చెరువులను చెరబట్టారు
ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు ఇవేవీ చాలవన్నట్లు ఆక్రమణదారులు ‘కబ్జాకు కాదేదీ అనర్హం’ అనే రీతిలో చెరువులపై కన్నేశారు.. దీనికి అధికారపార్టీ నేతలు, అధికారులు వంతపాడుతుండడంతో జిల్లాలో చెరువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
- యథేచ్ఛగా చెరువుల ఆక్రమణ
- పట్టించుకోని అధికారులు
- నీరు-చెట్టు పేరుతో రైతులను మభ్యపెడుతున్న ప్రభుత్వం
- కబ్జా కోరల్లో 903 చెరువులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎంతో వైభవం చవిచూసి జిల్లాలో గుర్తింపు తెచ్చుకున్న చెరువులు సైతం కబ్జాదారుల కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. రోజురోజుకూ ఆక్రమణలు పెరిగిపోతుండటంతో చెరువుల విస్తీర్ణం తగ్గిపోతోంది. ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తుండటంతో కబ్జారాయుళ్లకు ఎదురే లేక పోతోంది. నీరు-చెట్టు పథకం ద్వారా చెరువుల సంరక్షణ చేపడతామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఆదిశగా చర్యలు చేపట్టడం లేదు. ఇది కేవలం తెలుగు తమ్ముళ్లకు ఉపాధిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తిరుపతి సమీపంలోని అన్నా చెరువు, బొంతాలమ్మ చెరువు, మంగళం, మంచినీళ్ల గుంట చెరువుల్లో ఇప్పటికే అక్రమ కట్టడాలు వెలిశాయి.. కొంతమంది ఆక్రమణదారులు ఏకంగా చెరువులో ప్రహరీలను నిర్మించారు. రూరల్ పరిధిలో రెడ్డిగుంట, ఓటేరు చెరువుకు సంబంధించి అధికార పార్టీనేతలు అధికారులతో కుమ్మకై పట్టాలను సృష్టించి ఏకంగా స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకాళహస్తి పరిధిలో మన్నవరం, యల్లంపాడు, ఇనగలూరు, రాచగన్నేరి, పూడి, గౌనపల్లి, చిట్టత్తూరు, కోబాక, మసలిపేడు, కందాడు, గుడిమల్లం, మడిమల్లం చెరువులు కబ్జాకు గురయ్యాయి. ముఖ్యంగా ఈ చెరువులు తుడా పరిధిలో ఉండడంతో వీటిపైన అధికార పార్టీనేతలు కన్నేసినట్లు ఆరోపణలున్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా దాదాపు 8వేలకు పైగాచెరువులుండగా ఇందులో 903 చెరువులు ఆక్రమణకు గురైనట్లు ఇప్పటికే రెవెన్యూ అధికారులు గుర్తించారు. దాదాపు 5,932 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారు.
తెలుగు తమ్ముళ్లకు ఉపాధి : జిల్లాలో నీరు -చెట్టు కింద 262 చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టారు. అయితే వ్యవసాయాధికారులు భూసార పరీక్షలు నిర్వహించి ఈ మట్టి రైతులకు ఉపయోగపడుతుందని నిర్ధారించాకే ఈ పనులకు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారు. పలమనేరు మండలంలో పొలకలూరుపల్లి పెద్ద చెరువు, కుర్రప్పల్లి చెరువు, కనికల చెరువుల్లో నీరు-చెట్టు కింద పూడిక తీత పనులు జరుగుతున్నాయి. మట్టి తీసేందుకు జేసీబీ బాడుగలను ప్రభుత్వం భరిస్తుండగా మట్టి తోలుకునే రైతులు మాత్రం ట్రాక్టర్ల బాడుగను భరించాలి.
అయితే ఇక్కడ మాత్రం కనికల్ల చెరువులో తీసిన మట్టిని తెలుగుతమ్ముళ్లు ఏకంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే చెరువులో మట్టి తీస్తే చాలు, ఎవరు తోలుకుంటే ఏమని ఉచిత సలహా ఇవ్వడం గమనార్హం. దీనిని బట్టే నీరు - చెట్టు ద్వారా రైతులకు ఎంత మేర ఉపయోగం కలుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో వున్న చెరువులను సర్వేచేసి వాటి సంరక్షణ చేపట్టాల్సింది పోయి నీరు- చెట్టు ద్వారా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేపడుతోందని ప్రభుత్వ తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.