ఆధునికీకరణ పనుల్లో దగా! | Construction and modernization of dishonesty! | Sakshi
Sakshi News home page

ఆధునికీకరణ పనుల్లో దగా!

Published Sat, Jun 21 2014 1:42 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

Construction and modernization of dishonesty!

  • లైనింగ్ పనులు పోయి రిటైనింగ్ వాల్ నిర్మాణాలు
  •  అధికారులతో కాంట్రాక్టర్ లాలూచీ
  •  రైతులకు ఉపయోగపడని పనులు
  • చల్లపల్లి : కాంట్రాక్టర్లతో అధికారులు లాలూచిపడి ఇష్టారాజ్యంగా ఆధునికీకరణ పనులను మార్చేస్తున్నారు. రైతులకు ఉపయోగపడాల్సిన ఈ పనులు కాంట్రాక్టర్ల జేబులు నింపేవిగా మారాయి. సాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు ఆధునికీకరణ పనుల్లో భాగంగా ప్రధాన పంటకాలువలకు లైనింగ్ పనులు చేయాల్సి ఉండగా వాటిని మార్చి రైతులకు ఏవిధంగా ఉపయోగపడని రిటైనింగ్‌వాల్ నిర్మాణ పనులు చేపట్టడంపట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
     
    లైనింగ్‌పోయి రిటైనింగ్ వచ్చే!
     
    రూ.2,180కోట్ల నిధులతో కృష్ణాజిల్లాలో డెల్టాను ఆధునికీకరించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 జూన్ 6న మోపిదేవి వార్పు వద్ద ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. మట్టిపని, లైనింగ్ చేయడం, వంతెనల నిర్మాణం, ఓటీలు, రెగ్యులేటర్లు, క్యాటిల్ ర్యాంపులు, మేజరు, మీడియం డ్రెయిన్ల పూర్తిస్థాయి ఆధునికీకరణ వంటి 25ప్యాకేజీల ద్వారా  పనులు చేపట్టాల్సి ఉంది.

    శంకుస్థాపన నాటి నుంచి 51నెలల్లో పనులు పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఈ పనులు నత్తనడకన సాగాయి.  పంటకాలువలకు లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. నాలుగు అంగుళాలలోపు మాత్రమే లైనింగ్ పనులకు ప్రభుత్వం అనుమతివ్వడంతో ఈ ప్రాంతంలో ఉన్న నల్లరేగడి నేలలో ఈ పనులు చేపడితే పగిలిపోతాయన్న ఉద్దేశంతో వీటిని రిటైనింగ్‌వాల్‌కు మార్చినట్లు అధికారులు చెబుతున్నారు.

    లైనింగ్ పనులు చేపడితే సాగునీరు వృథాకాకుండా పంటపొలాలకు సక్రమంగా నీరందుతుంది. కోడూరు మండలం దింటిమెరక నుంచి ఊటగుండం వరకు, మచిలీపట్నం మండలంలోని 9/7వ నంబరు కాలువలో పెదయాదర నుంచి పల్లెతుమ్మలపాలెం వరకు లైనింగ్ పనులు చేయాల్సి ఉండగా వాటిని మార్చి రిటైనింగ్‌వాల్ నిర్మాణ పనులు చేపట్టడంపట్ల ఈ ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    లైనింగ్ పనులు చేయాల్సిన రూ.40కోట్ల నిధులతో ప్రస్తుతం అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ నుంచి అవనిగడ్డ వరకు,  అవనిగడ్డ నుంచి కొత్తపేట వరకు, బందలాయిచెర్వు నుంచి గుడివాకవారిపాలెం వరకు రిటైనింగ్‌వాల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. వీటి వల్ల తమకు ఎలాంటి ఉపయోగం ఉండదని  రైతులంటున్నారు. రైతుల ప్రయోజనం కోసం రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం నేడు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు ఉపయోగపడుతుందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.

    కోడూరు మండలం దింటిమెరక నుంచి ఊటగుండం వరకు 14, 14బీ కాలువకు 8కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉండగా రెండేళ్ల క్రితం దింటిమెరక మొదట్లో రెండు కిలోమీటర్లు లైనింగ్ పనులుచేసి తర్వాత రెండు కిలోమీటర్లు వదిలేశారు. దీని తర్వాత రామకృష్ణాపురంలో 14వ నెంబరు బీ కాలువలో మొదట్లో రెండు కిలోమీటర్లు లైనింగ్ పనులుచేసి తర్వాత రెండు కిలోమీటర్లు వదిలేశారు.

    ఇలా పూర్తిస్థాయిలో లైనింగ్ పనులు చేయకపోవడం వల్ల ఈ ప్రాంత పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో గతంలో రైతులు పలుసార్లు ఆందోళన చేశారు. గతంలో ఈ ప్రాంత రైతులు ఆందోళన చేసినప్పుడు అప్పటి కలెక్టర్ పీయూష్‌కుమార్ త్వరితగతిన లైనింగ్ పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ రెండేళ్ల నుంచి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు.
     
    మేటవేసిన పంట కాలువలు ...

    ఆధునికీకరణలో భాగంగా తొలుత లైనింగ్ పనులు చేస్తామని చెప్పి తర్వాత వీటిని రిటైనింగ్‌వాల్‌గా మార్చటం వల్ల రైతులకు భవిష్యత్తులో సాగునీటి ఇబ్బందులు తప్పెటట్లు లేవు.   పంటకాలువలు మట్టి మేటవేసి పూడుకుపోయాయి. ఈ విషయమై ఇరిగేషన్ డీఈ భానుబాబును వివరణ కోరగా  నాలుగు అంగుళాలోపు మాత్రమే లైనింగ్ పనులకు అనుమతులివ్వడం వల్ల నల్లమట్టికి ఇవి అనుకూలంగా లేకపోవడంతో ఈ నిధులను రిటైనింగ్‌వాల్‌కు మార్చినట్లు చెప్పారు. దింటిమెరక, రామకృష్ణాపురంలో మిగిలిపోయిన లైనింగ్ పనులు ఈ ఏడాది చేపట్టలేమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement