‌లు, దెబ్బతిన్నాయి. 1500ఎకరాలకు సాగునీరందిస్తున్న లక్ష్మీపురం పెద్ద చెరువుకు సరైన కాలువలు లేక నీరు వృథాగా పోతోంది. గొర్రెగెడ్డ, పాలగెడ్డ, తారకరామ మినీ రిజర్వాయర్లకు సాగునీటి కాలువలు పూర్తిచేయకపోవడంతో ఆ రిజర్వాయర్ల నీరు సాగుకు పూర్తిస్థాయిలో ఉపయోగపడటంలేదు. మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాం: డీఈఈ మాధవి చోడవరం సబ్‌డివిజన్ పరిదిలో అవసరమైన సాగునీటి కాలువల మరమ్మతుల కోసం గత ఏడేది ప్రతిపాదనలు పంపాం.ఇంకా నిధులు రాలేదు. గత తుఫాన్లకు దెబ్బతిన్న గట్లు పునర్నిర్మించి కాలువల్లో పూడిక తీతక నిధులు మంజూరయ్యాయి. టెండర్లు ఖరారుచేసి పనులు ప్రారంభిస్తాం. మైనర్ ఇరిగేషన్లో కాలువల పూడిక తీతకు, స్లూయీస్, సర్ప్లస్ గేట్లు నిర్మాణాలకు కూడా ప్రతిపాదనలు పంపాం. ఏటా ఇదే సమస్య రైవాడ కుడికాలువ నుంచి లక్కవరం ఛానల్ వచ్చే కాలువ ఆధునీకరణ పనులు జరగకపోవడంతో ఏటా ఖరీఫ్‌లో సాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది. పక్కనుంచే కాలువ వెళుతున్నా చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. పోరాటం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఖరీఫ్‌కు కూడా సాగునీటి కష్టాలు తప్పేలా లేదు. నిధులు మంజూరైనందున పను లు వెంటనే ప్రారంభించి ఖరీఫ్ మధ్యలోనైనా నీరందించాలి. - కర్రి ముత్యాలనాయుడు, లక్కవరం