
వట్టిపోయిన ఎన్మన్‌బెట్ల వీరమనాయుడి చెరువు
కొల్లాపూర్‌రూరల్ : కేఎల్‌ఐ నుంచి సాగునీరు సరఫరా కాకపోవడంతో మండల పరిధిలోని పలు గ్రామాల్లోని చెరువులన్నీ వట్టిపోయాయి. చెరువుల కింద ఉన్న వేల ఎకరాల్లో ఆయకట్టు పొలాలు బీడువారాయి. సుదూర ప్రాంతాలకు ఇక్కడి నుంచి కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించటానికి నీటిని సరఫరా చేస్తున్నా... ప్రాజెక్టుకు అతి సమీపంలో ఉన్న మండల పరిధిలోని చెరువులకు సాగునీరు లేక వట్టిపోయాయి. గత మూడు, నాలుగు సంవత్సరాల నుంచి కేఎల్‌ఐ అధికారులకు, ప్రభుత్వానికి చెరువులకు సాగునీరు విడుదల చేయాలని విన్నవించినా ఫలితం లేదని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
వలసబాటలో రైతులు
మండల పరిధిలోని జావాయిపల్లి చెరువు, ఎన్మన్‌బెట్ల గ్రామంలోని వీరమనాయుని చెరువు, కుడికిళ్ల గ్రామంలోని ఊర చెరువు, పట్టణంలోని కావలోనికుంట, మొలచింతలపల్లి గ్రామంలోని జిల్దార్‌తిప్ప చెరువులకు నేటి వరకు కేఎల్‌ఐ నుంచి సాగునీరు సరఫరా కావడం లేదు. ఈ చెరువుల కింద వేల ఎకరాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సుదూర ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు.
సాగునీరు విడుదల చేయాలి
మండలంలోని జావాయిపల్లి చెరువుకు కేఎల్‌ఐ నుంచి సాగునీరు విడుదల చేయాలి. సింగోటం రిజర్వాయర్‌కు అతి సమీ పంలో జావాయిపల్లి చెరువు ఉంది. రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల చేయాలని కొన్నేళ్లుగా విన్నపాలు చేస్తున్నాం. నేటికీ నీటి సరఫరా లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.
– స్వామి,జావాయిపల్లి రైతు
ఉద్యమాలు చేసినా ఫలితం లేదు
గ్రామంలోని వీరమనాయుని చెరువుకు కేఎల్‌ఐ నుంచి సాగునీరు విడుదల చేయాలని గ్రామ రైతులతో కలిసి ఉద్యమాలు చేశాం. నేటి వరకు ఫలితం లేదు. స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి కూడా ఎన్నోసార్లు తెచ్చాం. ఎన్మన్‌బెట్లలోని వీరమనాయుని చెరువుకు సాగునీరు లేక వందల ఎకరాల్లో ఆయకట్టు బీడువారింది.
– సాయిరాం, ఎన్మన్‌బెట్ల వార్డుమెంబర్
Comments
Please login to add a commentAdd a comment