భూములు పోతే ప్రాణాలు వదులుకుంటాం
- అధికారులకు శ్రీనగర్ గ్రామస్తుల హెచ్చరిక
- పట్టా భూముల్లో చెరువు పనులు చేయొద్దని వేడుకోలు
ములుగు : భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడితే ప్రాణాలు వదులుకుటామని మండలంలోని శ్రీనగర్ గ్రామస్తులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొన్ని దశాబ్దాలుగా సాగుచేసుకుంటూ జీవిస్తున్న తమ భూములను నేడు అధికారులు చెరువు శిఖం భూములుగా పేర్కొంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరా రు. భూములపై సర్వే నిర్వహించి తమ ను ఆదుకోవాలని వేడుకున్నారు. గతం లో రైతు ల సాగుభూములు నేడు ప్రభుత్వ భూములుగా ఎలా మారాయని ప్రశ్నిస్తున్నారు.
బాధి త రైతుల కథనం ప్రకారం.. మండలంలోని దేవనగర్ గ్రామపంచాయతీ పరిధి శ్రీనగర్‌కు చెందిన సుమారు 15 మంది రైతులకు మల్లంపల్లి శివారు సమీపంలోని పెద్దచెరువు కింద సర్వే నంబరు 195,198, 220/2లలో సుమా రు 32 ఎకరాల సాగుభూమి ఉంది. వారందరికీ 2000 సంవత్సరం నుంచి పహాణీలు జారీ అవుతున్నాయి. పట్టాలు అందించాలని 2009 లో రైతులు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించారు. వీరిలో కొందరు పట్టాలు చేసుకోగా మరికొందరు ఇంకా చేసుకోలేదు. వీటిలో సర్వే నంబర్ 195లో 8 ఎకరా లు, 220/2లో 15, 268లో 2ఎకరాల భూమి ప్రభుత్వానిదని అధికారులు పేర్కొన్నారు.
ఈ 25 ఎకరాల భూమి చెరువు శిఖం కిందికి వస్తుందని తెలిపారు. తాజాగా మళ్లీ బుధవా రం రెవెన్యూ అధికారులు భూములను సర్వే చేయడానికి వచ్చారు. విషయం తెలుసుకున్న రైతులు చెరువు వద్దకు చేరుకుని అధికారులను నిలదీశారు. వారు పట్టించుకోకపోవడంతో మూకుమ్మడిగా మందు డబ్బాలు చేతపట్టి హెచ్చరించారు. ఈ క్రమంలో మహిళా రైతు బానోతు ఆగమ్మ ఆవేశంతో పురుగుల మందు తాగింది. గమనించిన రైతులు నిలువరించి వెంటనే మల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ స్పందించి వాస్తవ పరిస్థితులపై సర్వే చేయాలని అప్పటివరకు పనులు జరిగేది లేదంటున్నారు.